తవ్విపోదురుగాక నాకేంటి? | Road Damages In Hyderabad | Sakshi
Sakshi News home page

తవ్విపోదురుగాక నాకేంటి?

Published Tue, Jul 17 2018 9:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Road Damages In Hyderabad - Sakshi

కుత్బుల్లాపూర్‌: పద్మానగర్‌లో డ్రైనేజీ కోసం తవ్విన రోడ్డు ఇలా...

సాక్షి, సిటీబ్యూరో/నెట్‌వర్క్‌: నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేసిన రోడ్లతో జనం అల్లాడుతున్నారు. గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో తవ్విన రోడ్లన్నీ గోదారిని తలపిస్తున్నాయి. గుంతలు, బురదతో చాలా మార్గాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్డు ప్రమాదాలు సైతం పెరుగుతున్నాయి. మిషన్‌ భగీరథలో భాగంగా తాగునీరు..డ్రెయినే జీ, విద్యుత్‌ తదితర అవసరాల కోసం వాటర్‌బోర్డు, విద్యుత్, టెలికాం వంటి ప్రభుత్వశాఖలు రహదారులను తవ్వుతూ, సకాలంలో పనులు పూర్తిచేయకున్నా చోద్యం చూస్తున్నారు. తవ్విన రోడ్లను నిర్ణీత వ్యవధిలో పూడ్చివేసేందుకు తగిన చర్యలు తీసుకోక సదరు విభాగాలు తీవ్ర నిర్లక్ష్యంవహిస్తున్నాయి. వర్షాకాలం లోపే పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ పట్టింపులేని తనం,  పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల  ఇష్టారాజ్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తరచూ తవ్విన గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. బురద గుంతల్లో వాహనాలు దిగబడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తవ్విన రోడ్ల పరిస్థితులిలా ఉంటే అంతర్గత రహదారుల నిర్మాణంలో అశ్రద్ధతో çపలు ప్రాంతాలు కాలు మోపడానికి వీల్లేకుండా బురదమయంగా మారాయి. దీంతో గ్రేటర్‌ ప్రజలు కాలు బయట పెట్టేందుకు వణుకుతున్నారు. ఓవైపు రోడ్లు లేక, మరోవైపు ఉన్న రోడ్లపై  తవ్వకాలతో ఏర్పడ్డ గోతులతో నిత్యం ఇబ్బందులే. గ్రేటర్‌ నగరంలోని రోడ్ల తవ్వకాలు..గోతుల్లో ప్రజల అవస్థలతో సాక్షి ఫోకస్‌..

కాప్రా డివిజన్‌ పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కోసం కాలనీల్లో రోడ్లను అడ్డదిడ్డంగా తవ్వారు. మట్టికుప్పలు రోడ్లపైనే ఉంచారు.  రామంతాపూర్‌ శ్రీనగర్‌ కాలనీలో గత మూడు నెలలుగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన  భూగర్భడ్రైనేజీ ఔట్‌లెట్‌ కోసం తవ్విన గుంతల్లో పడి పలువురు గాయాల పాలయ్యారు. ఇటీవలే ఒక ట్రాక్టర్‌ గుంతలో దిగబడగా, ఆటో బోల్తా పడింది. సికింద్రాబాద్‌ మాణికేశ్వరీనగర్‌ ప్రధాన రహదారిలో మంచినీటి పైపులైనుకోసం తవ్వన రోడ్డును పూడ్చకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అడ్డగుట్ట డివిజన్‌లో కార్పొరేటర్‌ నివాసం సమీపంలోని రోడ్డుపై ఇటీవల డ్రైనేజీ పైప్‌లైన్‌ పనులను ప్రారంభించారు. పనులు పూర్తికాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌  నెంబర్‌ 5లో హ్యుందాయ్‌ కార్ల షోరూం పక్క గల్లీలో నెల రోజుల క్రితం పైప్‌లైన్ల కోసం తవ్వి వదిలేశారు.  వర్షానికి  రోడ్డంతా బురదమయంగా తయారై కాలుపెట్టడమే కష్టంగా మారింది.  కార్వాన్‌ రాంసింగ్‌పుర వద్ద రోడ్డు వెడల్పు కోసం రహదారిని తవ్వి వదిలేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డును తవ్వి మూడు మాసాలు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీ ఫేజ్‌ 1, 2లో గోదావరి పైపు లైను నిర్మాణ పనుల్లో భాగంగా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో భాగంగా గత మూడు సంవత్సరాలుగా రోడ్లను తవ్వుతున్నారు. అయినా పనులింకా పూర్తికాలేదు. దీంతో  రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.   గడిచిన ఆరు నెలల నుంచి బంజారాహిల్స్, జూబ్లీ్లహిల్స్‌ రహదారులు తవ్వకాలతో, పైప్‌లైన్‌ పనులతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇలా నగరంలో ఏ రోడ్డుచూసినా.. ఏ వీధి చూసినా.. నడవలేక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.

కనీస  జాగ్రత్తలు కరువు..
చాలా ప్రాంతాల్లో  తవ్వకాల  చుట్టూ కనీసం ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు  కూడా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. తవ్విన రోడ్లకు సంబంధించి ఆయా సంస్థల నుంచి ఎన్‌ఓసీలు రానందున తాము పూడ్చలేకపోతున్నామని జీహెచ్‌ంఎసీ చెబుతోంది. జలమండలి తాగునీటి అవసరాల కోసం 1700 కి.మీ.ల మేర తవ్వకాలు జరపగా, ఇంకా 36 కి.మీ.ల మేర పనులు పూర్తికాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరో 1900 కి.మీ.ల తవ్వకాలకు వివిధ సంస్థలు అనుమతులు కోరాయి. అయితే వాటిని తిరస్కరించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వావసరాల దృష్ట్యా అత్యవసరమైతే ప్రభుత్వంనుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నవారికి మాత్రం అనుమతులిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఇలా దాదాపు 50 కి.మీ.ల మేర మాత్రం  అనుమతులిచ్చినట్లు తెలిపారు. 

పనులు చేయని విభాగాలు..
నగరంలో  దాదాపు 9100 కి.మీ.మేర రహదారులుండగా, వాటిల్లో ప్రధాన రహదారుల మార్గాల్లో నాలుగు లేన్లు దాటిన రోడ్లు 795 కి.మీ.లున్నాయి. వీటిల్లో 330 కి.మీ.ల రోడ్లను ప్రభుత్వం హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌)కు బదిలీ చేయడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో లేకుండా పోయాయి. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌లోని ప్రధాన రహదారులన్నీ హెచ్‌ఆర్‌డీసీఎల్‌ పరిధిలో ఉన్నాయి. తార్నాక, నాచారం, ఉషాముళ్లపూడి హాస్పిటల్, బేగంపేట, రేతిబౌలి, అత్తాపూర్, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్, రాజేంద్రనగర్‌ తదితర ప్రధాన మార్గాలన్నీ దాని పరిధిలో ఉన్నాయి. అవిపోను మిగతా 465 కి.మీ.ల మేర జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు అంతర్గత రోడ్లు, కాలనీ రోడ్లు తదితరమైనవన్నీ జీహెచ్‌ఎంసీ   అజమాయిషీలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రధాన రహదారుల్లో రాజ్‌భవన్‌ రోడ్, అయ్యప్పసొసైటీ, చందానగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్‌ తదితర మార్గాలున్నాయి. ఇవి కాక మెట్రోరైలు మార్గాల్లో పనులు హెచ్‌ఎంఆర్‌ చేయాల్సి ఉంది. అయినప్పటికీ, ఏ విభాగం కూడా తమ పరిధిలోని  పనులను పట్టించుకోకపోవడంతో  నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఆయా అవసరాల కోసం తవ్విన భారీ గుంతలతో ఓవైపు, వర్షాలకు పడ్డ గుంతలతో మరోవైపు నగరంలోని అన్ని రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టే  జీహెచ్‌ఎంసీ.. ఈ సంవత్సరం శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టినా వేసవిలో వాటిని పూర్తిచేయలేదు. వర్షాలు పడుతుండటంతో ఇప్పుడు పనులు చేసే పరిస్థితి లేదు.

  • గత మూడేళ్లుగా  రోడ్ల మరమ్మతుల వ్యయం..
  •      2015–16    రూ. 188 కోట్లు
  •      2016–17    రూ. 95 కోట్లు  
  •      2017–18    రూ. 90 కోట్లు 
  • ఈ సంవత్సరం జూలై 1 నుంచి 16వ తేదీ వరకు రోడ్లపై పడ్డ పాట్‌హోల్స్‌.. పూడ్చినవి.. ఇంకా పూడ్చాల్సినవి దాదాపుగా..
  •      పాట్‌హోల్స్‌ : 1623
  •      పూడ్చినవి  : 1520
  •      పడ్చాల్సినవి:103
  • గ్రేటర్‌లో రహదారులిలా..
  •      మొత్తం రోడ్లు : 9103 కి.మీ.
  •      బీటీ రోడ్లు : 4173 కి.మీ.
  •      సీసీ రోడ్లు    : 3932 కి.మీ.
  •      మట్టి రోడ్లు : 857  కి.మీ.
  •      మెటల్‌ రోడ్లు : 82 కి.మీ.
  • ఎస్‌ఎస్‌ ఫ్లోరింగ్‌: 60 కి.మీ.
  • 2017–18 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల కోసం జీహెచ్‌ఎంసీ చేసిన వ్యయం  దాదాపుగా రూ.కోట్లలో...  
  •      జూలై నుంచి అక్టోబర్‌ వరకు కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు: 25.00
  •      సమస్యాత్మక ప్రాంతాల్లో నీరు నిల్వకుండా రోడ్లకు చేసిన మరమ్మతులు:45.00
  •      రోడ్టు కటింగ్‌ పునరుద్ధరణ పనులు :34.00
  •      ఇవాంకా రాక సందర్భంగా వేసిన రోడ్లకోసం : 43.50
  •      ఇతరత్రా పనులు : 195.00
  •      ఇలా గడచిన ఆర్థిక సంవత్సరం(2017–18) దాదాపు రూ. 350 కోట్లు రోడ్ల పేరిట ఖర్చు చేశారు.  
  • వర్షం వస్తే గుంతలు(పాట్‌హోల్స్‌)..
  • ప్రతియేటా వర్షాలప్పుడు ఏర్పడే పాట్‌హోల్స్,ప్యాచ్‌వర్క్స్‌ మరమ్మతుల  పేరిట దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement