వరుడికి 25, వధువుకి మాత్రం..! | child marriage in kakinada district | Sakshi
Sakshi News home page

వరుడికి 25, వధువుకి మాత్రం..!

Published Sat, Dec 28 2024 11:01 AM | Last Updated on Sat, Dec 28 2024 11:03 AM

child marriage in kakinada district

విరిసీ విరియని.. తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు ‘మాంగల్యం తంతునానేనా..’ అంటున్నారు.. యుక్త వయస్సు రాకుండానే తాళిబొట్టు మెడలో వేయించేస్తున్నారు.. కొద్ది నెలలకే తల్లులవుతున్న ఆ అమ్మాయిలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.. అవగాహనా రాహిత్యమో.. గుండెల మీద కుంపటి దింపేసుకోవాలనే అమాయకత్వమో తెలీదు కానీ.. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా జరుగుతున్న బాల్య వివాహాలు కలవరపెడుతున్నాయి.

రాజానగరం: యుక్త వయస్సు రాకుండా బాల్య దశలోనే వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం, అయినప్పటికీ వీటిని నిరోధించడంలో తరచూ అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ప్రకటనలకే పరిమితమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. మండలంలోని భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు, పాతతుంగపాడు తదితర గ్రామాల్లో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అవగాహన లేకనో.. ఓ పనైపోతుందనే ఉద్దేశమో కానీ.. యుక్త వయస్సు రాకుండానే కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేసి, అత్తారిళ్లకు పంపించేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. 

గుట్టు చప్పుడు కాకుండా.. 
కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు దొడ్డ మణికంఠ, 16 సంవత్సరాల బాలిక పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. వరుడు రోజువారీ పనులు చేస్తూండగా.. వధువును ఆమె తల్లిదండ్రులు 9వ తరగతి వరకూ చదివించి, మానిపించేశారు. ఇంటి వద్దనే ఉంటున్న ఆ బాలికతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది. వారి వివాహానికి బాలిక తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. అయితే, అతడు లేకపోతే తాను బతకలేనంటూ ఆ బాలిక తరచూ అతడి ఇంటికి వెళ్లి వస్తూండేది. ఈ నేపథ్యంలో ఇరువైపుల పెద్దలు అయిష్టంగానే వారిద్దరికీ గుట్టు చప్పుడు కాకుండా బుధవారం రాత్రి ముక్కినాడ గ్రామంలోని దేవాలయంలో సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఆపై వారిద్దరినీ తిరుపతి పంపించేశారు. అధికారులకు తెలియకుండా ఇరు వర్గాల పెద్దలు ఈ వివాహం జరిపించినా.. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో బాల్య వివాహం గుట్టు రట్టయింది. 

గతంలోనూ.. 
⇒ మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కూడా ఇదేవిధంగా బాల్య వివాహాలు జరిగాయి. 
⇒ పుణ్యక్షేత్రం గ్రామంలో గత ఏడాది అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇరు వర్గాల పెద్దలకు బాల్య వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు. దీనిపై స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే పోలీసులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని, బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. యుక్త వయస్సు రాకుండా పిల్లలకు వివాహం చేయబోమంటూ పెద్దల నుంచి రాతపూర్వకంగా హామీ కూడా తీసుకున్నారు. అంతటితో తమ డ్యూటీ అయిపోయిందని సంబరపడుతూ వెనుదిరిగిన అధికారులు ఆ మర్నాడు అందుకున్న మరో సమాచారంతో షాకయ్యారు. రాతపూర్వక హామీ ఇచ్చిన పెద్దలే.. తమ పిల్లలను వేరొక ప్రాంతానికి తీసుకువెళ్లి, వివాహం చేశారని తెలిసి నిర్ఘాంతపోయారు. 

⇒ గడచిన నాలుగేళ్లలో భూపాలపట్నంలో 4, పుణ్యక్షేత్రంలో 6, కొత్తతుంగపాడులో 9, పాతతుంగపాడులో 6 బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం. 

చట్టం ఏం చెబుతోందంటే.. 
బాల్య వివాహాలను అరికట్టేందుకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే చట్టాలున్నాయి. మొదటిసారిగా 1929లో చైల్డ్‌ మ్యారేజ్‌ రి్రస్టిక్ట్‌ యాక్ట్‌ను బ్రిటిష్‌ వారు తీసుకువచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌–2006 రూపొందించారు. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, 21 సంవత్సరాలోపు అబ్బాయిలను బాలల కిందే పరిగణిస్తారు. ఈ యాక్ట్‌ ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారి తల్లిదండ్రులతో పాటు ఆ సమయంలో అక్కడున్న వారు, వివాహ తంతు జరిపించే వారు (ప్రోత్సహించినట్టుగా భావిస్తారు) కూడా శిక్షార్హులే అవుతారు. వీరికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. దీనిలో నేరస్తులైతే బెయిల్‌ కూడా లభించదు.

అధికారుల నిర్లక్ష్యమే కారణం 
సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొత్తతుంగపాడులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, గ్రామ కమిటీకి విషయం ముందుగా తెలిసినా కానీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. బాల్య వివాహం జరుగుతున్న సమాచారాన్ని పై అధికారులకు సకాలంలో ఇవ్వడం లేదు. బుధవారం రాత్రి జరిగిన బాల్య వివాహం గురించి, తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశాను. 
– యాళ్ల మాచరయ్య, కొత్తతుంగపాడు 

ఫలితమివ్వని గ్రామ కమిటీలు 
బాల్య వివాహాలను నిరోధించండి.. అమ్మాయిల జీవితాలను కాపాడండి.. అంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నాగానీ, ప్రజల్లో సరైన స్పందన రావడం లేదు. వీటిని ఏవిధంగానైనా అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామ మహిళా కార్యదర్శి (పోలీసు), ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, అంగన్‌వాడీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు కూడా వేశాం. అయినప్పటికీ బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ముందుగా అందడం లేదు. స్థానికంగా ఉండే మొహమాటాలతో తమ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతోందని తెలిసి కూడా చూసీ చూడనట్లు వదిలేసి, తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. 
– టి.నాగమణి, సీడీపీఓ, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం, రాజానగరం 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement