అమ్మ లేని లోకంలో ఉండలేనంటూ..
అమ్మ లేని లోకంలో ఉండలేనంటూ..
Published Tue, Aug 2 2016 11:31 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
విజయవాడ (చిట్టినగర్ ):
అమ్మా.. అమ్మా నే.. పసివాడనమ్మా....
నువ్వే లేక వసి వాడనమ్మా......
మాటే లేకుండా నువ్వే మాయం...
కన్నీరవుతుంది ఎదలో గాయం....
అంటూ తల్లి మరణాన్ని తట్టుకోలేని బిడ్డ పరిస్థితిని వర్ణిస్తూ ఓ సినిమాలో పాట ఇదీ... నిజ జీవితంలో అన్ని తానే అయ్యి పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందితే... తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ యువకుడు తన ప్రాణాలను బలి తీసుకున్నాడు... హృదయాన్ని కలిచి వేసే ఈ ఘటన నగరంలో కొత్తపేట శ్రీనివాసమహాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
గూడెల శారద, వెంకటేశ్వరరావు భార్యభర్తలు.... వీరికి దుర్గారావు సంతానం.. వెంకటేశ్వరరావుకు శారద రెండో భార్య.. శ్రీనివాసమహాల్ వెనుక పోతిన శ్రీనివాసరావు వీధిలో నివాసం ఉండే శారదకు బిడ్డంటే పంచప్రాణాలు..కూలీనాలి చేసుకుంటూ బిడ్డను పెంచుకుంటూ ఉండేది. బీఎస్సీ వరకు చదివిన దుర్గారావు ఓ ప్రయివేటు కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాడు. తన సంపాదనతో తల్లిని బాగా చూసుకుంటున్న తరుణంలో విధి ఆటాడింది. ఆస్థా్మతో బాధపడుతున్న తల్లి శారదకు దుర్గారావు వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. గత నెల రోజులుగా తల్లి పరిస్థితి విషమించడంతో లీవు పెట్టి తల్లికి సపర్యలు చేయసాగాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి శారద మృతి చెందడంతో దుర్గారావు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. స్నేహితులకు, తండ్రికి ఫోన్‌లో తల్లి మరణవార్త చెప్పి కన్నీటి పర్యంత అయ్యాడు. స్నేహితులు వెంటనే ఇంటికి వచ్చే సరికి ఇంట్లో మంచంపై శారద నిర్జీవంగా పడి ఉండగా దుర్గారావు జాడ లేకుండా పోయింది. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధతో ఎక్కడైనా ఉన్నాడని అనుకున్నారు...తీరా ఉదయం శారద అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్న తరుణంలో దుర్గారావు నిడమానూరు వద్ద రైలు కింద పడి మృతి చెందాడని విషయం తెలుసుకుని స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లి లేకుండా తానే జీవించలేననే దుర్గారావు ఇలా చేసి ఉంటాడని అందరూ భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం శారద అంతిమ యాత్ర పూర్తి చేయగా, దుర్గారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు గుడివాడకు తరలించారు. మంగళవారం రాత్రి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో కృష్ణలంక మార్చరీలో భద్రపరిచారు. బుధవారం దుర్గారావు అంతిమ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది గంటల్లోనే జరిగిన ఈ గుండెల్నిపిండేసే ఘటనతో కొత్తపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లి మరణం, తనయుని ఆత్మహత్య ఘటనతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు.
Advertisement