ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి పెరుగన్నం తిన్న వీరికి విరేచనాలు, వాంతులు మొదలయ్యాయి. శనివారం ఉదయం వరకు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. హాస్టల్‌లో సుమారు 220 మంది విద్యార్థులు ఉంటున్నారు. శనివారం రాత్రి పెట్టిన పెరుగన్నం రుచిగా లేదని పలువురు బయట తిన్నారు. కొందరు మాత్రం హాస్టల్‌లో పెరుగన్నం తిని పడుకున్నారు. కాగా అర్ధరాత్రి 11 మంది విద్యార్థులకు విరేచనాలు, వాంతులు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో శివతేజ, రవి అనే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం మరో 14 మంది విద్యార్థులు ఆస్పత్రికి వచ్చారు.
అస్వస్థతకు గురైన వారిలో అబ్దుల్, జయపాల్, శ్రీకాంత్, శ్రావణ్‌కుమార్, రామయ్య, మహమ్మద్ సిద్ధిక్, అనిల్‌కుమార్, మల్లికార్జున తదితరులు ఉన్నారు. విషయం తెలియడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ వీరకుమార్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎంసీ రాధా, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి తదితరులు హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. కలుషిత నీటి వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బంది హాస్టల్‌ను సందర్శించడం లేదని విద్యార్థులు కళాశాల ఎదురుగా కొర్రపాడు రోడ్డులో బైఠాయించారు. తమకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇకపై రోజూ మున్సిపల్ ట్యాంకర్‌తో నీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.
కలుషిత నీటితో విద్యార్థులకు అస్వస్థత
Published Sat, Aug 22 2015 8:07 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement