Hyderabad: ప్రేమ వ్యవహారాలు, దావత్‌ల మోజులో చిన్నారులు | Hyderabad: Study children Attract To Love Affairs Party Culture | Sakshi

Hyderabad: ప్రేమ వ్యవహారాలు, దావత్‌ల మోజులో చిన్నారులు

Published Sat, Mar 11 2023 1:11 PM | Last Updated on Sat, Mar 11 2023 1:24 PM

Hyderabad: Study children Attract To Love Affairs Party Culture - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆట పాటలతో హాయిగా సాగాల్సిన బాల్యం పక్కదారి పడుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన చిన్నారులు దావత్‌ల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మద్యానికి బానిసలవుతున్నారు. ఫోన్లు, సినిమాల మాయలో పడి పసితనంలోనే ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్నారు. చిన్న వయస్సులో స్నేహితులతో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా నేటి చిన్నారులు, యువత భావిస్తున్నారు.

తమ పనుల్లో బిజీగా మారిన తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదారులు పడుతున్నారు. తెలిసి తెలియని స్కూల్‌ వయస్సులోనే విద్యార్థులు ప్రేమ వలలో చిక్కుకుంటున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు ఫోన్లు కొనివ్వడంతో వారు చాటింగ్‌లు చేస్తూ బడి వయస్సులోనే ప్రేమ వలలో చిక్కి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి దాకా వెళ్తున్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం మద్యం, సిగరెట్‌లు తాగుతున్నారు. బర్త్‌డే పార్టీల పేరిట రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. కొందరు మద్యం తాగి సోషల్‌మీడియాలో ఫొటోలు సైతం పెడుతున్నారు.

భయం లేకపోవడమేనా?
గతంలో తల్లిదండ్రులు, గురువులు అంటే పిల్లలు భయపడేవారు. ప్రస్తుతం తల్లిదండ్రుల అతిగారాబంతో చిన్నారులకు వారంటే భయం ఉండడంలేదు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఏమన్నా అంటే తల్లిదండ్రులు గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంది. దీంతో వారు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి చేసిన తప్పిదానికి ఉపాధ్యాయుడు మందలిస్తే తల్లిదండ్రులు, బంధువులు సదరు ఉపాధ్యాయుడిపై గొడవకు దిగారు.

తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే..
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు, బైకులు, డబ్బులిచ్చి పాఠశాలకు కళాశాలకు పంపితే సరిపోతుందని భావించడంతోనే విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. తాము పడుతున్న కష్టాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సి ఉంది. పిల్లలు ఎటు పోతున్నారో ఓ కంట కనిపెట్టాలి. పిల్లల బాగోగులను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి.

ఆలోచన విధానం మారాలి
పిల్లలకు తల్లిదండ్రుల నుంచే క్రమశిక్షణ అలవాటు అవుతుంది. పిల్లలకు ఏమిస్తున్నాం. దాని అవసరం ఎంత ఉందని తల్లిందడ్రులు తెలుసుకోవాలి. చిన్న వయస్సులో అవసరానికి మించి బైకులు, ఖరీదైన ఫోన్లు ఇచ్చి కళాశాలకు, పాఠశాలకు పంపరాదు. సంస్కారం తల్లిదండ్రులు నుంచి వస్తుంది. వినయం విద్య ద్వారా వస్తుంది. తాము కూడా పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం.
– రమేశ్‌కుమార్‌, ఎస్‌ఐ, దౌల్తాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement