వాహనం నడిపిన మైనర్, అతని తండ్రికి అవగాహన కల్పిస్తున్న పోలీసులు
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో గత రెండేళ్లుగా వాహనాలు రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. పలు ద్విచక్ర వాహన ఉత్పత్తిదారులు యువతను ఆకట్టుకునేలా వాహనాలను రూపొందిస్తుండటంతో వీరి వేగానికి అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తమ పిల్లలకు వాహనాలు కొనుగోలు చేయడమో, ఉన్న వాహనాలను పిల్లలకు ఇవ్వడమో చేస్తున్నారు. పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా యువత, తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న యువతలో 80 శాతం మందికి లైసెన్స్‌లే లేవనడంలో అతిశయోక్తి కాదు. లైసెన్స్‌లు ఉన్నా వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడమో, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడమో జరుగుతున్నాయి. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతుండడం వల్ల వారికో.. ఎదురుగా వస్తున్న వారికో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
అయినప్పటికీ మైనర్లలో, తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలకు అనుగుణంగా రోడ్లు ఎక్కాల్సిన వాహనాలు అందుకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. ఇలా నిబంధనలు అతిక్రమించి, పోలీసులకు చిక్కినపుడు సిఫార్సుల ద్వారానో, జరిమానా చెల్లించో వాటి నుంచి బయటపడి మళ్లీ రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి వారికి జరిమానా విధిస్తున్నారే తప్ప, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం లేదు. ఇటువంటి సున్నితమైన సమస్యలపై మైనర్లు, తల్లిదండ్రులను చైతన్య పరచాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇటీవలే వారికి తరచూ కౌన్సిలింగ్ నిర్వహించి విడిచి పెడుతున్నారు. అయినా మార్పు రావడం లేదు. శ్రీకాకుళం నగరంలో పలు రోడ్లు ఇరుకుగా ఉండడం అందరికీ తెలిసింది. ఇటువంటి ప్రాంతాల్లో మైనర్లు అతి వేగాన్ని ప్రదర్శించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment