
మెదక్ రూరల్: ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులను(బ్లాక్ స్పాట్‌లను), జాతీయరహదారికి సమీపంలోని గ్రామాలకు వెళ్లే దారులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదకరమైన ప్రతి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులను, స్టాపర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటుచేసే విధంగా సంబంధిత అధికారులను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. బ్లాక్ స్పాట్‌లలో రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తమవంతు బాధ్యతగా భావించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా, రాష్ట్ర ముఖ్య రహదారులు, అవసరమైన ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను, రేడియం స్టిక్కర్లతో సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటని పోలీస్‌స్టేషన్‌లకు అనుసంధానించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమూర్తితో పాటు సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్ ఉన్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదకర మూలమలుపులను పరిశీలిస్తున్న ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment