చింతల్‌బస్తీలో రోడ్డును తవ్వి ఇలా వదిలేశారు...
రోడ్డు పూర్తిగా దెబ్బతినకముందే మరమ్మతులు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. అందుకోసం పీపీఎం(పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్) చేస్తాం. ఇది మనుషులకు హెల్త్ చెకప్ వంటిది. – జీహెచ్‌ఎంసీ అధికారులు
మనుషులకు ముందస్తు హెల్త్ చెకప్ ఎలాగో రోడ్లకు పీపీఎం అలాంటిదంటూ ముందు జాగ్రత్తగా రోడ్ల పనులు చేస్తామన్నారు. బాగున్న రోడ్లను సైతం తవ్వారు. మరమ్మతులు చేపట్టారు. మధ్యలో వదిలేశారు. దీంతో జనం అవస్థలు పడుతున్నారు. నగరంలో రోడ్ల మరమ్మతులపై మంత్రి కేటీఆర్ ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. సగం..సగం రోడ్లు ఇప్పుడు నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలానికి ముందే నగర రోడ్లకు మెరుగులు దిద్దుతామని, వాహనదారులకు గతుకులు లేని రహదారులపై ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్న జీహెచ్‌ఎంసీ అధికారులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరమితమయ్యాయి. ‘పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్’(పీపీఎం) పేరిట బాగున్న రోడ్లను వేసవిలోనే తవ్విపోశారు. కానీ ఎక్కడా ప్రాంతాల్లో సగం పనులు కూడా పూర్తి కాలేదు. బాగున్న రోడ్డు పాడయ్యి.. పాడైనవి తిరిగి బాగుకాక నగరంలోని నలుమూలలా గుంతల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. ఇంతవరకు జరిగిన పనులకు సంబంధిత కాంట్రాక్టర్లకు ఒక్కరూపాయి కూడా చెల్లించనందునే పనులు పూర్తి చేయలేదని.. అందుకు ప్రభుత్వం ఇస్తానన్న నిధులు విడుదల చేయలేదని తేలింది. దీంతో అధికారులు చేతులెత్తేసి రహదారుల అభివృద్ధిని గాలికొదిలేశారు.
ప్రభుత్వ హామీతో పనులు ప్రారంభం
జీహెచ్‌ఎంసీ ఖజానాలో నిధులు లేకపోవడంతో పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్ (పీపీఎం) పనుల కోసం బల్దియా.. ప్రభుత్వాన్ని నిధులు కోరింది. అందుకు సమ్మతించి రూ.721.86 కోట్లు గత జనవరిలో మంజూరు చేసింది. ఏప్రిల్ నుంచి నెలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చింది. పనుల పురోగతి మేరకు అవి సరిపోతాయని అధికారులు భావించారు. పీపీఎం కింద ఎక్కడ ఎలాంటి రోడ్లు అవసరమైతే అవి వేయాలని నిర్ణయించారు. సీసీ రోడ్లకు ఎక్కువ సమయం పడుతుందని బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించారు. వీటిని మొత్తం 52 పనులుగా రూ.381 కోట్లకు టెండర్లు పిలిచారు. వీటిలో రూ.311 కోట్ల విలువైన 41 పనులు పురోగతిలో ఉన్నాయి.
అయితే నిధులు రాక రూ.100 కోట్లకు పైగా బిల్లులకు చెల్లింపు జరగలేదు. దాంతో తామిక పెట్టుబడి పెట్టలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. మిల్లింగ్ కోసం తవ్వి వదిలేసినవి అలాగే ఉన్నాయి. బాగున్న రోడ్లను సైతం తవ్వి సగంలో నిలిపివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. వాస్తవానికి జూన్ రెండో వారానికే ఈ పనులన్నీ పూర్తి కావాలి. వర్షాలు లేకపోవడంతో ఇప్పటి వరకు పనులు చేసేందుకు అవకాశం లభించింది. కానీ పనులు మాత్రం జరగడం లేదు. వర్షాలొస్తే మాత్రం ప్రజలకు నరకం తప్పేలా లేదు. గత రెండు మూడేళ్లుగా నగరంలో ఆగస్టులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం సమస్యలు లేకుండా చూస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చేతలుడిగి ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఆర్‌డీసీ పరిధిలోవి, వైట్ టాపింగ్‌వి వెరసి మొత్తం రూ.720 కోట్లు మంజూరైనా, నిధుల విడుదల లేక జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఆర్‌డీసీ పరిధిలోని రోడ్లూ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లకు సైతం మరమ్మతుల్లేక నరకం చూపిస్తున్నాయి.
అసంపూర్తి రోడ్లతో ప్రమాదాలు
మలక్‌పేట: మూసారంబాగ్ చౌరస్తా నుంచి అంబర్‌పేట వైపు వేళ్లే బీటీ రోడ్లను జేసీపీతో పెకిలించారు. నిర్మాణాల కోసం ఇటీవల ఫుట్‌పాత్‌లను సైతం తొలగించారు. దీంతో రోడ్డు గతుకులమయంగా మారి వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తవ్వకాలు చేపట్టి నెల రోజులు దాటినా పనులు మాత్రం చేపట్టలేదని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సురేందర్, గ్రేటర్ కార్యదర్శి దేవేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధుసూదన్‌రెడ్డి, సదానంద్ పేర్కొన్నారు. పనుల్లో జాప్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.
అరకొరగా మరమ్మతులు
చార్మినార్: జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని కొన్ని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లన్నీ ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రస్తుత బోనాలను పురస్కరించుకుని శిథిల రోడ్లకు ప్యాచ్ వర్క్‌లు చేస్తున్నారు. కొన్ని చోట్ల వేసిన రోడ్లపైనే వేస్తుండగా.. మరికొన్ని చోట్ల బాగున్న రోడ్లను సగం తవ్వేసి మిగిలింది వేస్తున్నారు. దీంతో ఆయా రోడ్లలో వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సర్కిల్–6,7,8,9,10లలో జరుగుతున్న రోడ్ల మరమ్మతుల్లో ప్రమాణాలు పాటించడంలేదు. గౌలిపురా, సుల్తాన్‌షాహి, ఈదిబజార్, సంతోష్‌నగర్ వాటర్ ట్యాంక్, మొఘల్‌ఫురా, మీరాలంమండి, ఘాన్సీబజార్, పురానాపూల్, పూల్‌బాగ్ రోడ్డు, చాంద్రాయణగుట్ట, డీఆర్‌డీఎల్, కందికల్‌గేట్, జోరాబీకా దర్గా, ఇమాంబాడా, రెయిన్‌బజార్, పురానీహవేలి తదితర ప్రాంతాల్లోని రోడ్లకు అరకొర మరమ్మతులు చేస్తున్నారు.
ఆ ఆరు కి.మీ. నరకమే..
సూరారం: ఐడీపీఎల్ నుంచి సూరారం వరకు ఉన్న రోడ్లకు అక్కడక్కడా ప్యాచ్‌వర్క్‌లు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇటీవల జరిగిన పైపులైన్ల కోసం తవ్విన రోడ్లకు ఈ ప్యాచ్ వర్క్‌లు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. టీఎస్‌ఐఐసీ కాలనీ నుంచి సూరారం వరకు రోడ్డు వెడల్పుకు ఇరువైపులా కంకర పోశారు. రోజులు గడుస్తున్నా పనులు మాత్రం చేయలేదు. దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు రోడ్డు ఎగుడు దిగుడు, గుంతలతో ప్రమాదకరంగా మారింది.
కంకరతో సరిపెట్టారు..
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ప్రధాన రహదారుల అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగలేదు. రోడ్డులో సగభాగం బీటీ వేసి మగిలిన భాగాన్ని వదిలేశారు. దీంతో బీటీ వేసిన వైపు రోడ్డు నాలుగు ఇంచులు ఎత్తుగా ఉంది. మరి కొన్నిచోట్ల అభివృద్ధి పనులను అర్ధాంతరంగా వదిలేశారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి గుల్మోహర్ పార్క్ వరకు ప్రధాన రహదారి ఎగుడు దిగుడుగా ఉంది. మియాపూర్ జేపీనగర్ మార్గంలో సీసీ రోడ్డు వేసేందుకు నెల రోజుల క్రితం తవ్వి కంకర వేసి వదిలేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జేపీనగర్ నుంచి మక్తా వెళ్లే రోడ్డు విస్తరణ కోసం తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రశాంత్‌నగర్ నుంచి మదీనగూడ వెళ్లే రోడ్డులో కెనరీ స్కూల్ ముందు బీటీ రోడ్డును అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇక్కడ మరీ అధ్వానం
అంబర్‌పేట: నల్లకుంట, బాగ్ అంబర్‌పేట, శివంరోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న రోడ్లను తవ్వి వదిలేయడంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల క్రితం ఆయా ప్రధాన రోడ్లను తవ్వేశారు. తిరిగి వాటిని వేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయి కలుగుతోంది. వేసవి కాలంలో వేసే రోడ్లు వర్షకాలంలో మొదలు పెట్టారు. అధ్వానంగా ఉన్న రోడ్లను మరీ దారుణంగా మార్చేశారని ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment