child line
-
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
చిన్నారులతో పని చేయించడం నేరం
సాక్షి,మేడ్చల్ జిల్లా: చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. ఈ విషయంలో చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ హరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ), చైల్డ్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. బడులకు పంపించేలా చర్యలు తీసుకోవాలి.. ♦ చిన్న పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. వారి తల్లిదండ్రులు పాఠశాలల్లో చేరి్పంచాలని ఇన్చార్జ్ కలెక్టర్ కోరారు. చాలా మంది చిన్నారులు ఇటుక బట్టీల్లో కూలీలుగా పని చేస్తున్నారని చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పనులు మాని్పంచి పాఠశాలలకు వెళ్లేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 1098 సేవలను వినియోగించుకోవాలి.. ♦ బాలల అక్రమ రవాణా, లైంగికదాడులు, బాల్య వివాహాలు, వేధింపులకు గురి చేసినా ఇతర ఇబ్బందికరమైన చర్యలకు పాల్పడినా వారిపై సంబంధిత యాక్టుల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. పిల్లలకు ఉన్న హక్కులను ఎవరూ దూరం చేయరాదన్నారు. వారి హక్కుల రక్షణతో పాటు వారి అభివృద్ధికి కావాల్సిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. చైల్డ్‌లైన్ 1098 సేవలను వినియోగించుకోవాలని కోరారు. మూడు నెలలకో సమావేశం నిర్వహించాలి... ♦ ప్రతి మూడు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, స్యాంసన్, జిల్లా సంక్షేమాధికారి అంకేశ్వరరావు, రాచకొండ డీసీపీ సలీమా, డీఆర్డీవో పద్మజా, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.మల్లికార్జున్‌రావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రాజారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హోంవర్క్ చేయలేదని కుమారుడిని ఫ్యాన్ కు వేలాడదీసి, ఆపై
జైపూర్: స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయలేదని కన్న కొడుకుని సీలింగ్ ఫ్యాన్ కు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి తండ్రి. ఘటన ఈనెల 17న రాజస్థాన్ రాష్ట్రం బుంది జిల్లాలోని డాబిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త అరాచకాన్ని రికార్డు చేసిన భార్య... జోగ్నియమతలో ఉన్న తన అన్న చంద్రబాన్ కు చూపించడంతో ఆయన చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేశారు. కర్కశ తండ్రి.. హోం వర్క్ చేయలేదని కోపంతో ఊగిపోయిన కసాయి తండ్రి ప్రజాప్త్ (37) ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. అక్కడితో ఆగకుండా కర్రతో మళ్లీ చితకబాదేందుకు యత్నించగా... భార్య అతన్ని అడ్డుకుంది. ప్రాధేయపడినా.. తండ్రి తనను ఫ్యాన్ కు వేలాడదీస్తుండగా విడిచిపెట్టాలని ఆ బాలుడు పదేపదే ప్రాధేయపడ్డాడు. అయినా ఆయన కనికరించలేదు. ఇక తన భర్త అరాచకాన్ని ఎలాగైనా బయటపెట్టాలకున్న ఆ ఇల్లాలు.. పిల్లాడిని ఫ్యాన్ కు వేలాడదీస్తుండగా సాయం చేస్తున్నట్లుగా నటించింది. ఆమె ఫోన్ ను కిటికి దగ్గరగా ఉంచి ఈ బాగోతాన్ని రికార్డ్ చేసింది. దీంతో ఈ ఘటన బయటకొచ్చింది. బాలుడితో పాటు ఐదేళ్ల కూతురిని సైతం తన బావ పదేపదే కొడుతుంటాడని చంద్రబాన్ పోలీసులకు తెలిపారు. అయితే తన భర్తపై కేసు పెడితే అతని ఆగడాలు మరింత ఎక్కువ అవుతాయని చంద్రబాన్ సోదరి భయపడుతోంది. దీంతో విషయం గ్రహించిన రాష్ట్ర చైల్డ్ లైఫ్ అధికారి బుంది జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివరాలను మూడు రోజుల్లో తెలపాలని సూచించారు. -
మాకొద్దీ అమ్మానాన్న!
మక్కువకు చెందిన చెందిన 14 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు మందలించారని కొద్ది రోజుల క్రితం రైల్లో ముంబై వెళ్లిపోయాడు. అక్కడి పోలీసులు బాలుడిని విచారించి రెండు, మూడు రోజుల్లో స్వస్థలానికి పంపించనున్నారు. విశాఖపట్నానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.. వీరిద్దరే కాదు ఎందరో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – విజయనగరం ఫోర్ట్: తల్లిదండ్రులు మందలించారని కొందరు.. పట్టణాలు చూద్దామని మరి కొందరు ఇంటి నుంచి పారిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వీరు పోలీసులకో.. చైల్డ్‌లైన్ సభ్యులకో దొరికితే పరవాలేదు. పొరపాటున సంఘ విద్రోహ శక్తులకో దొరికితే అత్యంత ప్రమాదకరం. అయిదేళ్లలో 156 మంది మూడేళ్ల కాలంలో 156 మంది వరకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేసారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. అధికారుల దృష్టికి వచ్చిన వారు.. దృష్టికి రాకుండా ఇంటి నుంచి పారిపోయిన వారు మరి కొందరున్నారు. పిల్లల ఇష్టాలను తెలుసుకోలేకే.. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. పనులు, ఉద్యోగాల్లో నిమగ్నమై వారి ప్రవర్తనను గమనించలేకపోతున్నారు. అసలు వారేం చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత హడావుడిగా తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలకు ఏది ఆసక్తి.. ఏదంటే ఇష్టం ఉండదన్న విషయాలను తెలుసుకోవడం లేదు. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా మందలించడం.. కొట్టడం వల్ల భయపడి చాలా మంటి ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. కొందరు పదేపదే చదువు పేరిట సతాయించడం, కోప్పడటం వల్ల బయటికి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కుటుంబంలో, భార్యభర్తల మధ్య గొడవల వల్ల కొందరు పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొందరు పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్చ ఉండటం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – ఎస్.రంజిత, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ పిల్లల ఇష్టాలను తెలుసుకోవాలి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తు ఉండాలి. వారి ఇష్టాలను తెలుసుకోవాలి. కోప్పడటం, తిట్టడం వల్ల పిల్లలు భయపడి ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంది. చిన్న కుటుంబాల వల్ల కూడా నేడు పిల్లలను పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉండటం లేదు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి, చెడుల గురించి చెప్పేవారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూసే తీరిక ఉండటం లేదు. – వావిలపల్లి లక్ష్మణ్, అధ్యక్షుడు, జిల్లా బాలల సంక్షేమ సమితి -
10 తర్వాత పెళ్లికాదు.. 11
సాక్షి, తుళ్లూరు: బంధుత్వం పోతుందనో...మంచి సంబంధం వచ్చిందనో.. కట్నం లేని వరుడు దొరికాడనో...ఇలా పలు కారణాలతో చదువుకోవాల్సిన వయసులో, బాలికలను పెళ్లి పీఠలెక్కిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోవాలన్న కోరికను చంపుకొని పెళ్లిపీటలు ఎక్కుతున్నారు చిన్నారి పెళ్లి కూతుళ్లు. తన తోటి స్నేహితులు ఆడుతూ పాడుతూ పాఠశాలలు, కళశాలలకు వెళ్తుంటే, తాము మాత్రం చంటి పాపలను లాలిస్తు.. వారిని పెంచే భారం మోస్తు అవస్తులు పడుతున్నారు. తమ బతుకు ఇంతే అని జీవితం గడిపేస్తున్నారు పలువురు బాలికలు. ఈ నేపథ్యంలో చైల్డ్‌లైన్, క్రాఫ్, కరుణాలయం వంటి స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలు నిర్మూలన కోసం కంకణం కట్టుకున్నాయి. పది తరువాత పెళ్లి కాదు...11వ తరగతి అని ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నాయి. వివాహ వ్యూహంలో బాల్యం బందీ చదువుకోవాల్సిన వయసులో చిన్నారుల ఆశయాలను పెళ్లి అనే రెండు అక్షరాలు చిదిమేస్తున్నాయి. బాలికల విద్యకు ప్రభుత్వం అనేక పథకాలు, చట్టాలను అమలు చేస్తున్నా సామాజిక, సాంఘిక, ఆర్థిక కారణాలు బాల్య వివాహాలను ఆపలేక పోతున్నాయి. బాల్య వివాహాల నియంత్రణకు ఏర్పాటు చేసిన చైల్డ్‌లైన్ 1098 దృష్టికి రాకుండానే వివాహాలు జరిగిపోతున్నాయి. 10 తర్వాత పెళ్లికాదు.. 11 బాల్య వివాహాలపై అవగాహన కల్పించినా, ఎన్నోసార్లు హెచ్చరించినా సమాజంలో మార్పురాకపోవడంతో పాఠశాలల స్థాయి నుంచి ప్రభుత్వం అవగాహన కల్పించాలని భావించింది. అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలతో కలిసి 10 తరువాత పెళ్లి కాదు...11వ తరగతి వంటి కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల తల్లిదండ్రుల్లో కొంత మార్పు వచ్చిందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. చట్టమేం చెబుతుంది ? బాల్య వివాహ నిషేధిత చట్టం 1978 ప్రకారం అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు. భారత ప్రభుత్వం చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలను నిషేధించారు. ఈచట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి చేస్తే బెయిల్ లభించని నేరంగా పరిగణిస్తారు. రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. అవసరమైతే వివాహం రద్దు చేస్తారు. పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నాం గ్రామీణ స్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతి పాఠశాలలో చైల్డ్‌లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్, పోలీసులు అధికారులు 100 కు కూడా ఫిర్యాదు చేయడంపై బాలికలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. ‘పది తరువాత పెళ్లి కాదు.. 11వ తరగతి’ అని ప్రభుత్వాధికారులతో కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నాం. దీనికి కొంత స్పందన కనిపిస్తోంది. బాలికల తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. – బత్తుల బాబు, చైల్డ్‌లైన్ 1098 ప్రతినిధి -
చదువుకుంటా సార్.. పని మనిషిగా వెళ్లను !
ప్రకాశం, చీరాల: ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆ బాలిక జీవితంపై విధి అక్కసు కక్కింది. 9 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. హాస్టల్లో అయినా చదువుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకుని చీరాల్లోని హాస్టల్‌కు చేరుకుంటే అక్కడా విధి ఆడుకుంది. అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంది. చివరకు ఓ కుటుంబం చేరదీసింది. అదీ స్వార్థంతోనే. అయితే ఆ కుటుంబం బాలికను పని మనిషిగా మార్చింది. చివరకు 5 ఏళ్ల తర్వాత చదువుపై ఆశతో చీరాల మున్సిపల్ స్కూల్లో చేరి చదువుతున్నప్పటికీ దగ్గరకు తీసిన వ్యక్తి మళ్లీ అడ్డు తగిలాడు. హైదారాబాద్‌లోని తన కూతురి ఇంట్లో పనిమనిషిగా ఆ బాలికను మార్చాలని ప్రయత్నం చేశాడు. చివరకు స్థానికుల సహకారంతో చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది బుధవారం ఆ బాలికను ఒంగోలు హోంకు తరలించారు. స్వగ్రామంలో.. ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామానికి చెందిన బాలికకు 9 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోయారు. బాలిక బంధువులు 9 ఏళ్ల బాలికను పెంచలేక చీరాల్లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేర్పించారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆశ్రమం కూడా మూతపడింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికను ఆశ్రమం పక్కనే నివాసం ఉంటున్న మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సూపర్వైజర్ మేడిద కృపావరం చేరదీసింది. అయితే బాలిక చదువుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే హైదబాద్‌లోని తన సొంత కుమార్తె ఇంట్లో పనిమనిషిగా చేర్చింది. 5 ఏళ్ల పాటు వెట్టిచాకిరి, ఎన్నో కష్టాలను అనుభవించిన ఆ బాలిక తాను చదువుకుంటానని, ఇంట్లో పనిమనిషిగా చేయలేనని వేడుకుంది. దీంతో బాలికు 14 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి చీరాలకు తీసుకువచ్చి మున్సిపల్ పాఠశాల్లో చేర్పించారు. సూపర్వైజర్ కృపావరం కూడా కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. దీంతో కృపావరం భర్త మేడిద ప్రభాకరరావు చదువుతున్న బాలికను చదవు మాన్పించేసి హైదబాద్‌లోని తన రెండో కుమార్తె ఇంట్లో పనిమనిషిగా వెళ్లాలని వేధించి ఒత్తిడికి గురిచేశాడు. పలు మార్లు బాలిక తాను చదువుకోవాలి.. నన్ను చదివించండంటూ కాళ్లావేళ్లా పడి బతిమిలాడినా అతను మాత్రం ఆలకించలేదు. దీంతో బాలిక స్థానికుల సహకారంతో ఒంగోలు చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందించగా ప్రతినిధి బీవీ సాగర్ చీరాలకు వచ్చి చీరాల ఒన్‌టౌన్ సీఐ సూర్యనారాయణ, పోలీసుల సహకారంతో బాలికను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మతిన్, నాగిరెడ్డి, వేణుబాబు సమక్షంలో ఒంగోలు హోంకు అప్పగించారు. -
మాట్లాడు కన్నా..
హలో.. హలో.. మెత్తగా ఉన్నాయి కౌన్సిలర్ మాటలు. అవతలి నుంచి స్పందన లేదు. అనునయించినా అవతలి వైపు చిన్నారి గొంతు పెగల్లేదు. వెనుక నుంచి ఏవో శబ్దాలు... మూగ రోదన.. సాయం కోసం మౌన అభ్యర్థన...! ఆ మౌనాన్ని బద్దలు కొట్టేందుకు ఆమె ప్రయత్నించింది. అంతలోనే ఫోన్ కట్. మరోసారి కాల్ రావొచ్చని ఎదురుచూస్తోంది కౌన్సిలర్. చైల్డ్‌లైన్ కేంద్రాల్లో ఇలాంటి అనుభవాలు సాధారణం. 2017–18లో చైల్డ్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కి వచ్చిన ఇలాంటి సైలెంట్ కాల్స్ సంఖ్య 53 లక్షలు. 2015 ఏప్రిల్– 2018 మార్చి మధ్య.. అంటే మూడేళ్ల వ్యవధిలో చెల్డ్లైన్కి వచ్చిన మొత్తం కాల్స్ సంఖ్య ఎంతో తెలుసా 3.4 కోట్లు. ఇందులో సైలెంట్ కాల్స్ 1.36 కోట్లు. ఆ కాల్ చేసింది పిల్లలు కావొచ్చు.. పెద్దలూ కావొచ్చు. వారి పిలుపు వెనుక ఆపద ఉంది. నిస్సహాయత ఉంది. హింస ఉంది. ఊహకందని కోణాలు మరెన్నో ఉండొచ్చు. అందుకే వాటిని తీవ్రంగా పరిగణిస్తామంటున్నారు చైల్డ్‌లైన్ ఫౌండేషన్ ఇండియా ప్రతినిధి హర్లీన్ వాలియా. భరోసా ఇవ్వాలి... సాధారణంగా మొదటిసారి గొంతు విప్పే పిల్లలు అరుదే. కౌన్సిలర్ వారిలో విశ్వాసం నెలకొల్పాలి. నీకు ‘మేమున్నాం’ అనే భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే వారు గుండె గొంతుక విప్పగలుగుతారని చైల్డ్‌లైన్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేందుకు.. గూడుకోసం, మాయమైపోయిన పిల్లల కోసం కాల్ చేసే వారు ఎక్కువే. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, కుటుంబాల్లో కల్లోల వాతావరణం వల్ల సంక్షోభంలో చిక్కుకుపోయిన పిల్లలు (వారి తరపు పెద్దలు) కూడా మనోబలాన్ని కూడగట్టుకునేందుకు అవసరమైన మాట సాయం కోసం.. చైల్డ్‌లైన్ సేవలను ఆశిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక కుటుంబాలకు చెందిన వారు. ఈ తరహా మద్దతు ఆశించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత మూడేళ్లలో ఇలాంటి సాయం కోరుతూ అందిన 66 వేలకు పైగా కాల్స్‌కు చైల్డ్‌లైన్ స్పందించింది. బాధితులకు మనోబలం ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. మూడేళ్లలో రకరకాల వేధింపుల బారినపడ్డ 2,08,496 కాలర్లు చైల్డ్‌లైన్ సాయం తీసుకున్నారు. పిల్లలు అదృశ్యమైపోయిన (మిస్సింగ్) ఘటనలకు సంబంధించి అందిన 56,456 కేసుల్లో చైల్డ్‌లైన్ ఫౌండేషన్ ఇండియా జోక్యం చేసుకుంది. మొత్తం ఆరు లక్షలకు పైగా కేసుల్లో తన సేవలందించింది. -
పారిపోయి వచ్చేస్తున్నారు ..!
విజయనగరం ఫోర్ట్ : కొమరాడ మండలం విక్రమపురానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయి రైల్లో విజయనగరానికి శనివారం చేరుకున్నాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని చైల్డ్‌లైన్ సభ్యులు గుర్తించి సంరక్షణ కల్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలల సంక్షేమ కమిటీ సూచనల మేరకు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖపట్నం పూర్ణమార్కెట్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి విజయనగరం వచ్చేశాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా అనేక మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని కొంతమంది.. పట్టణాలు చూద్దామని మరి కొందరు.. ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయి వచ్చే సమయాల్లో పోలీసులకు గాని, చైల్డ్‌లైన్ సభ్యులకు గాని దొరికితే ఫర్వాలేదు. పొరపాటును ఏ అగంతుకులకో దొరికితే పిల్లల పరిస్థితి అంతే సంగతి. మూడేళ్ల కాలంలో.. మూడేళ్ల కాలంలో ఇళ్ల నుంచి పారిపోయి పట్టణానికి వచ్చేసిన వారు సుమారు వంద మంది వరకున్నారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. ఈ సంఖ్య కేవలం అధికారులకు పట్టుబడిన చిన్నారులు మాత్రమే. ఇలా లెక్కకు దొరకని చిన్నారులు ఇంకెంతమంది ఉన్నారో చెప్పలేం. ఇష్టాలు తెలుసుకోలేకపోతున్నారు.. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉంటూ పిల్లల ప్రవర్తనను చాలామంది గుర్తించ లేకపోతున్నారు. అసలు వారు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీలో తల్లిదండ్రులు ఉండడం బాధాకరం. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా మందలించడం, కొట్టడం వల్ల వారి మనసులు గాయపడి ఇళ్ల నుంచి పారిపోతున్నారు. చిన్నారుల అభిప్రాయాలను తెలుసుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తే ఇటువంటి సంఘటనలు జరగవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గొడవల వల్లే.. పిల్లల ఎదుటే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండడం వల్ల చిన్నారులు మనసు గాయపడుతుంది. దీంతో వారు ఎటైనా పారిపోవాలనే ఉద్దేశానికి వస్తారు. అలాగే సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కూడా కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండడం లేదని.. తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిన్ సభ్యుడు ప్రవర్తన గమనించాలి.. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయానికీ కొట్టడం, తిట్టడం చేయడం వల్ల ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి చెడుల గురించి చెప్పేవారు. కాని నేటి తల్లిదండ్రులు పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా గమనించడం లేదు. – వావిలాల లక్ష్మణ్, జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు -
మోసపోయిన బాలికకు కౌన్సెలింగ్
విజయనగరం ఫోర్ట్ : మోసపోయిన బాలికకు చైల్డ్‌లైన్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే .. ఆగ్రా, ముంబై వంటి పెద్ద పెద్ద పట్టణాలు చూపిస్తానని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మోసగాడు అదే రాష్ట్రం బాలంగీర్‌కు చెందిన పదహారేళ్ల బాలికను నమ్మించాడు. దీంతో బాలిక ఆయనతో పాటు వెళ్లగా మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం విజయనగరం రైల్వేస్టేషన్‌కు చేరుకునే సరికి సదరు వ్యక్తి లేకపోవడంతో బాలిక స్టేషన్లో దిగిపోయింది. అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో రైల్వే పోలీసులు గుర్తించి చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులకు అప్పగించారు. బాలిక వద్ద ఉన్న ఫోన్ నంబర్ అధారంగా తల్లిదండ్రులకు చైల్డ్‌లైన్ సభ్యులు సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రులు సోమవారం స్థానిక చైల్డ్‌లైన్ కార్యాలయానికి చేరుకోవడంతో బాధితురాలిని బాలల సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ వావిలాల లక్ష్మణ్, ప్రసాద్‌రావు, చైల్డ్‌లైన్ ప్రతి నిధులు వరలక్ష్మి, మధుసూదనరావు, కృష్ణారావు, సతీష్, రమణమ్మ పాల్గొన్నారు. -
గుర్తు తెలియని బాలుడిని చేరదీసిన చైల్డ్‌లైన్
ఖమ్మంక్రైం : ఖాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న రైలులో చిట్టి అనే మూడున్నరేళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన ఒక వ్యక్తి ఖమ్మంలో వన్‌టౌన్ పోలీసులకు బాలుడిని అప్పగించారు. చైల్డ్‌లైన్–1098 జిల్లా సమన్వయ కర్త కువ్వారపు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజీపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇంటర్సిటీ రైలులో చిట్టి అనే బాలుడు ఒంటరిగా తిరుగుతున్నాడు. గమనించిన శ్రీనివాస్ బాబును చేరదీసి వివరాలు అడగడంతో వివరాలను తెలుపలేకపోయాడు. దీంతో అతను ఖమ్మంలో దిగగానే వన్‌టౌన్ ఎస్సై రాంకు అప్పగించారు. వారు చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ టీం వెళ్లి బాబును బాలల సంరక్షణ సమితి చైర్మన్ ఎంఎల్ ప్రసాద్ మౌఖిక ఆదేశాల మేరకు శిశుగృహలో ఉంచారు. బాబు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ తగిన ఆధారాలతో సంప్రదిస్తే బాబును అప్పగిస్తామని తెలిపారు. -
మైనర్ బాలుడి వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ధర్పల్లి, నిజామాబాద్ : మైనారిటీ తీరకుండానే బాలుడికి వివాహం చేసేందుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా, అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ పరిధి బేల్యా తండాకు చెందిన మెగావత్ జగన్, కవిత దంపతుల కుమారుడు శ్రీనివాస్‌కు ఇంకా 21 ఏళ్లు నిండలేదు. అయితే, అదే తండాకు చెందిన మేజర్ అయిన యువతితో శ్రీనివాస్‌కు ఈ నెల 12న వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెళ్లి నిశ్చితార్థం గురించి అధికారులకు సమాచారం అందటంతో ఐసీడీఎస్ రూరల్ సీడీపీవో ఝాన్సిలక్ష్మి, ఎల్సీపీవో సూపర్వైజర్ అనిల్ శుక్రవారం విచారణ జరిపించి పెళ్లిని నిలిపి వేయించారు. బాలుడికి 21 ఏళ్లు వచ్చిన తరువాతనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో తండా పెద్దల సమక్షంలో ఒప్పందం పత్రం రాయించారు. ఏఎస్సై వెంకన్న, ఆర్ఐ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణి, వీఆర్వో పోశెట్టి పాల్గొన్నారు. బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న అధికారులు -
నా నుంచి పాపను దూరం చేయకండి
కట్టుకున్న భర్త కాదు పొమ్మని దూరం ఉంటున్నాడు.. నా అనే వారు నాకు లేని సమయంలో వేరే ఒకరు జన్మనిచ్చిన పాపను వద్దని పడేయగా అక్కున చేర్చుకుని ఖర్చు పెట్టి వైద్యం చేయించా.. కంటేనే కన్నతల్లి కాదని కడుపులో పెట్టుకుని ఎనిమిది నెలలు పెంచి ప్రేమతో అన్నీ పాపే నాకు ప్రాణమని భావించా.. నాకు ఉన్న కొద్దిపాటి ఆస్తిని కాజేసేందుకు కట్టుకున్నోడు మళ్లీ కన్నెర్రజేసి కుట్రలు పన్ని కన్నబిడ్డ కంటే ప్రాణంగా చూసే పెంచుకుంటున్న బిడ్డను దూరం చేయాలనుకుంటున్నారు.. నా నుంచి పాపను దూరం చేస్తే నేను బతకలేనంటూ కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తూ అధికారులను వేడుకుంటోంది ఓ పెంచిన అమ్మ.. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో నివాసముంటున్న దాసరి హైమావతిది చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామం. 25 సంవత్సరాల క్రితం సాంబయ్య అనే వ్యక్తితో వివాహమైంది. సంతానం కలగకపోవడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త సాంబయ్య తన భార్య హైమావతితో గొడవపడి చాలా కాలంగా వేరొక మహిళతో కలిసి దూరంగా ఉంటున్నాడు. దీంతో హైమావతి తన భర్త విషయంపై కోర్టును ఆశ్రయించగా సమస్య పరిష్కారం కాలేదు. న్యాయం చేయాలని పెద్దమనుషులను ఆశ్రయించడంతో నెలకు రూ.3 వేలు భర్త నుంచి ఇప్పించేందుకు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలోనే 2017 ఆగస్టులో బస్టాండ్ వద్ద ఉన్న పాన్‌షాపుల మధ్య పసిగుడ్డు అరుపులు వినపడగా రక్తపు మరకలతో అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైమావతి అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకుంది. అయితే తన పేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి పెంచుకుంటున్న దక్కుతుందనే దురుద్దేశంతో హైమావతి నుంచి పాపను దూరం చేసేందుకు భర్త సాంబయ్య బెదిరింపులకు దిగి 2018 ఏప్రిల్ 13న చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు అధికారులు హైమావతి నివసిస్తున్న ఇంటికి వచ్చి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏప్రిల్ 16 న బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచగా వివరాలు తెలుసుకుని విచారణ చేస్తున్న క్రమంలోనే హైమావతి పాపను తన నుంచి దూరం చేయవద్దని తనపై ఉన్న ఆస్తిని పాపపై చేయిస్తానని వేడుకుంది. నేటికీ అధికారుల చుట్టూ హైమావతి తిరుగుతూ వస్తుంది. సోమవారం జిల్లా కలెక్టర్ హరిత వద్దకు నర్సంపేటకు చెందిన కౌన్సిలర్ బండి ప్రవీణ్ , అంగన్వాడీ సంఘం బాధ్యురాలు నల్లా భారతితో కలిసి వేడుకుంది. దీంతో కలెక్టర్ మే5న సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎదుట హాజరుకావాలని సూచించారు. దీంతో పెంచుకున్న బిడ్డను తన నుంచి దూరం చేయవద్దని వేడుకుంటూ హైమావతి చేస్తున్న పోరాటానికి మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తూ సంఘీభావాన్ని తెలిపాయి. -
బాల్య వివాహం అడ్డగింత
శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పెదపాడు పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు పెదపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడితో శుక్రవారం జరగాల్సిన వివాహం వాయిదా పడింది. ఈ మేరకు పెళ్లికొడుకుతో పాటు వారి తల్లిదండ్రులను రూరల్ పోలీస్టేషన్‌కు చైల్డ్చైన్, అంగన్వాడీ సిబ్బంది తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. నిర్ణీత వయసు వచ్చే వరకు వివాహం చేయబోమని ఇరువర్గాల నుంచి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. -
బాల్య వివాహాలకు బ్రేక్
ఇచ్ఛాపురం రూరల్ : పదో తరగతి విద్యార్థినికి పెళ్లి చేస్తున్నారన్న సమాచారం మేరకు గెస్ట్ చైల్డ్‌లైన్ బృందం బాల్యవివాహానికి బ్రేక్ వేసింది. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఈ నెల 28న వివాహం చేస్తున్నట్లు 1098 చైల్డ్ లైన్‌కు వచ్చిన సమాచారం మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి చైల్డ్‌లైన్ సిబ్బంది వెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులను తీసుకొ చ్చి తహసీల్దార్ ఎం.సురేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నిర్ణీత వయసు వచ్చే వరకు బాలికకు వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెస్ట్ చైల్డ్‌లైన్ కోఆర్డినేట ర్ జాస్మీన్ కుమారీ, అంగన్వాడీ సూపర్వైజర్ జయలక్ష్మి, ఆర్ఐ కృష్ణప్రసాద్ రౌళో, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణి పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పెదపాడు పరిధిలోని గాంధీనగర్‌లో శుక్రవారం జరగాల్సిన ఓ వివాహానికి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు గురువారం అడ్డుకట్ట వేశారు. గాంధీనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను పెదపాడుకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు ఇరువర్గాలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే మే 9న పెదపాడులో జరగాల్సిన మరో బాల్య వివాహాన్ని కూడా అడ్డుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
బాల్యవివాహాలను అడ్డుకున్న అధికారులు
జడ్చర్ల: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెబ్బేరు మండలం కంబాలపురం గ్రామానికి చెందిన ఓ బాలిక(17)కు బాదేపల్లిలో నివాసం ఉంటున్న ఖిల్లాఘనపురం గంగాధర్(24)తో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ మేరకు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగబోతుండగా ఆకస్మికంగా పోలీసులు వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లి కూతురు వయస్సు మైనార్టీ తీరలేదని, నిర్ణీత వయస్సుకు తక్కువగా ఉన్నా పెళ్లి చేస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు సీఐ బాలరాజుయాదవ్ ఆలయానికి చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం పెళ్లి కూతురును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసిందని, స్కూల్ సర్టిఫికెట్ ఆధారంగా పెళ్లిని రద్దు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించడంతో వారు మహబూబ్‌నగర్ తీసుకెళ్లారు. దోనూరులో.. మిడ్జిల్ (జడ్చర్ల): మండలంలోని దోనూరులో గురువారం తహసీల్దార్ పాండునాయక్, పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలిక(16)ను హైదరాబాద్‌లోని ఉలాల్‌గడ్డకు చెందిన యువకుడితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు వచ్చి తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలిపివేయించారు. -
సాకే స్థోమత లేకనే బిడ్డను ఇచ్చేశా
బషీరాబాద్(తాండూరు): బషీరాబాద్ మండలం నావంద్గి గ్రామంలో వెలుగు చూసిన పసిపాప అక్రమ దత్తత వ్యవహారం బుధవారం కీలక మలుపు తిరిగింది. నెల రోజుల వయసున్న ఆడబిడ్డను తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చామే తప్ప.. అమ్ముకోలేదని చెన్నారం గ్రామానికి చెందిన పాప తండ్రి పానాదుల పకీరప్ప అధికారులకు తెలిపారు. అనారోగ్యంతో భార్య చనిపోవడం వలన మానసికంగా కుంగిపోయానని, ఈ పరిస్థితుల్లో పాప ఆలనా పాలనా చూసే ఆర్థిక స్థోమత లేదంటూ కన్నీరు మున్నీరయ్యాడు. తన బిడ్డను ప్రభుత్వానికి అప్పగిస్తూ అధికారులకు స్టాంపు పేపర్‌పై అంగీకార పత్రం రాసిచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత... యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన పానాదుల పకీరప్ప, జగ్గమ్మ దంపతుల నెల రోజుల వయసున్న కూతురిని పది రోజుల కిందట దూరపు బంధువులైన నావంద్గి బొడ్డు బాలప్ప, అమృతమ్మ, బాలమణి దంపతులకు అప్పగించారు. అయితే ఇది అక్రమ దత్తతని 1098 చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ ప్రతినిధి హన్మంత్‌రెడ్డి సమాచారాన్ని అధికారులకు అందించారు. బుధవారం వీఆర్ఓ రాఘవేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ నర్సమ్మ, శిశుగృహ ఎంఎస్‌డబ్ల్యూ నరేష్, హన్మంత్‌రెడ్డి నావంద్గి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పిల్లలను ఎలా తీసుకుంటారని బాలప్ప అమృతమ్మ, బాలమణి దంపతులను నిలదీశారు. అయితే పెంచుకోవడానికి బంధువులు ఇచ్చారని, తమ దగ్గర ఉన్న పాపను అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వారు అధికారులకు బదులిచ్చారు. వెంటనే పాపను తీసుకుని.. పాప తండ్రి పకీరప్పను పిలిచి విచారించారు. తనకు బిడ్డను సాకే స్థోమత లేదని, ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తండ్రి పకీరప్ప అధికారులతో చెప్పాడు. దీంతో తండ్రిగా వంద రూపాయల స్టాంపుపై బిడ్డను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అంగీకార పత్రం రాసిచ్చాడు. అనంతరం అధికారులు ఆ పాపను తాండూరు శిశు గృహకు తరలించారు. కార్యక్రమంలో శిశు గృహ ఇన్చార్జి శ్రీనివాస్, యాలాల చైల్డ్‌లైన్ ప్రతినిధి వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
తప్పిపోయిన చిన్నారి చైల్డ్ ప్రొటెక్షన్‌కు అప్పగింత
ఏలూరు టౌన్ : ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని ఒక వ్యక్తి చేరదీసి బంధువుల కోసం ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవటంతో ఆ బాలుడిని ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. బంధువుల సమాచారం తెలియకపోవటంతో బాలుడిని శిశు గృహకు తరలించారు. ఏలూరు పాత బస్టాండ్‌లో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాలుగేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. ఏలూరు మరడాని రంగారావు కాలనీకి చెందిన కాటూరి వెంకన్న ఆ బాలుడిని గమనించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బుధవారం ఉదయం మళ్లీ పాతబస్టాండ్‌కు తీసుకు వచ్చి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశించాడు. రాత్రి వరకూ చూసినా ఎవరూ రాకపోవటంతో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి సీఐ జి.మధుబాబుకు అప్పగించారు. వెంటనే ఆయన ఐసీడీఎస్ పీడీకి సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేష్ పోలీస్‌స్టేషన్‌కు రాగా, ఆ బాలుడిని సీఐ మధుబాబు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. బాలుడి చిరునామా తెలిసిన వారు ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ మధుబాబు కోరారు. -
అమ్మాయికి 12 ఏళ్లు..అబ్బాయికి 22
వికారాబాద్ అర్బన్ : బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ చిన్నఅప్పల నాయుడు హెచ్చరించారు. మండల పరిధిలోని ద్యాచారం గ్రామానికి చెందిన ఓ బాలికకు 22 ఏళ్ల యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారని చైల్డ్‌లైన్‌కు సమాచారం అందింది. ఈమేరకు తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం వీఆర్ఓ, చైల్డ్‌లైన్ సిబ్బంది గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను తీసుకొచ్చి తహసీల్దార్ ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం ద్వారా జరిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహంతో అమ్మాయి అనారోగ్యం బారినపడుతుందని తెలిపారు. బాలిక చదువు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి వివాహం చేస్తే బాధ్యులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బాలికకు మైనారిటీ తీరేవరకు వివాహం చేయబోమని ఆమె తల్లిదండ్రులతో హామీపత్రం రాయించుకున్నారు. గ్రామ కార్యదర్శి ప్రసన్న కుమార్, వీఆర్ఓ గోపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యమ్మ, చైల్డ్‌లైన్ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు వెంకటయ్య, ఆశలత ఉన్నారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
కుల్కచర్ల: అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీనివాస్ శంకర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు హెచ్చరించారు. మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన బాలయ్య, మంగమ్మల కుమార్తె (17)కు మైనారిటీ తీరకుండానే పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం చైల్డ్ లైన్ ప్రతినిధులకు తెలియడంతో గురువారం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో బండవెల్కిచర్ల గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలకు పెళ్లి వయస్సు రాకముందే వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి వివరించారు. తహసీల్దార్ శ్రీనివాస్ దగ్గరకు తీసుకొచ్చి వారితో హమీ పత్రం రాయించుకున్నారు. తమ బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే పెళ్లి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
సవతి తల్లి వేధింపులు తాళలేక..
- ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలుడు - సంరక్షణ సిబ్బందికి అప్పగించిన పోలీసులు మద్దికెర : కన్నతల్లి ప్రేమకు దూరమైన ఓ బాలుడు సవతి తల్లి వేధింపులను భరించలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. బాలున్ని గమనించిన మద్దికెర పోలీసులు కర్నూలు చైల్డ్ లైన్ వారికి అప్పగించారు. మద్దికెరకు చెందిన ఎరుకల దుర్గన్న ఈ నెల 26న కర్నూలు- గుంతకల్లు రైలులో కర్నూలు నుంచి గ్రామానికి బయలుదేరాడు. రాత్రి 12:00 గంటలకు రైలు మద్దికెరకు చేరుకుంది. తన పక్క సీటులో ఓ బాలుడు ఒంటరిగా ఉండడాన్ని గమనించి వివరాలు ఆరా తీశాడు. తన పేరు సురేష్‌గా చెప్పిన బాలుడు మిగతా వివరాలు కూడా తెలియజేశాడు. దీంతో ఇంటికి పిలుచుకువచ్చిన దుర్గన్న మరుసటి రోజు సోమవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. బాలున్ని ప్రశ్నించిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, మూసమ్మ దంపతుల కుమారుడు సురేష్. మూసమ్మ చనిపోవడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు, కూతురు ఉంది. ప్రతిరోజు సవతి తల్లి వేధిస్తుండడంతో భరించలేక పారిపోయి వచ్చినట్లు బాలుడు తెలిపాడు. పోలీసులు బాలుడు సురేష్‌ను సంరక్షణ నిమిత్తం కర్నూలు చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. -
బాలుడ్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన చైల్డ్‌లైన్ సంస్ధ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై తిరుగుతున్న బాలుడిని చేరదీసి పోలీసులు సమక్షంలో తల్లితండ్రులు చెంతకు చేర్చిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, చైల్డ్‌లైన్ సంస్ధ ప్రతినిధి సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌నగర్‌కు చెందిన కే.సాయిమణికంఠరెడ్డి మెట్టుగూడలోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు వెళ్లడం ఇష్టంలేని సాయిమణికంఠ ఈనెల 28వ తేదిన ఇంటి నుంచి పారిపోయాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై తిరుగుతున్న బాలుడిని చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు గుర్తించి చేరదీశారు. ఈనెల 30వ తేదిన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన బాలుడి అదృశ్యం కథనాన్ని చూసిన చైల్డ్‌లైన్ నిర్వాహకులు బాలుడు తమ వద్దే ఉన్నాడని చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్ఐ బీ శ్రీనివాసులు సమక్షంలో సాయిమణికంఠరెడ్డిని తల్లితండ్రులు అచ్చిరెడ్డి, సునీతలకు అప్పగించారు. బాలుడిని చేరదీసిన చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులతోపాటు ‘సాక్షి’ యాజమాన్యానికి బాలుని తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యో.. ఈ పాపం ఎవరిదో?
* పుట్టినకొద్ది గంటల్లోనే రోడ్డు పక్కన * సంచిలో వేసి పడేసిన కర్కశులు వికారాబాద్ రూరల్: ఆడపిల్ల అనుకున్నారో.. మరి ఇంకేదైనా కారణమో.. గుర్తుతెలియని వ్యక్తులు మానవత్వం మరిచిపోయి ఓ పసికందును బ్యాగ్‌లో పెట్టి పడేసి వెళ్లిపోయారు. తల్లిఒడిలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి రోడ్డుపక్కన గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది. పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు చిన్నారిని చేరదీశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం సమీపంలో ఈ ఘటన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు వెలుగుచూసింది. వివరాలు.. ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లోంచి పసికందు ఏడుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూశారు. కొన్ని గంటల క్రితమే పుట్టిన ఆడపిల్ల కనిపించింది. పోలీసులు, చైల్డ్‌లైన్ సిబ్బంది పాపను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పాప ఆరోగ్యంగా ఉండి రెండు కిలోల బరువు ఉంది. దీంతో పాపను చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో తాండూరులోని శిశుగృహకు తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ రవి తెలిపారు. -
ఏడేళ్ల క్రితం రూ. 250కి చిన్నారి కొనుగోలు!
భిక్షాటన చేయిస్తున్న దంపతులు ‘చైల్డ్‌లైన్’ చొరవతో వెలుగులోకి.. బషీరాబాద్: ముంబైలో ఓ చిన్నారిని రూ.250లకు కొనుగోలు చేసి ఆమెతో రంగారెడ్డి జిల్లా తాండూరులో భిక్షాటన చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బషీరాబాద్ ఎస్ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. బషీరాబాద్ మండలం మంతట్టికి చెందిన విభూతి రాములు, బసమ్మ దంపతులు 8 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. కొన్నాళ్లపాటు అక్కడే పనిచేసిన వారు.. ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఏడేళ్ల క్రితం రెండేళ్ల బాలికను రూ.250లకు కొనుగోలు చేశారు. అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చి, ఆ బాలికతో భిక్షాటన చేయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం రాములు దంపతులు హైదరాబాద్‌కు వెళ్లారు. రాములు తండ్రి పెంటప్ప దగ్గర ఉంటున్న బాలిక నిత్యం గ్రామంలో భిక్షాటన చేసేది. పెంటప్ప చెప్పడంతో నిత్యం బాలిక తాండూరుకు వెళ్లి రద్దీ కూడళ్లలో డబ్బులు అడుక్కోసాగింది. ఈ విషయమై చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందడంతో ఈనెల 7న చైల్డ్‌లైన్ ప్రతినిధులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాములుతోపాటు అతడి భార్యను, తండ్రిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఆ బాలికను చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. -
‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది’
-
‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది.. నొప్పిగా ఉంది’
♦ కంటతడి పెట్టించిన బాలుడి మాటలు ♦ రెండున్నరేళ్ల బాలుడిపై కన్నతల్లి కర్కశత్వం ఒంగోలు క్రైం: చెప్పిన మాట వినలేదని కన్నబిడ్డకు అట్లకాడతో వాతలు పెట్టిందో మహాతల్లి. ‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది.. బాగా నొప్పిగా ఉంది’ అంటూ బాలుడు చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న శ్రావణ్‌కుమార్, గీత దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు అఖిరానందన్. బాలుడు చెప్పిన మాట వినలేదనే కోపంతో తల్లి గీత సోమవారం ఇంట్లో ఉన్న అట్లకాడను స్టవ్‌పై ఎర్రగా కాల్చి పిరుదులు, తొడ, మూతి మీద వాతలు పెట్టింది. దీనిపై స్థానికులు మంగళవారం చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్ బాలుడి ఇంటి వద్దకు చేరుకుని శరీరంపై ఉన్న వాతలు గమనించి జిల్లా బాలల సంక్షేమ కమిటీ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
భుజంపై భార్య శవం.. చేతిలో పసిపాప
♦ హైదరాబాద్‌లో బిడ్డను కని తనువు చాలించిన భార్య ♦ మృతదేహం, ముగ్గురు పిల్లలతో బస్సులో మహబూబ్‌నగర్ చేరిన భర్త ♦ చందాలు పోగుచేసి వారిని స్వగ్రామానికి పంపిన ప్రయాణికులు, కార్మికులు హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ బస్టాండ్‌కు చేరిన బస్సులో నుంచి ఓ వ్యక్తి మహిళను భుజం మీద మోసుకుంటూ కిందకు దిగాడు. అతడి చేతిలో పసిగుడ్డు ఉన్నాడు. అతడ్ని చూసిన ప్రయాణికులు ఏమిటా? అని ఆరా తీస్తే... భుజంపై ఉన్నది భార్య మృతదేహం... చేతిలో ఉన్నది కళ్లు కూడా సరిగా తెరవని పసిగుడ్డు.. అని తెలిసి ఆశ్చర్యపోయారు. తన భార్య బిడ్డను కని చనిపోయిందని, అంత్యక్రియలు జరిపేందుకు స్వగ్రామానికి తీసుకెళుతున్నానని చెప్పిన అతని మాటలు విని అక్కడి వారి హృదయం చలించిపోయింది. పాలమూరు వలస కూలీ బతుకును ఆవిష్కరించే యథార్థ సన్నివేశం ఇది. పాలమూరు : మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన షఫియుద్దీన్, అతని భార్య పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి కాటేదాన్ ప్రాంతంలో అద్దె గదిలో నివాసముంటున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న షఫియుద్దీన్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. అతడు ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య రాఘవేంద్ర నర్సింగ్‌హోంకి వెళ్లిందని పొరుగువారు చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. కాన్పు అనంతరం ఆమె చనిపోయిందని చెప్పిన సిబ్బంది.. ఆసుపత్రి ఆవరణలో ఓ చివర పడుకోబెట్టిన మొయినున్నీసా(30) మృతదేహాన్ని చూపించారు. ఊరు కాని ఊరులో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భార్య మృతదేహాన్ని ఆరాంఘర్ చౌరస్తా వరకు తీసుకువచ్చాడు. అక్కడి నుంచి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ను బతిమాలి బస్సులో మహబూబ్‌నగర్‌కు చేరుకున్నాడు. సమ్మె వల్ల మహబూబ్‌నగర్ బస్టాండులో బస్సులు నిలిచిపోవడంతో మళ్లీ మృతదేహాన్ని భుజం మీద ఎత్తుకొని వెళ్తున్న షఫియుద్దీన్‌ను.. అతని వెనుక పసిగుడ్డును ఎత్తుకొని వస్తున్న పసివాడిని.. ఆ వెనకాల వయసుకు మించిన బరువున్న బ్యాగుమోస్తున్న మరో పసివాడ్ని.. చూసిన కొందరు ఏం జరిగిందని షఫీని వాకబు చేశారు. దీంతో జరిగిన ఉదంతాన్ని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బస్టాండ్‌లో సమ్మె చేస్తున్న కార్మికులు.. ప్రయాణికులు, పరిసర ప్రాంతాల వారు చలించి చందాలు పోగుచేసి రూ.6,000 ఇచ్చి ఆటోలో అతన్ని ఊట్కూర్‌కు పంపించారు. భార్య మృతదేహంతో కొన్ని గంటల పాటు షఫియుద్దీన్ పడిన వేదన అక్కడ ప్రతి మనసునూ కలచి వేసింది. పసిపాప ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చైల్డ్‌లైన్ ద్వారా ఐసీడీఎస్ శిశుగృహకు అప్పగించారు. -
వివాహం ఇష్టం లేక...
♦ ఇంటి నుంచి ఒంగోలు చేరుకున్న యువతి ♦ చైల్డ్‌లైన్ చొరవతో బాలసదన్‌కు ఒంగోలు క్రైం : చదువుపై మమకారంతో తల్లిదండ్రులు బలవంతంగా చేసిన వివాహాన్ని కాదని 16 ఏళ్ల యువతి ఆదివారం ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆ బాలికను గమనించిన చైల్డ్‌లైన్-1098 ప్రతినిధి బి.వి.సాగర్ ఆ బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ బాలికది కనిగిరి మండలం రామాపురం. ప్రస్తుతం గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఆ బాలిక కుటుంబం ఉంటోంది. ఆ బాలిక నాన్న ముఠా పని చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. గత నెల 5వ తేదీ ఆ బాలికను మేనమామ జి. వెంకట్రావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ వివాహం ఇష్టం లేని ఆమె అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూనే వచ్చింది. చివరకు చేసేది లేక ఇంటి నుంచి తాను చదువుకున్న సర్టిఫికెట్లన్నీ తీసుకొని గుంటూరు నుంచి ఒంగోలుకు చేరుకుంది. బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఆ పరీక్షల్లో 8.9/10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. చదువుతో పాటు ఎన్సీసీలో కూడా బాగా రాణించింది. ఎవరైనా ఆదరించి చదివిస్తే చదువుకుంటానంటూ ఆ బాలిక ఆశగా వేడుకుంటోంది. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు ఆ బాలికను బాలసదన్‌లో చేర్పించారు. -
బాల్య వివాహానికి బ్రేక్
నర్సంపేట : పట్టణంలోని శాంతినగర్‌లో శుక్రవారం జరుగుతున్న బాల్యవివాహాన్ని చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, పోలీసుల ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఇరుకుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. శాంతినగర్‌లోని ఎరుకల కాలనీకి చెందిన ఓ బాలికను గూడూరు వుండలం భూపతిపేటకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చరుుంచారు. ఈ క్రవుంలో చైల్డ్‌లైన్‌కు అందిన సమాచారంతో పెళ్లి జరగకుండా ఆపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటావుని హెచ్చరించారు. విద్యార్థినులకు 18 ఏళ్లు నిండక వుుందే వివాహం చేయడం చట్టరీత్యా నేరవున్నారు. వారు అనేక అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సవూచారం ఇవ్వాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ దెబోరా, చైల్డ్‌లైన్ వలంటీర్ బెజ్జంకి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ముద్దుల బాబు.. ఎవరికి వద్దట..
ఒంటరైన మృతుల కుమారుడు చైల్డ్‌లైన్‌కు అప్పగించిన పోలీసులు కేసముద్రం : తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో ఆ బాలుడు ఒంటరయ్యూడు. అక్కున చేర్చుకునేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో అనాథగా మారాడు. తల్లిదండ్రులకు ఏమైందో.. వారు ఎందుకు కనిపించడం లేదో అర్థం కాని ఆ బాలుడు అమాయకంగా బిత్తర చూపులు చూస్తున్నాడు. అంత్యక్రియల తర్వాత బంధువులంతా ఎవరిదారిన వారు వెళ్లిపోయూరు. కన్నీరుకార్చడం తప్ప ఏమి చేయలేని దుస్థితి స్థానికులది. కేసముద్రంస్టేషన్‌లో స్థాని కులను కలచివేసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు. పట్టణానికి చెందిన గుడ్ల వెంకట్రామయ్య, సరస్వతి దంపతులు ఈ నెల 7న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి అంత్యక్రియలు పూర్తయ్యూక బంధువులు తమ ఇళ్లకు వెళ్లిపోయూరు. తలకొరివి పెట్టిన మృతుల మూడేళ్ల కుమారుడు విష్ణును తీసుకెళ్లేందుకు ఇరువైపుల బంధువులు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో స్థానికులు, కులపెద్దమనుషులే రాత్రంతా ఆ బాలుడికి ఆశ్రయమిచ్చారు. తిరిగి సోమవారం మళ్లీ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదు. హత్యకు గురైన వాళ్ల బిడ్డను చేరదీస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని కొందరు, భారమవుతాడేమోనని మరి కొందరు ఆలోచించడాన్ని సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసింది. చిన్న వయసులోనే ఎం తటి కష్టమొచ్చింది కొడుకా అంటూ స్థానికులు కన్నీరుపెట్టడం తప్ప ఏమి చేయలేకపోయూరు. చివరికి చేసేదిలేక సోమవారం సాయంత్రం పోలీసులు చైల్డ్‌లైన్ మానుకోట వలంటీర్లు అరుణ, మహేష్, వెంకటేష్‌కు ఎస్సై ఫణిదర్, కులపెద్దమనిషి ఊరుగొండశ్రీరామలు కలిసి అప్పగించారు. అనంతరం బాలుడిని వరంగల్‌లోని సీడబ్ల్యూసీ మెజిస్ట్రేట్ అనితారెడ్డి ఎదుట హాజరుపరిచి, అనంతరం శిశువిహార్‌కు తరలించనున్నట్లు వలంటీర్లు తెలిపారు. వీడనున్న దంపతుల హత్య కేసు మిస్టరీ ? కలకలం రేపిన దంపతుల హత్య కేసు మిస్టరీ వీడనుంది. ఇప్పటికే పోలీసులు ఈ హత్యోదంతంపై పలు కోణాల్లో దర్యాప్తు సాగించారు. చివరకు ఈ హత్య కేసు ఛేదించి అంగంతకులను పట్టుకున్నట్లు తెలిసింది. హతులైన గుడ్ల వెంకట్రామయ్య, సరస్వతి కుటుంబ సభ్యులపైనే మొదటి నుండి అనుమానాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. హతురాలి మెడలో ఉన్న బంగారం చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దొంగలు చేసి ఉండరని, తెలిసినవారే చేసి ఉం టారనే కోణంలో దర్యాప్తు సాగింది. ఈ మేరకు హతుల కుమారుడిని, కోడలిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ లో హత్యలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పసిబాలుడిని కూడా చంపాలని భావించిన అగంతకులు అతడు ఏడవడంతో ఎవరైనా వస్తారనే భయంతో పరారైనట్లు సమాచారం. -
రెస్క్యూ రిస్కే
ఒంగోలు టౌన్ : బాలల హక్కుల రక్షణ, సంరక్షణకు కృషి చేస్తున్న కమిటీలకు కొత్త సమస్య వచ్చిపడింది. బాలల హక్కులకు విఘాతం కలిగినా, బాల కార్మికులు ఉన్నా వారిని అక్కడి నుంచి విముక్తులను చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు కమిటీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. బాలల హక్కులకు భంగం కలుగుతోందని సమాచారం అందుకున్న కమిటీలు అక్కడకు వెళ్లి రెస్క్యూ చేసినా వారికి షెల్టర్ కల్పించడంలో రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. గతంలో జిల్లాలో గవర్నమెంట్ హోమ్ ఉండేది. ఆ హోమ్ ఉన్నంతకాలం బాలల హక్కులపై పనిచేస్తున్న కమిటీలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న బాలలు ఉంటే వెంటనే వారిని ఆ హోమ్‌లో చేర్పించేవారు. గవర్నమెంట్ హోమ్‌ను ఎత్తివేయడంతో రెస్క్యూ చేసి తీసుకొచ్చిన బాలలను ఉంచేందుకు గవర్నమెంట్ హోమ్ లేకపోవడంతో ఎన్జీఓ హోమ్సే దిక్కయ్యాయి. బాలల హక్కుల రక్షణ, సంరక్షణకు సంబంధించి రెండు కమిటీలు పనిచేస్తున్నాయి. బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్(1098) ప్రతినిధులు, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐసీపీఎస్ సిబ్బంది సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగుతున్నారు. బాల్య వివాహాలను నియంత్రించడంతో పాటు ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నా, ఇంటి నుంచి అలిగి పారిపోయి వచ్చినా, తప్పిపోయిన బాలల కోసం ఈ కమిటీలు పనిచేస్తుంటాయి. 2007లో బాలల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌కు మేజిస్ట్రేట్ పవర్స్ కలిగి ఉంటాయి. బాలల హక్కులకు భంగం కలిగినా, వారు ఇబ్బంది పడుతున్నా సంబంధిత కమిటీల సభ్యులు వారిని తీసుకొచ్చి బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఎదుట హాజరు పరచాల్సి ఉంటుంది. బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరచిన తర్వాత చైర్మన్ ఆదేశాల మేరకు ఆ బాలలను తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తారు. అందుకోసం రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో గవర్నమెంట్ హోమ్‌ను ఏర్పాటు చేశారు. చైల్డ్‌లైన్(1098) ఏర్పడిన 2012 సెప్టెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు 162 మంది బాలలను గుర్తించి గవర్నమెంట్ హోమ్‌కు తరలించారు. అందులో వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తారు. బాలల తల్లిదండ్రులు, బంధువులు బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ను కలిసి ఇకముందు తమ పిల్లలను బాల కార్మికులుగా లేదా హింసకు గురిచేయమం టూ వేడుకొని తమ ఇళ్లకు తీసుకెళ్తారు. ఇతర హోమ్లే ఆధారం రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్‌కు నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో ఎనిమిది నెలలపాటు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత దాన్ని ఎత్తివేయడంతో రెస్క్యూ చేసి తీసుకువచ్చిన బాలలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు కమిటీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఏడు ఎన్జీఓ హమ్‌లు నడుస్తున్నాయి. బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు ఆ ఎన్జీఓ హోమ్‌ల్లో బాలలను చేర్పిస్తున్నప్పటికీ ఎంతకాలం వారిని ఈ విధంగా వాటిలో ఉంచుతారన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో హోమ్‌ను ఎత్తివేసిన తర్వాత నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 136 మంది బాలలను గుర్తించి ఎన్జీఓ హోమ్స్‌కు తరలించారు. మే నుంచి నవంబర్ వరకు 51మంది బాలలను గుర్తించి ఎన్జీఓ హోమ్స్‌కు తరలించారు. బాల కార్మికులు, ఇళ్లల్లో నుంచి పారిపోయి వచ్చేవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన వారి సంఖ్య పెరిగిపోతున్నా గవర్నమెంట్ హోమ్ లేకపోవడంతో వారికి తాత్కాలిక ఆశ్రయం పూర్తి స్థాయిలో కల్పించలేకపోతున్నారు. ఇటీవల జరిగిన బాలల హక్కుల దినోత్సవంలో గవర్నమెంట్ హోమ్ లేని విషయాన్ని కలెక్టర్ విజయకుమార్ దృష్టికి బాలల సంక్షేమ కమిటీలు తీసుకొచ్చాయి. గవర్నమెంట్ హోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ హామీ కార్యరూపం దాల్చే వరకు బాలల హక్కుల కోసం పనిచేసే కమిటీలకు కష్టాలు తప్పేలా లేవు. -
కన్నతండ్రి..కర్కశం
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిందా చిన్నారి. తండ్రి మంచంలో ఉండటంతో కన్నతల్లిలా సపర్యలు చేసింది. కదలలేని స్థితిలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాచుకుంటున్నా..కనికరం లేని అతను నిత్యం కుమార్తెకు నరకం చూపాడు. కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. తొమ్మిదేళ్ల బాలిక రోదన చూడలేక..చుట్టుపక్కల వారు చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఆ బాలికకు తండ్రి నుంచి విముక్తి కల్పించారు. ఒంగోలు టౌన్: కదలలేని స్థితిలో ఉన్న తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమార్తెను చిత్రహింసలు పెట్టాడో తండ్రి. ఒంగోలులోని పొనుగుపాటినగర్‌లో ఉంటున్న కాకర్ల కృష్ణ (40) భార్య లక్ష్మి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. బేల్దారి పని చేసుకుంటూ కుమార్తె రేణుకను పోషించేవాడు. రెండేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో వెన్నెముకకు బలమైన దెబ్బ తగిలి కృష్ణ కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి రేణుక.. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేస్తోంది. తండ్రి మంచంపైనే మలమూత్ర విసర్జన చేసినా చీదరించుకోకుండా శుభ్రం చే సేది. మంచంపైనే తండ్రికి స్నానం చేయించి దుస్తులు కూడా వేసేది. తల్లి తన బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అలా సేవలు చేసేది. అలాంటి కూతురిని ఏ తండ్రి అయినా అపురూపంగా చూసుకుంటాడు. ఆ చిన్న మనస్సుకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తాడు. కానీ కృష్ణ మాత్రం మంచంపై నుండి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను ప్రతిరోజూ రాచి రంపాన పెట్టేవాడు. కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను కొట్టేందుకు మంచం పక్కనే ఒక కర్రను కూడా సిద్ధంగా ఉంచుకునేవాడు. అయిన దానికి, కానిదానికి ఆగ్రహిస్తూ కర్రతో కొట్టడమే గాకుండా ఆ బాలిక శరీరంపై గోళ్లతో రక్కడం, తొడపాశం పెట్టడం నిత్యకృత్యమైంది. ప్రతిరోజూ తండ్రి చిత్రహింసలు భరించలేని ఆ బాలిక పెట్టే కేకలకు చుట్టుపక్కల వాళ్లు చలించిపోయేవారు. ఆ తండ్రి వద్దకు వెళ్లి పలుమార్లు చెప్పినప్పటికీ అతని తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఆ బాలిక స్థితిని చూసి తట్టుకోలేక చైల్డ్‌లైన్(1098)కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్ ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బీవీ శివప్రసాద్ ఎదుట హాజరు పరిచారు. ఆ బాలికను బాలసదన్‌లో చేర్పించి కష్టాలకు తాత్కాలిక చెక్ పెట్టారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
పూసపాటిరేగ: మండలంలోని పెదబత్తివలస గ్రామంలో బాలికకు వివాహం నిశ్చమైందన్న ఫిర్యాదు మేరకు చైల్డ్‌లైన్ సిబ్బంది గురువారం గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక బంధువుల వద్దకు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. బాలిక బంధువైన ఏకల ముసలినాయుడు చైల్డ్‌లైన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు కె.అప్పారావు, బీహెచ్.లక్ష్మి బాలికలకు వివాహం చేస్తే వచ్చే అనర్థాలపై బంధువులకు అవగాహన కల్పించారు. బాలిక గుర్ల కస్తూరిబాగాంధీ బాలికల ఆశ్రమపాఠశాలలో 9 వతరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఆగస్టు 15 వతేదీన బాలికకు జరగబోయే పెళ్లిని నిలుపుదల చేస్తున్నట్లు బాలిక తరఫు వారి నుం చి హామీ తీసుకుని చైల్డ్‌లైన్ అధికారులు వెళ్లిపోయారు. ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా బంధువులందరూ బాధ్యుల వుతారని అధికారులు హెచ్చరించారు. -
నెంటూరు చిన్నారులకు ఊరట!
వర్గల్: వర్గల్ మండలం నెంటూరు చిన్నారుల దీన స్థితి, వృద్ధులకు పెనుభారమైన వైనంపై సోమవారం ‘పండుటాకులకు పెద్ద కష్టం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగం స్పందించింది. సోమవారం మెదక్‌లోని చైల్డ్ లైన్ సంస్థ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు రజని, నందిని చదువుకు ఆసరాగా నిలుస్తామని పేర్కొంటూ ఫోన్ ద్వారా వారి వివరాలు సేకరించారు. మరోవైపు సమగ్ర బాలల సంరక్షణ పథకం కింద చిన్నారులకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆర్థిక సాయం వర్తింపజేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నడుం బిగించారు. మహిళ శిశు సంక్షేమ శాఖ అధీనంలోని ఐసీపీఎస్ (సమగ్ర బాలల సంరక్షణ పథకం) కౌన్సిలర్ రాజు ఈ మేరకు మంగళవారం నెంటూరును సందర్శించారు. చిన్నారుల నానమ్మ చీరాల రామవ్వను కలిసి, పిల్లల వివరాలు తెలుసుకున్నారు. ఆగస్టు నుంచి పిల్లలకు ప్రతి నెలా నగదు సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
చట్టానికి తలవంచిన తల్లి ప్రేమ!
శ్రీకాకుళం క్రైం: పెంచిన ప్రేమను చట్టం కాదంది. అనధికార దత్తత చెల్లదంటూ ఓ బిడ్డను పెంపుడు తల్లి నుంచి వేరుచేసి కన్నతల్లి చెంతకు చేర్చింది. ఎల్.ఎన్.పేటలోని రోటరీనగర్‌లో నివాసముంటున్న ప్రసాదం గోపాలం, అనసూయ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఆ దంపతులు వంశోద్ధారకుడి కోసం ఎదురుచూశారు. నాలుగో సంతానంగా ఈ నెల 15న ఆడపిల్లే జన్మించడంతో నలుగురిని ఎలా పెంచగలమని ఆవేదన చెందారు. శ్రీకాకుళం శివారు వాంబే కాలనీలో నివాసముంటున్న దూరపు బంధువులు బి.రామలింగస్వామి, మహేశ్వరి దంపతులకు పిల్లలు లేరని తెలుసుకున్నారు. ఎవరినైనా పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియటంతో వారితో మాట్లాడారు. వారు ఇష్టపడడంతో అప్పుడే పుట్టిన శిశువును అప్పగించేశారు. ఐదు రోజులుగా రామలింగస్వామి దంపతులు ఆ బిడ్డను ప్రేమతో సాకుతున్నారు. పిల్లలు లేని లోటు తీరిందని ఆనందంగా గడుపుతున్నారు. అవిరైపోయిన ఆనందం.. ఇంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్‌లైన్ సిబ్బందికి ఫోన్ చేసి రామలింగస్వామి దంపతులు శిశువును అనధికారికంగా దత్తత తీసుకున్న విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు విచారణ జరిపి వాస్తవం తెలుసుకున్నారు. చైల్డ్‌లైన్ సభ్యురాలు ఎస్.గీత, రామలింగస్వామి దంపతులకు చట్టం గురించి వివరించి శిశువును ఐసీడీఎస్ కార్యాలయానికి అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు శిశువు కన్నవారిని పిలిపించారు. పాపను అనధికారికంగా దత్తత ఇవ్వటం సరికాదని, పెంచలేకపోతే శిశువిహార్‌కు అప్పగించాలని సూచించారు. పాప తల్లిదండ్రులు ప్రసాదం గోపాలం, అనసూయలు మాట్లాడుతూ పాపను రామలింగందంపతులకే అప్పగిస్తామని, లేకుంటే తామే పెంచుకుంటామని తేల్చిచెప్పారు. శిశువును వేరొకరికి కిచ్చేందుకు అంగీకరించేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో శిశువును శిశువిహార్‌లో ఉంచి ఈ నెల 27న రమ్మని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. శిశువును శిశు విహార్‌లో ఉంచటమేమిటంటూ అక్కడకు చేరుకున్న సాక్షి ఛానల్ ప్రతినిధి అధికారులను నిలదీయడంతో కన్న తల్లిదండ్రులకు అప్పగించి పంపారు. ఈ నెల 27న హాజరు కావాలని ఇరువురు దంపతులకు ఐసీడీఎస్ ఏపీడీ పి.భవాని సూచించారు. కాగా ఐసీడీఎస్ అధికారులు చట్టం పేరుతో తమకు అన్యాయం చేశారంటూ రామలింగస్వామి దంపతులు వాపోయారు. వీరితో వచ్చిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాలికకు విముక్తి
టంగుటూరు, న్యూస్‌లైన్ : ఓ మహిళ వద్ద బంధీగా ఉన్న 13 సంవత్సరాల బాలికకు చైల్డ్‌లైన్ (1098) చొరవతో విముక్తి లభించింది. గురువారం టంగుటూరులో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా రూరల్ మండలం ఎర్తెని గ్రామంలో నివాసం ఉండే నిరుపేద అయిన నరసింహులుకు ఏడుగురు సంతానం. నాలుగేళ్ల క్రితం భార్య మరణించడంతో అతనే పిల్లలను చూసుకుంటున్నాడు. వారిలో చివరి కుమార్తె అయిన 13 ఏళ్ల భాగ్యంకు మినహా మిగిలిన వారందరికీ వివాహాలయ్యాయి. ఈ నేపథ్యంలో కూలి పనుల నిమిత్తం జిల్లాలోని టంగుటూరు నుంచి మహబూబ్‌నగర్ వలస వెళ్లిన పద్మ అనే మహిళ.. వారం రోజుల క్రితం ఇంటి ముందు ఏడుస్తూ కనిపించిన భాగ్యంను చూసి దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తనతో వస్తే బాగా చూసుకుంటానని మాయచేసింది. కొత్త డ్రస్సు కొనిపిస్తానంటూ వెంటబెట్టుకుని హైదరాబాద్ తీసుకెళ్లింది. అక్కడ ఉంటున్న తనకు తెలిసిన వారింట్లో రెండు రోజులు ఉండి అనంతరం బాలికను తీసుకుని టంగుటూరులోని తన ఇంటికి చేరింది. స్థానిక పోతుల చెంచయ్య వెస్ట్‌కాలనీలోని ఒక చిన్న రేకుల గదిలో బాలికను బంధించింది. అయితే, టంగుటూరు వచ్చిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది. స్థానిక వీధుల్లో యాచించి డబ్బు తీసుకురావాలంటూ బాలికను హింసించడం ప్రారంభించింది. మద్యం సేవించాలని చిత్రహింసలకు గురిచేసింది. పద్మ చేష్టలకు బెంబేలెత్తిన బాలిక బుధవారం అక్కడి నుంచి తప్పించుకుని ఏడుస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం రోడ్డులో వెళ్తుండగా.. ఆ రోడ్డులో హోటల్ నిర్వహించే ఓ మహిళ గమనించి దగ్గరకు తీసింది. వివరాలు తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆమె ద్వారా బాలిక విషయం తెలుసుకున్న స్థానిక అంగన్వాడీ కార్యకర్త వెంటనే ఒంగోలులోని చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి సాగర్‌కు సమాచారం అందించింది. టంగుటూరు పోలీసుల సాయంతో గురువారం రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ ప్రతినిధి.. హోటల్ నిర్వాహకురాలి వద్ద ఆశ్రయం పొందుతున్న బాలికను తీసుకెళ్లి చైల్డ్‌లైన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. ఆయన ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు మండలం మాచవరంలోని ఆశాసదన్ హోంకు బాలికను తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మ పరారవడంతో ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు. అయితే, దీనిపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని స్థానిక ఎస్సై తిరువీధుల త్యాగరాజు తెలిపారు. -
కొడుకుపై కన్నతల్లి కర్కశత్వం
నెక్కొండ, న్యూస్‌లైన్: పేగుబంధాన్ని మరిచిన ఓ తల్లి తన కుమారుడిని కర్కశంగా హింసించింది. మల, మూత్ర విసర్జన నిక్కరులో చేసుకుంటున్నావంటూ దారుణంగా చితకబాదింది. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నేపాల్ దేశానికి చెందిన గూర్ఖా రాము, అమృత దంపతులు కొద్ది నెలలుగా మండల కేంద్రంలో నివసిస్తున్నాడు. వారికి ఐదేళ్ల కుమారుడు అర్జున్, రెండున్నరేళ్ల కుమార్తె నేత, 8 నెలల బాబు కరణ్ ఉన్నారు. పెద్ద కుమారుడు అర్జున్ మల,మూత్ర విసర్జన చేసే విషయం చెప్పకుండా నిక్కరులోనే విసర్జిస్తున్నాడని, ఎంత చెప్పినా అలవాటు మార్చుకోవడం లేదని తల్లి బాలుడిపై కోపం పెంచుకుంది. ఆ కోపంలో తానేం చేస్తున్నానో తెలియనంతగా వ్యవహరించి అభంశుభం తెలియని బాలుడి కాళ్లుచేతులు తాళ్లతో కట్టి పడేసింది. అంతేగాక రెండు రోజులుగా తిండి పెట్టకుండా విపరీతంగా కొట్టి, ముఖంపై రక్కి నానా చిత్రహింసలకు గురిచేసింది. దీంతో పాపం ఆ చిన్నారి రెండు చేతులు, కాళ్లు గాయాలతో బొబ్బలెక్కడమే కాక స్పర్శను కూడా కోల్పోయాడు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు సీఐ రాజశేఖరరాజు, ఎస్సై అమృత్‌రెడ్డి బాలుడికి ఓ స్థానిక ప్రైవేటు ఆస్పతిలో వైద్యం చేయించి చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. మెరుగైన వైద్యం కోసం రూ.3 వేలు పోలీసులు, రూ.వేయి స్థానికులు పున్నం, యాకయ్య విరాళంగా అందజేశారు. బాలుడి వైద్యానికి దాతలు మానవతా దృష్టితో ముందుకు రావాలని సీఐ కోరారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ జిల్లా వలంటీర్లు శృతి, విజయ్, డివిజన్ వలంటీర్ ప్రభాకర్, పోలీసులు పాల్గొన్నారు.