విద్యార్థిని మింగేసిన ఉప్పుటేరు
Published Mon, Jan 6 2014 2:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పూసపాటిరేగ, న్యూస్‌లైన్: ఆ విద్యార్థి బొబ్బిలిలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవు రోజు కావడంతో ఇంటికొచ్చాడు. సరదాగా సముద్రస్నానం చేద్దామని ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏడుగురు పిల్లలతో కలిసివెళ్లాడు. తనతో పాటు సముద్ర స్నానానికి వచ్చిన ఓ చిన్నారిని ఉప్పుటేరు దాటించడాని కి ఎత్తుకున్నాడు. ఆ చిన్నారిని కాపాడి తాను ఉప్పుటేరులో మునిగి ప్రాణాలు కోల్పోయా డు. మిగతా ఏడుగురిని సమీపంలో ఉన్న మత్స్యకారులు కాపాడడంతో వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషాదం పూసపాటిరేగ మండలం కోనాడ సమీపంలో ఆదివారం జరిగింది. గ్రామపరిధిలో గల బొడ్డు వెంకటేశుపేటకు చెందిన కారి అశోక్(18) ఉదయం 9 గంటల సమయంలో ఉప్పుటేరు దాటుతుండగా లోతు ఎక్కువగా ఉండడంతో పాటు వేగంగా ప్రవహించడంతో మునిగిపోయాడు. అశోక్‌తో పాటు వచ్చిన చిన్నారులు బడి నరసింహులు, బడి దీక్షిత,బడి అమ్మాజీ, కారి వరలక్ష్మి, కారి ఎల్లాజీతో పాటు మరో ఇద్దరు కూడా మునిగిపోతుండడాన్ని సమీపంలో వేట ముగించు కుని ఇంటికి వస్తున్న మత్స్యకారులు చూసి వారిని బోటు సహాయంతో కాపాడారు. అశోక్ అప్పటికే మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
మృత్యువు కోసమే ఇంటికి వచ్చాడేమో..!
మృత్యువు కోసమే తమ కుమారుడు ఇంటికి వచ్చాడేమో అంటూ అశోక్ తల్లిదండ్రులు రాములమ్మ, గరగయ్యలు భోరున విలపించా రు. ఒక్కగానొక్క కుమారుడిని ఉప్పుటేరు రూపంలో మృత్యువు కాటేసిందని వారు రోది స్తుంటే గ్రామస్తుల కళ్లు చెమ్మగిల్లాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడిన మత్స్యకారులు ఎరుపల్లి పైడిరాజు, చోడిపల్లి గరగయ్య ను గ్రామస్తులు అభినందించారు. సంఘటన జరిగిన వెంటనే 108కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. పూసపాటిరేగ ఎస్‌ఐ జి.రామారావు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement