ఐశ్వర్య కార్లు.. మాజీ మంత్రి వద్ద! | - | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య కార్లు.. మాజీ మంత్రి వద్ద!

Published Wed, Jan 8 2025 12:20 AM | Last Updated on Wed, Jan 8 2025 9:14 AM

-

కిలేడీ కేసులో ఎన్నో ప్రశ్నలు

యశవంతపుర, దొడ్డబళ్లాపురం: మాజీ ఎంపీ డీకే సురేశ్‌ చెల్లినని చెప్పుకుని బెంగళూరులో నగల షాప్‌ల నుంచి మొదలుకుని అనేక మందికి కోట్లల్లో వంచించిన కిలేడీ ఐశ్వర్య గౌడ కేసులో అనేకమంది నాయకుల పేర్లు బయటపడుతున్నాయి. పోలీసులు ఐశ్వర్యగౌడపై నమోదైన కేసుల్లో ఆమె ఆస్తులను సీజ్‌ చేస్తున్నారు. ఐశ్వర్యగౌడ పేరుమీద ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే ఆ కార్లు మాజీ మంత్రి, కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన వినయ్‌ కులకర్ణి వద్ద ఉండడం చర్చనీయాంశమైంది. ఆమెతో ఆయనకేమిటి సంబంధం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాకు అనేకమంది బడా రాజకీయ నాయకులతో స్నేహాలున్నాయి అని ఆమె చెబుతూ వస్తోంది. ఆ మాటలు నిజమేననిపిస్తోంది. ఐశ్వర్యగౌడ అనేకమంది బడా బాబులను మండ్య జిల్లాలోని ఆమె ఊరికి తీసికెళ్లి వేడుకల్లో ముఖ్య అతిథులుగా సన్మానాలు చేసేది. వినయ్‌ కులకర్ణి కూడా ఐశ్వర్యగౌడ ఊరికి వెళ్లివచ్చాడని సమాచారం. చీటింగ్‌ కేసులో ఆమె బెయిలు మీద ఉన్నారు.

ఐశ్వర్య వద్ద లగ్జరీ కార్లు
ఐశ్వర్యగౌడ భర్త హరీశ్‌ పేరుపై నమోదైన ఖరీదైన బెంజ్‌ కారును మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణి ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. దీనితో పోలీసులు వినయ్‌కు నోటీసులిచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఐశ్వర్యగౌడ నుంచి ఒక బిఎండబ్ల్యూ, ఆడి, ఫార్చూనర్‌ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరుతో మరో రెండు బెంజ్‌ కార్లు ఉన్నట్లు గుర్తించారు.

కారు డ్రైవర్‌.. హత్యకేసు నిందితుడు
ధార్వాడలో జరిగిన బీజేపీ జడ్పీటీసీ యోగేశ్‌గౌడ హత్యకేసులో ఐదో నిందితునిగా ఉన్న అశ్వర్థగౌడ ఐశ్వర్యకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడు ఆమె ఎలా కారు డ్రైవర్‌ అయ్యాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య కేసులో వినయ్‌ కులకర్ణి ప్రధాన నిందితుడు కావడం, అతడు ఐశ్వర్యకు కూడా సన్నిహితుడు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రూ. 5 కోట్లు కొట్టేసిందని కేసు
బెంగళూరుకు చెందిన గైనకాలజిస్టు డా.మంజుళా పాటిల్‌.. ఐశ్వర్యపై ఆర్‌ఆర్‌ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 5.03 కోట్లు తనను మోసం చేసిందని తెలిపారు. డీకే సురేశ్‌ సోదరినని చెప్పుకుని భారీ వ్యాపారాలు చేస్తున్నట్లు నమ్మించింది, డబ్బు, బంగారం తీసుకుందని తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement