పూసపాటిరేగ: డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇండియూ కోస్టల్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు కలెక్టర్ నాయక్ ఆధ్వర్యంలో పతివాడబర్రిపేట గ్రామస్తులు బుధవారం ఘన స్వాగతం పలికారు. మేళ,తాళాల నడుమ మత్స్యకారుల సంప్రదాయ పద్ధతిలో ప్రతినిధులను గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నిధులు కోటీ పద్దెనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన తుపాను షెల్టర్‌తో పాటు పులిగెడ్డ, కోనయ్యపాలెంలో రూ. 3 కోట్లతో నిర్మించిన వంతెనలను పరిశీలించారు. తుపాను షెల్టర్ ఎలా ఉపయోగపడుతున్నదీ.. బ్యాంకుల నుంచి రుణాలు ఎలా మంజూరవుతున్నదీ మత్స్యకార మహిళా సంఘాల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పతివాడబర్రిపేటలో జరిగిన సభలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి ఎస్‌కె జైన్ మాట్లాడుతూ, రూ. 200 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తుపాను షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తీరప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు ఆర్థికంగా పటిష్టం కావాలన్నారు. టీమ్ లీడర్ సౌరబ్ ఘని మాట్లాడుతూ, మత్స్యకార గ్రామాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మత్స్యకార సంఘ నాయకులు బర్రి నూకరాజు, మైలపల్లి సింహాచలం, తదితరులు మాట్లాడుతూ, మత్స్యకారుల సమస్యలను సభ్యులకు తెలియజేశారు.
అంతకుముందు బృంద సభ్యులు మత్స్యకార్లకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ జేసీ శర్మ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ ధనుంజయరెడ్డి , పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ పి. సుబ్రహ్మణ్యశాస్త్రి, పీఆర్ ఎస్‌ఈ కె. వేణుగోపాల్, ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాదరావు, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినప్పన్న, ఎంపీడీఓ ఎంఎల్ నారాయణరావు, తహశీల్దార్ జి. జయదేవి, సర్పంచ్ ఎ. పైడిరామ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ బ్యాంకు బృందానికి ఘన స్వాగతం
Published Thu, Jan 21 2016 3:32 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement