ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. సెలవు పెట్టాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఆ ఉద్యోగి ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా...సెలవు పెట్టకుండా పది రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో చౌక దుకాణాలకు వెళ్లాల్సిన బియ్యం పంపిణీ నిలిచిపోయింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ ఉద్యోగి ఆచూకీ కోసం ఉన్నతాధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
విజయనగరం , చీపురుపల్లి: పౌర సరఫరాల శాఖ నేతృత్వంలో నిర్వహిస్తోన్న ఎంఎల్‌ఎస్ పాయింట్ గొడౌన్ ఇన్‌చార్జి పరారీలో ఉన్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. సుమారు పది రోజులుగా గొడౌన్ ఇన్‌చార్జి హెచ్.రమణారావు ఆచూకీ లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు సైతం గుట్టు చప్పుడు కాకుండా వెతికించే పనిలో పడ్డారు. అయితే గొడౌన్ ఇన్‌చార్జి కనిపించకుండా పరారీలో ఉండడం ఒకెత్తయితే ఆయనతో పాటు గొడౌన్‌కు చెందిన అతి ముఖ్యమైన రిజిస్టర్లు, ప్రధాన గొడౌన్ తాళాలు కూడా ఆయన వద్దే ఉండడం చర్చనీయాంశమైంది. అది కూడా మార్చి నెలలో తెలుపు రంగు రేషన్ కార్డు లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన బియ్యం దాదాపు 70 వేల క్వింటాళ్లకు పైగా గొడౌన్‌లో నిల్వ ఉండగా ఆయన తాళాలతో సహా కనిపించకుండా వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి సెలవు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరవ్వడం మాత్రమే కాకుండా కనిపించకుండా వెళ్లిపోవడంపై సంబంధిత అధికార వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అయితే వ్యక్తిగత అవసరాలు ఉంటే సెలవుపై వెళ్తారని, లేకపోయినప్పటికీ తాళాలు, రిజిస్టర్లు కూడా అప్పగించకుండా కనిపించకుండా వెళ్లిపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
4 నుంచి పరారీలోనే....
చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం(పార్ట్), గుర్ల(పార్ట్)కు సంబంధించిన ఆయా పరిధిలో ఉండే చౌకదుకాణాలకు చీపురుపల్లిలో ఉండే ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ప్రతీ నెలా రేషన్ సరుకులు పంపిస్తారు. ఈ గొడౌన్‌కు ఇన్‌చార్జిగా ఉండే హెచ్.రమణారావు ఈ నెల 4 నుంచి కార్యాలయానికి వెళ్లడం లేదు. ఎక్కడున్నారో తెలియదు. జిల్లా అధికారుల ఫోన్‌లకు సైతం స్పందించడం లేదు. ప్రభుత్వ సెల్ నంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉండగా, వ్యక్తిగత సెల్ నంబరు కూడా ఏదో ఒక సమయంలో మాత్రమే పని చేస్తోందని తెలిసింది. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో సమావేశానికి కూడా ఆయన హాజరు కానట్టు సమాచారం. అయితే ఆయనతో పాటు రిజిస్టర్లు, గొడౌన్ తాళాలు కూడా ఉండడంతో విభిన్న చర్చలకు దారి తీస్తోంది.
70 వేల క్వింటాళ్లకు పైగా బియ్యం....
మార్చి నెలకు సంబంధించి చౌక దుకాణాలు ద్వారా పంపిణీ చేసేందుకు అవసరమైన బియ్యం ఫిబ్రవరి 3న స్థానిక గొడౌన్‌కు చేరుకుంది. అప్పటికి గొడౌన్ ఇన్‌చార్జి విధుల్లోనే ఉన్నారు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 4 నుంచి ఆయన అందుబాటులో లేరు. అయితే గొడౌన్లులో దాదాపు 70 వేల క్వింటాళ్లకు పైగా బియ్యం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 18 నుంచి గొడౌన్ నుంచి చౌక దుకాణాలకు సరుకులు వెళ్లాల్సి ఉంది. ఇంతవరకు ఇన్‌చార్జి ఆచూకీ లభించలేదు. ఫిబ్రవరి 4 నుంచి దాదాపు పది రోజులుగా ఇన్‌చార్జి ఆచూకీ లేకపోయినప్పటికీ ఎలాంటి చర్యలు కానరావడం లేదు. జిల్లా అధికారులు రెండు రోజులుగా ఆయన ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
చర్యలకు సిద్ధం...
చీపురుపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ గొడౌన్ ఇన్‌చార్జిపై చర్యలకు సిద్ధమవుతున్నాం. ముఖ్యమంత్రి పర్యటన పూర్తి కాగానే ఆయనపై చర్యలు ప్రారంభమవుతాయి. గొడౌన్ తాళాలు, రిజిస్టర్లు ఆయన వద్ద పెట్టుకోవడం చాలా పెద్ద నేరం. ఆయన ఎలాంటి సెలవు పెట్టలేదు. ఎన్నో ఫోన్ కాల్స్ చేసాం, ఇంటికి పంపించాం ఎవ్వరూ లేరు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగి కావడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. చర్యలు తీసుకోమని జాయింట్ కలెక్టర్ గారికి కోరతాం. తాళాలు, రిజిస్టర్లు స్వాధీనం చేసుకుంటాం. రిజిస్టర్లు, తాళాలు వచ్చాక పరిశీలన చేసి ఎలాంటి తేడాలు ఉన్నా గట్టి చర్యలు ఉంటాయి.– షర్మిల,జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment