youngman
-
‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. యువకుడు..
సాక్షి, కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు మోయతుమ్మెద వాగు(ఎల్ఎండీ బ్యాక్ వాటర్)లో దూకిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటకు చెందిన సందెబోయిన అభిలాష్ అలియాస్ టింకు బుధవారం రాత్రి రేణికుంట శివారులోని రాజీవ్ రహదారి బ్రిడ్జి పైనుంచి ఎల్ఎండీ బ్యాక్ వాటర్‌లో దూకాడు. అంతకుముందు తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు అభిలాష్ ఆచూకీ దొరకలేదని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం! -
చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ యుగేంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లికి చెందిన వారణాసి తరుణ్(24) తన స్నేహితుడు డీకొండ నితిన్‌తో కలిసి ఆదివారం బీబీనగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. స్నేహితుడిని కలిసిన తర్వాత తరుణ్, నితిన్ కలిసి బీబీనగర్ మండలంలోని వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. తరుణ్, నితిన్ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. తరుణ్ చెరువులోరాళ్ల మధ్యన ఇరుక్కపోయాడు. నితిన్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తరుణ్ కోసం గాలింపు చర్యలు ఆచూకీ లభించలేదు. సోమవారం చెరువులో తరుణ్ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరుణ్ ముఖంపై గాయాలు ఉండడంతో నితిన్‌పై అనుమానం ఉన్నట్లు మృతుడి తండ్రి గోవిందాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తన ప్రేమను తిరస్కరించిందని...కర్కశంగా కత్తితో పొడిచి ఆ తర్వాత...
ఇటీవల యువతీ యువకులు ప్రేమ కోసం చనిపోవడం లేదా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని చంపేయడం వంటి దారుణాలకు ఒడిగడ్డుతున్నారు. చదువకుకునే వయసులో కలిగే ప్రేమలకు, ఆకర్షణలకు లొంగిపోయి బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందినవాడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు. చక్కగా తన మానాన తాను చదుకుంటున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఆ యువకుడి వెంటపడి వేధించాడు. చివరికి జైల్లో పెట్టించినా మారకపోగా ఆ బాలికను చంపేందుకు యత్నించాడు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ కేశవన్ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులు కేశవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేశవన్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్ పోలీసులు నిర్థారించారు. (చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..) -
యువకుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్
హుకుంపేట: యువకుడిపై సర్పంచ్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దాడికి పాల్పడడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాకూరు పంచాయతీ కేంద్రంలో బుధవారం సాయంత్రం శ్రీ పోతురాజుస్వామి జాతర మహోత్సవంలో భాగంగా డాన్స్బేబీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలోని స్టేజ్‌పై అదే గ్రామానికి చెందిన కాకర రవి ఎక్కి కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ సీనియర్ నాయకుడు, స్థానిక సర్పంచ్ వెంకటరమణరాజు, రవిని కొట్టడమే కాకుండా ముఖంపై కాలితో తన్నడంతో అతను గాయపడ్డాడు. దీనిపై సామాజిక మధ్యమాల్లో యువకుడిపై దాడి ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. (చదవండి: వేడెక్కుతున్న మన్యం) -
ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీగా కందుకూరు యువకుడు
కందుకూరు: చిన్న వయసులోనే పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా యువకుడు విదేశీ చట్టసభలకు ప్రతినిధిగా ఎంపికయ్యాడు. తన సమాజ సేవతో మెప్పించి ఆస్ట్రేలియాలో యువత కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. నెల్లూరు జిల్లా తూర్పుకమ్మపాలేనికి చెందిన దివి రామకృష్ణ, ప్రత్యూషలు దంపతులు. రామకృష్ణ 12 ఏళ్ల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ పిల్లలను అక్కడే చదివించుకున్నారు. రామకృష్ణ పెద్ద కుమారుడైన తనూజ్‌చౌదరి (15) అక్కడి కాలేజీలో ప్రస్తుతం ప్లస్ వన్ (ఇంటర్) చదువుతున్నాడు. సమాజ సేవా కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నాడు. అక్కడి చట్టాల ప్రకారం ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువత చట్టసభల్లో ఎంపికయ్యేందుకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, ఈ క్రమంలో అన్ని అర్హతలను పరిశీలించిన తరువాత యువత కోటాలో తన కుమారుడిని ఎమ్మెల్సీగా అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసిందని రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం తన కుమారుడు అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నాడని తెలిపారు. -
మలేషియాలో సూర్యాపేట యువకుడు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశి వర్ధన్ రెడ్డి(20) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను సోమవారం మృత్యువాత పడ్డాడు. ఉదయం షిప్‌పై నుంచి సముద్రంలో పడిపోవడంతో అతను మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారం క్రితమే తమ బిడ్డ ఫోన్ చేశాడని, ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఉందని అన్నాడు. త్వరలోనే మరో కంపెనీకి మారాలనుకుంటున్నట్లు చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, కుమారుడి మృతిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి) -
అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌కు చెందిన సాయి సుశాంత్(30) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీలో స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుశాంత్ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నేడు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్‌నాయక్ గతంలో బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. -
చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం
సాక్షి, బెంగళూరు: కామోన్మాదులకు జెండర్‌తో కూడా పనిలేదనేంతలా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో 20 ఏళ్ల యువకుడిపై మరొక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇదే విషయంపై దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబాక అనే గ్రామానికి చెందిన యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చాక భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద ఉండటం గమనించిన అతని తండ్రి కంగారుపడి ఏం జరిగిందని అడగ్గా యువకుడు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు. కబాక గ్రామానికే చెందిన మొహ్మద్ హనీఫ్‌తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్‌కు వెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ అతడిని పలకరించాడు. తెలిసినవాడే అని యువకుడు కూడా మాట కలిపాడు. చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికాడు హనీఫ్. ఇక అదే నెపంతో యువకుణ్ని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి జరిగిన ఘటనపై బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హనీఫ్పై అత్యాచార కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడు హనీఫ్పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు. -
పిట్ట కొంచెం.. ప్రయోగాలు ఘనం.. అమెరికాలో ప్రతిభ
సాక్షి, అమరావతి: కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏ వ్యక్తినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇదే స్ఫూర్తితో ఆంధ్రా యువకుడు పిన్న వయస్సులోనే అమెరికాలో తన ప్రతిభను చాటుతున్నాడు. గుంటూరు జిల్లా అమరావతికి చెంది అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు తల్లం శ్రీనివాస కిరణ్, వెంకట పల్లవి కుమారుడు సాహిల్ (17) మూడు సాఫ్ట్వేర్ ఆవిష్కరణలకు రూపకల్పన చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో అతని ఆలోచనలు భారత్, అమెరికా దేశాలకు ఉపయుక్తమైన ఆవిష్కరణలకు అంకురార్పణ చేశాయి. ఆ కొత్త ఆవిష్కరణలు ఇవే.. అడవుల పెంపకానికి ఇ–ప్లాంటేషన్ డ్రోన్ కాలిఫోర్నియాలోని అడవులను కార్చిచ్చు తరచూ నాశనం చేస్తుండడంతో తల్లడిల్లిన సాహిల్ ఆ భూముల్లో తిరిగి మొక్కలు పెంచేందుకు (రీ ఫారెస్టేషన్) సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానిస్తూ డ్రోన్లను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా అడవుల పునర్నిర్మాణ లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాడు. బహుళ రకాలుగా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. అడవులు, మైదాన ప్రాంతాల్లో మనుషులు, యంత్రాల సాయంతో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను ఇవి గుర్తిస్తాయి. మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో ఈ డ్రోన్లే మొక్కలు నాటి నీళ్లుపోసి సంరక్షిస్తాయి. స్మార్ట్ సాగులో ‘ఇ–ప్లాంటేషన్’ విధానం ఇది. ఇందుకోసం ప్రతీ డ్రోన్ ఒకదానికొకటి అనుసంధానించుకుని పనిచేస్తాయి. తుపాకులను గుర్తించే సాఫ్ట్వేర్ తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లిన ప్రాంతాల్లోని పాఠశాలల్లో నిఘా, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా సాహిల్ ఓ సాఫ్ట్వేర్ రూపొందించాడు. తుపాకీ, ఇతర మారణాయుధాలతో ప్రాంగణంలోకి వచ్చినా గుర్తించగలిగే సాఫ్ట్వేర్ ఆధారిత మైక్రో–కెమెరా వ్యవస్థను తాను చదివిన కాలిఫోర్నియాలోని శాన్ రామన్ డౌగెర్టీ వ్యాలీ హైస్కూల్లో ఏర్పాటుచేసి అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నాడు. నిర్దేశిత ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచి పసిగట్టే సైన్స్ ఫిక్షన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇది. అంధులకు స్మార్ట్ గ్లాస్ అంధులలో దృష్టిలోప నివారణకు సాహిల్ స్మార్ట్ కళ్లజోళ్లు రూపొందించాడు. ఈ కళ్లద్దాల్లో కెమెరా, మైక్, సెన్సార్, స్పీకర్లు ఉంటాయి. వీటికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను అనుసంధానించాడు. ఇవి ఎదురుగా కన్పించే దృశ్యాలను చిత్రీకరించి ప్రత్యేక సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. స్పీకర్ల ద్వారా వీటిని ధరించిన అంధులకు తెలియజేస్తుంది. సాహిల్ ప్రత్యేకతలు మరికొన్ని.. ► లాక్డ్ రెడీ సెక్యూర్ (ఎల్ఆర్ఎస్) కంపెనీ సీఈఓగా అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీని తెలుసుకోగల నిఘా కెమెరాలను రూపొందించాడు. ► సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం మీడియా అప్లికేషన్లకు రూపకల్పన చేశాడు. ► అమెరికాలో వెబ్ డెవలపర్‌గా యూనిఫైడ్ స్పోర్ట్స్ ఇంటర్న్‌షిప్ పూర్తిచేశాడు. ► భారత్‌లో కృత్రిమ మేథా ప్రాజెక్టు రూపకల్పనలో మెంపేజ్ టెక్నాలజీస్‌కు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాడు. ► తన డ్రోన్ ప్రాజెక్ట్‌తో ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్ పోటీల్లో సెమీఫైనల్స్‌కు చేరాడు. ► లింగ్ హక్స్ మేజర్ లీగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టి మూడో స్థానంలో నిలిచాడు. ► బెమాక్స్ కంపెనీతో చేపట్టిన సోలార్ హాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌కు ఉత్తమ అవార్డు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ► 2018లో లూయిస్విల్లేలో జరిగిన వెక్స్ గ్లోబల్ కాంపిటీషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌లో 3వ స్థానం సాధించాడు. -
పొచ్చర జలపాతం వద్ద యువకుడి గల్లంతు
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం వద్ద జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్, నరేశ్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠికి చెందిన రమేశ్, భీంసరి గ్రామానికి చెందిన ఆడెపు వెంకట్ ఆదివారం మధ్యా హ్నం పొచ్చర జలపాతానికి వచ్చారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో జలపాతానికి వరద నీరు పోటెత్తింది. వీరు తిరిగి వెళ్తున్న దారిలోఉన్న వంతె నపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన దాటే ప్రయత్నంలో రమేశ్ జారి పడడంతో హరీశ్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వర ద ఉ«ధృతికి హరీశ్ కొట్టుకుపోయాడు. రమేశ్ వంతెనను పట్టుకుని బయటపడ్డాడు. హరీశ్(25)కు 6 నెలల క్రితమే వివాహం అయింది. ఆయన తండ్రి విఠల్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. గాలింపు కొనసాగిస్తున్నామని ఎస్సై తెలిపారు. -
వివాహేతర సంబంధం: యువకుడు దారుణ హత్య
సాక్షి,మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెంలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జాడి ప్రవీణ్(32) స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఊళ్లోకి వెళ్లిన అతడు 10 దాటిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. ఎంతకూ రాకపోగా తెల్లవారేసరికి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ బోనాల కిషన్‌తోపాటు ఇతర అధికారులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పదునైన ఆయుదంతో తల వెనక, ముందు భాగంలో పొచిడి హత్య చేసిన ఆనవాళ్లను గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.కాగా, సదరు యువకుడికి గ్రామానికి చెందిన ఓ వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వివాహిత సంబంధికులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తమ్ముడు సుదర్శన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. అదుపులో నిందితులు? ప్రవీణ్‌ను హత్య చేశారని అనుమానిస్తున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో ఈ హత్య చేశారని భావిస్తున్న పోలీసులు.. మరికొంత మంది యువకులను అవసరమైతే పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించినట్లు తెలిసింది. -
‘బాహుబలి’లో బల్లాల దేవుడిలా బిల్డప్ ఇచ్చాడు.. కానీ చివరకి
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి.కానీ కొంత మంది సోషల్ మీడియా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. -
డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డబుల్బెడ్రూం ఇంటిని తనకు కేటాయించలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చిలువేరి గౌతమ్(32) హైదరాబాద్‌లో ప్రైవేట్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా అర్హుల జాబితాలో గౌతమ్ పేరు వచ్చింది. అయితే చివరి కేటాయింపు లిస్టులో తన పేరును అధికారులు తొలగించడంతో గౌతమ్ పదిరోజుల క్రితం ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగాడు. తండ్రి పేరిట సొంతిల్లు ఉన్నందున డబుల్ బెడ్రూం ఇల్లు రాదని అధికారులు తేల్చి చెప్పడంతో గురువారం వేకువజామున భార్య, పిల్లలు నిద్రలో ఉండగా దూలానికి ఉరేసుకున్నాడు. అతడికి భార్య ప్రవళిక, కుమారుడు గణేశ్(4), కూతురు లాస్య(2) ఉన్నారు. కాగా, గౌతమ్ తండ్రి గంగప్రసాద్‌కు సొంతిల్లు, ఆ పక్కనే రెండు గుంటల ఖాళీస్థలం ఉండటంతో అతడి దరఖాస్తును తిరస్కరించినట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. -
విషాదం: కరోనా వ్యాక్సిన్‌కు భయపడి యువకుడు..
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వేస్తున్న టీకాపై ఇంకా ప్రజల్లో భయాలు తొలగడం లేదు. తాజాగా ఓ యువకుడు వ్యాక్సిన్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో కుటుంబీకులతో కలిసి శివప్రకాశ్ (21) నివసిస్తున్నాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కొద్దిరోజులుగా శివప్రకాశ్కు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి శివప్రకాశ్ జంకుతున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబీకులు కొద్దిగా ఒత్తిడి చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టంలేని శివ ప్రకాశ్ జూన్ 12వ తేదీన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. -
వైరల్ వీడియో: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు!
-
మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో
సాధారణంగా మెట్రో సౌకర్యం ఉన్న నగరాలలోని ప్రజలు.. తమ ప్రయాణానికి మెట్రోకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి మెట్రో రైలులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిల్చోవటానికి ఖాళీ స్థలం కూడా దొరకని సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం? మహా అయితే అక్కడ ఉండే రోప్‌ను పట్టుకుని పడిపోకుండా నిల్చుంటాం. కానీ ఇక్కడో యువకుడు మాత్రం తనకు మెట్రో రైలులో సీటు దొరకలేదని వింతగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు మెట్రో రైలు ఎక్కాడు. ట్రైన్ అంతా చాలా రద్దీగా ఉంది. నిల్చోవటానికి తప్ప కూర్చోవటానికి ఎక్కడా చోటు లేదు. చాలా సేపు నిలబడినందుకు కాళ్లు నొప్పిపెట్టాయో లేదా ఇంకేం అయిందో తెలీదుగానీ వెంటనే నిల్చున్న చోట మూర్ఛ వచ్చినట్టు వణకిపోయాడు. దీంతో అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు ఆందోళనపడ్డారు. వెంటనే ఒక మహిళ లేచి అతడు కూర్చోవడానికి తన సీటు ఇచ్చింది. మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఈ క్రమంలో, అతగాడు.. సీటుపై కూర్చున్న మరోసారి షాక్ కొట్టినట్లు వణికాడు. కానీ, ఈసారి తోటి ప్రయాణికులు సదరు యువకుడి ప్రవర్తన పట్ల కాస్త అనుమానంగా చూశారు. బహుషా.. ఇది ప్రాంక్ ఏమో.. అనుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్న చూసిన నెటిజన్లు.. ‘ఏం.. తెలివి భయ్యా.. నీది’, ‘తోటి వారిని ఫుల్స్ చేశావ్ గా..’, ‘ అయినా.. ఇలా చేయడం సరైన పనికాదు, ‘ మొత్తానికి సీటు సంపాదించావ్ ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: స్తంభంపైకి ఎక్కిన ఎలుగుబంటి.. విద్యుత్ అంతరాయం.. -
ఉసురు తీసిన ప్రేమ
పలమనేరు(చిత్తూరు జిల్లా): ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఆమె తండ్రి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి వేళ తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న యువకుడిని చూసిన తండ్రి ఆగ్రహంతో అతన్ని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరించారు. పలమనేరు మండలం పెంగరగుంట కు చెందిన ఈశ్వరగౌడ్ కుమారుడు ధనశేఖర్ (23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై అతని తండ్రి ఈనెల 26న స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని ఫోన్ కాల్స్ ఆధారంగా ఆఖరి కాల్‌ను ట్రేస్ చేసి పెం గరగుంటకు చెందిన బాబును విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. బాబు కుమార్తె (16), ధనశేఖర్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బాలిక 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేయడంతో అతను బాలిక ఇంటికి వెళ్లాడు. పొలంవద్దకు వెళ్లిన బాబు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి వసారాలో పడుకున్నాడు. ఇంట్లోని ఓ గది నుంచి మాట లు వినిపించడంతో వెళ్లి చూడగా తన కుమార్తెతో పాటు ధనశేఖర్ కనిపించాడు. ఆగ్రహించిన బాబు ధనశేఖర్‌ను కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం గోతాంలో మూటకట్టి చిన్నకుంట సమీపంలోని ఓ బావిలో పడేసి ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల తరువాత బావివద్దకు వెళ్లి చూడగా శవం తేలి కనిపించింది. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కొందరి సాయంతో మృతదేహాన్ని మల్బరీ ఆకులు కత్తిరించే కట్టర్ సాయంతో ముక్కలు ముక్కలుగా చేసి సమీపంలోని అటవీప్రాంతంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. -
స్నేహితులతో గొడవ.. యువకుడు ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ గ్రామానికి చెందిన వనమాల కృష్ణ కుమారుడు సాయిచరణ్(24) ఇంట్లో తల్లిదండ్రులు ఎవ్వరూ లేకపోవడంతో స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం సేవించారు. స్నేహితులతో ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. స్నేహితులు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు వచ్చేసరికి ఇంట్లో సాయి చరణ్ ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఇరుగుపొరుగు వారిని ఏం జరిగిందో తెలుసుకోగా కొంతమంది స్నేహితులు రాత్రి ఇంట్లో మద్యం సేవించి గలాటా వినిపించింది. అని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. జిన్నారం సీఐ లాలూ నాయక్ సైతం ఈ కేసులో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: చిన్నారిపై సవతి తండ్రి కర్కశం: దెబ్బలకు తాళలేక.. -
పెళ్లయిన 45 రోజులకే దారుణం..
సాక్షి, నెల్లూరు (సంగం): బ్యాంక్‌కు వెళ్లొస్తానని భార్యతో చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన యువకుడు కర్ణాటకలోని బీజాపూర్ రైల్వేట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా సంగం మండలం దువ్వూరుకు చెందిన డాకా సాయినాథ్‌రెడ్డి (30)గా గుర్తించారు. అక్కడి పోలీసులు ఈ విషయమై కుటుంబసభ్యులకు శనివారం సమాచారమివ్వడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్.. మనోవేదనతో శిరీష) వివరాలు.. సంగం మండలం దువ్వూరుకు చెందిన ద్వారకానాథ్‌రెడ్డి, కల్యాణి దంపతుల కుమారుడు సాయినాథ్‌రెడ్డి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి, హైదరాబాద్‌లో షేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్ 25న వరంగల్‌కు చెందిన జ్యోత్స్నతో వివాహమైంది. వీరు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. అక్కడే చందానగర్‌లో ఉంటున్న మేనత్త గిరిజమ్మ ఇంటికి గురువారం వెళ్లి, జ్యోత్స్నతో మీరు కారులో దువ్వూరుకు వెళ్లండి.. కంపెనీలో ఉద్యోగులకు జీతాలిచ్చి 11వ తేదీన తానూ వస్తానని చెప్పారు. అనంతరం ఇంటి నుంచి వెళ్లిన ఆయన బీజాపూర్ వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాయినాథ్‌రెడ్డి జేబులోని సెల్ఫోన్లో లభ్యమైన నంబర్ ఆధారంగా రైల్వే పోలీసులు అతడి స్నేహితుడు అశోక్‌కు సమాచారం అందించి ఫొటోలను సైతం పంపారు. ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే ఇది ముమ్మాటికీ హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ కూడా అక్కడే నిలిపి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. దీంతో బీజాపూర్ రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: (పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!) -
సత్తెనపల్లిలో యువకుడి మృతి
సాక్షి, సత్తెనపల్లి, గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. వివరాలు.. పట్టణంలోని టింబర్ డిపో నిర్వాహకుడు షేక్ మహ్మద్ గౌస్(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్ పోస్టు వద్ద ఎస్ఐ రమేశ్ ఆపి మందలించారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్ పడిపోవడంతో తండ్రి షేక్ మహ్మద్ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందాడు. పోలీసుల దాడితోనే గౌస్ మరణించాడని ఆస్పత్రి ముందు, మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. సీఐ పైనా దాడి చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోక్యం చేసుకుని గౌస్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రూరల్ ఎస్పీని కోరడంతో ఆందోళన సద్దుమణిగింది. తర్వాత ఏఎస్పీ మాట్లాడుతూ ఆర్డీఓతో విచారణ చేయిస్తామని, పోలీసుల తప్పుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు కొడతారనే భయంతోనే గౌస్ చనిపోయాడని అతని తండ్రి చెప్పారు. గౌస్‌కు పదేళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేసి స్టంట్ కూడా వేశారు. ఎస్ఐను సస్పెండ్ చేశాం: ఐజీ ప్రభాకరరావు ఈ ఘటనపై ఎస్ఐను సస్పెండ్ చేశామని గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకర్‌రావు తెలిపారు. రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావుతో కలిసి మాట్లాడుతూ గౌస్‌కు గుండె సంబంధిత సమస్య ఉందని, చికిత్స కూడా తీసుకుంటున్నాడని తెలిపారు. డీజీపీ ఆదేశాలతో అసహజ మరణం కింద కేసు నమోదు చేసి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు దాడి లాఠీచార్జి చేసినట్లు రుజువైతే కారణమైన ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
టిక్‌టాక్ సరదా ప్రాణం తీసింది..
టిక్‌టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. చంపాపేట డివిజన్ కటకోని కుంట కాలనీకి చెందిన రాజు, గీత దంపతుల కుమారుడు పవన్ (20). పవన్‌కు టిక్‌టాక్ వీడియోలు చేయడం అంటే ఇష్టం. స్నేహితులతో కలసి యాక్షన్ సినిమాలలో మాదిరిగా తరచూ టిక్‌టాక్‌లు చేస్తుండేవాడు. భద్రాచలం అనే సినిమాలో నదిలో కొట్టుకుపోతున్న పొట్టేలును హీరో శ్రీహరి కాపాడిన సన్నివేశం మాదిరి టిక్‌టాక్‌లో చిత్రీకరించాలని అనుకున్నాడు. వీడియోను చిత్రీకరించేందుకు స్నేహితులతో కలసి ఆదివారం అల్మాస్‌గూడలోని రాజీవ్ గృహకల్ప సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఈత రాని పవన్ పొట్టేలును ఎత్తుకుని చెరువులోకి దిగాడు. ఒక్కసారిగా గుంతలోకి జారడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. పవన్ స్నేహితుడు ఏసు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు.. పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. పవన్ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. – చంపాపేట -
పది రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య
పలమనేరు: మరో పదిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సరుకులు తీసుకొస్తానని బుధవారం వెళ్లిన ఆ యువకుడు యోగేశ్ ఆదివారం అటవీ ప్రాంతంలో శవమై కనిపించడం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరులో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేమన్నకు అశోక్, యోగేశ్ కుమారులు. పదేళ్ల కిందట అశోక్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేని అతడి తల్లి రాజమ్మ కూడా అదేరోజు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంది. తరువాత వేమన్న రెండో వివాహం చేసుకున్నారు. అన్న, తల్లి మృతితో మానసికంగా ఇబ్బందిపడిన యోగేశ్.. తరువాత బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల అతడికి వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇంటికి వచ్చి పెళ్లిపనుల్లో నిమగ్నమైన యోగేశ్‌కు, అతడి సవతితల్లికి ఇంటి పెయింటింగ్ విషయమై గత బుధవారం వివాదం జరిగింది. దీంతో తీవ్రంగా కలత చెందిన అతడు అదేరోజు తన తండ్రితో బెంగళూరులో పని ఉందని చెప్పి కొత్తగా కొన్న బుల్లెట్ మీద వెళ్లాడు. గ్రామానికి సమీపంలోని కొత్త చెరువు వద్ద నల్లక్కబాయి అటవీ ప్రాంతంలో బుల్లెట్‌ను, విషపుగుళికలను ఆదివారం గుర్తించిన పెంగరగుంట వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు పరిశీలించి సమీపంలో యోగేశ్ మృతదేహాన్ని గుర్తించారు. అతడు నాలుగు రోజుల కిందటే ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడు బలి
ఇబ్రహీంపట్నం రూరల్: క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో ఓడిపోయి డబ్బులు చెల్లించలేనిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తుర్కయంజాల్ గ్రామానికి చెందిన పలుస దాసుగౌడ్ కుమారుడు అఖిల్‌గౌడ్(21) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతను వారంరోజులుగా కళాశాలకు వెళ్లి వచ్చి ఏకాంతంగా ఉంటున్నాడు. రెండురోజుల నుంచి అఖిల్‌గౌడ్ వద్ద ఉన్న ఫోన్ పోయింది. పోన్ ఎక్కడ పోయింది.. ఎవరికి ఇచ్చావని తండ్రి మందలించడంతో ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పాడు. మంగళవారం ఉదయం తండ్రి మరోమారు మందలించి ఫోన్ తీసుకురావాలని చెప్పాడు. దీంతో అఖిల్‌గౌడ్ ఇంట్లో మొదటి అంతస్తులో గల షట్టర్‌లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుమారుడి మృతికి గల కారణాలపై తండ్రి ఆరా తీయగా ఇటీవల అఖిల్‌గౌడ్ ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బు చెల్లించకపోవడంతో ఫోన్ లాక్కున్నారని అతని స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో మనస్తాపానికిగురై అత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన కుమారుడి మృతి పట్ల పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని దాసుగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
ప్రకాశం, మేదరమెట్ల: కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్లో శ్రీకాకుళానికి చెందిన యువకుడు ఉరేసుకొని బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం సింగన్నపాలెం గ్రామానికి చెందిన జీవన్‌కుమార్ (25) అనే యువకుడు కొంతకాలం నుంచి గ్రోత్ సెంటర్లో గ్రానైట్ పాలిష్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సెలవు పెట్టి స్వగ్రామానికి వెళ్లి వచ్చాడు. నాలుగు రోజుల నుంచి అనారోగ్యంగా ఉండటంతో పనికి కూడా వెళ్లడం లేదు. తోటి స్నేహితులతో కలిసి ఊరికి వెళ్తున్నానని చెప్పిన జీవన్‌కుమార్ గది లోపల గడియ పెట్టుకొని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పనికి వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చిన సహచరులు లోపల గడియ పెట్టి ఉండటాన్ని గమనించి కిటికీ నుంచి లోపలకు చూడగా జీవన్‌కుమార్ ఉరేసుకొని కనిపించడంతో మేదరమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేదరమెట్ల ఎస్ఐ వై.పాండురంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీవన్‌కుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
రాజీ పేరుతో రప్పించి.. యువకుడి దారుణ హత్య
నాంపల్లి: పాత కక్షల కారణంగా ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రాజీ పేరిట చర్చలకు ఆహ్వానించి అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని 21 సెంచరీ బిల్డింగ్ సెల్లార్లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సయీదుద్దీన్ (23) ఫ్లెక్సీ బోర్డుల ఫిట్టింగ్ పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అబ్బూ అతడికి స్నేహితులు. అందరూ కలిసి జల్సా చేసేవారు. అయితే కొన్నాళ్ల క్రితం వీరి మధ్య విబేధాలు రావడంతో సయీదుద్దీన్, ఇమ్రాన్ రెండు గ్రూపులుగా విడిపోయారు. దీంతో సయీదుద్దీన్ను అంతం చేయాలనుకున్న ఇమ్రాన్ అందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా అబ్బూ ద్వారా సయీదుద్దీన్ను రాజీకి పిలిపించాడు. ఇందుకు 21 సెంచరీ బిల్డింగ్‌లోని సెల్లార్‌ను వేదికగా నిర్ణయించారు. సయీదుద్దీన్ అక్కడికి చేరుకునే సరికి ఇమ్రాన్, అబ్బూలతో పాటు మరో ఇద్దరు అనుచరులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సయీద్‌పై ఇమ్రాన్, అబ్బూ అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెండదంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్వా్కడ్‌లతో ఆధారాలు సేకరించారు. మధ్య మండలం డీసీపీ విశ్వ ప్రసాద్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కనకయ్యలతో సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. కాగా ప్రధాన నిందితులు ఇమ్రాన్, అబ్బూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సయీదుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య తలవంపులు తెస్తోందని..
సాక్షి, మదనపల్లె క్రైం : భార్య చెడు తిరుగుళ్లతో తలవంపులు తెస్తోందని ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన పీట్ల శ్రీనివాసులు(32) మార్బల్ పనులు చేస్తూ భార్యా ఇద్దరు కుమార్తెలను పోషించు కుంటున్నాడు. అయితే ఇంటిపట్టునే ఉంటున్న భార్య జ్యోతి గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో చనువుగా ఉంటూ భర్తను పట్టింకుకోక పోవడంతో మందలించాడు. దీంతో ఆమె అలిగి భర్తను వదిలి ఎనిమిది నెలల క్రితం అదే ఊరులో ఉన్న పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తితో మరింతగా చనువుగా ఉంటోంది. జ్యోతి తీరుకు గ్రామంలో భర్త తలెత్తుకు తిరగలేక అవమానానికి గురయ్యాడు. అంతే కాకుండా ప్రియుడి మాటలు విని ఆమె స్థానిక రూరల్ పోలీసులకు అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాసులును స్టేషన్‌కు పిలిపించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. జీవితంపై విరక్తి చెందిన అతను సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు శ్రీనివాసులును ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. -
యువకుడిపై కత్తులతో దాడి
కొమ్మాది(భీమిలి) : భీమిలి రూరల్ మండలం చేపలుప్పాడ పంచాయతీ చిన ఉప్పాడలో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిపై గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... ఇదే ప్రాంతానికి చెందిన చెన్నా హరి ప్రసాద్ (25) ఇంట్లో గురువారం ఇంటి అమ్మవారి పండుగ చేశారు. రాత్రి వరకు బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎవరూ లేని సమయంలో చిన ఉప్పాడ రచ్చబండ సమీపంలో హరిప్రసాద్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అక్కడ పడి ఉన్న హరిప్రసాద్‌ను స్థానికులు గుర్తించి హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. శుక్రవారం ఏసీపీ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తనపై తమ ప్రాంతానికి చెందిన చార్లెస్, రాంబాబు, నరేష్ అనే ముగ్గురు దాడి చేసినట్టు హరిప్రసాద్ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సంఘటనపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరిప్రసాద్ చెప్పినట్టు వారు ఎందుకు దాడిచేశారు, కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై.. యువకుడి ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: ప్రేమ విఫలం అయిందని ఒకరు.. పెద్దలు మందలించారని మరొకరు.. ఉద్యోగం లేదని ఇంకొకరు.. పరీక్షలో ఫెయిల్ అయ్యామని మరికొందరు.. ఇలా ఏదో ఒక కారణంతో నిత్యం సమాజంలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకు నిండా నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా చిదిమేస్తున్నారు. జీవితంపై భరోసా లేకపోవడంతో నిరాశలో కూరుకుపోయి.. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. తమ తల్లిదండ్రులు, అయినవారు, ఆప్తులు పెట్టుకున్న ఆశల్ని చిదిమేసి.. అకస్మాత్తుగా తనువు చాలిస్తున్నారు. సమాజంలో పెరిగిపోతున్న ఆత్మహత్యలపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణం ఎన్టీఆర్ నగర్లో ఓ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలమర్తి చిన్న(24) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ప్రేమ విఫలం కావటం వల్లనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫేస్బుక్లో బెదిరింపులు.. యువకుడు అరెస్టు
సాక్షి, క్రిష్ణగిరి: తనను పెళ్లిచేసుకోవాలని ఓ యువతిని యువకుడు ఫేస్బుక్లో బెదిరించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ యువకుడిని బారూర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి.. జిల్లాలోని పుళియూర్ గ్రామానికి చెందిన భగవత్ సింగ్(22) మరోగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె సమీపంలోనిఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తుంది. ఆ యువకుడు ఉదయం, సాయంత్రం ఆమె వెంటపడి వేధించేవాడు. అయితే ఆ యువతి అతనితో పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఫొటోను ఫేస్బుక్లో పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఈ సంఘటనపై ఆమె తల్లిదండ్రులు బారూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భగవత్‌సింగ్ అరెస్టు చేశారు. -
యువకుడి ఆత్మహత్య
పాణ్యం : స్థానిక ఎస్సార్బీసీ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కుమారుడు బాల తిరుపతయ్య (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ చిరంజీవి వివరాల మేరకు మృతుడికి పదిహేను రోజులుగా మానసిక స్థితి సరిగా లేదు. పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. గాలి సోకిందేమోనన్న ఉద్దేశ్యంతో అంత్రాలు కూడా వేయించారు. అయినా నయం కాలేదు. రాత్రుళ్లు నిద్రపోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుండేవాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. తెల్లారిన తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యువకుడిని మింగిన బావి
- పోలకల్‌లో విషాదం పోలకల్(సి.బెళగల్) : మండల పరిధిలోని పోలకల్ గ్రామంలో గురువారం.. బావిలో పడి మధు(19) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బోయ వీధిలో నివాసముంటున్న బోయ గుడసె సోమప్ప, అనంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మధు.. కూలీ పనులకు వెళ్తూ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండేవాడు. గురువారం గ్రామ సమీపంలోని ఉలిగి నాగన్నకు చెందిన పత్తిపొలంలో గుంటిక పాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 సమయంలో దాహం వేయడంతో సమీపంలోని ఉలిగి గిడ్డయ్య బావిలోకి దిగాడు. అయితే కాలుజారి అందులో పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని బావి దగ్గర నీళ్లు తాగేందుకు వచ్చిన పశువుల కాపర్లు గుర్తించారు. సమీపంలోని రైతులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని వెలికి తీశారు. సి.బెళగల్ ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందటంతో తల్లి అనంతమ్మ, కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
వెల్దుర్తి(కృష్ణగిరి): ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మంది తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి మండలం పులగుమ్మి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమారుడు శ్రీనివాసరెడ్డి(29) శుభకార్యాల్లో డెకరేషన్ పనులకు వెళ్తుంటాడు. శనివారం గ్రామ శివారులోని పొలాల్లో పురుగుల మందుతాగాడు. అక్కడే ఆపస్మారక స్థితిలో పడి ఉండగా సమీప పొలాల్లోని వారు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఉన్న ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. తండ్రి ఈశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఎస్ఎస్ నగర్లో నివాసం ఉంటున్న బోయ బాబు ట్రాలీ ఆటోలో పండ్లను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి కుమారుడు నాగేంద్రకుమార్ (20)ఓ మెడికల్ షాపులో పనిచేస్తూ ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు అంగీకరించ లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా నాగేంద్రకుమార్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
మద్దికెర/కొలిమిగుండ్ల(పత్తికొండ, బనగానపల్లె): పిడుగుపాటుతో కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల ఆదివారం.. ఇద్దరు యువకులు మృతి చెందారు.మద్దికెర గ్రామానికి చెందిన విష్ణు (18).. పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి మృత్యువాత పడ్డాడు. అలాగే కొలిమిగుండ్లకు చెందిన చంద్రశేఖర్(20)..దుస్తులు ఉతికేందుకు వెళ్లి పిడుగుపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతనికి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యువతితో జూన్ 4వతేదీన వివాహం జరగాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఊహించని రీతిలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కర్నూలు: కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు మధు (18) విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలోని మేనమామ ఈరన్న దగ్గర మధు ఉంటాడు. గురువారం పెద్దమ్మ స్వగ్రామం ఆర్.కొంతలపాడుకు వెళ్లి రాత్రి మిద్దెపై పడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి కిందికి దిగుతుండగా మెట్ల దగ్గర విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి యువకుడు మృతి
బావిలో పడి యువకుడు మృతి కృష్ణగిరి : నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందిన సంఘటన పందిర్లపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ హరినాథ్‌సింగ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కమ్మరి రామచంద్ర, లక్ష్మినరసమ్మ దంపతుల పెద్ద కుమారుడైన హర్షవర్ధన్(20) రోజు మాదిరిగానే పొలం పనులకు వెళ్లాడు. దాహం వేయడంతో సమీపంలోని బావిలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. అయితే హర్షవర్దన్‌కు ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పొలాల్లో గాలించక బావిలో మృతదేహం కనిపించింది. కుమారుడి అకాల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండి రామచంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జగ్గంపేట మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన గరిక లోవదుర్గా నాగార్జున (25) బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రోడ్-కం-రైలు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. 2013లో తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిబుల్ ఐటీ చదివిన నాగార్జున బ్యాంక్ టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటూ అతడి గ్రామంలోని దారాల ఫ్యాక్టరీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రాజమహేంద్రవరం, కాకినాడలో వైద్యం చేయించినట్టు మృతుడి తండ్రి విశ్వనాథం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గంట సమయంలో ఇంటిలో భోజనం చేసి ఫ్యాక్టరీ పని ఉందని చెప్పినట్టు తండ్రి చెప్పారు. ఫ్యాక్టరీ మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం చేరుకున్న అతడు.. అక్కడ మోటారు సైకిల్, జేబులోని రూ.3000, సెల్‌ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అతడిని పరిశీలించిన వారు మోటారు సైకిల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకువెళ్లిపోయారు. మృతుడి సెల్‌ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి మీ కుమారుడు బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులకు తెలిపారు. విషయాన్ని వారు రాజమహేంద్రవరంలోని బంధువులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్సై నాగార్జున రాజు, పోలీసులు బ్రిడ్జి మీద మృతుడు వదిలిన మోటారుసైకిల్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహం కోసం జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు మృతుడు నాగార్జున తండ్రికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తె పెద్దది కాగా కుమారులలో నాగార్జునే ఇంటికి పెద్ద కుమారుడు. ఇతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ సభ్యులను కలచివేసింది. -
యువకుడి దారుణహత్య
- మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు - స్థానికేతరుడిగా గుర్తించిన పోలీసులు - నన్నూరు సమీపంలో ఘటన ఓర్వకల్లు : మండల పరిధిలోని నన్నూరు సమీపంలో బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఘటన తీరును బట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. కత్తులతో విచక్షణా రహితంగా నరికి, హత్యానంతరం మృతదేహానికి తగులపెట్టారు. నన్నూరు సమీపంలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలకు కూతవేటు దూరంలో జమాల్‌షా దర్గాకు వెళ్లే దారిలో జాతీయరహదారి పక్కనే గురువారం కాలిపోయిన శవం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగాలపురం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రక్తపు మరకలు, మృతదేహంపై లోతైన గాయాలను బట్టి పోలీసులు హత్యగా గుర్తించారు. వాహనంపై తీసుకొచ్చి తల, మెడ, భుజాలు, పొత్తి కడుపుపై విచక్షణా రహితంగా నరికి చంపేసినట్లు తెలుస్తోంది. తర్వాత పెట్రోల్ పోసి శవానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కాలిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. హతుడు నన్నూరు, మీదివేముల, లొద్దిపల్లె గ్రామాల ప్రాంతానికి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తుండగా పోలీసులు మాత్రం స్థానికేతరుడిగా చెబుతున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందం అక్కడికి చేరుకుని పరిసరాల్లో తనిఖీలు చేశారు. ఆచూకీ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఐసుపెట్టెలో భద్రపరచనున్నట్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
- మూడు రోజుల తర్వాత వెలుగులోకి - తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఘటన కొలిమిగుండ్ల: తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. పత్తికొండకు చెందిన వడ్డె రంగయ్య, మద్దమ్మ దంపతులు ఉపాధి నిమిత్తం చిన్న కుమారుడు అరుణ్‌కుమార్(26)తో కలిసి పదేళ్ల క్రితమే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరుణ్‌కుమార్ సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తుండేవాడు. తల్లి కూలీ పనుల నిమిత్తం రెండు నెలల క్రితం పత్తికొండకు వెళ్లింది. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్న అరుణ్‌కుమార్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. మృతుడి ఇళ్లు కాలనీ చివర్లో ఉండటం..జన సంచారం లేని కారణంగా విషయం వెలుగు చూడలేదు. గురువారం హౌసింగ్ ఈఈ సుధాకరరెడ్డి, ఏఈ వాసుదేవరెడ్డి కాలనీలో పర్యటిస్తూ దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా విషయం తెలిసింది. ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ వ్యవహరమే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడి బలి
- మూత్రం రావడం లేదని తెలిపినా పట్టించుకోని సిబ్బంది - రాత్రంతా నరకయాతన అనుభవించి మృతి - నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన నూనెపల్లె: వైద్యుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పలుకరించే నాథుడు కరువయ్యారు. పరిస్థితి విషమించి కన్నీరుమున్నీరుగా విలపించినా అక్కడి సిబ్బంది గుండె కరుగలేదు. ప్రాణం పోయిన తర్వాత మా తప్పేమి లేదని తప్పుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అక్కలపల్లె గ్రామానికి చెందిన నర్రా చిన్న అల్లూరెడ్డి (42) దినసరి కూలీ. శుక్రవారం గిద్దలూరు పట్టణంలో పనులు ముగించుకుని ఇంటి వస్తుండగా ఓ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా అక్కడి వైద్యులు సిటీ స్కానింగ్‌కు సూచించడంతో శనివారం నంద్యాలకు వచ్చారు. పట్టణంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్ మిషన్ పనిచేయక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి పక్కటెముకలు విరిగాయని ధ్రువీకరించి అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో మూత్రం రాక అల్లూరెడ్డి పొట్ట ఉబ్బింది. రాత్రి 11 గంటల సమయంలో సమస్య తీవ్రం కా వడంతో వైద్యులు, నర్సుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించ లేదు. ఉదయం విధులకు హాజరైన నర్సుల పరిసి్థతిని వివరించగా సూచించగా డ్యూటీ డాక్టర్ వస్తారని చెప్పింది. ఉదయం 10 గంటల సమయలో అల్లూరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించలేదని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తంతో ఆందోళనకు దిగారు. భర్త మృతితో భార్య సుబ్బలక్ష్మమ్మ రోదిస్తూ సొమ్మసిల్లి పడి పోయింది. మృతుడికి ముగ్గురు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు వివాహమైంది. విచారణ చేస్తాం: డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్, సూపరింటెండెంట్, నంద్యాల ఆసుపత్రి అల్లూరెడ్డికి పక్కటెముకలు విరగడంతో ఆసుపత్రిలో చేర్చుకున్నాం. మొదట పరిస్థితి బాగానే ఉంది. రాత్రి సమయంలో వైద్యం అందని విషయంపై విచారణ చేస్తాం. డ్యూటీలో ఉన్న సిబ్బంది, డాక్టర్ నుంచి వివరాలు తెలుసుకుని, మృతుడి కటుంబనికి న్యాయం చేస్తాం. -
యువకుడు అదృశ్యం
కర్నూలు: నగర శివారులోని వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు బోయ గిడ్డయ్య అదృశ్యమయ్యాడు. ఎల్.పేట గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంతో సహా 30ఏళ్లుగా వీకర్‌సెక్షన్ కాలనీలో ఉంటూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న కుమారుడు ఆంజనేయులు కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన మేనత్త కూతురును 2010లో పెళ్లి చేసుకున్నాడు. భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె గత నెలలో పుట్టింటికి వెళ్లింది. ఇందుకు మనస్థాపానికి గురైన ఆంజనేయులు డిసెంబరు 31వ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి తండ్రికి ఫోన్ చేసి వెంకటగిరిలో ఉన్నానని, ఇవే చివరి మాటలంటూ చెప్పి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. తండ్రి అతని కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తండ్రి గురువారం నాల్గవ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్(94406 27736, 08518 – 259462) ద్వారా సమాచారం అందించాలని సీఐ నాగరాజు రావు కోరారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
డోన్ టౌన్: పట్టణంలోని పాత పోస్టుమార్టం కేంద్రం సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సీసంగుంతల గ్రామానికి చెందిన సురేష్ (26) కొత్తపల్లె గ్రామ శివారులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. మంగళవారం ఉదయం సొంత పనిపై డోన్‌కు వచ్చి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. పోస్టుమార్టం కేంద్రం వద్ద ధర్మవరం నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు వేగంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తండ్రి చిన్నన్న ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు డోన్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: కల్లూరు చెంచు కాలనీకి చెందిన చాకలి మునిశేఖర్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మునిస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మునిశేఖర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి సోమవారం ఉదయం ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. రైల్వే సీఐ మహేశ్వరరెడ్డికి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలతో ఎస్ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతుని యదపై ఎంకే చిన్ని అనే పచ్చబొట్టు ఉంది. ప్రేమ వ్యవహారంలోనే ఎవరైనా హత్యచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక హత్య చేసి తీసుకొచ్చి ట్రాక్‌పై పడవేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుని జేబులో స్టేట్‌బ్యాంకు ఏటీఎం కార్డు లభిచింది. అడ్రస్సు ఆధారంగా తల్లిదండ్రులను పిలిపించి రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
బైక్ బోల్తా..యువకుడు మృతి
– రామచంద్రాపురంలో విషాదం పత్తికొండ టౌన్: బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో యశ్వంత్(24) అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి రామచంద్రాపురం కొట్టాల గ్రామ సమీపంలో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్, శ్రీకళ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు యశ్వంత్ డిగ్రీ మధ్యలో మానివేసి, టమాట వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పత్తికొండకు పనిమీద వచ్చి..శుక్రవారం రాత్రి తిరిగి గ్రామానికి వెళ్లేటపుడు రామచంద్రాపురం కొట్టాలకు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలో పడ్డాడు. ప్రమాదంలో యశ్వంత్ అక్కడిక్కడే మృతిచెందాడు.రాత్రివేళ కావడంతో ప్రమాదం జరిగిన విషయం ఎవరికి తెలియలేదు. ఉదయం పత్తికొండకు వస్తున్న గ్రామస్తులు గమనించి యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. యువకుడు మృతిచెందిన సమాచారం తెలుసుకుని శనివారం ఉదయం కేడీసీసీ మాజీవైస్‌చైర్మన్ రామచంద్రారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి తదితరులు యశ్వంత్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. -
పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య
చనుగొండ్ల (గూడూరు): మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామంలో పెళ్లి ఇష్టం లేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ పగిడాల చిన్న సుంకన్న, వెంకటమ్మల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి చేశారు. అలాగే కుమారుడు రాముడు (22)కి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం పెళ్లి చూపులకు వెళ్లాలని కుటుంబీకులు నిశ్చయించుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ యువకుడు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి పొలం దగ్గరికి వెళ్లి మ«ద్యం సీసాలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి వచ్చిన కుమారుడు అనంతలోకాలకు వెళ్లి పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
కల్లు తాగి యువకుడు మృతి
- నేత్ర దానానికి కుటుంబ సభ్యులు అంగీకారం కల్లూరు: కల్లుకు బానిసైన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మంగళవారం కల్లూరు అర్బన్‌లోని శరీన్‌నగర్‌లో నివాసం ఉంటున్న సత్యబాబు, వెంకటలక్ష్మీ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎం. విశ్వనాథం డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మంగళవారం శరీన్‌నగర్‌లోని కల్లు పెంట వద్దే మత్తులో పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విశ్వనాథం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు నేత్రాలను సేకరించారు. -
పెళ్లి కాలేదని..
సంగపట్నం(అవుకు): సంగపట్నం గ్రామంలో పెళ్లి కాలేదని ఓ యువకుడు ఆత్మహత్మకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట శివరామిరెడ్డి(24) పొలం పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. కొంత కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఎక్కడ నిశ్చయం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు బనగానపల్లె ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికి మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఓర్వకల్లు: కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై రాగమయూరి–నన్నూరు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన చిట్టెమ్మ, కేశవరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో పెద్ద కుమారుడు మోహన్‌రెడ్డి(20) ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల సమీపంలోని వైష్ణవి కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్‌పై కర్నూలు నుంచి పూడిచెర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక సాయంత్రం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హంద్రీకాలువలో లభ్యమైన యువకుడి మృతదేహం ఆచూకీ లభ్యం
– నరబలి ఇచ్చారని తల్లి ఫిర్యాదు వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువలో మల్లెపల్లె పంపింగ్ స్టేషన్ వద్ద గత ఆదివారం గుర్తుతెలియని యువకుడి, చిన్నారి మృతదేహాలు కొట్టుకువచ్చి తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసందే. విచారణ చేపట్టిన ఎస్ఐ తులసీనాగప్రసాద్ బుధవారం మృతుని ఆచూకీ లభ్యమైనట్లు తెలిపారు. పత్రికల్లో గుర్తుతెలియని మృతదేహాలను వార్త రావడంతో అనుమానం వచ్చిన పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన మృతుని తల్లి నాగమ్మ, బంధువులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మృతుని దుస్తులు చూసి తల్లి నాగమ్మ తన కుమారుడు మాల వెంకటేశ్వర్లుగా(23) గుర్తించింది. డిగ్రీ పూర్తి చేసిన వెంఽకటేశ్వర్లు ఇటీవలే అదే గ్రామస్తుడు రమేష్‌కు చెందిన జేసీబీకి హెల్పర్‌గా నెలక్రితం చేరాడు. కాగా తన కుమారుడిని రమేష్‌తో పాటు జేసీబీ డ్రైవర్ చంద్ర కలిసి జేసీబీ యంత్రానికి నర బలి ఇచ్చారని తల్లి నాగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా విచారణ చేపట్టినట్లు ఎస్ఐ -
రైలు ఢీకొని యువకుడు మృతి
కల్లూరు (రూరల్): రైలు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు నగరంలోని బుధవారపేట కనకదుర్గమ్మ దేవాలయం పక్కనే నివాసం ఉంటున్న భట్టి ధన్‌రాజ్ సింగ్, తారాబాయి దంపతలకు ఆరుగురు సంతానం. నాలుగో సంతానం భట్టి యువరాజ్ సింగ్ (25)కు మతిస్థితిమితం సరిగా లేదు. సిల్వర్, ప్లాస్టిక్ సామానులు అమ్ముకుంటూ కుటుంబ సభ్యులు జీవనం సాగించేవారు. మానసిక పరిస్థితి సరిగా లేని యువరాజ్ సింగ్ మంగళవారం ఉదయం 10గంటల నుంచి కనిపించకుండాపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులంతా నగరంలో గాలించినా కనిపించలేదు. చివరకు బుధవారం కర్నూలు నగర శివారులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ ఎదురుగా ఉన్న గోశాల వెనుక రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకొని రైల్వే ఎస్ఐ జగన్, బంధువులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆదివారం పుట్టిన రోజును జరుపుకుని ఇంతలోనే శాశ్వతంగా వెళ్లిపోయావా అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. మృతదేహానికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. -
చదువుకోలేక..
మంత్రాలయం రూరల్: చదువు ఇష్టం లేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో చోటు చేసుకుంది. మంత్రాలయం ఎస్ఐ శ్రీనివాస నాయక్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె సంతానం. చివరి కుమారుడు రామకృష్ణ (18) తిరుపతిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి మొదటి నుంచి కుడా చదువు ఇష్టం లేదు. దసరా సెలవులకు గ్రామానికి వచ్చి కాలేజీకి వెళ్లనని పట్టుబడ్డాడు. అయితే వెళ్లాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్తానికి గురై శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు నుంచి జారి పడి..
అనంతపురం యువకుడి మృతి పాణ్యం: పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు రైలులో వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పాణ్యం మండలం నెరవాడ రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన బీమ లింగప్ప కుమారుడు చైతన్య(24) నంద్యాలోని ఓ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. హైదరాబాద్‌లో జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారం తెల్లవారుజామున రైలులో బయలుదేరాడు. నెర్రవాడ సమీపంలో రైలు నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. ఘటన స్థలంలో శరీర అవయవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ట్రాక్ మెన్ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్ఐ నారాయణ, హెడ్ కానిస్టేబుల్ రఫీ, శ్రీనివాసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరశీలించారు. సమీపంలో లభించిన ఓటరు కార్డు, ఫొటో సేకరించి కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు -
బైక్ అదుపు తప్పి ఒకరు దుర్మరణం
కల్లుదేవకుంట(మంత్రాలయం రూరల్): బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దసరా పండగ సందర్భంగా ఇద్దరు యువకులు బంధువుల ఇంటికి వెళ్తుండగా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసనాయక్ తెలిపిన మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయాచూర్ జిల్లా గిల్కసూగూరు క్యాంప్‌కు చెందిన బాలమదిరాజు కుమారుడు మహింద్రకుమార్, నెట్టికల్లు కుమారుడు వడ్డె రాము దసరా పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం బంధువుల ఊరైన పత్తికొండ మండలం మారెళ్ల గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మంత్రాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు దగ్గరికి చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో బైక్‌తో పాటు ఆ ఇద్దరు యువకులు ఎగిరి పక్కనున్న గుంతలో పడ్డారు. ఈ ఘటనలో మహింద్రకుమార్(20) అక్కడిక్కడే మరణించగా వడ్డెరాముకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఈయువకుడిని చిక్సిత నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ పెద్దాసుపత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహింద్రకుమార్ మృతదేహానికి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అతడి బంధువులకు అప్పగించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
భూపాలపల్లి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని దీక్షకుంటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావ్ కథనం ప్రకారం.. గ్రామంలో వ్యవసాయం చేసుకొని జీవించే ఉల్లేరావు పోషయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు తిరుపతి(24) టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి పొలం నుంచి ఇంటికి వచ్చి, టీవీ ఆన్ చేయగా రాకపోవడంతో విద్యుత్ వైర్లను సరిచేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి పోషయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కాలువలో పడి యువకుడి గల్లంతు
గుడివాడ: ప్రమాద వశాత్తు కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద ఎరుకపాడు వార్పు రోడ్డులో నివాసం ఉంటున్న పఠాన్ బిస్మిల్లా (23) తాపీ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కార్మిక నగర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో చంద్రయ్యడ్రైను వద్ద స్నేహితులతో మాట్లాడుతూ కాలుజారి కాలువలో పడ్డాడు. డ్రైను ఉధృతంగా ఉండటం వల్ల ప్రవాహానికి కొట్టుకు పోతుండటంతో స్నేహితుడు శ్రీకాంత్ కాలువలోకి దూకి రక్షించేందుకు యత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులకు తెలపటంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదని బంధువులు తెలిపారు. -
అమ్మా నా పని అయిపోయింది !
చెరువుకొమ్ముపాలెం(నందిగామ రూరల్) : ‘అమ్మా.. నా పని అయిపోయింది...’ అని ఓ యువకుడు తన తల్లికి ఫోన్లో చెప్పిన కొన్ని నిమిషాల్లోనే కన్నుమూశాడు. తన కుమారుడికి ఏమైందోనని ఆందోళనతో ఆ తల్లి వెదుకుతుండగానే... పత్తి చేనులో మృతదేహం కనిపించింది. దీంతో ఆ తల్లి కుప్పకూలిపోయింది. ఈ హృదయవిదారక ఘటన మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... గ్రామానికి చెందిన నరమట్ల సత్యనారాయణ (24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు తమకు ఉన్న ఎకరం పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నాడు. పత్తి కాయ దశలో ఉండటంతో కోతుల బెడద అధికం కావడంతో కాపలా కోసం ఉదయం 10.30 గంటలకు పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన తల్లి రమణకు సత్యనారాయణ సెల్‌ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ‘అమ్మా.. నా పని అయిపోయింది..’ అని చెబుతండగానే మాట ఆగిపోయింది. దీంతో ఆమె కంగారుపడి తన రెండో కుమారుడు శ్రీనుతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో సత్యనారాయణ మృతదేహం కనిపించింది. సత్యనారాయణ గొంతు వద్ద బ్లేడ్‌తో కోసిన గాయం ఉంది. కుమారుడి మృతదేహాన్ని చూసి రమణ కన్నీరుమున్నీరుగా విలపించారు. నందిగామ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశలించారు. మృతదేహం పక్కన ఓ బ్లేడ్ లభించింది. దీంతో సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడా... లేక ఎవరైనా దుండగులు హత్య చేశారా.. అనే కోణంలో విచారిస్తున్నారు. సత్యనారాయణ సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
వెలుగోడు: పట్టణ శివారులోని వన్ ఆర్ తూమ్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌గౌడ్(30) పట్టణ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. శుక్రవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘట స్థలాన్ని ఆత్మకూరు సీఐ దివాకర్‌రెడ్డి పరిశీలించారు. ఘటన స్థలంలో మృతుడి డ్రై వింగ్ లైసెన్స్ ఉండటంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. -
రన్నింగ్‌లో బస్సు ఎక్కుతూ..
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో జీవీకే మాల్ వద్ద శనివారం రన్నింగ్‌లో ఉన్న బస్సు ఎక్కుతూ జారిపడి ఒక యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
గోదావరిలో దూకి యువకుడి గల్లంతు
కొవ్వూరు రూరల్ : కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెనపై నుంచి ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని చిడిపి గ్రామానికి చెందిన 24 ఏళ్ల పామెర్ల సురేంద్ర సోమవారం రాత్రి మోటారు సైకిల్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు వెతకడం మొదలెట్టారు. ఈ క్రమంలో గామన్ వంతెనపై నుంచి మంగళవారం ఉదయం అతను మోటార్‌సైకిల్ ఉంచి గోదావరిలోకి దూకేశాడు. దీనిని అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి మోటార్‌సైకిల్ ముందు బ్యాగులో లభించిన విజిటింగ్ కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సురేంద్ర బంధువులు వంతెనపైకి చేరుకుని ఆ మోటార్‌సైకిల్ అతనిదేనని గుర్తించారు. యువకుడి కోసం గోదావరిలో గాలింపు చేపట్టారు. సురేంద్ర ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. యువకుడి గల్లంతుతో చిడిపి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తహసీల్దార్ కె.విజయకుమార్, అగ్నిమాపక అధికారి సూర్యనారాయణ, ఎంపీడీవో ఎ.రాములు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
స్నేహితులతో పాకాలకు వెళ్లిన కుమారస్వామి ఫిట్స్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్పించిన మిత్రులు వైద్యం ప్రారంభించేలోగా కన్నుమూత ఖానాపురం : అనుమానాస్పద స్థితి లో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఏఎస్సై కుమారస్వామిలు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మం డలం మచ్చాపురానికి చెందిన నమిండ్ల సాంబయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు నమిండ్ల కుమారస్వామి(28) ఓ దినపత్రికలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. వరంగల్‌లోని లేబర్‌కాలనీకి చెందిన ఆరూరి రవి, జన్ను అరుణ్, జన్ను మహేష్, జన్ను అరుణ్‌కుమార్‌లతో కలిసి పాకాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాడు. పాకాలకు చేరుకొని అక్కడ మిత్రులంతా ఈత కొడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలో కుమారస్వామికి ఫిట్స్ వచ్చిందంటూ తోటి స్నేహితులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు సెలైన్ బాటిల్ ఎక్కించే ప్రయత్నం చే శారు. అయితే అప్పటికే కుమారస్వామి మృతి చెందాడు. పాకాలకు వెళ్లిన తమ కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆస్పత్రిలోని కుమారుడి మృతదేహాన్నిచూసి గుండెలవిసేలా ఏడ్చారు. అయితే మృతుడు కుమారస్వామితో కలిసి పాకాలకు వెళ్లినస్నేహితులు పరారవడం గమనార్హం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఖానాపురం పోలీ స్స్టేçÙన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు చేశా రు. అనంతరం నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కుమారస్వామి మృతదేహాన్ని పోలీసులు పరిశీ లించారు. మృతుడికి భార్య మహేశ్వరీ ఉంది. ‘మా అబ్బాయిని పాకాలకు తీసుకెళ్లిన వ్యక్తులే ఏదో చేసి ఉంటారు. వాడికి ఇప్పటిదాకా ఎన్నడూ ఫిట్స్ రాలేదు. ఇప్పుడు ఫిట్స్ వచ్చిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. కారకులైన వారిని పోలీసులు పట్టుకోవాలి’ అని కుమారస్వామి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎం.దయానంద్‌రెడ్డి(21) ఆటో డ్రైవర్. జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వరకు షేరింగ్ ఆటో నడుపుతుంటాడు. మంగళవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లిన దయానంద్ రాత్రి 10 గంటలకు టీవీ చూస్తుండగా టీవీ సౌండ్ తగ్గించమని సోదరుడు కోరాడు. దీంతో టీవీ ఆపేసి సోదరుడి బైక్(ఏపీ29 ఈ 0226)పై జూబ్లీహిల్స్ వచ్చాడు. 11 గంటలకు ఫిలింనగర్ ప్రాంతంలో తిరిగిన దయానంద్ సరిగ్గా అర్ధరాత్రి 12.10 గంటలకు జర్నలిస్టు కాలనీ వైపు నుంచి రోడ్ నెం.45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వస్తుండగా బాలకృష్ణ ఇంటి చౌరస్తాలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. తలపై నుంచి డీసీఎం చక్రాలు వెళ్లడంతో దయానంద్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ను ఘటనా స్థలంలో ఆపకుండా డ్రైవర్ పరారయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుక ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
బైక్ ప్రమాదంలో యువకుడి మృతి
బంటుమిల్లి: ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఛిన్నాభిన్నం చేశాయి. గతంలో తండ్రి యాక్సిడెంట్లో మరణించడాన్ని మరువకముందే కొడుకు కూడా బైక్ ప్రమాదంలో దూరం కావడంతో ఆ కుటుంబంలో ఆవేదన మిన్నంటింది. స్థానిక మెయిన్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన యువకుడు యర్రంశెట్టి వినయ్ (19) మృతి చెందాడు. స్వగ్రామానికి చెందిన బొలిశెట్టి విష్ణుతో కలసి బంటుమిల్లి సమీపంలోని పెట్రోల్ బంక్‌లో వినయ్ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కొత్త పల్సర్ మోటార్‌సైకిల్‌పై వినయ్, విష్ణులు ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు బలమైన గాయాలు తీవ్రంగా రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన 108 ద్వార చికిత్స నిమిత్త బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో వినయ్ మరణించాడు. విష్ణు విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వినయ్ తండ్రి కూడా గతంలో దుర్మరణం మృతుడు వినయ్ తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం. అప్పటినుంచి వినయ్ తల్లి కుమారుడు, కుమార్తెతో పెడన మండలం చెన్నూరు నుండి వచ్చి నీలిపూడిలో ఉంటోంది. భర్తలాగా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. గ్రామ సర్పంచ్ పుప్పాల చిన్నాతోపాటు పలువురు గ్రామస్తులు వినయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. విష్ణు ఆరోగ్య పరిస్తితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
భార్య చంపిందంటున్న తల్లిదండ్రులు విచారణ చేపట్టిన పోలీసులు వేములవాడ : పట్టణంలోని కోరుట్ల బస్టాండు ప్రాంతంలో నివాసముంటున్న పరోళ్ల మురళీకృష్ణ(28) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సిమెంటు గాజులు, సిమెంటు ఇటుకలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మురళీకృష్ణ ఉరఫ్ కృష్ణ ఇక్కడే ఓ షెడ్డు వేసుకుని భార్య మౌనికతో ఉంటున్నాడు. మంగళవారం ఇదే షెడ్డులోని ఓ పైపుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా కావలి మండలం కమ్మవారిపాలెం నుంచి రమణయ్య– వెంకటరమణమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం వేములవాడకు వలస వచ్చారు. వీరికి మురళీకృష్ణ, శ్రీకాంత్ కుమారులు, కుమార్తె తిరుమల ఉన్నారు. ఇక్కడే సిమెంటు ఇటుకలు, గాజుల పోసుకుంటూ జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితం నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పొట్టిపల్లికి చెందిన మౌనికతో మురళీకృష్ణకు వివాహం జరిపించారు. ఆ వెంటనే మరో సిమెంటు తయారీ కేంద్రాన్ని సపరేటుగా పెట్టించారు. రెండేళ్లుగా వీరి కాపురం సజావుగా సాగింది. ఏడాదిగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మౌనిక తాలూకూ బంగారం అంశంలో గొడవలు జరిగేవనీ, ఈక్రమంలోనే మురళీకృష్ణ మరణించాడని చెబుతున్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై సైదారావు, ఏఎస్సై సురేశ్ పరిశీలించారు. గదిలోని రక్తపు మరకలు, వేలాడుతున్న తాడు పరిశీలించారు. మృతదేహం కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి ఉండడంతో హతా?.. ఆమ్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే రెండు చేతులకు ఎలా కట్టేసుకుంటాడని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్యే చంపింది... తన కుమారుడిని భార్య మౌనికే చంపేసిందని తల్లిదండ్రులు రమణయ్య, వెంకటరమణమ్మ ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా మౌనిక తన కుమారున్ని ఇబ్బందులు పెడుతోందని, ఇటీవలే బంగారం విషయంలో గొడవ పడిందని చెప్పారు. ఈ గొడవ కారణంగానే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తోందని పేర్కొన్నారు. పుట్టింటింకి వెళుతున్నట్లు చెప్పి భర్తను హత్యచేసి వెళ్లిందని పోలీసులకు వివరించారు. -
యువకుడి దారుణహత్య
శామీర్‌పేట్: మండలంలోని మజీద్పూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. సీఐ సత్తయ్య కథనం ప్రకారం.. మజీద్‌పూర్ శివారులో మేడ్చల్-మజీద్‌పూర్ మార్గంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడిని ఐలయ్య (26)గా గుర్తించారు. అతడి తలకు తీవ్ర గాయాలు కనిపించడంతో ఎవరో చంపేసి ఉండొచ్చనే కోణంలో పరిశీలించారు. జాగిలాలు, క్లూస్ టీంను రప్పించి విచారణ చేశారు. జాగిలాలు సంఘటన స్థలం నుంచి మజీద్‌పూర్‌లోని మృతుడి సవతి తండ్రి గోపాల్, తల్లి సత్తమ్మ ఉంటున్న ఇంటి వద్దకు, అక్కడే ఉన్న ఓ రిక్షా వద్దకు వెళ్లి ఆగాయి. దీంతో ఐలయ్యను సవతి తండ్రి గోపాల్ హత్య చేసి రిక్షాలో తీసుకువచ్చి రోడ్డు పక్కన పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు గోపాల్‌ను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. మండలంలోని మూడుచింతలపల్లికి చెందిన (బుడగ జంగాలు) గోపాల్‌కు భార్య చనిపోవడంతో మెదక్ ప్రాంతానికి చెందిన సత్తమ్మతో (ఈమె కుమారుడు ఐలయ్య)ను కలిసి ఐదేళ్లుగా మజీద్‌పూర్‌లోని ఓ వ్యక్తి వద్ద మూగజీవాలు కాస్తున్నాడు. గోపాల్ సత్తమ్మతోపాటు తన మొదటి భార్య కుమారుడు మహేశ్‌తో కలిసి ఉంటున్నాడు. సత్తమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఐలయ్య మంగళవారం రాత్రి మజీద్‌పూర్ గ్రామానికి వచ్చి తామ ఇంట్లో నిద్రపోయాడని, ఉదయం లేవగానే కన్పించలేదని తెలిపింది. మంగళవారం రాత్రి గోపాల్‌కు తన కుమారుడు ఐలయ్యకు మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగడంతో హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో యువకుడి మృతి
తిరుమల కాలిబాటలో ఘటన సాక్షి, తిరుమల : తిరుమలకు కాలిబాటలో వెళుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిన ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. వేములపల్లి రఘువీర్ (30) మహారాష్ట్ర లోని కాన్పూర్‌లో ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. పీహెచ్డీ ఉతీర్ణత సాధించటంతో మొక్కు తీర్చుకునేందుకు బుధవారం ఉదయం మరో ఇద్దరు స్నేహితులతో కలసి అలిపిరి కాలిబాటలో తిరుమలకు బయలుదేరాడు. మార్గంలో హఠాత్తుగా ఛాతీనొప్పి వచ్చింది. దీంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని టీటీడీ అంబులెన్స్ ద్వారా సొంత గ్రామానికి తరలించారు. -
యువకుడి ఆత్మహత్య
దావులూరు (కంకిపాడు) : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని షెడ్డులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని పంట పొలాల్లో పనులకు వచ్చిన కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. మంగళవారం రాత్రి ఆ యువకుడు అక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారించుకున్నారు. తాను వేసుకున్న చొక్కాకు, బ్యానర్‌తో ముడి వేసి షెడ్డులోని ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు బందరు మండలం గరాలదిబ్బకు చెందిన పంతగాని నాగూర్ (32) గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద లక్ష్మీ తిరుపతమ్మ, దావులూరు, గౌడ అన్న కార్డు ముక్క దొరికింది. బందరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
అనకాపల్లిలో విశాఖ యువకుడి ఆత్మహత్య
అనకాపల్లిటౌన్: విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు అనకాపల్లి గవరపాలెంలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఏఎస్ఐ ఫణి క«థనం మేరకు విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన కొమ్మోరు శ్రీనివాసరావు(25)అనే యువకుడికి వివాహమైంది. అయితే అక్కడే నివాసం ఉంటూ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మూడు నెలలు క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో తన భర్త కనిపించడంలేదని అతని భార్య సరోజని అప్పట్లో విశాఖ ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసింది. శ్రీనివాసరావు ఆ మహిళతో ఎక్కడెక్కడో తిరిగి అనకాపల్లి చేరుకున్నాడు. గవరపాలెం కర్రిపైడియ్యగారివీధిలో ఒక ఇంటిని మూడురోజుల క్రితం అద్దెకు తీసుకొని ఆమెతో ఉంటున్నాడు. రెండురోజులపాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. శనివారం ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఆ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఏఎస్ఐ చెప్పారు. సమాచారం అందడంతో భార్య సరోజని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ చెప్పారు. -
వ్యక్తి బలవన్మరణం
విజయవాడ (భవానీపురం) : కుటుంబ కలహాలు, భార్య పుట్టింటికి వెళ్లి వేరేగా ఉండడంతో మనస్థాపానికి గరైన మేడిశెట్టి రమేష్ (34) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాధరపురం హెడ్‌వాటర్ వర్క్స్ పక్కన యనమదల కుసుమకుమారి (72) నివసిస్తోంది. ఆమె పెద్ద కుమార్తె రాజేశ్వరి కుమారుడు మేడిశెట్టి రమేష్ (34)కు కాకినాడ సమీపంలోని పండూరు గ్రామానికి చెందిన దుర్గాదేవితో పదేళ్ల క్రితం వివాహమైంది. పెయింటింగ్ పనులు చేసుకునే రమేష్ ఒక పాప పుట్టే వరకు బాగానే ఉండేవాడు. తరువాత మద్యానికి అలవాటుపడిన అతను తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో భార్య దుర్గాదేవి వేరే వెళ్లిపోయింది. కొన్నాళ్ల తరువాత పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చి కలిపారు. తరువాత ఒక బాబు పుట్టాడు. మళ్లీ గొడవలు వచ్చి రెండేళ్ల క్రితం విడిపోయారు. అయినా రమేష్ భార్య దగ్గరకు వెళితే ఆమె రావద్దని తిరస్కరించేది. రమేష్‌కు స్థిరత్వం లేకపోవడంతో తల్లి కూడా ఇంటికి రానిచ్చేదికాదు. అమ్మమ్మ వద్దే ఉంటూ.. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విద్యాధరపురం హెడ్ వాటర్‌వర్క్స్ పక్కన ఉంటున్న అమ్మమ్మ కుసుమకుమారి వద్దకు వచ్చి ఇక్కడే పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ అమ్మమ్మకూ, తనకూ బయటి నుంచే భోజనం తీసుకువచ్చేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రమేష్ భోజనం తీసుకురాలేదు. అమ్మమ్మ అడుగగా ఏం మాట్లాడకుండా రోజూ మాదిరిగానే పక్క ఇంటి డాబాపైన పడుకునేందుకు వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో ఉండే గోవింద్ అనే యువకుడు సినిమాకు వెళ్లి 12.30 గంటల సమయంలో వచ్చాడు. మూత్రవిసర్జనకు ఇంటి పక్కకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేళాడుతున్న రమేష్‌ను చూసి అందరికీ చెప్పాడు. భవానీపురం ఎస్సై అబ్దుల్ సలాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి రాజేశ్వరి నగరానికి చేరుకోగా, భార్య దుర్గాదేవి రావడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేప్ కేసు పెట్టొద్దని ఫ్యామిలీని బంధించారు
బహ్రైచ్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. కేసు పెట్టొద్దంటూ బాధితురాలి కుటుంబాన్ని గదిలో బంధించాడు. ఈ వ్యవహారంలో గ్రామపెద్ద సదరు యువకుడికి అనుకూలంగా వ్యవహరించడం విశేషం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న బహ్రైచ్ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై షిబు(24) అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. కేసు పెట్టడానికి వెళ్తున్న వారిని షిబుతో పాటు గ్రామపెద్ద షబ్బాన్ బలవంతంగా ఆపటమే కాకుండా వారిని గదిలో బంధించి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం బాధితకుటుంబాన్ని విడిపించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు గ్రామపెద్దపై కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
యువకుడిపై గొడ్డలితో దాడి
మూసాపేట (హైదరాబాద్) :గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ మూసాపేటలో ఉన్న జనతానగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన కె.గిరి(18) అనే వ్యక్తి హైదరాబాద్‌లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే జనతానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అయితే సోమవారం సాయంత్రం గుర్తుతెలియని దుండుగులు గిరిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో అతనిని స్థానికులు మెరుగైన వైద్యం కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమా? లేక స్నేహితులు కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.