
బాధితురాలు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
పోలీసు, సీబీఐ పేరు చెప్పిన కేటుగాళ్లు
సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగినిని (75) టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.73 లక్షలు కాజేశారు. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా..పోలీసు, సీబీఐ అధికారుల పేరు చెప్పి.. దుర్భాషలాడిన ఆరోపణలపై కేసుంటూ మొదలుపెట్టి...మనుషుల అక్రమ రవాణా వరకు తీసుకువెళ్లి ఈ మొత్తం స్వాహా చేశారు. ఎట్టకేలకు తాను మోసోయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితురాలికి వారం రోజుల క్రితం టెలికం విభాగానికి చెందిన అధికారి పేరుతో ఫోన్ వచ్చింది. 702–––––562 నంబర్ మీదేనా? అంటూ అవతలి వ్యక్తి పశి్నంచగా కాదని సమాధానం ఇచ్చారు.
ఆమె ఆధార్‌తో లింకై ఉన్న ఆ ఫోన్ నెంబర్ వినియోగించిన కొందరు అసభ్య పదజాలంతో పలువురికి ఫోన్లు చేశారని, దీనిపై బెంగళూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదై ఉందని చెప్పారు. ఆమె పేరుతో ఉన్న అన్ని ఫోన్లు త్వరలో బ్లాక్ అవుతాయని భయపెట్టాడు. ఈ ఆరోపణల్ని బాధితురాలు తోసిపుచ్చగా... త్వరలోనే పోలీసులు సంప్రదిస్తారని చెప్పాడు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ చేసిన వ్యక్తి పోలీసు యూనిఫాంలో బాధితురాలికి కనిపించాడు. ఆమె ద్వారా ఆధార్ కార్డు కూడా షేర్ చేయించుకున్నాడు. తాము షాదత్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, అతడు వినియోగించిన బ్యాంకు ఖాతాల్లో కొన్ని బాధితురాలి పేరుతో ఉన్నట్లు చెప్పాడు. బాధితురాలి ఆరి్థక స్థితిగతుల్ని అడిగిన అతగాడు మనుషుల అక్రమ రవాణా కేసులో 187వ అనుమానితురాలిగా చేరుస్తున్నట్లు చెప్పాడు.
ఆ కేసులో అరెస్టు వారెంట్, బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ఆదేశాలు సిద్ధంగా ఉన్నట్లు నమ్మబలికాడు. దీని తర్వాత సీబీఐ అధికారి పేరుతో వీడియో కాల్ చేసిన మరో వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ జారీ చేసినట్లు ఉన్న నకిలీ లేఖను పంపాడు. అందులో సుప్రీం కోర్టు జ్యుడీషియల్ అథారిటీ ఆదేశాల ప్రకారం బాధితురాలు కొంత మొత్తం పోలీసులు సూచించినట్లు డిపాజిట్ చేయాలని ఉంది. సదరు నకిలీ సీబీఐ అధికారి ఆ కేసుల్లో పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులకూ పాత్ర ఉన్నట్లు చెప్పాడు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం నగదు డిపాజిట్ చేయాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు.
దీంతో బాధితురాలు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు సైతం బ్రేక్ చేసి, తన కుమార్తె వద్ద నుంచి తీసుకుని మొత్తం రూ.73.5 లక్షలు సిద్ధం చేశారు. ఆపై నేరగాళ్లు ఆర్బీఐ పేరుతో మరో నకిలీ లేఖ పంపి...అందులో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు, వివరాలు సూచించిన వాటిల్లోకి నగదు బదిలీ చేయమన్నారు. బాధితురాలు అలానే చేయడంతో ఆదాయపుపన్ను శాఖ, ఆర్బీఐ స్టాంపులు ఉన్న నకిలీ రసీదులు కూడా షేర్ చేశారు.
కొన్నాళ్లకు నేరగాళ్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో మరో నకిలీ లేఖను పంపిస్తూ... అందులో ఆమె పేరును నిందితుల జాబితా నుంచి బాధితుల జాబితాలోకి మార్చినట్లు పేర్కొన్నారు. బాధితురాలు ఎన్నిసార్లు కోరినా నగదు రిఫండ్ చేయకపోవడంతో అనుమానించిన ఆమె ఎట్టకేలకు మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment