అప్పన్న మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు ( అంతర్ చిత్రం : నిందితుడు ఉపయోగించిన ఆయుధం)
న్యాయం చేద్దామని వెళ్లి.. ఓ వ్యక్తి అన్యాయమైపోయాడు. నువ్వు చేసినది తప్పు.. అన్నందుకు ‘మరణశిక్ష’ అనుభవించాడు. మండలంలోని లంకలపల్లిపాలెంలో గురువారం హత్య జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొయ్య అప్పారావు తాటికల్లు కోసమని అదే ప్రాంతానికి చెందిన రీసు రాము చెట్టు వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ కల్లు గీస్తున్న రామును తాటికల్లు ఇవ్వాలని అడిగాడు.
ఇది మధ్యాహ్నం సమయమని, కల్లు రావని రాము చెప్పాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం రేగింది. దీంతో అప్పారావు తన వద్ద ఉన్న కత్తితో చెట్టు ఎక్కి తాటికొమ్మలు నరకసాగాడు. సమీపంలో ఉన్న అదే గ్రామానికి చెందిన పెసల నర్సింహులు అక్కడకు చేరుకుని అప్పారావును మందలించాడు. కల్లు ఇవ్వలేదని గొడవపడి కమ్మలు నరకడం మంచి పద్ధతి కాదని హితవు పలికాడు. అక్కడ నుంచి అప్పారావు కోపంతో సమీపంలో గొర్రెలు కాస్తున్న నక్కాన అప్పన్న(55) వైపు వెళ్లాడు. ‘నువ్వు చేసింది తప్పు.
కల్లు ఇవ్వలేదని చెట్టు కొమ్మలు నరకడం సరికాదు.’ అంటూ అప్పారావును అప్పన్న మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన అప్పారావు.. తన వద్ద ఉన్న కత్తితో నక్కాన అప్పన్న చేతిలోని కర్రను ముందుగా నరికాడు. ఆ తర్వాత అప్పన్న మెడపై కత్తితో వేటు వేశాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకుంటున్నా చలించలేదు. సమీపంలో ఉన్న అప్పన్న కుమారుడు అప్పలనాయుడు పరుగున అక్కడకు వచ్చాడు.
అతనిపైనా అప్పారావు కత్తితో దాడికి దిగి, గాయపరిచాడు. కళ్ల ముందే రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న తండ్రిని చూసి అప్పలనాయుడు భయాందోళనకు గురై, గ్రామంలోకి పరుగు తీశాడు. గ్రామస్తులను తీసుకొచ్చాడు. అప్పటికే అప్పన్న మృతి చెందాడు. మృతుడు అప్పన్నకు భార్య బంగారమ్మతోపాటు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృతి చెందడంతో వారంతా భోరుమన్నారు.
విషయం తెలుసుకున్న భోగాపురం సీఐ ఎ.ఎస్.చక్రవర్తి, ఎస్సై షేక్ ఫక్రుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.