
నెంటూరు చిన్నారులకు ఊరట!
వర్గల్: వర్గల్ మండలం నెంటూరు చిన్నారుల దీన స్థితి, వృద్ధులకు పెనుభారమైన వైనంపై సోమవారం ‘పండుటాకులకు పెద్ద కష్టం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగం స్పందించింది. సోమవారం మెదక్‌లోని చైల్డ్ లైన్ సంస్థ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు రజని, నందిని చదువుకు ఆసరాగా నిలుస్తామని పేర్కొంటూ ఫోన్ ద్వారా వారి వివరాలు సేకరించారు.
మరోవైపు సమగ్ర బాలల సంరక్షణ పథకం కింద చిన్నారులకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆర్థిక సాయం వర్తింపజేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నడుం బిగించారు. మహిళ శిశు సంక్షేమ శాఖ అధీనంలోని ఐసీపీఎస్ (సమగ్ర బాలల సంరక్షణ పథకం) కౌన్సిలర్ రాజు ఈ మేరకు మంగళవారం నెంటూరును సందర్శించారు. చిన్నారుల నానమ్మ చీరాల రామవ్వను కలిసి, పిల్లల వివరాలు తెలుసుకున్నారు. ఆగస్టు నుంచి పిల్లలకు ప్రతి నెలా నగదు సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.