కలెక్టర్ హరితను వేడుకుంటున్న హైమావతి
కట్టుకున్న భర్త కాదు పొమ్మని దూరం ఉంటున్నాడు.. నా అనే వారు నాకు లేని సమయంలో వేరే ఒకరు జన్మనిచ్చిన పాపను వద్దని పడేయగా అక్కున చేర్చుకుని ఖర్చు పెట్టి వైద్యం చేయించా.. కంటేనే కన్నతల్లి కాదని కడుపులో పెట్టుకుని ఎనిమిది నెలలు పెంచి ప్రేమతో అన్నీ పాపే నాకు ప్రాణమని భావించా..
నాకు ఉన్న కొద్దిపాటి ఆస్తిని కాజేసేందుకు కట్టుకున్నోడు మళ్లీ కన్నెర్రజేసి కుట్రలు పన్ని కన్నబిడ్డ కంటే ప్రాణంగా చూసే పెంచుకుంటున్న బిడ్డను దూరం చేయాలనుకుంటున్నారు.. నా నుంచి పాపను దూరం చేస్తే నేను బతకలేనంటూ కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తూ అధికారులను వేడుకుంటోంది ఓ పెంచిన అమ్మ..
నర్సంపేట : నర్సంపేట పట్టణంలో నివాసముంటున్న దాసరి హైమావతిది చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామం. 25 సంవత్సరాల క్రితం సాంబయ్య అనే వ్యక్తితో వివాహమైంది. సంతానం కలగకపోవడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త సాంబయ్య తన భార్య హైమావతితో గొడవపడి చాలా కాలంగా వేరొక మహిళతో కలిసి దూరంగా ఉంటున్నాడు. దీంతో హైమావతి తన భర్త విషయంపై కోర్టును ఆశ్రయించగా సమస్య పరిష్కారం కాలేదు.
న్యాయం చేయాలని పెద్దమనుషులను ఆశ్రయించడంతో నెలకు రూ.3 వేలు భర్త నుంచి ఇప్పించేందుకు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలోనే 2017 ఆగస్టులో బస్టాండ్ వద్ద ఉన్న పాన్‌షాపుల మధ్య పసిగుడ్డు అరుపులు వినపడగా రక్తపు మరకలతో అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైమావతి అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకుంది.
అయితే తన పేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి పెంచుకుంటున్న దక్కుతుందనే దురుద్దేశంతో హైమావతి నుంచి పాపను దూరం చేసేందుకు భర్త సాంబయ్య బెదిరింపులకు దిగి 2018 ఏప్రిల్ 13న చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు అధికారులు హైమావతి నివసిస్తున్న ఇంటికి వచ్చి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏప్రిల్ 16 న బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచగా వివరాలు తెలుసుకుని విచారణ చేస్తున్న క్రమంలోనే హైమావతి పాపను తన నుంచి దూరం చేయవద్దని తనపై ఉన్న ఆస్తిని పాపపై చేయిస్తానని వేడుకుంది.
నేటికీ అధికారుల చుట్టూ హైమావతి తిరుగుతూ వస్తుంది. సోమవారం జిల్లా కలెక్టర్ హరిత వద్దకు నర్సంపేటకు చెందిన కౌన్సిలర్ బండి ప్రవీణ్ , అంగన్‌వాడీ సంఘం బాధ్యురాలు నల్లా భారతితో కలిసి వేడుకుంది. దీంతో కలెక్టర్ మే5న సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ఎదుట హాజరుకావాలని సూచించారు. దీంతో పెంచుకున్న బిడ్డను తన నుంచి దూరం చేయవద్దని వేడుకుంటూ హైమావతి చేస్తున్న పోరాటానికి మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తూ సంఘీభావాన్ని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment