chandana deepthy
-
ప్రమాదాల నివారణకు చర్యలు
మెదక్ రూరల్: ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులను(బ్లాక్ స్పాట్లను), జాతీయరహదారికి సమీపంలోని గ్రామాలకు వెళ్లే దారులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదకరమైన ప్రతి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులను, స్టాపర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటుచేసే విధంగా సంబంధిత అధికారులను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తమవంతు బాధ్యతగా భావించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా, రాష్ట్ర ముఖ్య రహదారులు, అవసరమైన ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను, రేడియం స్టిక్కర్లతో సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటని పోలీస్స్టేషన్లకు అనుసంధానించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమూర్తితో పాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఉన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదకర మూలమలుపులను పరిశీలిస్తున్న ఎస్పీ -
ఆపరేషన్ ముస్కాన్‌తో 94 మందికి విముక్తి
సాక్షి, మెదక్ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొచ్చాయి. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. కార్మిక శాఖ ప్రతి ఏటా దాడులు నిర్వహిస్తున్నా. తూతూమంత్రంగానే సాగుతోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ జిల్లాలో చాలా ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు హోటళ్లు, దుకాణాలు, ఇటుకబట్టీల్లో వారు కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చదువుకునే వయసులో పిల్లలు వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారుతుండగా, ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌లో అధికారులు వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు సమన్వయంతో ముందుకు.. జిల్లాలో బాలకార్మికుల నిర్మూలనకు సంబంధించి అధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. పోలీస్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ బాలకార్మికులను గుర్తిస్తున్నారు. ఈ మేరకు ఐదో దఫాలో జిల్లా కేంద్రంతో పాటు నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ పట్టణాలు, పలు మండలాల్లో వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న బడి బయట ఉన్న 94 మంది బాలబాలికలను గుర్తించారు. వీరిని బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చారు. వీరితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలబాలికలను వారివారి సమీప పాఠశాలల్లో చేర్పించారు. ఇప్పటివరకు 347 మందికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం రాష్ట్రంలో 2015లో ప్రారంభమైంది. జిల్లాల విభజన అనంతరం 2017లో మెదక్‌లో మొదటిసారిగా జల్లెడ పట్టారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారితో పాటు బడి బయట ఉన్న పిల్లలు 134 మందిని గుర్తించారు. ఇందులో 120 మంది బాలురు కాగా 14 మంది బాలికలు ఉన్నారు. వీరందరిని సమీప పాఠశాలల్లో చేర్పించిన అధికారులు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. 2018లో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో మొత్తం 119 మంది బాలకార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ఇందులో బాలురు 108 మంది కాగా.. బాలికలు 11 మంది. అదే విధంగా ఈ ఏడాది గత నెలలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 94 మందికి విముక్తి కలిగింది. ఇందులో 83 మంది బాలురు కాగా, 11 మంది బాలికలు ఉన్నారు. ఇప్పటివరకు విబాజ్య మెదక్ జిల్లాలో 311 మంది బాలురు 36 మంది బాలికలు.. మొత్తం 347 మందికి అధికారులు విముక్తి కల్పించారు. వీరిని పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతోనే.. పలువురు బాలబాలికలు ఆర్థిక ఇబ్బందులతోనే బడికి వెళ్లకుండా పనులకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలు, హోటళ్లు, పరిశ్రమల నిర్వాహకులు వారికి నెలనెలా జీతంతో పాటు తిండి కూడా పెడుతుండటంతో పిల్లలను పనులకు పంపించేందుకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అనాథలుగా మారిన పిల్లలు మాత్రం చెత్త కాగితాలు ఏరుతూ, బస్టాండ్లు ఇతర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నారు. అంతేకాదు కొంత మంది బాలబాలికలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలను పనిలోకి పంపితే బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అనాథలైన పిల్లలను ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు పోలీస్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నాం. బాలకార్మికుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రెండు బృందాలతో జిల్లాను జల్లెడ పట్టాం. బాలబాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – చందనాదీప్తి, ఎస్పీ -
మాటిచ్చిన కేసీఆర్..పాటించిన ఎస్పీ
