వాహనం నడుపుతున్న మైనర్లు
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : గడప దాటి రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నా సరే మైనర్లు, తాగుబోతులు ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలను చూసినట్లయితే డ్రైవింగ్‌పై అవగాహన లేని మైనర్లు వాహనాలను నడపటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఇటీవలే కొత్త అమెండ్‌మెంట్ వచ్చింది. దీనిపై ప్రత్యేక కథనం.
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట తరచూ జరుగుతుండగా అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వెహికిల్స్ తోలడం, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం తదితరవి కొన్ని కారణాలైతే.. ఏమాత్రం అవగాహన లేని మైనర్లు ద్విచక్ర వాహనాలనే కాక ఫోర్‌వీలర్స్, త్రీవీలర్స్ వాహనాలు కూడా నడపటం ప్రమాదాలు జరుగటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పిల్లలు నడిపితే ..తల్లిదండ్రులపై కేసు
మోటార్ వెహికల్ యాక్ట్‌లో మరో కొత్త అమెండ్‌మెంట్‌ను ఇటీవలే తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఇకపై తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. పిల్లలు అతివేగంతో, అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైనా లేక పోలీసులకు పట్టుబడ్డా కొత్త అమెండ్‌మెంట్ ప్రకారం ఇకపై సదరు మైనర్ల పైనే కాక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు కానుంది. సాధారణంగా వాహనం ఎవరిదైనా సరే దానిని నడిపే సమయంలో సదరు వ్యక్తికి సరైన పత్రాలు లేకుంటే జరిమానాలు విధిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడొచ్చిన కొత్త నిబంధన ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు లేదా వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసే అధికారాలు పోలీసులకు ఉన్నాయి.
పేరెంట్స్ బీ కేర్‌ఫుల్
కొత్తగా వచ్చిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికే పేరెంట్స్ వాహనాలు ఇవ్వాలి.
లైసెన్స్ లేకుండా నడిపితే చర్యలు
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. కొత్తగా వచ్చిన ఎంవీ అమెండ్‌మెంట్ ప్రకారం మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తాం. డైవింగ్ చేసే వారు ఎవరైనా సరే వాహనానికి సంబంధించిన పేపర్లతోపాటు లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. మైనర్లు డ్రైవింగ్ చేయటం నేరం. ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి.
– శ్రీకాంత్, ఆర్‌కేపీ ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment