అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
Published Tue, Dec 20 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
కర్నూలు: కల్లూరు చెంచు కాలనీకి చెందిన చాకలి మునిశేఖర్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మునిస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మునిశేఖర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి సోమవారం ఉదయం ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. రైల్వే సీఐ మహేశ్వరరెడ్డికి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలతో ఎస్‌ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతుని యదపై ఎంకే చిన్ని అనే పచ్చబొట్టు ఉంది. ప్రేమ వ్యవహారంలోనే ఎవరైనా హత్యచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక హత్య చేసి తీసుకొచ్చి ట్రాక్‌పై పడవేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుని జేబులో స్టేట్‌బ్యాంకు ఏటీఎం కార్డు లభిచింది. అడ్రస్సు ఆధారంగా తల్లిదండ్రులను పిలిపించి రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement