![3 month old baby kidnapped in hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/125.jpg.webp?itok=Tq-p9rgN)
5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
తల్లి వద్దకు చేరిన చిన్నారి
దుస్తులు కొనిపిస్తామని నమ్మించి ఎత్తుకెళ్లిన దుండగుడు
రూ. లక్షన్నరకు చిన్నారిని విక్రయించేందుకు యత్నం
కాచిగూడ హైదరాబాద్: దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి ఓ తల్లి నుండి మూడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడిని సీసీ కెమెరాల సాయంతో కాచిగూడ పోలీసులు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్‌లు మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం, అగ్రహారం గ్రామానికి చెందిన రవి, వరలక్ష్మి దంపతులు 3 నెలల బాబుతో ఉపాధి కోసం నగరానికి వచ్చి ఉప్పుగూడలో నివాసం ఉంటూ కూలీ పనిచేస్తున్నారు. గౌలిగూడా ప్రాంతానికి చెందిన బోగ నర్సింగ్ రాజ్ పంజగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
అతనికి కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్ (48), అదే ప్రాంతానికి చెందిన ఎన్.ఉమావతి (55)తో పరిచయం ఉంది. ఉమావతి పనిచేస్తున్న బట్టల షాపులో లాల్‌దర్వాజా ప్రాంతానికి చెందిన సంధ్యారాణి పనిచేస్తుంటుంది. శివ, సంధ్యారాణి దంపతులకు పిల్లలు లేకపోవడంతో తాను పెంచుకోవడానికి దత్తతకు పిల్లలు కావాలని ఉమావతిని కోరింది. ఉమావతి ఈ విషయాన్ని నర్సింగ్ రాజ్, రాఘవేంద్రలకు తెలిపింది. వారు తమకు తెలిసిన వాళ్లు పిల్లలను దత్తతకు ఇస్తారని, వారికి లక్షన్నర డబ్బులు ఇవ్వాలని సంధ్యారాణికి తెలిపారు.
దానికి అంగీకరించిన సంధ్యారాణి తొలివిడతగా లక్ష రూపాయలు చెల్లించింది. డబ్బులు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా వారు ఇచి్చన మాట నిలబెట్టుకోక పోవడంతో సంధ్యారాణి వారిపై ఒత్తిడి చేసింది. దీనితో కిడ్నాప్ చేసి, ఆమెకు చిన్నారిని అందించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో సోమవారం చాదర్‌ఘాట్ చౌరస్తాలో వరలక్ష్మి తన మూడేళ్ల కుమారుడితో భిక్షాటన చేస్తుండగా నర్సింగ్‌రాజ్ ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. కొత్త దుస్తులు ఇప్పిస్తానని వరలక్ష్మీని మాటల్లో పెట్టాడు. తన వెంట కాచిగూడ డిమార్ట్‌కు తీసుకెళ్లాడు. వరలక్ష్మి దుస్తులు చూస్తుండగా నర్సింగ్‌రాజ్ అక్కడి నుండి బాబును తీసుకొని ఆటోలో ఉడాయించాడు.
లాల్ దర్వాజాలో ఉండే సంధ్యారాణికి అప్పజెప్పాడు. బాలుడు కని్పంచకపోవడంతో వరలక్ష్మి కొద్దిసేపు వెదికింది. ఫలితం లేకపోవడంతో సోమవారం సాయంత్రం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐలు సుభాష్, రవికుమార్‌లు రెండు టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాల సహాయంతో లాల్‌దర్వాజలో బాలుడు ఉన్నట్లు కనుగొన్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నర్సింగ్‌రాజ్, రాఘవేందర్‌లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ఉమావతి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఆరు గంటల్లో కేసును ఛేదించిన కాచిగూడ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment