Pusapatirega
-
భార్య తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుందని..
సాక్షి, విజయనగరం : మండలంలోని కుమిలి కొండపై ఓ వివాహిత మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారించారు. భర్తే ఆమెను హతమార్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొండగుడ్డికి చెందిన సంబాపు పుష్ప(35)ను ఆమె భర్త సంబాపు శ్రీను ఈ నెల రెండో తేదీన కుమిలిలో రక్ష కట్టించుకుందామని చెప్పి మోపెడ్‌పై తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి ఆమె కనిపించలేదు. భార్యను తీసుకెళ్లిన శ్రీను కుమిలిలోనే విడిచిపెట్టి వెళ్లినట్లు బందువులకు చెప్పి చీపురుపల్లిలో పురుగుమందు సేవించి ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. అనుమానం వచ్చిన పుష్ప తల్లిదండ్రులు పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న తరుణంలో కుమిలి సమీపంలో కొండపై వివాహిత మృతదేహం వున్నట్లు మంగళవారం రాత్రి తెలుసుకున్నారు. ఆమె పుష్ప అని నిర్థారించుకుని భర్తే హత్య చేసి వుండవచ్చన్న అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలికి మెరకముడిదాం మండలం సిమంద్రాయవలసకు చెందిన సంబాపు శ్రీనుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరి మధ్య ఎప్పటినుంచో మనస్పర్థలున్నాయి. రెండు నెలల క్రితమే సిమంద్రాయవలస నుంచి అత్తవారి గ్రామమైన కొండగుడ్డికి శ్రీను వచ్చినట్లు బంధువులు తెలియజేశారు. గతంలో కూడా భార్య భర్తలు పురుగుమందు సేవించినట్లు పోలీసులు తెలిపారు. భార్య సెల్ఫోన్లో తరచూ మాట్లాడుతున్నందునే వారి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలిసింది. మృతురాలికి దీపిక, మనోజ్ అనే ఇద్దరు పిల్ల లు వున్నారు. భోగాపురం సీఐ సీహెచ్.శ్రీధర్, ఎస్ఐ ఆర్.జయంతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చేయి కోసుకొని.. లవర్‌కు వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టి.. -
పెళ్లైన రెండు నెలలకే...
పెళ్లై రెండు నెలలైంది. ఇంతలోనే ఆషాఢం రావడంతో భార్యను పుట్టింటికి పంపారు. వారం రోజుల కిందట భార్య వద్దకు వెళ్లిన భర్త వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి తన విధులకు యథావిధిగా వెళ్లాడు. ఇంతలోనే తను పని చేస్తున్న విశాఖలోని పరవాడలోని సాయినార్ లైఫ్సైన్సెస్లో గ్యాస్‌లీక్‌తో సంభవించిన ప్రమాదంలో తనువు చాలించాడు. దీంతో ఇటు మృతుని కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది. పూసపాటిరేగ: ఆషాఢం కారణంగా కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్యకు వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన భర్త గ్యాస్ లీక్ ఘటనలో మృత్యువాతపడ్డాడు. పెళ్లినాటి జ్ఞాపకాలు కూడా మరవక ముందే నవజంటపై దేవుడుకు కన్నుకుట్టిందా..! అంటూ మృతుడు స్వగ్రామం రెల్లివలసలో రోదనలు మిన్నంటాయి. రెండు నెలల క్రితమే వివాహమైన జంటలో భర్త మృతిని తట్టుకోలేని భార్య రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్ లైఫ్సైన్సెస్లో నాలుగేళ్లుగా కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్ వున్నారు. రెల్లివలస నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన వరకు తమ కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలియదని మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో అన్నయ్య, అక్క తరువాత జన్మించి చిన్నవాడైన గౌరీశంకర్‌పై కుటుంబం ఆధారపడి వుంది. చిన్న కుమారుడు గౌరీశంకర్ మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు రమణ, నాగరత్నం బోరున విలపించారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పుట్టెడు సంతోషంతో వున్న కుటుంబాన్ని అనాధ చేసావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రెండు నెలలకే... రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్రావుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్ వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన నవ వరుడు గ్యాస్‌లీక్ ఘటనలో మృత్యువాత పడటంతో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇండియా ఓడింది... అభిమాని గుండె ఆగింది
పూసపాటిరేగ (నెల్లిమర్ల): వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో బుధవారం ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా ఓడిపోవడం చూస్తూ తట్టుకోలేని ఓ అభిమాని గుండెపోటుతో టీవీ ముందే కుప్పకూలాడు. ఈ విషాదం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన మీసాల రాము(35) ఎంవీజీఆర్ కళాశాలలో టెక్నీషియన్. బుధవారం సాయంత్రం వరకు తోటి ఉద్యోగులందరితోను సరదాగా గడిపిన అతను అనంతరం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉత్కంఠకు లోనయ్యాడు. భారత్ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య ప్రమీల, రెండేళ్ల కుమారుడు వున్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రెల్లివలసకు రాత్రి 10 గంటల సమయంలో తీసుకువచ్చారు. -
వేటకు వేళాయే..!
నేటితో ముగియునున్న నిషేధం పూసపాటిరేగ : రెండు నెలల విరామం తర్వాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. చేపల వేటపై నిషేధం మంగళవారంతో ముగియనుంది. దీంతో వేటకు కావాల్సిన వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకోవడంతోపాటు అసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న పూసపాటిరేగ, బోగాపురం మండలాల్లో సుమారు 19వేల మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రత్యక్ష్యంగా నాలుగు వేల మంది, పరోక్షంగా 15వేల మంది మత్స్యకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండు మండలాల్లో 700 పడవలు ఉండగా, వాటిలో సంప్రదాయ బోట్లు 500 కాగా, ఫైబర్‌బోట్లు 200 వరకు ఉన్నాయి. అత్యధికంగా చింతపల్లి, పతివాడబర్రిపేట, తిప్పలవలస, కోనాడ, చేపలు కంచేరు, ముక్కాం గ్రామాల నుంచి పడవలు వేటకు వెళ్తాయి. అందని జీవన భృతి ప్రతి ఏడాది 45 రోజులు వేట నిషేధం కాగా, ఈ సంవత్సరం 60 రోజులకు పెంచారు. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 30 కిలోల బియ్యం, రూ.2వేల నగదు ఇచ్చారు. దీనిపై మత్స్యకారులు ఆందోళనలు చేశారు. దీంతో తమిళనాడు తరహాలో రూ.5వేలు నగదు, బియ్యం ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే రూ.4వేల నగదు, 30 కిలోల బియ్యం ఇస్తున్నట్లు జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం కూడా జీవన భృతి చెల్లించలేదు. వేట నిషేధ సమయం ముగుస్తున్నా జీవన భృతి అందలేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే తమకు జీవన భృతి అందించాలని కోరుతున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
గంట క్రితం వచ్చి తమతో మాట్లాడిన కుమార్తె క్షణాల్లో విగతజీవిగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను అల్లుడే అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడని బోరున విలపిస్తున్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో మూడు నెలల గర్భిణి అనుమానాస్పద మృతి ఘటన సంచలనం రేకెత్తించింది. పూసపాటిరేగ : మండలంలోని చింతపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ అల్లుడే కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. చింతపల్లి గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్మి(23), అప్పన్న భార్యాభర్తలు. లక్ష్మి తల్లిదండ్రులు బర్రి ఎర్రయ్య, అప్పయ్యమ్మలు కూడా చింతపల్లిలోనే ఉంటున్నారు. శుక్రవారం లక్ష్మి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. రాత్రి వరకు ఉండి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. లక్ష్మి వెళ్లిన గంట వ్యవధిలోనే మృతి చెందిందని తల్లిదండ్రులకు సమాచారం అందడం నిర్ఘాంతపోయారు. అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన అప్పన్నే తమ కుమార్తెను హత్య చేశాడని తల్లిదండ్రులు బోరును విలపిస్తూ చెప్పారు. లక్ష్మి గొంతుపై ఉన్న గాట్లు ఆధారంగా హత్యేనని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూసపాటిరేగ ఎస్ఐ కళాధర్ ఆధ్వర్యంలో మృతదేహానికి పంచానామా నిర్వహించారు. నిందితుడు అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భోగాపురం సీఐ కె.వైకుంఠరావు వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు.. మృతురాలు లక్ష్మి మూడునెలలు గర్భిణి. ఆమెకు పావని, పరిదేశి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి మరణించడం, తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రే‘ముంచాడు’!
► ప్రేమించి మోసపోయిన యువతి ► ప్రియుడి ఇంటి వద్ద బంధువులతో కలసి ఆందోళన ► తనకేమీ తెలియదంటున్న ప్రియుడు పూసపాటిరేగ: వరసకు బావ అవుతాడు.. ప్రేమగా నాలుగు మాటలు చెబితే పరవశించిపోయింది. ప్రేమించానంటే.. నమ్మి వెంట నడిచింది. సర్వమూ అర్పించింది. ఇలా వీరి ప్రేమకథ ఐదేళ్లపాటు సాగింది. పెళ్లి మాట ఆమె ఎప్పుడు అడిగినా.. ఇదిగో అదిగో అంటూ కాసేపు, ఉద్యోగమొచ్చాక చేసుకుంటానని మరోసారి తప్పించుకువచ్చాడు. చివరికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతను ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి.. బావ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. మరికొన్ని గంటల్లో అతను వేరే పెళ్లికి సిద్ధం కావడంతో చేసేదిలేక శనివారం పోలీసులను ఆశ్రయించింది. మండలంలోని రెల్లివలసలో జరిగిన ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం చిట్టివలసకు చెందిన యువతి వాళ్లె నాగమణి, పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన చందక రమణ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగమణికి రమణ వరసకు బావ అవుతాడు. ‘ఉద్యోగం రాగానే నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆర్మీలో ఉద్యోగం కోసం రూ.లక్ష కట్టాలి. ఉంటే సర్దుబాటు చేయు..’ అని అతను కోరడంతో ఆ మొత్తాన్ని ఆమె సమకూర్చింది. ఈ ఐదేళ్ల కాలంలో వీరు శారీరకంగానూ ఒక్కటయ్యారు. అయితే, ఇప్పుడు ఆమెను కాదని రమణ వేరే సంబంధం కుదుర్చుకున్నాడు. వేరే యువతితో శనివారం అతనికి వివాహం జరగనుందని తెలియడంతో.. నాగమణి బంధువులతో కలసి రెల్లివలస చేరుకుంది. ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో సుమారు రెండుగంటలపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంత జరిగినా ప్రియుడు రమణ మాత్రం బయటకు రాలేదు. దీంతో నాగమణి పూసపాటిరేగ పోలీసులను ఆశ్రయించింది. ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న చందక రమణ విలేకరులతో మాట్లాడుతూ.. డబ్బుల కోసమే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపాడు. శారీరకంగా కలవడం అవాస్తవమని, తాను ఎటువంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. -
ప్రపంచ బ్యాంకు బృందానికి ఘన స్వాగతం
పూసపాటిరేగ: డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియూ కోస్టల్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు కలెక్టర్ నాయక్ ఆధ్వర్యంలో పతివాడబర్రిపేట గ్రామస్తులు బుధవారం ఘన స్వాగతం పలికారు. మేళ,తాళాల నడుమ మత్స్యకారుల సంప్రదాయ పద్ధతిలో ప్రతినిధులను గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నిధులు కోటీ పద్దెనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన తుపాను షెల్టర్‌తో పాటు పులిగెడ్డ, కోనయ్యపాలెంలో రూ. 3 కోట్లతో నిర్మించిన వంతెనలను పరిశీలించారు. తుపాను షెల్టర్ ఎలా ఉపయోగపడుతున్నదీ.. బ్యాంకుల నుంచి రుణాలు ఎలా మంజూరవుతున్నదీ మత్స్యకార మహిళా సంఘాల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పతివాడబర్రిపేటలో జరిగిన సభలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి ఎస్కె జైన్ మాట్లాడుతూ, రూ. 200 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తుపాను షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తీరప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు ఆర్థికంగా పటిష్టం కావాలన్నారు. టీమ్ లీడర్ సౌరబ్ ఘని మాట్లాడుతూ, మత్స్యకార గ్రామాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మత్స్యకార సంఘ నాయకులు బర్రి నూకరాజు, మైలపల్లి సింహాచలం, తదితరులు మాట్లాడుతూ, మత్స్యకారుల సమస్యలను సభ్యులకు తెలియజేశారు. అంతకుముందు బృంద సభ్యులు మత్స్యకార్లకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ జేసీ శర్మ, డిజాస్టర్ మేనేజ్మెంట్ డెరైక్టర్ ధనుంజయరెడ్డి , పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ పి. సుబ్రహ్మణ్యశాస్త్రి, పీఆర్ ఎస్ఈ కె. వేణుగోపాల్, ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాదరావు, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినప్పన్న, ఎంపీడీఓ ఎంఎల్ నారాయణరావు, తహశీల్దార్ జి. జయదేవి, సర్పంచ్ ఎ. పైడిరామ్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
పూసపాటిరేగ : మండలంలోని కందివలస జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకలను పూసపాటిరేగ మండలం కందివలస జంక్షన్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొంది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన కంచిరెడ్డి సత్యనారాయణ(25), అదే మండలం ఇల్లంనాయుడువలసకు చెందిన బెజ్జిపరపు కృష్ణారావు(26) తీవ్ర గాయాలపాలై సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సత్యనారాయణ పెనుబాకలో పాల డెయిరీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు పూసపాటిరేగ ఎస్సై ఎస్.శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
బల్లి పడిన భోజనం తిన్న విద్యార్థులు
పూసపాటిరాగ: విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలం కోనడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీటిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బల్లి పడిన మధ్యాహ్న భోజనం తినడంతో వీరు అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు. బాధిత విద్యార్థులకు పూసపాటిరాగ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ మార్క్ రాజకీయం!
పూసపాటిరేగ: మండలంలో టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికారం తమ చేతిలో ఉండడంతో వారికి నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఉన్న వారిని తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాక్షర్‌భారత్ మండల కోఆర్డినేటర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికార పార్టీ నాయకులు తమ అనుచరులను ఉద్యోగా ల్లో నియమించేందుకు అధికారులపై ఒత్తిడి తీ సుకువచ్చి తమంతట తామే స్వచ్ఛందంగా ఉ ద్యోగానికి రాజీనామా చేసేలా చేస్తున్నారు.అధికారపార్టీకి చెందినవారిని వదిలేసి మిగతా వారి పై వేటు వేయడానికి ఇప్పటికే జాబితా కూడా సిద్ధంచేశారు. అందులో భాగంగానే ముందుగా సాక్షర్‌భారత్ గ్రామ సమన్వయకర్తలను తొ లగిస్తున్నారు. మండలంలో మొత్తం 56 మంది గ్రామ సమన్వయకర్తలు అందులో అధికార పార్టీకి చెందిన 11మంది మినహా, మిగతా 45మందిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైం ది. 45 మందిలో ఇప్పటికే వివిధ కారణాలతో ఐదుగురు సస్పెన్షన్‌లో ఉన్నారు. దీంతో మిగ తా వారిని తొలగించేందుకు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు విడుదల కాక సమన్వయకర్తలు ఆర్థికంగా ఇబ్బందు లు పడుతున్నా రు. ఈ నేపథ్యంలో అధికారుల ఒత్తిడి ఎక్కువ్వడంతో పని చేయడం కష్టమేనని చెబుతున్నారు. కొన్ని రోజలు క్రితం రేషన్ డీలర్లపై కూడా ఇదే విధానం అవలంభించి పలువురు డీలర్లను తొలగించారు. -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా
పూసపాటిరేగ: ఇసుక రవాణా అక్రమార్కులకు కాసుల పంటపండిస్తుండడంతో తమకు ఎవరైనా అడ్డు తగిలితే సహించలేకపోతున్నారు. ఎంతటి హాని తలపెట్టడానికైనా వెనుకాడడం లేదు. మండలంలోని కోనయ్యపాలెం సమీపంలో గల కందివలస గెడ్డలో రెవెన్యూఇన్స్పెక్టర్పై సోమవారం సాయంత్రం ఇసుక అక్రమార్కులు దాడి చేశారు. ఆయనను రెండు సార్లు ట్రాక్టరుతో ఢీకొనడానికి ప్రయత్నించగా, తప్పించుకుని స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనుమతిలేకుండా కందివలస గెడ్డ నుంచి ఇసుక అక్రమరవాణా అవుతోందని అందిన ఫిర్యాదుతో పూసపాటిరేగ రెవెన్యూఇన్స్పెక్టర్ బి.వి. మురళీకృష్ణ సోమవారం సాయంత్రం అక్రమతవ్వకాలు జరుగుతున్న గెడ్డ వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఐదుట్రాక్టర్లు ఉన్నాయి. ఆయన రాకను గమనించి నాలుగు ట్రాక్టర్లను అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. ఇసుక గుంతలో దిగబడిన రణస్థలం మండలం అక్కయ్యపాలెంకు చెందిన ట్రాక్టరు రెవెన్యూ ఇన్స్పెక్టర్కు పట్టుబడింది. పట్టుబడిన ట్రాక్టరును నిలిపివేయాలని ఆర్ఐ కోరారు. దీంతో ట్రాక్టర్‌డ్రైవర్ బవిరి గోవింద నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఆర్ఐపై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ట్రాక్టరును బయటకు తీయించి .. ఆర్ఐని ఢీ కొనేందుకు రెండు సార్లు యత్నించాడు. సమీపంలో గల గోతిలో ఆర్ఐ పడిపోవడంతో స్వల్పగాయాలతో ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నారు. ఈలోగా డ్రైవర్ ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. ఆర్ఐతో పాటు ఉన్న వీఆర్ఏ జి.ఎల్లయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ,తహశీల్దార్ వి.పద్మావతి, ఎంపీడీఓ డి.లక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయమై పరిసర గ్రామాల ప్రజలను విచారణ చేశారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తహశీల్దార్ పద్మావతికి, ఎస్సై షేక్ ఫకృద్దీన్లకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలం పూసపాటిరేగ, రణస్థలం సరిహద్దులో ఉండడంతో ఇంకా కేసు నమోదుపై నిర్ణయం తీసుకోలేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
పూసపాటిరేగ: మండలంలోని పెదబత్తివలస గ్రామంలో బాలికకు వివాహం నిశ్చమైందన్న ఫిర్యాదు మేరకు చైల్డ్‌లైన్ సిబ్బంది గురువారం గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక బంధువుల వద్దకు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. బాలిక బంధువైన ఏకల ముసలినాయుడు చైల్డ్‌లైన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు కె.అప్పారావు, బీహెచ్.లక్ష్మి బాలికలకు వివాహం చేస్తే వచ్చే అనర్థాలపై బంధువులకు అవగాహన కల్పించారు. బాలిక గుర్ల కస్తూరిబాగాంధీ బాలికల ఆశ్రమపాఠశాలలో 9 వతరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఆగస్టు 15 వతేదీన బాలికకు జరగబోయే పెళ్లిని నిలుపుదల చేస్తున్నట్లు బాలిక తరఫు వారి నుం చి హామీ తీసుకుని చైల్డ్‌లైన్ అధికారులు వెళ్లిపోయారు. ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా బంధువులందరూ బాధ్యుల వుతారని అధికారులు హెచ్చరించారు. -
విధి వక్రించి...!
పూసపాటిరేగ/సరుబుజ్జిలి: పెళ్లి చూపుల కోసం వచ్చిన ఆ జవాన్..ఆ ముచ్చట తీరకుండానే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. తాను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనమే..మృత్యుశకటమైంది. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సువ్వారి రామ్మోహనరావు(31) జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండడంతో విధులకు సెలవు తీసుకుని..ఉదయ మే విశాఖపట్నంలో రైలు దిగాడు. అక్కడి నుంచి సోదరు డు లక్ష్మణరావుకు చెందిన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు.8 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా..వస్తుండగా..పూసపాటిరేగ వద్దకు వచ్చే సరికి ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో...డ్రైవర్ సడ్న్ బ్రేక్ వేశాడు. దీం తో వెనుక బైక్‌పై వస్తున్న రామ్మోహన్ వేగంగా వచ్చి, కారు ను ఢీకొన్నాడు. దంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయన్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో..వైద్యులు విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం..శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. నెల రోజుల తరువాత రావాల్సి ఉన్నా.. వాస్తవానికి రామ్మోహనరావు.. నెల రోజుల తరువాత గ్రామానికి రావాల్సి ఉంది. కానీ పెళ్లి చూపులు ఉన్నాయని..ఇంటి నుంచి ఫోన్ రావడంతో..20 రోజులు సెలవు తీసుకుని బ యల్దేరాడు. ఇంతలోనే..ప్రమాదంలో మృతి చెందాడంటూ..కుటుంబ సభ్యులు బంధువులు భోరున విలపిస్తున్నారు. పురుషోత్తపురం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. హెల్మెట్ ఉన్నా.. ప్రమాదసమయంలో రామ్మోహన్ హెల్మెట్ ధరించి ఉన్నా..ప్రయోజనం లేకపోయింది. బలమైన గాయాలు కావడం తో ప్రాణాలు కో ల్పోయాడు. మృతునికి తల్లిదండ్రులు కృష్ణారావు, దమయంతితో పాటు..సోదరులు రమేష్, లక్ష్మణరావు ఉన్నారు. పూసపాటి రేగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కళ్లెదుటే...
పూసపాటిరేగ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఓ రైతు ప్రాణాన్ని బలిగొంది. నేలకూలిన స్తంభాన్ని పునరుద్ధరించకపోవడం.. ఇది గమనించని రైతు వేలాడుతున్న వైర్లను పొరపాటున తగలడం.. వెరసి భార్య కళ్ల ముందే ఆ భర్త విగతజీవిగా మారాడు. మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధి లక్ష్మీదేవితోట కల్లాలులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పతివాడ ప్రకాశరావు(45)తోపాటు అతని భార్య అన్నపూర్ణ నువ్వుసాగు గొప్పుకు వెళ్లారు. ఇద్దరూ గొప్పు తవ్వుతుండగా.. సమీపంలో విరిగిన విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు ప్రకాశరావుకు తగిలాయి. వైర్లలో విద్యుత్ ప్రవహిస్తుండడంతో ఆయన షాక్‌కు గురయ్యూడు. సమీపంలోనే గొప్పు తవ్వుతున్న భార్య.. అతనిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యంకాలేదు. ఆమె కళ్ల ముందే గిలగిలా కొట్టుకుంటూ ప్రకాశరావు విగతజీవిగా మారాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారం రోజుల క్రితం స్తంభం నేలకొరిగినా... వారం రోజుల క్రితం వచ్చిన గాలులకు తాడిచెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో స్తంభం నేలకూలింది. అప్పటి నుంచి ఈ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, బుధవారం ఉదయం నేలమీద ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా అవడంతో ప్రకాశరావు విద్యుదాఘాతానికి గురై, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం గాలిలో కలిసిపోయిందని మృతుని బంధువులతోపాటు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, ఇజ్జరోతు ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎంవీజీ శంకరరావు, గ్రామ వైస్ సర్పంచ్ అప్పలనాయుడు పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేశారు. -
తప్పును తప్పని చెప్పాడు అంతే...
న్యాయం చేద్దామని వెళ్లి.. ఓ వ్యక్తి అన్యాయమైపోయాడు. నువ్వు చేసినది తప్పు.. అన్నందుకు ‘మరణశిక్ష’ అనుభవించాడు. మండలంలోని లంకలపల్లిపాలెంలో గురువారం హత్య జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొయ్య అప్పారావు తాటికల్లు కోసమని అదే ప్రాంతానికి చెందిన రీసు రాము చెట్టు వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ కల్లు గీస్తున్న రామును తాటికల్లు ఇవ్వాలని అడిగాడు. ఇది మధ్యాహ్నం సమయమని, కల్లు రావని రాము చెప్పాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం రేగింది. దీంతో అప్పారావు తన వద్ద ఉన్న కత్తితో చెట్టు ఎక్కి తాటికొమ్మలు నరకసాగాడు. సమీపంలో ఉన్న అదే గ్రామానికి చెందిన పెసల నర్సింహులు అక్కడకు చేరుకుని అప్పారావును మందలించాడు. కల్లు ఇవ్వలేదని గొడవపడి కమ్మలు నరకడం మంచి పద్ధతి కాదని హితవు పలికాడు. అక్కడ నుంచి అప్పారావు కోపంతో సమీపంలో గొర్రెలు కాస్తున్న నక్కాన అప్పన్న(55) వైపు వెళ్లాడు. ‘నువ్వు చేసింది తప్పు. కల్లు ఇవ్వలేదని చెట్టు కొమ్మలు నరకడం సరికాదు.’ అంటూ అప్పారావును అప్పన్న మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన అప్పారావు.. తన వద్ద ఉన్న కత్తితో నక్కాన అప్పన్న చేతిలోని కర్రను ముందుగా నరికాడు. ఆ తర్వాత అప్పన్న మెడపై కత్తితో వేటు వేశాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకుంటున్నా చలించలేదు. సమీపంలో ఉన్న అప్పన్న కుమారుడు అప్పలనాయుడు పరుగున అక్కడకు వచ్చాడు. అతనిపైనా అప్పారావు కత్తితో దాడికి దిగి, గాయపరిచాడు. కళ్ల ముందే రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న తండ్రిని చూసి అప్పలనాయుడు భయాందోళనకు గురై, గ్రామంలోకి పరుగు తీశాడు. గ్రామస్తులను తీసుకొచ్చాడు. అప్పటికే అప్పన్న మృతి చెందాడు. మృతుడు అప్పన్నకు భార్య బంగారమ్మతోపాటు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృతి చెందడంతో వారంతా భోరుమన్నారు. విషయం తెలుసుకున్న భోగాపురం సీఐ ఎ.ఎస్.చక్రవర్తి, ఎస్సై షేక్ ఫక్రుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
విద్యార్థిని మింగేసిన ఉప్పుటేరు
పూసపాటిరేగ, న్యూస్‌లైన్: ఆ విద్యార్థి బొబ్బిలిలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవు రోజు కావడంతో ఇంటికొచ్చాడు. సరదాగా సముద్రస్నానం చేద్దామని ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏడుగురు పిల్లలతో కలిసివెళ్లాడు. తనతో పాటు సముద్ర స్నానానికి వచ్చిన ఓ చిన్నారిని ఉప్పుటేరు దాటించడాని కి ఎత్తుకున్నాడు. ఆ చిన్నారిని కాపాడి తాను ఉప్పుటేరులో మునిగి ప్రాణాలు కోల్పోయా డు. మిగతా ఏడుగురిని సమీపంలో ఉన్న మత్స్యకారులు కాపాడడంతో వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషాదం పూసపాటిరేగ మండలం కోనాడ సమీపంలో ఆదివారం జరిగింది. గ్రామపరిధిలో గల బొడ్డు వెంకటేశుపేటకు చెందిన కారి అశోక్(18) ఉదయం 9 గంటల సమయంలో ఉప్పుటేరు దాటుతుండగా లోతు ఎక్కువగా ఉండడంతో పాటు వేగంగా ప్రవహించడంతో మునిగిపోయాడు. అశోక్‌తో పాటు వచ్చిన చిన్నారులు బడి నరసింహులు, బడి దీక్షిత,బడి అమ్మాజీ, కారి వరలక్ష్మి, కారి ఎల్లాజీతో పాటు మరో ఇద్దరు కూడా మునిగిపోతుండడాన్ని సమీపంలో వేట ముగించు కుని ఇంటికి వస్తున్న మత్స్యకారులు చూసి వారిని బోటు సహాయంతో కాపాడారు. అశోక్ అప్పటికే మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృత్యువు కోసమే ఇంటికి వచ్చాడేమో..! మృత్యువు కోసమే తమ కుమారుడు ఇంటికి వచ్చాడేమో అంటూ అశోక్ తల్లిదండ్రులు రాములమ్మ, గరగయ్యలు భోరున విలపించా రు. ఒక్కగానొక్క కుమారుడిని ఉప్పుటేరు రూపంలో మృత్యువు కాటేసిందని వారు రోది స్తుంటే గ్రామస్తుల కళ్లు చెమ్మగిల్లాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడిన మత్స్యకారులు ఎరుపల్లి పైడిరాజు, చోడిపల్లి గరగయ్య ను గ్రామస్తులు అభినందించారు. సంఘటన జరిగిన వెంటనే 108కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. పూసపాటిరేగ ఎస్ఐ జి.రామారావు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.