ఎస్పీ చందనాదీప్తితో చిన్నారి శరణ్య, తల్లిదండ్రులు
తూప్రాన్: మండలంలోని ఆదర్శ గ్రామం మల్కాపూర్‌కు చెందిన కిష్టాల స్వామి, రేణుక దంపతుల ఏకైక కుమార్తెను పోలీసు ఉద్యోగిగా చేసేందుకు సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎస్పీ చందనాదీప్తీ ముందుకు వచ్చారు. శుక్రవారం మెదక్‌లోని తన కార్యాలయంలో చిన్నారితోపాటు తల్లిదండ్రులతో చర్చించారు. ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కంటివెలుగు’ పథకం ప్రారంభోత్సవానికి మల్కాపూర్ గ్రామానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్ స్వామి, రేణుకల ఇంటి ముందు నాటిన మొక్కలను చూసి హర్షం వ్యక్తం చేశారు.
అలాగే వారి ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్కను నాటారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం చిన్నారి శరణ్యను పలకరించి ఏం చదువుతున్నావ్.. పెద్దయ్యాక ఏం కావాలని ఉంది అని అడిగారు. పోలీస్ కావాలని ఉంది అని చిన్నారి చెప్పడంతో పక్కనే ఉన్న ఎస్పీ చందనాదీప్తికి చిన్నారి చేయిని అందించి పోలీసు ఉద్యోగిగా చేసే బాధ్యత ఇకపై నీదే అని అందరి సమక్షంలో తెలిపారు. దీంతో ఎస్పీ చందనాదీప్తి చిన్నారి బాధ్యతను తీసుకునేందుకు స్థానిక పోలీసులను, చిన్నారితో పాటు కుటుంబ సభ్యులను శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారి శరణ్యకు పోలీసు ఉద్యోగంపై ఎందుకు ఆసక్తి పెరిగిందో అడిగి తెలుసుకున్నారు. దీనికి చదువుల విషయంలో చిన్నారి ఆసక్తిని గమనించిన ఎస్పీ, నాణ్యమైన విద్యతోపాటు చక్కని క్రమశిక్షణ కలిగిన అమ్మాయిగా తీర్చిదిద్దడానికి ఎస్పీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి అవసరమైన పాఠశాలల గుర్తింపులో నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో పాఠశాలను గుర్తించి చేర్పించే ఏర్పాట్లు చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. తమ కూతురు చదువు విషయంలో సీఎం కేసీఆర్, ఎస్పీ చందనాదీప్తిలు చూపిస్తున్న ఆదరణకు దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment