వ్యక్తి బలవన్మరణం
వ్యక్తి బలవన్మరణం
Published Sat, Jul 23 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
విజయవాడ (భవానీపురం) :
కుటుంబ కలహాలు, భార్య పుట్టింటికి వెళ్లి వేరేగా ఉండడంతో మనస్థాపానికి గరైన మేడిశెట్టి రమేష్ (34) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాధరపురం హెడ్‌వాటర్ వర్క్స్ పక్కన యనమదల కుసుమకుమారి (72) నివసిస్తోంది. ఆమె పెద్ద కుమార్తె రాజేశ్వరి కుమారుడు మేడిశెట్టి రమేష్ (34)కు కాకినాడ సమీపంలోని పండూరు గ్రామానికి చెందిన దుర్గాదేవితో పదేళ్ల క్రితం వివాహమైంది. పెయింటింగ్ పనులు చేసుకునే రమేష్ ఒక పాప పుట్టే వరకు బాగానే ఉండేవాడు. తరువాత మద్యానికి అలవాటుపడిన అతను తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో భార్య దుర్గాదేవి వేరే వెళ్లిపోయింది. కొన్నాళ్ల తరువాత పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చి కలిపారు. తరువాత ఒక బాబు పుట్టాడు. మళ్లీ గొడవలు వచ్చి రెండేళ్ల క్రితం విడిపోయారు. అయినా రమేష్ భార్య దగ్గరకు వెళితే ఆమె రావద్దని తిరస్కరించేది. రమేష్‌కు స్థిరత్వం లేకపోవడంతో తల్లి కూడా ఇంటికి రానిచ్చేదికాదు.
అమ్మమ్మ వద్దే ఉంటూ..
ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విద్యాధరపురం హెడ్ వాటర్‌వర్క్స్ పక్కన ఉంటున్న అమ్మమ్మ కుసుమకుమారి వద్దకు వచ్చి ఇక్కడే పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ అమ్మమ్మకూ, తనకూ బయటి నుంచే భోజనం తీసుకువచ్చేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రమేష్ భోజనం తీసుకురాలేదు. అమ్మమ్మ అడుగగా ఏం మాట్లాడకుండా రోజూ మాదిరిగానే పక్క ఇంటి డాబాపైన పడుకునేందుకు వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో ఉండే గోవింద్ అనే యువకుడు సినిమాకు వెళ్లి 12.30 గంటల సమయంలో వచ్చాడు. మూత్రవిసర్జనకు ఇంటి పక్కకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేళాడుతున్న రమేష్‌ను చూసి అందరికీ చెప్పాడు. భవానీపురం ఎస్సై అబ్దుల్ సలాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి రాజేశ్వరి నగరానికి చేరుకోగా, భార్య దుర్గాదేవి రావడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement