గంట క్రితం వచ్చి తమతో మాట్లాడిన కుమార్తె క్షణాల్లో విగతజీవిగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను అల్లుడే అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడని బోరున విలపిస్తున్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో మూడు నెలల గర్భిణి అనుమానాస్పద మృతి ఘటన సంచలనం రేకెత్తించింది.
పూసపాటిరేగ : మండలంలోని చింతపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ అల్లుడే కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. చింతపల్లి గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్మి(23), అప్పన్న భార్యాభర్తలు. లక్ష్మి తల్లిదండ్రులు బర్రి ఎర్రయ్య, అప్పయ్యమ్మలు కూడా చింతపల్లిలోనే ఉంటున్నారు. శుక్రవారం లక్ష్మి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.
రాత్రి వరకు ఉండి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. లక్ష్మి వెళ్లిన గంట వ్యవధిలోనే మృతి చెందిందని తల్లిదండ్రులకు సమాచారం అందడం నిర్ఘాంతపోయారు. అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన అప్పన్నే తమ కుమార్తెను హత్య చేశాడని తల్లిదండ్రులు బోరును విలపిస్తూ చెప్పారు. లక్ష్మి గొంతుపై ఉన్న గాట్లు ఆధారంగా హత్యేనని స్థానికులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూసపాటిరేగ ఎస్‌ఐ కళాధర్ ఆధ్వర్యంలో మృతదేహానికి పంచానామా నిర్వహించారు. నిందితుడు అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భోగాపురం సీఐ కె.వైకుంఠరావు వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
గ్రామంలో విషాదఛాయలు..
మృతురాలు లక్ష్మి మూడునెలలు గర్భిణి. ఆమెకు పావని, పరిదేశి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి మరణించడం, తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
వివాహిత అనుమానాస్పద మృతి
Published Sun, Apr 10 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement