కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడానికి బదులు అడ్డదారుల్లో ఆస్తులు సంపాదించినవారిపై లోకాయుక్త ముమ్మర దాడులు చేసింది. బెంగళూరు, మైసూరు, బీదర్, బళ్లారి, విజయనగరతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 63కు పైగా ప్రాంతాల్లో 13 మంది అధికారులు, ఉద్యోగుల ఆఫీసులు, ఇళ్లు, వారి బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపింది. ఇందులో కోట్లాది విలువ చేసే నగదు, బంగారం, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది.
లెక్చరర్ వ్యాపారాలు
మైసూరు నంజనగూడు ప్రభుత్వకాలేజీ లెక్చరర్ మహదేవస్వామికి చెందిన మైసూరు గురుకుల లేఔట్ నివాసంతో పాటు 12 చోట్ల దాడులు చేశారు. పేరుకే ఆయన అధ్యాపకుడు, కానీ ఎంఎస్ గ్రూప్ కంపెనీ నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు పోగేసినట్లు తెలిసి సోదాలు చేపట్టారు. మైసూరులోని ఇళ్లు, కార్యాలయం, పాఠశాల, వాణిజ్య కట్టడాల్లో గాలింపు జరిపారు. ఒక విద్యాసంస్థ, స్టీల్, వస్త్ర దుకాణాలు గుర్తించారు. ఆయన కార్ల పార్కింగ్ కోసమే విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఘనాపాఠి తిమ్మరాజ
కేఆర్‌ఐడీఎల్ సూపరిన్‌టెండెంట్ ఇంజనీర్ తిమ్మరాజప్ప బంగ్లా చూసి లోకాయుక్త అధికారులు షాక్ తిన్నారు. కోలారు, బెంగళూరు, బెళగావితో పాటు 8 చోట్ల దాడులు చేశారు. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని సొంతూరు మహదేవపురలో బృహత్ బంగ్లా కట్టుకున్నారు. బెంగళూరులోనూ తిమ్మరాజప్ప 7 ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువచేసే నివాసం, ఆస్తులు, భూములు రికార్డులు లభ్యమయ్యాయి.
విజయేంద్ర బావమరిదిపై...
బళ్లారి గనులు, భూ విజ్ఞానశాఖ చంద్రశేఖర్, అటవీశాఖ డీఆర్‌ఎఫ్‌ఓ మారుతి ఇళ్లలో తనిఖీలు చేశారు. చంద్రశేఖర్ బళ్లారిలో పనిచేస్తుండగా ఇల్లు హోసపేటెలో ఉంది. బీదర్‌లో పశువైద్య యూనివర్శిటీ ఉద్యోగి సునీల్‌కుమార్ నివాసం, వాణిజ్య కాంప్లెక్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై. విజయేంద్ర భార్య సోదరుడు, యాదగిరి డీహెచ్‌ఓ డాక్టర్ ప్రభులింగ మానకర్ కలబురిగి నివాసంలోను సోదాలు చేపట్టారు. అందరి ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు తదితరాల తనిఖీ కొనసాగుతోంది.
బెంగళూరులో ముగ్గురు..
బెంగళూరులో మూడుచోట్ల... బెస్కాం జాగృతి దళం అధికారి టీఎన్.సుధాకర్‌రెడ్డి, సహకార సంఘం సీఈఓ హెచ్‌ఎస్.కృష్ణమూర్తి, జయనగర బెస్కాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్‌డీ. చెన్నకేశవల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. చెన్నకేశవకు చెందిన అమృతహళ్లి ఇంటిలో రూ.6 లక్షలు నగదు, 3 కిలోల బంగారు నగలు, 28 కేజీల వెండి, రూ.25 లక్షల విలువచేసే వజ్రాభరణాలు, రూ.5 లక్షలు విలువైన 7 పురాతన వస్తువులు లభించాయి. వీటన్నింటి ప్రాథమిక విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే లక్షలాది రూపాయల ముడుపులు తీసుకుంటారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఫిర్యాదులు కూడా అందాయి.
మొదటి భార్య భవనం
చిక్కబళ్లాపురం: రామనగర జిల్లాలో వ్యవసాయశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే మునేగౌడపై లోకాయుక్త దాడులు చేసింది. ఇక్కడ నంది క్రాస్‌లో ఉన్న మొదటి భార్య ఉండే విలాసవంతమైన బంగ్లాలో సోదాలు చేశారు. పాలిహౌస్‌ల కొనుగోలులో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రామనగర, బెంగళూరు, సొంతూరు శిడ్లఘట్ట, చిక్కబళ్లాపురంలోనూ బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. బంగారం, నగదు, ఆస్తిపత్రాలు లభించాయి. చిక్కబళ్లాపురం లోకాయుక్త ఎస్పీ రామ్, డీఎస్పీ వీరేంద్రకుమార్, ఇన్స్‌పెక్టర్లు శివప్రసాద్, మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment