సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత అసెంబ్లీని గురువారం రద్దు చేస్తారనే సంకేతాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం జీహెచ్‌ఎంఈయూ–టీఆర్‌ఎస్ కేవీ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ప్రవేశ ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికులు, నాయకులు అక్కడకు వెళ్లకుండా కార్యాలయ అన్ని గేట్లను మూసివేశారు. అయితే ఆందోళన చేస్తున్నవారికి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ససమిరా అనడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా జీహెచ్‌ఎంసీలోని 20 వేల పైచిలుకు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తారని ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, వారు ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని వెళ్లిపోతే, వారినే నమ్ముకున్న కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, వారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారన్నారు. అయితే నాలుగున్నర ఏళ్లయినా హామీలను అమలు చేయలేదన్నారు. ఇంత కాలం ప్రభుత్వం ఉందని, తమకు న్యాయం చేస్తుందన్న భరోసాతో ఉన్నామని, ఇప్పుడు తమ గతేంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం కానీ, కమిషనర్ కానీ తమను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రగతి భవన్‌కు వెళుతుంటే పోలీసులు వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన బహుమతి ఇదని వేదన వ్యక్తం చేశారు.
సమ్మెలో అన్ని విభాగాల కార్మికులు
తమ సమస్యల పరిష్కారానికి పారిశుధ్య కార్మికులతో సహా వెటర్నరీ, రవాణా, ఉద్యానవన, తదితర అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటారని యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ప్రకటించారు. సేవలు చేసే పేద కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కంటే మరింత ఎక్కువగా తమ సత్తా చాటుతారన్నారు. తమకు జరిగే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
రాజకీయ పార్టీలతో సంబంధం లేదు..
టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. దీనిపై యూనియన్ నేతలు స్పందిస్తూ తమది కార్మికులకు అనుబంధమైన సంస్థ అని, పదవులపై తమకు ఆశలు లేవన్నారు. తాము ఏ రాజకీయ పార్టీతోనూ కలసి ఉండమని ప్రకటించారు. కార్మికుల జీవితాలు బాగుపడతాయనే ఆశతో టీఆర్‌ఎస్‌కు దగ్గరగా ఉన్నామని తెలిపారు. పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పోలీసులను ఉసిగొలిపిన వారు రేపట్నుంచి వారితోనే తమ డ్యూటీలు చేయించుకోవాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కార్మికుల కోసం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా ఆ ప్రస్తావన రాకపోవడం బాధాకరమన్నారు.
నేటి నుంచి జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో..
జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా గురువారం నుంచి కార్మికులు విధులను బహిష్కరించనున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. శుక్రవారం నుంచి పర్మనెంట్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు.
ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన
తమ డిమాండ్లు నెరవేర్చాలని ఐఎన్‌టీయూసీ అనుబంధ విభాగం ఆ«ధ్వర్యంలో కార్మికులు బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శనకు దిగారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కార్మికుల వేతనాలు రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా కార్మికులు ఉదయం నుంచి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించడంతో అధికారులు, ఉద్యోగులు మేయర్ ద్వారం నుంచి కార్యాలయం లోనికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment