minors driving
-
మైనర్.. డ్రైవింగ్ డేంజర్
సాక్షి, హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా ఝళిపించింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు కార్లు, బైక్‌లు నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులు మూల్యం చెల్లించుకోవాల్సిందే. గ్రేటర్ పరిధిలో తరచుగా ఎక్కడో ఒకచోట మైనర్ల డ్రైవింగ్ బెంబేలెత్తిస్తున్నాయి. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా వాహనాలు నడిపే మైనర్లు వాహనాలు ఢీకొట్టి ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ విపత్కర పరిణామంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ల తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా కార్యాచరణ చేపట్టినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. తల్లిదండ్రులు తమ మైనారిటీ పిల్లలకు వాహనాలను అప్పగించి చిక్కులు కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. హడలెత్తిస్తున్న మైనర్లు.. 👉స్కూల్‌పిల్లలు, మైనారిటీ తీరని ఇంటరీ్మడియట్ స్థాయి పిల్లలు సైతం ఎస్యూవీ వంటి అత్యంత వేగవంతమైన బైక్‌లు, కార్లు నడుపుతున్నారు. పిల్లలకు వాహనాలను ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులే వారి డ్రైవింగ్ చూసి గర్వంగా భావిస్తున్నారు. కానీ.. ముంచుకొచ్చే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇలాంటి వాహనాలను నడుపుతూ పరిమితికి మించిన వేగంతో పరుగులు తీస్తున్నారు. 👉 ఈ ఏడాది జూన్ నెలలో మణికొండ వద్ద ఓ మైనర్ బాలుడు ఎస్యూవీ వాహనం నడుపుతూ పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గతంలోనూ నలుగురు పిల్లలు వారిలోఒకరి పుట్టిన రోజు సందర్భంగా కారు తీసుకొని లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు సాధారణ శిక్షలతో సరి.. 👉 ప్రతి ఏటా పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది తనిఖీల్లో సుమారు 2,500 నుంచి 3,000 మంది పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నట్లు అంచనా. ఇలాంటి సంఘటనల్లో ఇప్పటి వరకు సాధారణ శిక్షలే అమలవుతున్నాయి. తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి వదిలేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సివస్తోంది. 👉 రెండేళ్ల క్రితం మైనర్ల డ్రైవింగ్ వల్ల 25 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2023లో 35 ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలు వాహనాలు నడిపే డ్రైవర్లు, వారితో కలిసి ప్రయాణం చేసేవారు. ఇతర రోడ్డు వినియోగదారులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు కానుంది. 👉 మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడటంతో పాటు బండి నడుపుతూ పట్టుబడినా సరే ఆర్సీ రద్దవుతుంది. ఏడాది పాటు సదరు వాహనం రిజి్రస్టేషన్‌ను రద్దు చేయనున్నారు. దీంతో ఆ వాహనాన్ని వినియోగించేందుకు అవకాశం ఉండదు. పట్టుబడే మైనర్లకు 25 ఏళ్ల వయసు వరకు లెరి్నంగ్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ రవాణా కమిషనర్ ఇలంబర్తి ఇటీవల అన్ని జిల్లా, ప్రాంతీయ రవాణా కార్యాలయాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనర్ల డ్రైవింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని తెలిపారు.రహదారి భద్రత ప్రధానం.. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేని పిల్లలు వాహనాలను తీసుకొని రోడ్డెక్కితే చాలా నష్టం జరుగుతుంది. ఆ పిల్లల కుటుంబాలే కాకుండా సమాజం కూడా ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. – సి.రమేష్, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ -
HYD: ఫుల్లుగా తాగి కారు నడిపి.. చెట్టును ఢీ కొట్టి..
సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గాయపడిన పిలిప్స్, రుబిన్‌లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
మైనర్ కాదు.. మోనార్క్!
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో గత రెండేళ్లుగా వాహనాలు రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. పలు ద్విచక్ర వాహన ఉత్పత్తిదారులు యువతను ఆకట్టుకునేలా వాహనాలను రూపొందిస్తుండటంతో వీరి వేగానికి అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తమ పిల్లలకు వాహనాలు కొనుగోలు చేయడమో, ఉన్న వాహనాలను పిల్లలకు ఇవ్వడమో చేస్తున్నారు. పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా యువత, తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న యువతలో 80 శాతం మందికి లైసెన్స్లే లేవనడంలో అతిశయోక్తి కాదు. లైసెన్స్‌లు ఉన్నా వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడమో, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడమో జరుగుతున్నాయి. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతుండడం వల్ల వారికో.. ఎదురుగా వస్తున్న వారికో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మైనర్లలో, తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలకు అనుగుణంగా రోడ్లు ఎక్కాల్సిన వాహనాలు అందుకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. ఇలా నిబంధనలు అతిక్రమించి, పోలీసులకు చిక్కినపుడు సిఫార్సుల ద్వారానో, జరిమానా చెల్లించో వాటి నుంచి బయటపడి మళ్లీ రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి వారికి జరిమానా విధిస్తున్నారే తప్ప, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం లేదు. ఇటువంటి సున్నితమైన సమస్యలపై మైనర్లు, తల్లిదండ్రులను చైతన్య పరచాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇటీవలే వారికి తరచూ కౌన్సిలింగ్ నిర్వహించి విడిచి పెడుతున్నారు. అయినా మార్పు రావడం లేదు. శ్రీకాకుళం నగరంలో పలు రోడ్లు ఇరుకుగా ఉండడం అందరికీ తెలిసింది. ఇటువంటి ప్రాంతాల్లో మైనర్లు అతి వేగాన్ని ప్రదర్శించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు. -
తస్మాత్.. జాగ్రత్త
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : గడప దాటి రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నా సరే మైనర్లు, తాగుబోతులు ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలను చూసినట్లయితే డ్రైవింగ్‌పై అవగాహన లేని మైనర్లు వాహనాలను నడపటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఇటీవలే కొత్త అమెండ్మెంట్ వచ్చింది. దీనిపై ప్రత్యేక కథనం. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట తరచూ జరుగుతుండగా అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వెహికిల్స్ తోలడం, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం తదితరవి కొన్ని కారణాలైతే.. ఏమాత్రం అవగాహన లేని మైనర్లు ద్విచక్ర వాహనాలనే కాక ఫోర్‌వీలర్స్, త్రీవీలర్స్ వాహనాలు కూడా నడపటం ప్రమాదాలు జరుగటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు నడిపితే ..తల్లిదండ్రులపై కేసు మోటార్ వెహికల్ యాక్ట్‌లో మరో కొత్త అమెండ్మెంట్ను ఇటీవలే తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఇకపై తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. పిల్లలు అతివేగంతో, అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైనా లేక పోలీసులకు పట్టుబడ్డా కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఇకపై సదరు మైనర్ల పైనే కాక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు కానుంది. సాధారణంగా వాహనం ఎవరిదైనా సరే దానిని నడిపే సమయంలో సదరు వ్యక్తికి సరైన పత్రాలు లేకుంటే జరిమానాలు విధిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడొచ్చిన కొత్త నిబంధన ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు లేదా వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసే అధికారాలు పోలీసులకు ఉన్నాయి. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్ కొత్తగా వచ్చిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికే పేరెంట్స్ వాహనాలు ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. కొత్తగా వచ్చిన ఎంవీ అమెండ్మెంట్ ప్రకారం మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తాం. డైవింగ్ చేసే వారు ఎవరైనా సరే వాహనానికి సంబంధించిన పేపర్లతోపాటు లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. మైనర్లు డ్రైవింగ్ చేయటం నేరం. ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. – శ్రీకాంత్, ఆర్కేపీ ఎస్ఐ -
పిల్లలకు బైక్ ఇచ్చారో..?
విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సెక్షన్ ప్రతీ ఒక్కరిలోనూ గుబులు రేపుతోంది. సెక్షన్ 304 (ఏ) ద్వారా ఈ విషయంలో శిక్షలను మరింత కఠినతరం చేశారు. మైనర్లు బైక్ నడిపి ప్రమాదానికి కారణమైనా, మితి మీరిన వేగంతో ఎదుట వ్యక్తి ప్రాణాలు బలిగొన్నా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, సదరు వాహన యాజమానిపై సెక్షన్ 304 (ఏ)ప్రకారం కేసు నమోదు చేస్తారు. వెంటనే రిమాండ్‌కు కూడా తరలిస్తారు. బైక్ ఇస్తే అంతే సంగతులు.. చాలా మంది తల్లిదండ్రులు, బంధువులు పిల్లలకు బైక్ ఇవ్వడం గొప్పగా భావిస్తారు. అయితే ఇకపై అది కుదరదు. సదరు బాలుడు లేదా బాలిక బైక్ నడిపి ప్రమాదం చేసినట్లు అయితే ఆ తల్లిదండ్రులపై, సెక్షన్ 304 (ఏ) కేసు నమోదు చేస్తారు. మద్యం సేవించి బైక్ నడిపి ప్రమాదం చేసి ప్రాణనష్టం కలిగించిన వారిపై కూడా ఇదే సెక్షన్ కింద కేసులు పెడతారు. లైసెన్స్ లేకుండా ఇతరుల వాహనం నడిపి ప్రమాదాలు చేస్తే వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారిపై కేసు నమోదు చేస్తారు. యాక్సిడెంట్ చేసిన వారితో పాటు వాహనం ఇచ్చిన వారు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అమ్మిన వ్యక్తిపై కూడా కేసులు పెడతారు. గతంలో యాక్సిడెంట్ చేసిన వారికి కూడా 304 (ఏ)ను నమోదు చేసేవారు. అయితే అప్పట్లో వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరయ్యేది. నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. యాక్సిడెంట్‌కు కారణమైన వ్యక్తితో పాటు సంబంధిత వాహన యాజమానికి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేదు. పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం.. మూడేళ్లలో దేశంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. వాటిని అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు బలిగొనే వారిని, ఉద్దేశ పూర్వకంగానే హత్య చేసినట్లుగా భావిస్తూ సెక్షన్ 304(ఏ)ను రూపొందించారని పోలీసు వర్గాలు తెలిపాయి. వాహనం నడిపే వారు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు, బంధువులు మైనర్ వ్యక్తులకు బైక్‌లు ఇస్తే ఎదురయ్యే సంఘటనలకు సిద్ధంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పాత వాహనాలు ఎవరికైనా అమ్మితే కొనుగోలు చేసిన వారి పేరున బైక్ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే అమ్మిన వారికి ఇబ్బందులు తప్పవు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను యువత మానుకోవాలి అని పోలీసులు సూచిస్తున్నారు. కేంద్రానిది మంచి నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎంతో మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకులు బలైపోతున్నారు. వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదాలకు పాల్పడి ఆయా కుటుంబాల్లో విషాదం నింపారు. ప్రమాదాలు చేసిన వారికి వెంటనే స్టేషన్ బెయిల్ రావడం, పెద్దగా చర్యలు లేకపోవడంతో పరిస్థితి మారడం లేదు. ఈ సెక్షన్ అమలు చేస్తే కొంత వరకు ప్రమాదాలు నివారణ అవుతాయి. – గుల్లిపల్లి కృష్ణ, విశ్రాంత ఉద్యోగి రామభద్రపురం భారీ మూల్యం తప్పదు... వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మైనర్లకు బైక్‌లు ఇచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, మద్యం సేవించి వాహనం నడిపే వారు రోడ్డు ప్రమాదం చేస్తే, ప్రాణ నష్టం జరిగితే ఉద్దేశ పూర్వకంగానే హత్య చేసినట్లు సెక్షన్ 304(ఎ) చెబుతోంది. దీన్ని గట్టిగా అమలు చేస్తే ప్రమాదాలు నివారణయ్యే అవకాశం ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. – బి.లక్ష్మణరావు, ఎస్ఐ, రామభద్రపురం -
మైనర్లూ బహుపరాక్ !
కరీంనగర్ క్రైం: పదో తరగతిలో ఫస్ట్‌క్లాస్ మార్కులు వచ్చినందుకు కొడుకుకి బైక్ కానుకగా ఇచ్చే తల్లిదండ్రులు.. ఇంటర్ కాలేజీకి బస్సులో వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న పుత్రరత్నాన్ని చూసి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చే పేరెంట్స్ ఒక్క నిమిషం ఆలోచించండి. పట్టుమని పదహారేళ్లు దాటని మీ పిల్లలు బైక్‌లు నడుపుతూ.. ప్రమాదాలు చేస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఒక వేళ పోలీసులకు చిక్కితే జువైనల్ జైలుకు వెళ్లాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఇక కఠిన శిక్షల అమలుకు కమిషనరేట్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లకు బైక్‌లు కొనిచ్చే తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. కొత్త చట్టం పద్నాలుగు, పదహారేళ్ల వయస్సులోనే బైక్‌లపై రివ్వున వెళ్లే యూత్‌ను కట్టడి చేసేందుకు పోలీస్‌కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి కొత్త చట్టం అ మలుకు శ్రీకారం చుట్టారు. మైనర్లు బైక్‌లు నడిపితే..మొదట తల్లిదండ్రులకు నోటీస్‌లు జారీ చేస్తా రు. బాల డ్రైవర్లపై జువైనల్ కోర్టులో అభియోగప్రతం(చార్జిషీట్) దాఖలు చేయనున్నా రు. కరీంనగర కమిషనరేట్‌లో కఠినంగా అమ లు చేయడానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి వారికి శిక్షలు కూడా వేశారు. పక్కాగా అమలుకు శ్రీకారం కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు ఇంజినీరింగ్ ఉన్నాయి. ఇటీవల పలువురు మైనర్లు బైక్‌లు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో మైనర్ల బైక్రైడింగ్కు చెక్ పెట్టేందుకు సీపీ ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ మైనర్లకు మొ దట వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తారు. అయినా వారిలో మార్పు రాకపోతే కఠిన చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు. 2015లో హైదరాబాద్ సెం ట్రల్ జోన్ డీసీపీగా ఉన్న సమయం లో కమలాసన్‌రెడ్డి అక్కడ మైనర్ డ్రైవింగ్‌లపై దృష్టి సారించి పలు చట్టా లు అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. అదేవిధంగా కరీంనగర్లో అమలు చేయనున్నారు. ఇప్పటికే సుమారు ఆరుగురు మైనర్లపై కేసులు నమోదు చేసి జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు. వాహన యజమానికీ శిక్ష! భారత మోటార్ వాహన చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు వారు ఎలాంటి వాహనాలు నడపకూడదు. 18 ఏళ్ల నిండిన తర్వాతనే గేర్లతో కూడిన వాహనాలు నడపాలి. వారికే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తారు. అయితే ఈక్రమంలో మైనర్లకు వాహనాలు ఇచ్చే వారు సైతం శిక్షార్హులే. వీరిని సైతం కోర్టులో ప్రవేశపెడతారు. మైనర్ డ్రైవింగ్‌లో ప్రమాదం చేస్తే.. వాహనం నడిపిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లలో కఠినమైన కేసులు నమోదు చేస్తారు. వీరికి వాహనం ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి నిర్ణయం ప్రకారం శిక్షలు ఖరారు చేయనున్నారు. మైనర్లు పాల్పడే ఉల్లంఘనలు హైదరాబాద్, సైబరాబాద్‌లలో కొన్ని స్వచ్ఛంద సం స్థలు మైనర్లు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో అధ్యయనం చేసింది. వాటి ప్రకారం ముఖ్యంగా మైనర్లు 12 రకాల ఉల్లంఘనకుల పాల్పడుతున్నారని గుర్తించారు. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్ల వినియోగం, డ్రైవింగ్ అవగాహన లేకుండా అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కల్గిస్తారని గుర్తించారు. విదేశాల్లో కఠిన చట్టాలు విదేశాల్లో మైనర్లు వాహనాలు నడిపితే వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. భారీగా జరిమానా విధిస్తారు. మైనర్లు, తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. తల్లిదండ్రులకూ భారీగా జరిమానాలు విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్న వారు కూడా మూడుసార్లు నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్‌లైసెన్స్‌లు రద్దు చేస్తారు. ఒక్కసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దయితే మళ్లీ పునరుద్ధరించరు. కఠినంగా అమలు చేస్తాం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో మైనర్లకు అవగాహన కల్పించాం. కౌన్పెలింగ్లు నిర్వహించాం. అయినా ప్రమాదాలు తగ్గడం లేదు. వాటిని కట్టడి చేయడానికి చట్టం అమలు చేస్తున్నాం. మైనర్ వాహనం నడిపి ప్రమాదాలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బోల్తాకొట్టింది. ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.