suviside
-
మరో కౌలురైతు గుండె ఆగింది
– నారు మోస్తూ పొలంలోనే – ప్రాణాలొదిలిన వైనం – జుజ్జూరు వద్ద విషాదం – ఆర్థిక ఇబ్బందులే కారణం! జుజ్జూరు (వీరులపాడు): పొలం పనులు చేస్తూ గుండెపోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన నందిగామ మండలంలో జరిగింది. జుజ్జూరు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి దావీదు (50) నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం మాగాణి పొలంలో నారు మూటలు మోస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కూలీలు ఆయనను ఆటోలో జుజ్జూరు ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్ళారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కన్నీరుమున్నీరైన కుటుంబం మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో భార్య, కుమారుడు, కూతురు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సొంతపొలం లేకపోయినప్పటికీ కౌలుకు తీసుకొని సాగు చేస్తూ జీవిస్తున్నామని, ఇంక మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. దొరకని పంట రుణాలు! వ్యవసాయమే జీవనాధారమైన దావీదు వరుసగా కౌలు సేద్యంలో నష్టాలు పాలైనట్లు బంధువులు తెలిపారు. రూ. 4 లక్షల అప్పుల భారం కూడా ఉందని, పలు బ్యాంకుల్లో పంట రుణాల కోసం ప్రయత్నిస్తుంటే నిబంధనల పేరుతో తిరస్కరించారని తెలిపారు. దీంతో కొంతకాలంగా తీవ్ర ఆవేదనకు లోనవుతుండేవాడని తెలిపారు. అçప్పుడే అప్పులోళ్ల ఒత్తిడి కాగా, రైతు మరణవార్త తెలియగానే కొందరు రుణదాతలు తమకు దావీదు అప్పు తీసుకున్నాడని, చెల్లించాల్సిం దేనని నోట్లతో సహా ఇంటికి రావడంతో బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గుర య్యారు. మనిషి పోయిన విషాదంలో ఉంటే రుణదాతలు ఇలా చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
మరణంలోనూ వీడని బంధం
కానుకొల్లు (మండవల్లి): జీవితమంతా కలిసే ఉంటామని, కష్టసుఖాలు సమానంగా పంచుకుంటామని బాసలు చేశారు. చివరకు ఇద్దరూ కలిసే ఈ లోకాన్ని వీడిపోయారు. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కానుకొల్లు గ్రామంలో శనివారం జరిగింది. భార్యాభర్తలు ఇరువురూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన సింగిడి శ్రీనివాసరావు(44), భార్య ఎల్లమ్మ(40) అప్పుల బాధ తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగారు. ఉదయం ఎంతకీ నిద్రలేకపోవడంతో ఇరుగుపొరుగు అనుమానంతో పరిశీలించగా అప్పటికే మరణించారు. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు, ఎల్లమ్మల మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరికి లక్ష్మి, జ్యోతి అనే పెళ్లయిన ఇద్దరు కుమార్తెలు, ఇంటర్ వరకు చదివిన కుమారుడు ఉత్తమకుమార్ ఉన్నారు. విషాదంతో షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు తిరిగిరారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్ఐ ఎ.మణికుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఏ మందు తాగారో తెలియడం లేదని, ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు. పీఎం నిమిత్తం మృతదేహాలను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
గుడ్లవల్లేరు : చదువుపై ఆసక్తి లేక ఇంటిలో తల్లిదండ్రులు బలవంతం చేయడంతో ఒక విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరానికి చెందిన కుంభా శివకోటేశ్వరరావు పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనకున్న అనాసక్తిని తల్లిదండ్రులకు చెప్పినా వినకపోవటంతో శుక్రవారం ఎలుకల మందు తిన్నాడు. అదే సమయంలో తనకు ఫోను చేసిన తండ్రి వెంకటేశ్వరరావుకు విషయం చెప్పాడు. ఆయన హుటాహుటిన గుడ్లవల్లేరుకు చేరుకున్నాడు. కాలేజీ యాజమాన్యం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించింది. తనకు ఇక్కడ చదువుకోవాలని లేదని అతను విలేకరులకు తెలిపాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు చెప్పాడు. సున్నితంగానే వ్యవహరిస్తాం... ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు, కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థులకు వారి సబ్జెక్టుల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు అధ్యాపకులు, విభాగాధిపతులు సున్నితంగానే వ్యవహరిస్తారు. కొన్ని సబ్జెక్టులు పోయాయని భయపడి మొత్తం చదువును పక్కన పెట్టేయటం మంచిది కాదు. సబ్జెక్టులపై పట్టు సాధించుకునేందుకు ఏకాగ్రతను పెంచుకోవాలే తప్ప ధైర్యం కోల్పోయి ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చందర్లపాడు : కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోనాయిపాలెంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు నందిగామ పట్టణం చక్రాల బజార్‌కు చెందిన అల్లి లక్ష్మి(35) ఆదివారం మధ్యాహ్నం సమయంలో కోనాయిపాలెం గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. చెరువులో నీటిలోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ నూతలపాటి నాగేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్త్రీశక్తి భవనంలోఉద్యోగి ఆత్మహత్య
పెనమలూరు : గ్రామంలోని మండల స్త్రీశక్తి భవనంలో ఐకేపీ ఔట్‌సోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న తంగిరాల అజయ్‌కుమార్ (26) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కారణంగానే తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల కథనం మేరకు... పోరంకి బీజేఆర్ నగర్‌కు చెందిన తంగిరాల అజయ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా ఐకేపీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతను గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చి 10 గంటల సమయంలో తలుపులు వేసి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోస్టుఉమెన్ వచ్చి తలుపులు కొట్టినా స్పందన రాలేదు. డ్వాక్రా మహిళలు కిటికీ నుంచి చూడగా అతను ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు, ఆ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత అతని ఆత్మహత్యకు కారణాన్ని కుటుంబ సభ్యులు చెప్పలేకపోయారు. సూసైడ్‌నోట్ లభ్యం పోలీసులు వచ్చి కార్యాలయం తలుపులు పగులకొట్టి చూడగా, గదిలో వేలాడుతున్న మృతదేహం వద్ద పది పేజీల సూసైడ్‌నోట్, రెండు సీడీలు, పెన్‌డ్రైవ్, రెండు సెల్ ఫోన్లు, ఒక సిమ్‌కార్డు దొరికాయి. సూసైడ్ నోట్లో గతలో కార్యాలయంలో బుక్ కీపర్‌గా పనిచేసిన వివాహితతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆమె కోసం తాను రూ.1.50 లక్షలు ఖర్చుచేశానని, అయితే ఇప్పుడు ఆమె తనను పట్టించుకోకుండా వేధిస్తోందని, అందుకే మనస్థాపం చెంది ఆమె చీరతోనే ఉరేసుకుంటున్నానని పేర్కొన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
తమ్ముళ్ల వేధింపులకు వృద్ధ రైతు బలి
బోరు కరెంటు కనెక్షన్ కట్ చేసిన టీడీపీ నేతలు ఎండిన పొలం చూసి పురుగుల మందు తాగిన రైతు వెంకయ్య చికిత్స పొందుతూ విజయవాడ ఆస్పత్రిలో మృతి పచ్చ తమ్ముళ్ల దాష్టీకం ఓ వృద్ధ రైతును పొట్టనబెట్టుకుంది. తమ వర్గానికి మద్దతివ్వడం లేదనే కసితో రైతు బోరు కరెంటు కనెక్షన్‌ను కట్ చేయించి పొలాన్ని ఎండబెట్టడంతో పేద రైతు గుండె చెదిరింది. తమ్ముళ్ల వేధింపుల గురించి ఎందరికి చెప్పుకున్నా వినేవారు లేక చివరకు ఈ లోకం నుంచే వెళ్లిపోయాడు. మైలవరం : వ్యవసాయ బోరు విద్యుత్ కనెక్షన్‌ను తెలుగు తమ్ముళ్ళు కట్ చేస్తుంటే నారుమడికి నీరందక ఎండిపోవడం, అధికారులకు చెప్పినా పట్టించుకోపోవడంపై తీవ్ర ఆవేదనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన చండ్రగూడెం రైతు తాతా వెంకయ్య తుది శ్వాస విడిచాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. తమ వర్గానికి మద్దతివ్వడం లేదనే కక్షతో మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన తాతా వెంకయ్య (70)కు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు విద్యుత్ కనెక్షన్లను స్థానిక అధికార పార్టీకి చెందిన తమ్ముళ్లు గత 15 రోజుల్లో మూడు సార్లు పోల్ పైకి ఎక్కి కట్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని... ఈ విషయాన్ని ఎలక్ట్రిసిటి అదికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేదు. నీరు లేక ఎండిపోయిన నారుమడిని చూసిన రైతు గుండె కొట్టుకులాడింది. ఆ ఆవేదనతో మూడు రోజుల క్రితం చేలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన ప్రక్క రైతులు, కుటుంబ సభ్యులు బాధితుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజులు మరణయాతన అనుభవించి చివరకు తుదిశ్వాస విడిచాడు. -
శానిటరీ మేస్త్రీ ఆత్మహత్య
విజయవాడ(చిట్టినగర్): శానిటరీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ పరి«ధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ వీఎంసీ కాలనీకి చెందిన వడ్డాది ఏడుకొండలు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ మేస్త్రీగా ఉద్యోగం చేస్తుంటాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం రూ.ఆరు లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతారనే ఆందోళనతో ఆదివారం సాయంత్రం పాముల కాల్వ సమీపంలో తన బైక్‌లోని పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించిన ఏడుకొండలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా కూలీ ఆత్మహత్య
చిట్టినగర్: అనారోగ్యంతో మహిళా కూలీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌లోని అచ్చిరెడ్డి పాలెం నుంచి కూలీ పనుల కోసం కొంత మంది కూలీలు విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడికి తరలివచ్చారు. వీరంతా పోలవరం కాలువ పనులు చేస్తూ కాల్వ గట్టునే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరిలో బర్తాలు నాగన్న, వెంకటమ్మలకు పనుల కోసం రాగా, కొంత కాలంగా వెంకటమ్మకు అనారోగ్యంగా ఉంటుంది. గురువారం పనికి వెళ్లకుండా వెంకటమ్మ ఇంట్లోని దూలానికి ప్లాస్టిక్ వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అమ్మ లేని లోకంలో ఉండలేనంటూ..
విజయవాడ (చిట్టినగర్ ): అమ్మా.. అమ్మా నే.. పసివాడనమ్మా.... నువ్వే లేక వసి వాడనమ్మా...... మాటే లేకుండా నువ్వే మాయం... కన్నీరవుతుంది ఎదలో గాయం.... అంటూ తల్లి మరణాన్ని తట్టుకోలేని బిడ్డ పరిస్థితిని వర్ణిస్తూ ఓ సినిమాలో పాట ఇదీ... నిజ జీవితంలో అన్ని తానే అయ్యి పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందితే... తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ యువకుడు తన ప్రాణాలను బలి తీసుకున్నాడు... హృదయాన్ని కలిచి వేసే ఈ ఘటన నగరంలో కొత్తపేట శ్రీనివాసమహాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గూడెల శారద, వెంకటేశ్వరరావు భార్యభర్తలు.... వీరికి దుర్గారావు సంతానం.. వెంకటేశ్వరరావుకు శారద రెండో భార్య.. శ్రీనివాసమహాల్ వెనుక పోతిన శ్రీనివాసరావు వీధిలో నివాసం ఉండే శారదకు బిడ్డంటే పంచప్రాణాలు..కూలీనాలి చేసుకుంటూ బిడ్డను పెంచుకుంటూ ఉండేది. బీఎస్సీ వరకు చదివిన దుర్గారావు ఓ ప్రయివేటు కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాడు. తన సంపాదనతో తల్లిని బాగా చూసుకుంటున్న తరుణంలో విధి ఆటాడింది. ఆస్థా్మతో బాధపడుతున్న తల్లి శారదకు దుర్గారావు వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. గత నెల రోజులుగా తల్లి పరిస్థితి విషమించడంతో లీవు పెట్టి తల్లికి సపర్యలు చేయసాగాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి శారద మృతి చెందడంతో దుర్గారావు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. స్నేహితులకు, తండ్రికి ఫోన్లో తల్లి మరణవార్త చెప్పి కన్నీటి పర్యంత అయ్యాడు. స్నేహితులు వెంటనే ఇంటికి వచ్చే సరికి ఇంట్లో మంచంపై శారద నిర్జీవంగా పడి ఉండగా దుర్గారావు జాడ లేకుండా పోయింది. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధతో ఎక్కడైనా ఉన్నాడని అనుకున్నారు...తీరా ఉదయం శారద అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్న తరుణంలో దుర్గారావు నిడమానూరు వద్ద రైలు కింద పడి మృతి చెందాడని విషయం తెలుసుకుని స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లి లేకుండా తానే జీవించలేననే దుర్గారావు ఇలా చేసి ఉంటాడని అందరూ భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం శారద అంతిమ యాత్ర పూర్తి చేయగా, దుర్గారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు గుడివాడకు తరలించారు. మంగళవారం రాత్రి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో కృష్ణలంక మార్చరీలో భద్రపరిచారు. బుధవారం దుర్గారావు అంతిమ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది గంటల్లోనే జరిగిన ఈ గుండెల్నిపిండేసే ఘటనతో కొత్తపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లి మరణం, తనయుని ఆత్మహత్య ఘటనతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. -
యువకుడి ఆత్మహత్య
దావులూరు (కంకిపాడు) : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని షెడ్డులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని పంట పొలాల్లో పనులకు వచ్చిన కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. మంగళవారం రాత్రి ఆ యువకుడు అక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారించుకున్నారు. తాను వేసుకున్న చొక్కాకు, బ్యానర్‌తో ముడి వేసి షెడ్డులోని ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు బందరు మండలం గరాలదిబ్బకు చెందిన పంతగాని నాగూర్ (32) గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద లక్ష్మీ తిరుపతమ్మ, దావులూరు, గౌడ అన్న కార్డు ముక్క దొరికింది. బందరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
ఒకరికోసం ఇంకొకరు..
భర్తకు ప్రాణహాని భయంతో భార్య ఆత్మహత్య భార్య మృతితో మనస్తాపం చెంది భర్త బలవన్మరణం మృత్యువుతో పోరాడుతున్న కుమార్తె తిరువూరు : రోజువారీ కూలీ పనులు చేసుకుని ఉన్నంతలో సంతృప్తికరమైన జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో ఒక కోయదొర సృష్టించిన అలజడి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారం రోజుల క్రితం ‘నీ భర్తకు ప్రాణగండం ఉందని, పూజలు చేస్తే గండం నుంచి బయట పడతాడని’ కాకర్లకు చెందిన గజ్జెల్లి ఏడుకొండలు (వెంకటేశ్వరరావు) భార్య నాగమణికి ఒక కోయదొర జోస్యం చెప్పాడు. అతని మాటలు నమ్మిన నాగమణి తన భర్త ప్రాణరక్షణ కోసం రెండు బంగారు ఉంగరాలను ఇవ్వగా కోయదొర ఒక తాయెత్తు ఇచ్చి ఏడుకొండలుకు కట్టమని ఇచ్చి వెళ్లిపోయాడు. భర్తకు ఎటువంటి హాని జరుగుతుందోననే ఆందోళనతో ఐదు రోజుల క్రితం నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతితో మనస్తాపానికి గురైన ఏడుకొండలు తానూ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాము లేకుంటే పిల్లలు అనాథలుగా మిగులుతారనే ఉద్దేశంతో వారికీ విషమిచ్చి చంపాలని నిశ్చయించుకున్నాడు. ఏడుకొండలు రాజమండ్రిలో ఒక బేకరీలో పనిచేస్తుండగా, భార్య నాగమణి కూలీపని చేసి కుటుంబ పోషణలో సహకరిస్తోంది. అస్తికలు కలిపి తిరిగి వస్తూ.. భార్య అస్తికలను బుధవారం తన కుమార్తె నవ్య, కుమారుడు పృథ్వి, మరో బంధువుతో కలిసి విజయవాడలోని కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పిల్లలిద్దరికీ మంచినీటిలో పురుగుమందు కలిపి ఇచ్చేందుకు ఏడుకొండలు నిర్ణయించుకున్నాడు. గ్రామానికి చేరుకున్న అనంతరం కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. తనతో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లేలోపు మంచినీరు అడిగింది. దీంతో పురుగుమందు కలిపిన మంచినీటిని ఆమెకు ఇచ్చి తానూ తాగాడు. తండ్రి ఇచ్చిన నీటిని తాగిన నవ్య ఇంటికి చేరుకుని కుప్పకూలగా, ఏడుకొండలు అస్వస్థతకు గురయ్యాడు. ఇరువురినీ తిరువూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఏడుకొండలు మృతిచెందాడు. నవ్య మృత్యువుతో పోరాడుతోంది. పాపం పసివాడు ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, మృత్యువుతో పోరాడుతున్న సోదరి గురించి తెలియని చిన్నారి పృథ్వి బంధువుల ఇంట ఆడుకుంటుండడం చూపరులను కంట తడిపెట్టిస్తోంది. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే బంధువర్గం పృథ్వీని అక్కున చేర్చుకుంది. -
న్యాయవాది ఆత్మహత్య
తిరువూరు : తిరువూరుకు చెందిన సీనియర్ న్యాయవాది కొత్తా వెంకటేశ్వరరావు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఉరి వేసుకుని వెంకటేశ్వరరావు మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. తన ఆత్మహత్యకు గల కారణాలను వెంకటేశ్వరరావు సవివరంగా సూసైడ్ నోట్లో రాసినట్లు తెలిసింది. గతంలో కూడా పలుమార్లు ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్ఐ సురేష్ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నా చావుకు పెద్దమనుషులే కారణం ‘నన్ను నమ్మించి అప్పు తీసుకున్న పెద్దమనుషులు మోసం చేశారు. అవసరానికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేసి తీరా పంచాయతీ చేసి పావలా ఇప్పిస్తాం, అర్ధ రూపాయి ఇప్పిస్తామంటూ బేరసారాలు చేసిన పెద్దలు చివరికి చేతులెత్తేశారు. ఏమి చేయాలో పాలుపోక, సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నా’నని న్యాయవాది కొత్తా వెంకటేశ్వరరావు సూసైడ్నోటులో స్పష్టం చేశారు. ఆయన రాసిన సూసైడ్‌నోటును పోలీసులు, న్యాయవాదులు పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అధికార పార్టీకి చెందిన తిరువూరు నియోజకవర్గ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ తాను ఆ పార్టీకి 20 ఏళ్ల పాటు నమ్మినబంటుగా ఉన్నానని, అయినా నన్నే మోసం చేశారని వెంకటేశ్వరరావు ఆవేదనతో సూసైడ్నోటులో పేర్కొన్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఒకరు రూ.26 లక్షలు ఇవ్వాలని, సమీప బంధువు రూ.12 లక్షలు ఇవ్వాలని, ఈ సొమ్మును పెద్దలు తన మరణానంతరమైనా వసూలు చేసి తన భార్యకు ఇప్పించాలని కోరారు. తన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని సూసైడ్నోటులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి సంతాపం వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి సందర్శించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దామోదరరావు, అదనపు జడ్జి పఠాన్ షియాజ్‌ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగళ్ల మోహనరెడ్డి, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలకు చెందిన కక్షిదారులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వ్యక్తి బలవన్మరణం
విజయవాడ (భవానీపురం) : కుటుంబ కలహాలు, భార్య పుట్టింటికి వెళ్లి వేరేగా ఉండడంతో మనస్థాపానికి గరైన మేడిశెట్టి రమేష్ (34) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాధరపురం హెడ్‌వాటర్ వర్క్స్ పక్కన యనమదల కుసుమకుమారి (72) నివసిస్తోంది. ఆమె పెద్ద కుమార్తె రాజేశ్వరి కుమారుడు మేడిశెట్టి రమేష్ (34)కు కాకినాడ సమీపంలోని పండూరు గ్రామానికి చెందిన దుర్గాదేవితో పదేళ్ల క్రితం వివాహమైంది. పెయింటింగ్ పనులు చేసుకునే రమేష్ ఒక పాప పుట్టే వరకు బాగానే ఉండేవాడు. తరువాత మద్యానికి అలవాటుపడిన అతను తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో భార్య దుర్గాదేవి వేరే వెళ్లిపోయింది. కొన్నాళ్ల తరువాత పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చి కలిపారు. తరువాత ఒక బాబు పుట్టాడు. మళ్లీ గొడవలు వచ్చి రెండేళ్ల క్రితం విడిపోయారు. అయినా రమేష్ భార్య దగ్గరకు వెళితే ఆమె రావద్దని తిరస్కరించేది. రమేష్‌కు స్థిరత్వం లేకపోవడంతో తల్లి కూడా ఇంటికి రానిచ్చేదికాదు. అమ్మమ్మ వద్దే ఉంటూ.. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విద్యాధరపురం హెడ్ వాటర్‌వర్క్స్ పక్కన ఉంటున్న అమ్మమ్మ కుసుమకుమారి వద్దకు వచ్చి ఇక్కడే పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ అమ్మమ్మకూ, తనకూ బయటి నుంచే భోజనం తీసుకువచ్చేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రమేష్ భోజనం తీసుకురాలేదు. అమ్మమ్మ అడుగగా ఏం మాట్లాడకుండా రోజూ మాదిరిగానే పక్క ఇంటి డాబాపైన పడుకునేందుకు వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో ఉండే గోవింద్ అనే యువకుడు సినిమాకు వెళ్లి 12.30 గంటల సమయంలో వచ్చాడు. మూత్రవిసర్జనకు ఇంటి పక్కకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేళాడుతున్న రమేష్‌ను చూసి అందరికీ చెప్పాడు. భవానీపురం ఎస్సై అబ్దుల్ సలాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి రాజేశ్వరి నగరానికి చేరుకోగా, భార్య దుర్గాదేవి రావడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నున్నలో వ్యక్తి ఆత్మహత్య
నున్న (విజయవాడ రూరల్) : నున్న గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం తాను ఉంటున్న గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన మాంజీ ఉపేంద్ర (35) నున్న గ్రామంలోని చెప్పుల కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్య మధుమాలతి, రెండేళ్ల కుమార్తె, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. ఉపేంద్ర గ్రామానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డి ఇంటిలో మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంటిలోనే మరో పోర్షన్లో కోల్‌కతాకు చెందిన రంజిత్రాణా కూడా ఉంటున్నారు. ఉపేంద్ర రోజూ మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. మంగళవారం ఉదయం చెప్పల కంపెనీకి పనికని వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాలేదు. రాత్రికి కంపెనీలో ఓటీ చేస్తున్నాడేమోనని భావించిన భార్య పిల్లలతో కలిసి భోజనం చేసి పడుకుంది. ఉదయం సుమారు 6.30 గంటలకు లేచి చూడగా ఉపేంద్ర చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె పక్కనే ఉంటున్న రంజిత్రాణాకు విషయం చెప్పగా ఆయన ఇంటి యజమానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఉరి వేసుకున్న గదిలోపల గడియ పెట్టి ఉండడంతో గ్రామ పెద్దలతో కలిసి పోలీసులు తలుపులు పగులగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నున్న రూరల్ పోలీసు స్టేషన్ సీఐ సహేరాబేగం ఆధ్వర్యంలో ట్రెయినింగ్ ఎస్ఐ శ్రీనివాస్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.