
దయానంద్‌రెడ్డి (ఫైల్)
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎం.దయానంద్‌రెడ్డి(21) ఆటో డ్రైవర్. జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వరకు షేరింగ్ ఆటో నడుపుతుంటాడు. మంగళవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లిన దయానంద్ రాత్రి 10 గంటలకు టీవీ చూస్తుండగా టీవీ సౌండ్ తగ్గించమని సోదరుడు కోరాడు. దీంతో టీవీ ఆపేసి సోదరుడి బైక్(ఏపీ29 ఈ 0226)పై జూబ్లీహిల్స్ వచ్చాడు.
11 గంటలకు ఫిలింనగర్ ప్రాంతంలో తిరిగిన దయానంద్ సరిగ్గా అర్ధరాత్రి 12.10 గంటలకు జర్నలిస్టు కాలనీ వైపు నుంచి రోడ్ నెం.45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వస్తుండగా బాలకృష్ణ ఇంటి చౌరస్తాలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. తలపై నుంచి డీసీఎం చక్రాలు వెళ్లడంతో దయానంద్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ను ఘటనా స్థలంలో ఆపకుండా డ్రైవర్ పరారయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుక ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.