తూప్రాన్: మండలంలోని ఆదర్శ గ్రామం మల్కాపూర్‌కు చెందిన కిష్టాల స్వామి, రేణుక దంపతుల ఏకైక కుమార్తెను పోలీసు ఉద్యోగిగా చేసేందుకు సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎస్పీ చందనాదీప్తీ ముందుకు వచ్చారు. శుక్రవారం మెదక్‌లోని తన కార్యాలయంలో చిన్నారితోపాటు తల్లిదండ్రులతో చర్చించారు. ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కంటివెలుగు’ పథకం ప్రారంభోత్సవానికి మల్కాపూర్ గ్రామానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్ స్వామి, రేణుకల ఇంటి ముందు నాటిన మొక్కలను చూసి హర్షం వ్యక్తం చేశారు. అలాగే వారి ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్కను నాటారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం చిన్నారి శరణ్యను పలకరించి ఏం చదువుతున్నావ్.. పెద్దయ్యాక ఏం కావాలని ఉంది అని అడిగారు. పోలీస్ కావాలని ఉంది అని చిన్నారి చెప్పడంతో పక్కనే ఉన్న ఎస్పీ చందనాదీప్తికి చిన్నారి చేయిని అందించి పోలీసు ఉద్యోగిగా చేసే బాధ్యత ఇకపై నీదే అని అందరి సమక్షంలో తెలిపారు. దీంతో ఎస్పీ చందనాదీప్తి చిన్నారి బాధ్యతను తీసుకునేందుకు స్థానిక పోలీసులను, చిన్నారితో పాటు కుటుంబ సభ్యులను శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి శరణ్యకు పోలీసు ఉద్యోగంపై ఎందుకు ఆసక్తి పెరిగిందో అడిగి తెలుసుకున్నారు. దీనికి చదువుల విషయంలో చిన్నారి ఆసక్తిని గమనించిన ఎస్పీ, నాణ్యమైన విద్యతోపాటు చక్కని క్రమశిక్షణ కలిగిన అమ్మాయిగా తీర్చిదిద్దడానికి ఎస్పీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి అవసరమైన పాఠశాలల గుర్తింపులో నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో పాఠశాలను గుర్తించి చేర్పించే ఏర్పాట్లు చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. తమ కూతురు చదువు విషయంలో సీఎం కేసీఆర్, ఎస్పీ చందనాదీప్తిలు చూపిస్తున్న ఆదరణకు దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నకిలీ నోట్లతో జాగ్రత్తగా ఉండాలి
మెదక్ మున్సిపాలిటీ : నకిలీ నోట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మెదక్ పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హన్మకొండ వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట గ్రామానికి చెందిన మహ్మద్ షఫీ, అబ్దుల్ మజీద్లు వరుసకు బావ బావమరుదులు. కాగా మహ్మద్ షఫీ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మజీద్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 16న రాత్రి 8గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలోని పెద్ద బజార్‌లోని జనతా చికెన్ సెంటర్లో, పెద్దబజార్ మజీద్ వద్ద గల ఓ కిరాణషాపులో సరుకులు కొనుగోలు చేసి నకిలీ రూ.2000 నోట్లు ఇచ్చి వెళ్లారు. కొద్ది సేపటి తరువాత కిరాణాషాపు యజమాని కొండ రమేష్ రూ.2000 నోటు నకిలీగా గుర్తించి అతని తమ్ముడితో కలిసి రాందాస్ చౌరస్తాలో నిందితుల కారు గమనించి వారిని వెంబడించి పోలీస్‌స్టేషన్ సమీపంలో వారిని రమేష్ అడ్డగించి నిలదీయడంతో నిందితులు రమేష్‌ను తోసేసి కారును స్పీడుగా తీసుకెళ్లారు. దీంతో రమేష్ తమ్ముడు అతని స్నేహితులు కారును వెంబడించి హౌసింగ్ బోర్డు వద్ద నిందితులను పట్టుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితుడు కొండా రమేష్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. అలాగే నిందితుల నుంచి రూ.2000 నకిలీ నోట్లు7, రూ.500 నోట్లు 8తోపాటు నోట్ల తయారీకి ఉపయోగించిన స్కానర్, ప్రింటర్, పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు నకిలీనోట్ల చలామణితో చిక్కకుండా వెంట తెచ్చుకున్న కారుకు సైతం రెండు నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నకిలీ నోట్లను గుర్తించిన పట్టణ వాసులను ఎస్పీ అభినందించారు. ఈ కేసు చేధించడంలో పురోగతి సాధించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, పట్టణ ఎస్ఐ శేఖర్‌రెడ్డి, మెదక్రూరల్ఎస్ఐ లింబాద్రి, హవేళిఘణాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగరాజు ఉన్నారు. -
పోలీసులకు స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన
మెదక్ మున్సిపాలిటీ: పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్న పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులకు స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజు పని ఒత్తిడికి గురవుతుంటారని, వీరికి మానసిక ప్రశాంతత అవసరమన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించడానికి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ తరగతులన్నారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నీలేష్ డార్ఫే మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి అనేక రకాలుగా ఒత్తిళ్లుంటాయని, వాటి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుందన్నారు. కాబట్టి ఒత్తిడిని అధిగమించడం ఎంతైన అవసరమన్నారు. ఇందుకోసం ప్రతిరోజు యోగా, నడక, ప్రాణాయాణం, మెడిటేషన్, పాజిటీవ్ ఆలోచనలు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి చేయాలన్నారు. వీటి వల్ల చాలా వరకు ఒత్తిడిని అధిగమించవచ్చునని తెలిపారు. ఈ నియమాలు పాటించి అందరూ వ్యాధులను తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగరాజు, డాక్టర్ ప్రియాంక, తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్‌రావు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
ఎయిమ్స్‌లో సత్తా చాటిన చందనా దీప్తి
న్యూశాయంపేట : జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్షలో హన్మకొండకు చెందిన రాపోలు చందనాదీప్తి 37వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. ఈ మేరకు ఆమె ఎయిమ్స్ భూపాల్‌లో సీటు సంపాదించింది. చందనా దీప్తి నగరంలోని తేజస్వీ పాఠశాలలో పదో తరగతి, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కార్డియాలజిస్టును అవుతానని ఆమె పేర్కొన్నారు.