రూ.25,000 వరకు జరిమానా, వాహనం ఆర్సీ రద్దు
మోటారు వాహన చట్టానికి రవాణా శాఖ పదును
సాక్షి, హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా ఝళిపించింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు కార్లు, బైక్‌లు నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులు మూల్యం చెల్లించుకోవాల్సిందే. గ్రేటర్ పరిధిలో తరచుగా ఎక్కడో ఒకచోట మైనర్ల డ్రైవింగ్ బెంబేలెత్తిస్తున్నాయి. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా వాహనాలు నడిపే మైనర్లు వాహనాలు ఢీకొట్టి ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు.
ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ విపత్కర పరిణామంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ల తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా కార్యాచరణ చేపట్టినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. తల్లిదండ్రులు తమ మైనారిటీ పిల్లలకు వాహనాలను అప్పగించి చిక్కులు కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
హడలెత్తిస్తున్న మైనర్లు..
👉స్కూల్‌పిల్లలు, మైనారిటీ తీరని ఇంటరీ్మడియట్ స్థాయి పిల్లలు సైతం ఎస్‌యూవీ వంటి అత్యంత వేగవంతమైన బైక్‌లు, కార్లు నడుపుతున్నారు. పిల్లలకు వాహనాలను ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులే వారి డ్రైవింగ్ చూసి గర్వంగా భావిస్తున్నారు. కానీ.. ముంచుకొచ్చే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇలాంటి వాహనాలను నడుపుతూ పరిమితికి మించిన వేగంతో పరుగులు తీస్తున్నారు.
👉 ఈ ఏడాది జూన్ నెలలో మణికొండ వద్ద ఓ మైనర్ బాలుడు ఎస్‌యూవీ వాహనం నడుపుతూ పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గతంలోనూ నలుగురు పిల్లలు వారిలోఒకరి పుట్టిన రోజు సందర్భంగా కారు తీసుకొని లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇప్పటివరకు సాధారణ శిక్షలతో సరి..
👉 ప్రతి ఏటా పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది తనిఖీల్లో సుమారు 2,500 నుంచి 3,000 మంది పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నట్లు అంచనా. ఇలాంటి సంఘటనల్లో ఇప్పటి వరకు సాధారణ శిక్షలే అమలవుతున్నాయి. తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి వదిలేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సివస్తోంది.
👉 రెండేళ్ల క్రితం మైనర్ల డ్రైవింగ్ వల్ల 25 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2023లో 35 ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలు వాహనాలు నడిపే డ్రైవర్లు, వారితో కలిసి ప్రయాణం చేసేవారు. ఇతర రోడ్డు వినియోగదారులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు కానుంది.
👉 మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడటంతో పాటు బండి నడుపుతూ పట్టుబడినా సరే ఆర్సీ రద్దవుతుంది. ఏడాది పాటు సదరు వాహనం రిజి్రస్టేషన్‌ను రద్దు చేయనున్నారు. దీంతో ఆ వాహనాన్ని వినియోగించేందుకు అవకాశం ఉండదు. పట్టుబడే మైనర్లకు 25 ఏళ్ల వయసు వరకు లెరి్నంగ్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ రవాణా కమిషనర్ ఇలంబర్తి ఇటీవల అన్ని జిల్లా, ప్రాంతీయ రవాణా కార్యాలయాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనర్ల డ్రైవింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని తెలిపారు.
రహదారి భద్రత ప్రధానం..
రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేని పిల్లలు వాహనాలను తీసుకొని రోడ్డెక్కితే చాలా నష్టం జరుగుతుంది. ఆ పిల్లల కుటుంబాలే కాకుండా సమాజం కూడా ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు.
– సి.రమేష్, ట్రాన్స్‌పోర్ట్ జాయింట్
కమిషనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment