సాక్షి, మెదక్ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొచ్చాయి. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. కార్మిక శాఖ ప్రతి ఏటా దాడులు నిర్వహిస్తున్నా. తూతూమంత్రంగానే సాగుతోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ జిల్లాలో చాలా ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు హోటళ్లు, దుకాణాలు, ఇటుకబట్టీల్లో వారు కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చదువుకునే వయసులో పిల్లలు వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారుతుండగా, ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌లో అధికారులు వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు
సమన్వయంతో ముందుకు..
జిల్లాలో బాలకార్మికుల నిర్మూలనకు సంబంధించి అధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. పోలీస్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ బాలకార్మికులను గుర్తిస్తున్నారు. ఈ మేరకు ఐదో దఫాలో జిల్లా కేంద్రంతో పాటు నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ పట్టణాలు, పలు మండలాల్లో వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న బడి బయట ఉన్న 94 మంది బాలబాలికలను గుర్తించారు. వీరిని బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చారు. వీరితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలబాలికలను వారివారి సమీప పాఠశాలల్లో చేర్పించారు.
ఇప్పటివరకు 347 మందికి విముక్తి..
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం రాష్ట్రంలో 2015లో ప్రారంభమైంది. జిల్లాల విభజన అనంతరం 2017లో మెదక్‌లో మొదటిసారిగా జల్లెడ పట్టారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారితో పాటు బడి బయట ఉన్న పిల్లలు 134 మందిని గుర్తించారు. ఇందులో 120 మంది బాలురు కాగా 14 మంది బాలికలు ఉన్నారు. వీరందరిని సమీప పాఠశాలల్లో చేర్పించిన అధికారులు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. 2018లో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో మొత్తం 119 మంది బాలకార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ఇందులో బాలురు 108 మంది కాగా.. బాలికలు 11 మంది. అదే విధంగా ఈ ఏడాది గత నెలలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 94 మందికి విముక్తి కలిగింది. ఇందులో 83 మంది బాలురు కాగా, 11 మంది బాలికలు ఉన్నారు. ఇప్పటివరకు విబాజ్య మెదక్ జిల్లాలో 311 మంది బాలురు 36 మంది బాలికలు.. మొత్తం 347 మందికి అధికారులు విముక్తి కల్పించారు. వీరిని పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతోనే..
పలువురు బాలబాలికలు ఆర్థిక ఇబ్బందులతోనే బడికి వెళ్లకుండా పనులకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలు, హోటళ్లు, పరిశ్రమల నిర్వాహకులు వారికి నెలనెలా జీతంతో పాటు తిండి కూడా పెడుతుండటంతో పిల్లలను పనులకు పంపించేందుకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అనాథలుగా మారిన పిల్లలు మాత్రం చెత్త కాగితాలు ఏరుతూ, బస్టాండ్‌లు ఇతర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నారు. అంతేకాదు కొంత మంది బాలబాలికలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలను పనిలోకి పంపితే బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అనాథలైన పిల్లలను ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించారు.
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
పోలీస్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నాం. బాలకార్మికుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రెండు బృందాలతో జిల్లాను జల్లెడ పట్టాం. బాలబాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
– చందనాదీప్తి, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment