చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయలేదు
ఎమ్మెల్యే ఆదిమూలం వర్గీయులు వేధిస్తున్నారు
సత్యవేడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆవేదన
మరోవైపు ఆదిమూలానికి మద్దతుగా పలు వర్గాలు ఆందోళన
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది.
చంద్రబాబు, లోకేశ్ వల్లే..
వరలక్ష్మికి టీడీపీలోని యాదవ సామాజికవర్గ నాయకులు మద్దతుగా నిలిచారు. వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి.. తిరిగి ఆమెనే వేధింపులకు గురిచేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర భాషతో నీచాతినీచంగా తిడుతూ.. ఫోన్‌కాల్స్ చేసి వేధిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. బలవంతపు మరణానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాధితురాలి ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.
దళిత ఎమ్మెల్యేపై కుట్ర చేశారంటూ ఆందోళన
టీడీపీలోని అగ్రకుల నాయకులు కుట్ర పన్ని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం సత్యవేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వరలక్ష్మిపై కేసు నమోదు చేసి, ఆమె వెనుక ఎవరున్నారో విచారించి.. శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే నారాయాణవనం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఓ మాజీ ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌గా నియమించి పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదిమూలం వర్గీయులు కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు ఫోన్ చేసి.. వరలక్ష్మి కేసు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment