పుత్తడి బొమ్మకు.. పుస్తెల బంధనం! | Child marriages are in the district | Sakshi
Sakshi News home page

పుత్తడి బొమ్మకు.. పుస్తెల బంధనం!

Published Fri, Nov 29 2024 5:50 AM | Last Updated on Fri, Nov 29 2024 5:50 AM

Child marriages are in the district

చిన్నారిని చేయొద్దు పెళ్లికూతురు

జిల్లాలో కలవరపరుస్తున్న బాల్య వివాహాలు 

వయసు రాకుండానే పెళ్లి పీటలెక్కుతున్న బాలికలు 

చట్టాలున్నా చట్టుబండలే 

రెండేళ్లలో ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నబాల్య వివాహాలు  151

బాల్య వివాహాల నిర్మూలన,బాలల సంరక్షణ కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098

ఎస్‌.రాయవరం మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికకు సమీప బంధువుతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. తాను చదువుకుంటానని ఈ వివాహం ఇష్టం లేదని ఏడ్చి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా తాము నిశ్చయించిన వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తండ్రి హెచ్చరించడంతో బాలిక వివాహం చేసుకోక తప్పలేదు. 

యలమంచిలి పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి పదో తరగతి పూర్తయిన 15 ఏళ్ల బాలికను ప్రసవం కోసం తీసుకురావడంతో వైద్యులు నివ్వెరపోయారు. తమ వద్ద డెలివరీ చేయడానికి కుదరదని చెప్పడంతో వారు పక్క జిల్లాలో ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లిపోయారు. ఈ విషయం బాలిక నివసిస్తున్న గ్రామంలో ఐసీడీఎస్, మహిళా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.

యలమంచిలి రూరల్‌: ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా.. ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. చిన్నారి పెళ్లి కూతురికి పుస్తెల బంధనం తప్పడం లేదు. ఇందుకు నిరక్షరాస్యత, పేదరికం కొంత కారణం కాగా.. తల్లిదండ్రుల ఆలోచనా విధానం మరో ప్రధాన కారణం. తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్న కొందరు తల్లిదండ్రుల ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. 

ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన బాలికల మెడల్లో పుస్తెల తాళ్లు పడుతున్నాయి. లోకం పోకడ తెలియకుండానే బిడ్డలకు బాల్యంలోనే వివాహాలు చేసి వారి జీవితాలను కొందరు తల్లిదండ్రులు చేజేతులా అగాధంలోకి నెడుతున్నారు. 18 సంవత్సరాలు నిండకుండా వివాహాలు చేస్తే అనారోగ్యంతో కుంగిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.  

అడ్డుకుంటున్నా.. ఆగడం లేదు 
బాల్య వివాహాలను మాతాశిశు సంక్షేమ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు బాల్య వివాహాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది.

ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్న వారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే, అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. పెద్దయితే తాము చెప్పిన సంబంధం చేసుకుంటుందో లేదో అనే ఆలోచనతో మరికొందరు, ప్రేమలో పడి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తుందేమోనన్న భయంతో ఇంకొందరు.. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. 

అనకాపల్లి జిల్లాలో గత రెండేళ్లలో అధికారుల దృష్టికి వచ్చిన 151 బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి రాకుండా జరిగిపోతున్న పెళ్లిళ్లు అనేకం ఉంటున్నాయి. 

బాల్య వివాహాలు చేసుకున్న అ­మ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బాధ్య­త మోస్తూనే అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు గర్భం దాలిస్తే తల్లికీ, బిడ్డకు ప్రాణాపాయం ఉంటుంది. ఎంతో సందడిగా ఆనందోత్సాహాలతో జరగాల్సిన పెళ్లి అధికారుల జోక్యంతో అర్థంతరంగా ఆగిపోతే రెండు కుటుంబాల వారికీ నగుబాటే కదా. అందుకే పెళ్లి వయసు రాకుండా ముహూర్తాలు పెట్టుకొని, అడ్డుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. 

బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఏటా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

బాల్య వివాహం నేరానికి శిక్ష.. 
బాల్య వివాహం చట్తరీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ కోసం 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉంది. సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు నిండే వరకు బాలికకు వివాహం చేయబోమని ఒప్పంద పత్రం రాయించుకుంటారు. 

టీనేజ్‌ ప్రెగ్నెన్సీలతో ప్రాణానికే ప్రమాదం 
బాల్య వివాహాల వలన వచ్చే గర్భాల వల్ల బాలికలు ఎనీమియా బారిన పడే ప్రమాదం ఉంది. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం, అధిక రక్తపోటుతో మెటర్నల్‌ డెత్‌లు జరుగుతాయి. బిడ్దను మోసే సామర్థ్యం బాలికలకు తక్కువగా ఉంటుంది. 6 నెలల క్రితం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి 17 ఏళ్ల ప్రాయంలోనే గర్భం దాల్చిన కేసు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాను. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రమాదమే. –డాక్టర్‌ ఆర్‌.నిహారిక, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, గైనకాలజిస్ట్, యలమంచిలి సీహెచ్‌సీ 

సమాచారం ఇవ్వండి 
బాల్య వివాహాలు జరిగినట్టు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పెళ్లిని ఆపుచేస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం. తగిన వయసు లేకపోతే మానసిక, శారీరక పరిపక్వత ఉండదు.  –కె.అనంతలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ, అనకాపల్లి 

అందరూ బాధ్యులే.. 
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహం జరిపించిన తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, అనుమతించిన పెద్దలు, సహకరించిన వారు కూడా నేరస్తులే అవుతారు. మైనర్‌ బాలికను పెళ్లి చేసుకొని సంసారం చేస్తే పోక్సో కేసు నమోదవుతుంది.  –కె.వి.సత్యనారాయణ, డీఎస్పీ, పరవాడ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement