రెచ్చిపోయిన ఇసుక మాఫియా
పూసపాటిరేగ: ఇసుక రవాణా అక్రమార్కులకు కాసుల పంటపండిస్తుండడంతో తమకు ఎవరైనా అడ్డు తగిలితే సహించలేకపోతున్నారు. ఎంతటి హాని తలపెట్టడానికైనా వెనుకాడడం లేదు. మండలంలోని కోనయ్యపాలెం సమీపంలో గల కందివలస గెడ్డలో రెవెన్యూఇన్‌స్పెక్టర్‌పై సోమవారం సాయంత్రం ఇసుక అక్రమార్కులు దాడి చేశారు. ఆయనను రెండు సార్లు ట్రాక్టరుతో ఢీకొనడానికి ప్రయత్నించగా, తప్పించుకుని స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనుమతిలేకుండా కందివలస గెడ్డ నుంచి ఇసుక అక్రమరవాణా అవుతోందని అందిన ఫిర్యాదుతో పూసపాటిరేగ రెవెన్యూఇన్‌స్పెక్టర్ బి.వి. మురళీకృష్ణ సోమవారం సాయంత్రం అక్రమతవ్వకాలు జరుగుతున్న గెడ్డ వద్దకు వెళ్లారు.
అప్పటికే అక్కడ ఐదుట్రాక్టర్లు ఉన్నాయి. ఆయన రాకను గమనించి నాలుగు ట్రాక్టర్లను అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. ఇసుక గుంతలో దిగబడిన రణస్థలం మండలం అక్కయ్యపాలెంకు చెందిన ట్రాక్టరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు పట్టుబడింది. పట్టుబడిన ట్రాక్టరును నిలిపివేయాలని ఆర్‌ఐ కోరారు. దీంతో ట్రాక్టర్‌డ్రైవర్ బవిరి గోవింద నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఆర్‌ఐపై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ట్రాక్టరును బయటకు తీయించి .. ఆర్‌ఐని ఢీ కొనేందుకు రెండు సార్లు యత్నించాడు. సమీపంలో గల గోతిలో ఆర్‌ఐ పడిపోవడంతో స్వల్పగాయాలతో ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నారు.
ఈలోగా డ్రైవర్ ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. ఆర్‌ఐతో పాటు ఉన్న వీఆర్‌ఏ జి.ఎల్లయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ,తహశీల్దార్ వి.పద్మావతి, ఎంపీడీఓ డి.లక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయమై పరిసర గ్రామాల ప్రజలను విచారణ చేశారు. అనంతరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తహశీల్దార్ పద్మావతికి, ఎస్సై షేక్ ఫకృద్దీన్‌లకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలం పూసపాటిరేగ, రణస్థలం సరిహద్దులో ఉండడంతో ఇంకా కేసు నమోదుపై నిర్ణయం తీసుకోలేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.