పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
గుడ్లవల్లేరు :
చదువుపై ఆసక్తి లేక ఇంటిలో తల్లిదండ్రులు బలవంతం చేయడంతో ఒక విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరానికి చెందిన కుంభా శివకోటేశ్వరరావు పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనకున్న అనాసక్తిని తల్లిదండ్రులకు చెప్పినా వినకపోవటంతో శుక్రవారం ఎలుకల మందు తిన్నాడు. అదే సమయంలో తనకు ఫోను చేసిన తండ్రి వెంకటేశ్వరరావుకు విషయం చెప్పాడు. ఆయన హుటాహుటిన గుడ్లవల్లేరుకు చేరుకున్నాడు. కాలేజీ యాజమాన్యం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించింది. తనకు ఇక్కడ చదువుకోవాలని లేదని అతను విలేకరులకు తెలిపాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు చెప్పాడు.
సున్నితంగానే వ్యవహరిస్తాం...
ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు,
కాలేజీ ప్రిన్సిపాల్
విద్యార్థులకు వారి సబ్జెక్టుల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు అధ్యాపకులు, విభాగాధిపతులు సున్నితంగానే వ్యవహరిస్తారు. కొన్ని సబ్జెక్టులు పోయాయని భయపడి మొత్తం చదువును పక్కన పెట్టేయటం మంచిది కాదు. సబ్జెక్టులపై పట్టు సాధించుకునేందుకు ఏకాగ్రతను పెంచుకోవాలే తప్ప ధైర్యం కోల్పోయి ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదు.