బాల్య వివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
పూసపాటిరేగ: మండలంలోని పెదబత్తివలస గ్రామంలో బాలికకు వివాహం నిశ్చమైందన్న ఫిర్యాదు మేరకు చైల్డ్‌లైన్ సిబ్బంది గురువారం గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక బంధువుల వద్దకు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. బాలిక బంధువైన ఏకల ముసలినాయుడు చైల్డ్‌లైన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు కె.అప్పారావు, బీహెచ్.లక్ష్మి బాలికలకు వివాహం చేస్తే వచ్చే అనర్థాలపై బంధువులకు అవగాహన కల్పించారు. బాలిక గుర్ల కస్తూరిబాగాంధీ బాలికల ఆశ్రమపాఠశాలలో 9 వతరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఆగస్టు 15 వతేదీన బాలికకు జరగబోయే పెళ్లిని నిలుపుదల చేస్తున్నట్లు బాలిక తరఫు వారి నుం చి హామీ తీసుకుని చైల్డ్‌లైన్ అధికారులు వెళ్లిపోయారు. ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా బంధువులందరూ బాధ్యుల వుతారని అధికారులు హెచ్చరించారు.