నేటితో ముగియునున్న నిషేధం
పూసపాటిరేగ : రెండు నెలల విరామం తర్వాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. చేపల వేటపై నిషేధం మంగళవారంతో ముగియనుంది. దీంతో వేటకు కావాల్సిన వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకోవడంతోపాటు అసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న పూసపాటిరేగ, బోగాపురం మండలాల్లో సుమారు 19వేల మంది మత్స్యకారులు ఉన్నారు.
ప్రత్యక్ష్యంగా నాలుగు వేల మంది, పరోక్షంగా 15వేల మంది మత్స్యకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండు మండలాల్లో 700 పడవలు ఉండగా, వాటిలో సంప్రదాయ బోట్లు 500 కాగా, ఫైబర్‌బోట్లు 200 వరకు ఉన్నాయి. అత్యధికంగా చింతపల్లి, పతివాడబర్రిపేట, తిప్పలవలస, కోనాడ, చేపలు కంచేరు, ముక్కాం గ్రామాల నుంచి పడవలు వేటకు వెళ్తాయి.
అందని జీవన భృతి
ప్రతి ఏడాది 45 రోజులు వేట నిషేధం కాగా, ఈ సంవత్సరం 60 రోజులకు పెంచారు. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 30 కిలోల బియ్యం, రూ.2వేల నగదు ఇచ్చారు. దీనిపై మత్స్యకారులు ఆందోళనలు చేశారు. దీంతో తమిళనాడు తరహాలో రూ.5వేలు నగదు, బియ్యం ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు.
అయితే రూ.4వేల నగదు, 30 కిలోల బియ్యం ఇస్తున్నట్లు జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం కూడా జీవన భృతి చెల్లించలేదు. వేట నిషేధ సమయం ముగుస్తున్నా జీవన భృతి అందలేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే తమకు జీవన భృతి అందించాలని కోరుతున్నారు.