భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది.
నెల్లిమర్ల రూరల్ : భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళి తే... విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో గల కొం డపేట గ్రామానికి చెందిన లక్ష్మి(25)కి నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అలుగోలు జగన్నాథంతో ఎని మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం తాగవద్దని ఎంతచెప్పినా వినకపోవడంతో లక్ష్మి ఈనెల 20న భర్త ఇంట్లో ఉంటుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచింది.
పరారీలో భర్త
ఘటన జరిగిన దగ్గర నుంచి భర్త జగన్నాథం పరారీలోనే ఉన్నాడు. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తమ కుమార్తె మృతికి భర్తే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిత్యం మద్యం సేవించి గొడవలకు దిగేవాడని, కుటుంబ పోషణను కూడా పట్టించుకునేవాడు కాదని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేశామని ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. ఇప్పటికే మృతిరాలి వద్ద నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం కూడా తీసుకున్నాయని చెప్పారు. జగన్నాథం విశాఖపట్నంలో ఉన్నట్లు తెలిసిందని, రెండు రోజుల్లో పట్టుకొని పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు.