తుళ్లూరులో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
సాక్షి, తుళ్లూరు: బంధుత్వం పోతుందనో...మంచి సంబంధం వచ్చిందనో.. కట్నం లేని వరుడు దొరికాడనో...ఇలా పలు కారణాలతో చదువుకోవాల్సిన వయసులో, బాలికలను పెళ్లి పీఠలెక్కిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోవాలన్న కోరికను చంపుకొని పెళ్లిపీటలు ఎక్కుతున్నారు చిన్నారి పెళ్లి కూతుళ్లు. తన తోటి స్నేహితులు ఆడుతూ పాడుతూ పాఠశాలలు, కళశాలలకు వెళ్తుంటే, తాము మాత్రం చంటి పాపలను లాలిస్తు.. వారిని పెంచే భారం మోస్తు అవస్తులు పడుతున్నారు. తమ బతుకు ఇంతే అని జీవితం గడిపేస్తున్నారు పలువురు బాలికలు. ఈ నేపథ్యంలో చైల్డ్‌లైన్, క్రాఫ్, కరుణాలయం వంటి స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలు నిర్మూలన కోసం కంకణం కట్టుకున్నాయి. పది తరువాత పెళ్లి కాదు...11వ తరగతి అని ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నాయి.
వివాహ వ్యూహంలో బాల్యం బందీ
చదువుకోవాల్సిన వయసులో చిన్నారుల ఆశయాలను పెళ్లి అనే రెండు అక్షరాలు చిదిమేస్తున్నాయి. బాలికల విద్యకు ప్రభుత్వం అనేక పథకాలు, చట్టాలను అమలు చేస్తున్నా సామాజిక, సాంఘిక, ఆర్థిక కారణాలు బాల్య వివాహాలను ఆపలేక పోతున్నాయి. బాల్య వివాహాల నియంత్రణకు ఏర్పాటు చేసిన చైల్డ్‌లైన్ 1098 దృష్టికి రాకుండానే వివాహాలు జరిగిపోతున్నాయి.
10 తర్వాత పెళ్లికాదు.. 11
బాల్య వివాహాలపై అవగాహన కల్పించినా, ఎన్నోసార్లు హెచ్చరించినా సమాజంలో మార్పురాకపోవడంతో పాఠశాలల స్థాయి నుంచి ప్రభుత్వం అవగాహన కల్పించాలని భావించింది. అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలతో కలిసి 10 తరువాత పెళ్లి కాదు...11వ తరగతి వంటి కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల తల్లిదండ్రుల్లో కొంత మార్పు వచ్చిందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తున్నారు.
చట్టమేం చెబుతుంది ?
బాల్య వివాహ నిషేధిత చట్టం 1978 ప్రకారం అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు. భారత ప్రభుత్వం చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలను నిషేధించారు. ఈచట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి చేస్తే బెయిల్ లభించని నేరంగా పరిగణిస్తారు. రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. అవసరమైతే వివాహం రద్దు చేస్తారు.
పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నాం
గ్రామీణ స్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతి పాఠశాలలో చైల్డ్‌లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్, పోలీసులు అధికారులు 100 కు కూడా ఫిర్యాదు చేయడంపై బాలికలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. ‘పది తరువాత పెళ్లి కాదు.. 11వ తరగతి’ అని ప్రభుత్వాధికారులతో కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నాం. దీనికి కొంత స్పందన కనిపిస్తోంది. బాలికల తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. – బత్తుల బాబు, చైల్డ్‌లైన్ 1098 ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment