Workers strike
-
సమ్మె విరమించండి.. మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు. పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రెగ్యులర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, కొందరు కాంట్రాక్ట్ సిబ్బంది సైతం సేవలు అందిస్తున్నారని వివరించారు. అవసరమైన యూఎల్బీల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. యూఎల్బీల్లో సేవలకు వాహనాలు అవసరమైన చోట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, మార్కెట్ల వద్ద చెత్త ఉండిపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రులు ఆదిమూలపు, బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. సమ్మెను ఉధృతం చేస్తాం: కార్మిక జేఏసీ మునిసిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీ, సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి మునిసిపల్ ఒప్పంద కార్మికులు విద్యుత్ నిర్వహణ సేవలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ నెల 17 నుంచి అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న మునిసిపల్ కార్మికులు విధుల్లో పాల్గొనరాదని కోరారు. గురువారం అన్ని పట్టణాల్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారని, శుక్రవారం మునిసిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. -
హామీ నెరవేర్చకుంటే సమ్మె కొనసాగిస్తాం
-
కార్మిక హక్కులను కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రెండు రోజులపాటు జరిగిన కార్మికుల సమ్మె తెలంగాణలో పాక్షికంగా, ప్రశాంతంగా ముగిసింది. సింగరేణి, జాతీయ బ్యాంకుల సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వామపక్షాలు సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడాలని, రైతులకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బ్యాంకులు మూతపడ్డాయి. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా హైదరాబాద్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్థల జోలికొస్తే మసే.. విద్యుత్ సంస్థలు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదని, తమ జోలికొస్తే.. మాడిమసై పోతారని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం వేర్వేరుగా మహాధర్నాలు నిర్వహించారు. టీఎస్పీఈజేఏసీ ఆధ్వర్యంలో మింట్‌కాంపౌండ్‌లో, టీఈఈఏ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అలాగే విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబర్‌సిటీ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ మహాధర్నాల్లో ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు పి.రత్నాకర్‌రావు, పి. సదానందం, సాయిబాబు, అనిల్‌కుమార్, ఎన్.శివాజీ, రామేశ్వర్‌శెట్టి, వినోద్, తుల్జా రాంసింగ్, పి.అంజయ్య, పరమేష్, వెంకటేశ్వర్లు, వీరస్వామి, బాలచంద్రుడు, గోవర్థన్, కొండా రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, మురలయ్య, తులసినాగరాణి, వెంకన్నగౌడ్, శ్యామ్‌మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
18 గంటలుగా సెల్ టవర్‌పైనే..
సాక్షి, నల్గొండ : జిల్లాలో హెచ్ఎమ్డబ్ల్యూఎస్&ఎస్బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. వేతనాలు పెంచాలంటూ నిన్నటినుంచి సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి మండలం మల్ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గటం లేదు. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది. -
‘ప్రభుత్వ దృష్టికి కార్మిక సంఘాల సమస్యలు’
సాక్షి, విజయవాడ : సమ్మెకు వెళ్లే కార్మిక సంఘాలతో తాము చర్చలు జరుపుతామని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వ దృష్టికి ఆయా సమస్యలను తీసుకవెళ్తామని, మార్చిలో జరిగిన ఒప్పందం విషయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని తెలిపారు. కార్మిక సంఘాలు సమ్మెకు సంబంధించిన నోటీసుల ఇచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్న విషయమూ తెలిసిందే. ఈ నెల 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మె తేదిని ప్రకటిస్తామని , ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
2018 అచ్చిరాలేదు
రాష్ట్ర ఆర్టీసీకి ఈ ఏడాది చాలా చేదు జ్ఞాపకాలే మిగిలాయి. పెరుగుతున్న అప్పులు,వాటి వడ్డీలు, నిర్వహణ వ్యయం, డీజిల్ ధరలతో ఓ వైపు సతమతమవుతుంటే.. మరోవైపు ఫిట్నెస్ లేని బస్సుల కారణంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు మరింత కలవరపెట్టాయి. ఇటు ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం అందకపోవడం సంస్థకు శాపంగా మారింది. ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో ఎప్పుడూ నిధులు విడుదల కాలేదు. కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బందిపై పని ఒత్తిడి ఆర్టీసీలో సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యలుగా ఉన్నాయి. అయితే స్పెషల్ సీజన్లలో ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో ఆదాయం పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. మొదటి 6 నెలల పరిణామాలు ఈ ఏడాది మొదటి నుంచి ఆరు నెలల పాటు ఆర్టీసీ అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్మికుల సమ్మె నిర్ణయం, రెండు ప్రమాద ఘటనలు పెద్దవిగా చెప్పవచ్చు. జనవరిలో హైదరాబాద్‌లో టికెట్ రేట్లను ఆర్టీసీ స్వల్పంగా సవరించింది. చిల్లర ధర తలెత్తుతుండటంతో ఈ మేరకు కొన్ని టికెట్ల ధరలో పెంపు, మరికొన్నింటికి కోత విధించింది. ఫిబ్రవరిలో సంస్థ ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ ఆర్టీసీకి ఉత్తమ రవాణా సంస్థగా అవార్డు దక్కింది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్టీసీకి రూ.975 కోట్లు కేటాయించింది కానీ, రూ.230 (సెప్టెంబర్ వరకు) మాత్రమే విడుదల చేశారు. ఏప్రిల్‌లో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.140 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. మేలో వేతన సవరణ జరపాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. స్పందన లేకపోయే సరికి 11వ తేదీన సమ్మెలోకి వెళ్తున్నట్లు గుర్తింపు పొందిన సంఘం టీఎంయూ, ఇతర సంఘాలు ప్రకటించాయి. కానీ, ఆ నెలలో సమ్మెజరగలేదు. ఇటు రిమ్మనగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం 13 మంది మరణించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. జూన్‌లో మరోసారి కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. దీనిపై ప్రభుత్వం మండిపడింది. అవసరమైతే ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం జరిగింది. మంత్రుల కమిటీతో యూనియన్ల చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. 16 శాతం మధ్యంతర భృతి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఇదే నెలలో సంస్థ ఎండీ రమణారావు పదవీకాలం పూర్తవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఎండీగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సునీల్ శర్మ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో కొండగట్టు ప్రమాదం.. జూలైలో ఆదాయం పెంచుకునేందుకు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ కమిటీ నియమించారు. తర్వాతి నెలలో పెద్దగా పరిణామాలు జరగలేదు. అయితే సెప్టెంబరు 11న ఆర్టీసీ చరిత్రలోనే ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడి ఏకంగా 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే ఈ స్థాయి ప్రమాదం ఎప్పుడూ చోటుచేసుకోలేదు. అదే నెల దసరా సెలవులప్పుడు నడిపిన బస్సుల ద్వారా దాదాపు రూ.18 కోట్లు ఆర్జించినట్లు సమాచారం. నవంబర్‌లో ఆర్టీసీ నష్టాలు రూ.270 కోట్లు (సెప్టెంబర్) వరకు దాటినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీకి కొత్తగా రూ.500 కోట్ల అప్పు దొరికింది. ప్రభుత్వ పూచీకత్తుతో బ్యాంకులు ఈ మొత్తాన్ని సంస్థకు ఇచ్చాయి. డిసెంబర్లో సీసీఎస్ నుంచి వాడుకున్న నిధుల్లో రూ.80 కోట్లు తిరిగి ఆర్టీసీ చెల్లించింది. – సాక్షి, హైదరాబాద్ -
ఎక్కడి చెత్త అక్కడే!
సాక్షి నెట్వర్క్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 279 జీవోను రద్దు చేయాలని, జీవో 151 అమలుచేయాలని.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న డిమాండ్లతో రాష్ట్రంలోని 104 మున్సిపాలిటీల్లో ఆరు రోజులుగా జరుగుతున్న సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. దాదాపు అన్నిచోట్లా రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఊరూవాడలన్నింటా దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో జనాలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎక్కడచూసినా ముక్కుమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రాణాంతక డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ప్రస్తుత దుస్థితి మరింత బెంబేలెత్తిస్తోంది. పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నా సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే విషజ్వరాలతో ప్రజలు మరోవైపు.. సర్కారు మొండివైఖరిని నిరసిస్తూ కార్మికులూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరపాలక సంస్థతో పాటు కృష్ణాజిల్లాలోని ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయితీల్లో సుమారు ఆరు వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మున్సిపాల్టీలలో చెత్త వ్యర్థాలు మేట వేశాయి. డంపర్లలో చెత్త నిల్వలు పేరుకుపోయి పరిసరాలు చెత్తమయం కావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. విజయవాడలో కార్మికులు మంగళవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మరోవైపు.. నగర మున్సిపల్ కమిషనర్ జె. నివాస్ కూలీల ద్వారా చెత్తను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు 40మంది కార్మికులను విధుల నుంచి తొలగించారు. తెనాలి, చిలకలూరిపేట, గుంటూరులో వేరేవారితో పారిశుధ్య పనులను నిర్వహిస్తుండగా వీరిని సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. గుంటూరులో పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్సీపీ తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంఘీభావం తెలిపారు. సత్తెనపల్లిలో మానవహారం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 1500 మంది పారిశుధ్య సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు కందుకూరు, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీ, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్మికులకు మద్దతు ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశుధ్య కార్మికుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. వెంకటగిరిలో అధికారులు 100మంది ప్రైవేట్ కార్మికుల్ని రంగంలోకి దింపగా కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కావలి పట్టణంలో ప్రజాసంఘాలు, వైఎస్సార్‌ఎస్‌యూ, వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆత్మకూరులో అధికారుల జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ‘అనంత’లో చర్చలు విఫలం అనంతపురం జిల్లాలో తాడిపత్రి మినహా మిగితా అన్నిచోట్లా సమ్మె కొనసాగుతోంది. అనంతపురంలో ఇంజినీరింగ్ విభాగం కార్మికులు కూడా సమ్మె చేస్తుండడంతో అధికారులు వారికి అల్టిమేటం జారీచేశారు. మరోవైపు.. అనంతపురం, పామిడి, పుట్టపర్తిలో మంగళవారం అధికారులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హిందూ పురంలో అధికారులు, కార్మికుల వాగ్వాదం జరిగింది. కర్నూ లు జిల్లాలోని 9 మున్సిపాల్టీల్లో 2,500మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయు, వైఎస్సార్టీయూసీ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వైఎస్సార్ జిల్లాలో సుమారు 3వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇక్కడ రోజూ 400 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ 200 మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే తరలించగల్గుతున్నారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతోపాటు పుత్తూరు, నగరి, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లోనూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. విశాఖలో కుప్పలు కుప్పలుగా చెత్త మహా విశాఖ నగర పాలక సంస్థలో రోడ్లపై చెత్త కుప్పలు కుప్పలుగా పెరిగిపోతోంది. శాశ్వత ఉద్యోగులతో రోజుకు కేవలం 700–750 టన్నుల చెత్తను మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించగలుగుతున్నారు. ఇంకా నగర వ్యాప్తంగా సుమారు 2500 టన్నుల చెత్త పేరుకుపోయింది. సమ్మె ఇలాగే కొనసాగితే.. ప్రతిరోడ్డు ఓ డంపింగ్ యార్డులా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 4000మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లాలోని యలమంచిలి, నర్సీపట్నంల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో పట్టణ ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 511 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కార్మికుల కోరతతో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాను ప్రాణాంతక డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ప్రస్తుత దుస్థితి మరింత బెంబేలెత్తిస్తోంది. పురపాలక సంస్థల ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోనూ ఇదే పరిస్థితి. -
'ఢీ'హెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత అసెంబ్లీని గురువారం రద్దు చేస్తారనే సంకేతాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం జీహెచ్ఎంఈయూ–టీఆర్ఎస్ కేవీ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ప్రవేశ ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికులు, నాయకులు అక్కడకు వెళ్లకుండా కార్యాలయ అన్ని గేట్లను మూసివేశారు. అయితే ఆందోళన చేస్తున్నవారికి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ససమిరా అనడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా జీహెచ్ఎంసీలోని 20 వేల పైచిలుకు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తారని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, వారు ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని వెళ్లిపోతే, వారినే నమ్ముకున్న కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, వారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారన్నారు. అయితే నాలుగున్నర ఏళ్లయినా హామీలను అమలు చేయలేదన్నారు. ఇంత కాలం ప్రభుత్వం ఉందని, తమకు న్యాయం చేస్తుందన్న భరోసాతో ఉన్నామని, ఇప్పుడు తమ గతేంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం కానీ, కమిషనర్ కానీ తమను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రగతి భవన్‌కు వెళుతుంటే పోలీసులు వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన బహుమతి ఇదని వేదన వ్యక్తం చేశారు. సమ్మెలో అన్ని విభాగాల కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి పారిశుధ్య కార్మికులతో సహా వెటర్నరీ, రవాణా, ఉద్యానవన, తదితర అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటారని యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ప్రకటించారు. సేవలు చేసే పేద కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కంటే మరింత ఎక్కువగా తమ సత్తా చాటుతారన్నారు. తమకు జరిగే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు.. టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. దీనిపై యూనియన్ నేతలు స్పందిస్తూ తమది కార్మికులకు అనుబంధమైన సంస్థ అని, పదవులపై తమకు ఆశలు లేవన్నారు. తాము ఏ రాజకీయ పార్టీతోనూ కలసి ఉండమని ప్రకటించారు. కార్మికుల జీవితాలు బాగుపడతాయనే ఆశతో టీఆర్ఎస్కు దగ్గరగా ఉన్నామని తెలిపారు. పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పోలీసులను ఉసిగొలిపిన వారు రేపట్నుంచి వారితోనే తమ డ్యూటీలు చేయించుకోవాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ కార్మికుల కోసం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా ఆ ప్రస్తావన రాకపోవడం బాధాకరమన్నారు. నేటి నుంచి జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో.. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా గురువారం నుంచి కార్మికులు విధులను బహిష్కరించనున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. శుక్రవారం నుంచి పర్మనెంట్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన తమ డిమాండ్లు నెరవేర్చాలని ఐఎన్టీయూసీ అనుబంధ విభాగం ఆ«ధ్వర్యంలో కార్మికులు బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శనకు దిగారు. ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కార్మికుల వేతనాలు రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా కార్మికులు ఉదయం నుంచి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించడంతో అధికారులు, ఉద్యోగులు మేయర్ ద్వారం నుంచి కార్యాలయం లోనికి వెళ్లారు. -
ఫ్యాక్టరీ తెరవకపోతే ఆత్మహత్యలే శరణ్యం
టెక్కలి : ‘వందలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న పరిశ్రమను మూత వేసి మమ్మల్ని రోడ్డున పడేశారు.. మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా మా సమస్య పరిష్కారం కాలేదు.. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పరిశ్రమను తెరిపించకపోతే ఆత్మహత్యలకు వెనుకాడం..’ అంటూ టెక్కలి మండలం రావివలసలో మెట్కోర్ ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమ కార్మికులు నినాదాలు చేశారు. సోమవారం 300కు పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ‘జీఎంఆర్’ పేరిట ఉన్న ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. పరిశ్రమ నుంచి ప్రారంభమై ఎన్ఎం రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. పోలీస్ సిబ్బంది నలువైపులా బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు చేసిన నినాదాలు మిన్నంటాయి. పరిశ్రమ తెరిపించే విషయంలో యాజమాన్యం మొండివైఖరి నశించాలని, తక్షణమే 4 సంవత్సరాల పీఎఫ్ చెల్లించాలని, 20 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని, పరిశ్రమను వెంటనే తెరిపించాలని తదితర డిమాండ్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొదటగా ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారి సోమేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తహసీల్దారు కార్యాలయం వర కు ర్యాలీను కొనసాగించి తహసీల్దారు ఆర్.అప్పలరాజుకు వినతిపత్రం అందించారు. పాత జాతీయ రహదారి మీదుగా ర్యాలీను కొనసాగించి కార్మిక శాఖా కార్యాలయం వరకు వెళ్లి అక్కడ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ కొనసాగించారు. మంత్రికి చెప్పినా ఫలితం శూన్యం.. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ 2014లో పరిశ్రమ ఉత్పత్తి నిలిపివేశారని, ఆ తర్వాత 60 శాతం జీతాలు ఇప్పిస్తామంటూ అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో యాజమాన్య ప్రతినిధులు ఒప్పందం చేశారని గుర్తు చేశారు. కొన్ని రోజులు మాత్రమే జీతాలు ఇచ్చారని ఆ తరువాత జీతాలు నిలిపివేశారంటూ కార్మికులు వాపోయారు. ఈ విషయమై మంత్రి చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో, కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ మూతపడటంతో కార్మికులు దాసరి చిన్నబాబు, జి.ఎర్రన్న, బి.ఆర్.బి.సాగర్, బి.సూర్యారావు, అడ్డి అప్పయ్యలు మానసిక ఆందోళనతో మృతి చెందారని వాపోయారు. తక్షణమే డిమాండ్లు పరిష్కరించకపోతే ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నామంటూ కార్మికులు హెచ్చరించారు. ర్యాలీకి సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు ఎన్.షణ్ముఖరావు, కె.ఎల్లయ్య తదితరులు మద్దతు పలికారు. వైఎస్సార్ సీపీ నాయకుల సంఘీభావం ర్యాలీ చేపట్టిన కార్మిక సంఘ ప్రతినిధులకు వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌లు సంఘీభావం ప్రకటించారు. శ్రీకాకుళంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశానికి ఇరువురు వెళ్లిపోవడంతో అక్కడి నుంచి కార్మిక సంఘాల నాయకులకు ఫోన్లో సంఘీభావం తెలియజేశారు. కార్మికుల పోరాటానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసాఇచ్చారు. -
రెండో రోజూ అదే జోరు
► కొనసాగిన పారిశుధ్య కార్మికుల సమ్మె ► చాలా వీధుల్లో పేరుకుపోతున్న చెత్త ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీవీఎంసీ ► వ్యాధులు ప్రబలే ప్రమాదం ► మంత్రి గంటా ఇల్లు ముట్టడి నగరంలో పారిశుధ్యం పడకేసింది. జీవో 279 అమలు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలంటూ జీవీఎంసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కారణంగా క్లీన్ సిటీ కాస్తా చెత్త సిటీగా మారుతోంది. వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో జీవీఎంసీ పనులు చేపడుతున్నా.. అవి సగభాగానికి మాత్రమే పరిమితమయ్యాయి. మరోవైపు కార్మికులు సైతం తమ సమ్మె రెండో రోజు కొనసాగించారు. విశాఖ సిటీ : నగర పాలక సంస్థలో ప్రజారోగ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా ప్రభుత్వం తీసుకొస్తున్న జీవో 279పై కార్మికుల వ్యతిరేకత కొనసాగుతోంది. కార్పొరేషన్ అజమాయిషీకి చరమగీతం పాడుతూ, కార్మికులకు ఉద్యోగ భద్రతను దూరం చేసే జీవోను రద్దు చేయకుంటే.. ఆందోళన ఉధృతం చేస్తామనే హెచ్చరికలతో సమ్మె సాగుతోంది. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 1600 పర్మినెంట్, 4,130 మంది ఒప్పంద పారిశుధ్య కార్మికులుండగా.. వీరిలో ఒప్పంద కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. చెత్తను తరలించే వాహనాల డ్రైవర్లను కమిషనర్ హరినారాయణన్ కోరిక మేరకు సమ్మె నుంచి మినహాయించారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగులతో జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సగం చెత్తే తరలింపు నగరంలో రోజుకు సుమారు వెయ్యి మెట్రిక్ టన్నుల వరకూ చెత్త వస్తోంది. వీటిని ఏరోజు కారోజు డంపింగ్ యార్డుకు తరలించాలంటే కార్మికులంతా పనిచేయాల్సిందే. సింహభాగం కార్మికులు సమ్మెలో పాల్గొనడం వల్ల 1000 మెట్రిక్ టన్నుల్లో కేవలం 500 నుంచి 600 మెట్రిక్ టన్నులు మాత్రమే తరలించగలుగుతున్నారు. దీంతో వార్డుల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. డంపర్ బిన్లు నిండిపోవడంతో రోడ్డుపైనే చెత్తను పారబోస్తున్న పరిస్థితులు తలెత్తాయి. కాల్వలు చెత్తతో పూడుకుపోతున్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో ఇలా చెత్తతో నగరం నిండిపోతే వ్యాధులు ప్రబలే ప్రమాదముందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయం అంతంతమాత్రమే.. సమ్మె కారణంగా నగరంలో తలెత్తిన పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తొలి రోజున సమ్మె ప్రభావంతో కాస్తా చెత్త పేరుకుపోయింది. రెండో రోజుకు రెట్టింపు అవ్వడంతో తలకు మించిన భారంగా మారిపోయింది. దీంతో వెయ్యి మంది రెగ్యులర్ వర్కర్లతో పనులు చేయిస్తున్న జీవీఎంసీ ప్రజారోగ్య శాఖాధికారులు మరో వంద మందిని అదనంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న వర్కర్లను అదనపు పనిగంటలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి గంటా ఇంటి ముట్టడి జీవో రద్దుపై ప్రభుత్వం అవలంబిస్తున్న వి«ధానాలపై కార్మిక సంఘాలు దండెత్తుతున్నాయి. సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో 8 జోన్ల పరిధిలోని పారిశుధ్య కార్మికులు ఎంవీపీ కాలనీలోని మంత్రి గంటా ఇంటిని ముట్టడించారు. కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేటు కాంట్రాక్టర్లకూ లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. మూడు రోజుల సమ్మెను నిరవధిక సమ్మెగా మారుస్తామని సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్, యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు హెచ్చరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడంతో పీఏకు వినతి పత్రం ఇచ్చిన కార్మిక సంఘాల నేతలు ఇసుక తోట డబుల్ రోడ్డుపై రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సమ్మె సైరన్ ఆగింది జీవీఎంసీలో రెండు రోజులుగా మోగుతున్న సమ్మె సైరన్ తాత్కాలికంగా ఆగింది. జీవోనం.279ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 15 రోజుల తర్వాత పూర్తి వివరాలతో చర్చించేందుకు గడువు ఇచ్చింది. సమ్మెతో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తమవడంతో ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించింది. సంబంధిత శాఖ మంత్రి నారాయణ చర్చల్లో పాల్గొని సమ్మె విరమించాలని కోరినట్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) గౌరవాధ్యక్షుడు ఎం.ఆనందరావు తెలిపారు. రాత్రి 11 గంటల వరకూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్ సంఘ ప్రతినిధులతో చర్చించారని చెప్పారు. జీవోను తాత్కాలికంగా నిలిపేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో పాటు కార్మికులకు సంబంధించిన ఇతర సమస్యలపైనా 15 రోజుల తర్వాత చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారన్నారు. ఉద్యోగుల భద్రతపై ఆలోచించినందుకు ముఖ్య కార్యదర్శి వలవన్‌కు, సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు. -
తిరుమలకు తాకిన బంద్ ప్రభావం
తిరుమల: నేడు దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక బంద్ ప్రభావం చిత్తూరు జిల్లా తిరుమలను తాకింది. టీటీడీ కార్మికులు కూడా బంద్‌లో పాల్గొనడంతో పారిశుధ్య పనులకు తీవ్ర అంతరాయ కలుగుతోంది. దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
యూసీఐఎల్ కార్మికుల ధర్నా
వేముల : వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. దీంతో యూరేనియం తవ్వకాలతోపాటు, ఉత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇంటి భత్యం పెంచాలని, తమ పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించాలని, ఉచిత బస్సు సౌకర్యం, తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
30 రోజుల పోరాటం
వేతనాలు పెంచాలంటూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో నేటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కార్మికులపై ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. నేటి నుంచి ఆమరణ దీక్షలు - నిరవధికంగా కొసాగుతున్న మున్సిపల్ సమ్మె - పట్టుబిగిస్తున్న ప్రభుత్వం.. వెనక్కి తగ్గని కార్మికులు.. - పనిచేసిన రోజులకు జీతం చెల్లించని బల్దియా సాక్షి, హన్మకొండ : వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో 2015 జులై 6వ తేదీ నుంచి మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లతో పాటు జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగరపంచాయతీల్లో మొత్తం 3,074 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా వీరిలో 2051 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఏకధాటిగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరువవపోవడంతో అన్ని పురపాలక కార్యాలయ ఎదుట నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహారిస్తోంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకే వేతనాల పెంపును ప్రభుత్వం వర్తింప చేసింది. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పెంపుపై ప్రభుత్వం మౌన దాల్చింది. ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరిపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు మండిపడుతున్నారు. తమకు వేతనాలు పెంచే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కారణంగా ఇప్పటికే వరంగల్ నగరంతోపాటు మిగిలిన మున్సిపాలిటీలు అపరిశుభ్రంగా మారాయి. ఫాగింగ్, గ్యాంగ్ వర్క్‌లు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. నేటి నుంచి ఆమరణ దీక్షలు జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపంచాయతీలతో పోల్చితే గ్రేటర్ వరంగల్ పరిధిలో సమ్మె తీవ్రత కొనసాగుతూనే ఉంది. సమ్మెను నీరుగార్చే లక్ష్యంతో కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. చెత్త ఎత్తేందుకు 148 మంది దినసరి కూలీలను పనిలోకి తీసుకుంది. దానితోపాటే సమ్మెలో పాల్గొంటున్న 42 మంది కార్మికులపై వేటు వేశారు. దానితో క్రమంగా విధుల్లో చేరుతున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది. అరుునప్పటికీ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 318 మంది కార్మికులు ఇప్పటికీ సమ్మెలో పాల్గొంటున్నా రు. క్రమంగా సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల సం ఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో నేటి నుంచి ఆమరణ దీక్షకు కార్మికులు సి ద్ధమవుతున్నారు. 2015 ఆగస్టు 6 ఉదయం 10:00 గంటల నుంచి గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష మొదలవనుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు కార్మికులు. జీతాలు ఇవ్వని బల్దియా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు ప్రతీనెల 25 నుంచి 25 వరకు ఉన్న పని దినాలను లెక్కించి తొలివారంలో వేతనం చెల్లిస్తారు. జు లై ఆరు నుంచి సమ్మె కొనసాగుతోంది. దానితో జు న్లో ఆరు, జులైలో ఐదు రోజులు కలిపి మొత్తం ప దకొండు రోజుల వేతనాన్ని కార్పొరేషన్ నుంచి కా ర్మికులకు చెల్లించాల్సి ఉంది. ఆగస్టు 1వ తేదీన కార్మికులకు బల్దియా వేతనాలు చెల్లించింది. అయితే కా ర్మికులందరికీ వేతనం ఇవ్వలేదు. ప్రస్తుతం బల్దియా పరిధిలో మొత్తం 2,983 మంది కార్మికులు ఉండగా కార్పొరేషన్ అధికారుల సూచన మేరకు వీరిలో 1,453 మంది కార్మికులు జులై 25 నుంచి విధుల్లోకి వస్తున్నారు. కేవలం తమ విజ్ఞప్తిని మన్నించిన 1,45 3 మంది కార్మికులకే 11 రోజుల వేతనాన్ని బల్దియా చెల్లించింది. మిగిలిన కార్మికులకు అసలు వేతనాలు చెల్లించలేదు. వేతనం పొందిన 1,453 మంది కార్మికులకు సైతం అన్ని మినహాయింపులు పోను సగటు న ఒక్కో కార్మికునికి రూ 1100 జీతమే చేతికి అం దింది. చాలీచాలనీ వేతనంతో కాంట్రాక్టు కార్మికు లు తాము ఇబ్బంది పడుతోంటే, కార్పోరేషన్ అధికార యంత్రాంగం అభద్రత వాతవరణం కల్పిస్తోం దంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊరి నిండా ‘చెత్త’
కార్మికుల సమ్మెతో కంపుకొడుతున్న గ్రామాలు - దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలు, రోడ్లు - ప్రత్యామ్నాయ మార్గాలు చూడని పంచాయతీ అధికారులు - నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం - వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు ఇందూరు : పంచాయతీ కార్మికుల సమ్మె పారిశుద్ధ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గత నెల రోజులుగా తమను రెగ్యులర్ చేయాలంటూ వారు విధులు మానుకుని సమ్మెకు దిగడంతో గ్రామాలలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ప్రధానంగా రోడ్లు, మురికి కాలువలు ఆధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోంది. తద్వారా పల్లె ప్రజలు దోమల బెడదతో డెంగీ, విష జ్వరాలబారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 718 పంచాయతీలలో దాదాపు కాంట్రాక్టు, తాత్కాలిక ఇతర పద్ధ తులలో పని చేస్తున్న కార్మికులు మూడు వేల మందికి పైగా ఉన్నారు. వీరికి రెండు యూనియన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు యూనియన్ల కార్మికులు సమ్మె చేస్తున్నా రు. కార్మికులు రోజూ ప్రజలకు ఎలాంటి రోగాల రాకుండా రోడ్లను, మురికి కాలువలను పరిశుభ్రం చేసేవారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలిగించేవారు. అలాగే తాగునీ టి, వాటర్, విద్యుత్ దీపాలు వేసే బాధ్యతలు, పంచాయతీ కార్యాలయాలను శుభ్రంగా ఉంచే బాధ్యత కార్మికులపైనే ఉంది. కానీ గత నెల రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. చెత్తతో, దుమ్ము దూళితో మండల కేంద్రాలతో పాటు చిన్న చిన్న గ్రామాలు ఆధ్వానంగా త యారయ్యాయి. ఇదిలా ఉండగా మురికి కాలువలు తీయకపోవడం, నీరు నిలువ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెదడ తీవ్రం కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటు వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లె వారు లేకపోవడంతో ట్యాంకులు కూడా ఆపరిశుభ్రంగా మారాయి. పట్టించుకోని పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పంచాయతీ శాఖ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గ్రామాలన్నీ చెత్తతో నిండిపోతున్నా, మురికి కాలువలు కంపు కొడుతున్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. పన్నులు వసూలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ, అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన పారిశుద్య పనులపై ఎందుకు చూపడం లేదని పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వమైన స్పందించి కార్మికులచే సమ్మెను విరమింపజేయాలని, లేదా అధికారులు ప్రత్యామ్నయ మార్గాలతో గ్రామాలను పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు. -
ఏం చేద్దాం..
- కార్మికుల సమ్మెపై డిప్యూటీ సీఎం శ్రీహరి ఆరా - వేతనాల పెంపుపై కమిషనర్‌తో సమాలోచనలు - ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులపై చర్చ - రూ.వెయ్యి పెంచేందుకు బల్దియా సిద్ధం? వరంగల్ అర్బన్ : కార్మికుల సమ్మెతో మహా నగరంలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఎట్టకేలకు జోక్యం చేసుకుంది. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరికి కమిషనర్ నివేదిక సమర్పించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె.. గ్రేటర్ అర్థిక పరిస్థితి, కార్మికుల డిమాండ్లు, మహా నగరంలో చెత్త, మురుగు సమస్యలపై సమాలోచనలు చేశారు. బల్దియాకు ప్రతి ఏటా ఆస్తి పన్ను రూపంలో జమ అవుతున్న సొమ్మును మాత్రమే ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలుగా అందించాల్సి ఉందని కమిషనర్ వివరించారు. గత ఏడాది పన్నుల టార్గెట్ రూ. 40 కోట్లు ఉండగా, రూ. 38 కోట్లు వసూలయ్యూయన్నారు. గ్రేటర్ పరిధిలో 2,994 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిపై వివిధ విభాగాల్లో విధులు నిర్త్రిస్తున్నారని... ఏడాదికి వేతనాల రూపంలో వీరికి ప్రస్తుతం రూ.40.74 కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల డిమాండ్ మేరకు కనీస వేతనాలను పెంచితే బల్దియాపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న వేతనానికి అదనంగా రూ.వెరుు్య పెంచితే ఏడాదికి రూ.45 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, రూ.2వేలు పెంచితే రూ.50 కోట్లు, రూ.3వేలు పెంచితే రూ. 55 కోట్లు పంపిణీ చేయాలని వివరించారు. ఇంత మొత్తంలో చెల్లించలేమని, ఒక్కో కార్మికుడికి రూ.వెరు్య చొప్పన వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరికి కమిషనర్ వివరించినట్లు సమాచారం. 2015-16 బడ్జెట్లో నగర ప్రజలపై ఎలాంటి ఆస్తి భారం మోపకుండా అంచనాలను రూపొందించామని, ఈ నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనాలను పెంచడం బల్దియాపై పెనుభారమేనని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా బల్దియా ఆర్థిక పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు బల్దియూ అధికార వర్గాలు చెబుతున్నారుు. మహా నగరంలో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోందని, మురుగు నీరు నిలవడంతో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పర్మినెంట్ కార్మికులు ప్రధాన రహదారుల్లో చెత్తను మడికొండ డంప్ యార్డుకు తరలిస్తున్నారని, కొంత మంది దినసరి కూలీలలను విధుల్లోకి తీసుకున్నట్లు కమిషనర్ ఆయనకు వివరించారు. -
అంతా నాలుగు రోజుల్లోనే..
- ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అల్టిమేటంతో స్పందించిన సర్కార్ - బంద్ హెచ్చరికతో దిగొచ్చిన వైనం విజయవాడ సెంట్రల్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె అంశంలో నాలుగు రోజుల్లోనే అద్భుతం జరిగింది. నాలుగు రోజుల్లో విధుల్లో చేరకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామంటూ ప్రభుత్వం డ్వాక్వా, సీఎంఈవై కాంట్రాక్టర్లకు ఈనెల 22న నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రబంద్ తప్పదని ప్రభుత్వానికి ఈనెల 23వ తేదీన అనంతపురం జిల్లా కంబదూర్ మండలం తిమ్మాపురం నుంచి అల్టిమేటం ఇచ్చారు. జగన్ ఇచ్చిన భరోసా కార్మిక వర్గానికి ఊపిరులూదింది. 24న చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం కావడానికి దోహదపడింది. దీంతో కంగుతిన్న సర్కార్ యూనియన్ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించింది. దిగిరాక తప్పలేదు ఈనెల 17న బందరురోడ్డులోని గేట్‌వే హోటల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరగా, సీఎం ససేమిరా అన్నారు. కార్మికులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పోరాటంలో కీలక భూమిక పోషించారు. మెడలు వంచాం.. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన రాష్ట్ర బంద్‌తో సర్కార్ దిగిరాక తప్పలేదు. మొండిపట్టు వీడి జీతాల పెంపుదలకు అంగీకరించింది. ప్రభుత్వం మెడలు వంచిన ఘనత జగన్‌కే దక్కుతుంది. కార్మికుల పోరాటానికి వైఎస్సార్ సీపీ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది. ఇది సమష్టి విజయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మార్చుకోవాలి. ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సానుకూల ధోరణిలో వ్యవహరిస్తే మంచిది. - బీఎన్ పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ -
పరుచుకొనేనా పచ్చందం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలోనే ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని, పచ్చందాలు ఆపాదించి పర్యావరణ సమతుల్యం సాధించాలన్న సదాశయంతో తలపెట్టిన యజ్ఞమే హరితహారం. అయితే ఇప్పుడు మొక్కలు నాటడం కంటే వాటి సంరక్షణ బాధ్యత పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ లేకపోవడంతో చాలా మంది బాధ్యతగా కన్నా భారంగా భావిస్తూ తూతూ మంత్రంగా చేపడుతున్నారనే విమర్శలున్నాయి. తూప్రాన్: ‘హరితహారం’ కార్యక్రమానికి ముఖ్యంగా నీళ్లు, సంరక్షణ అవరోధంగా మారుతున్నాయి. ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తే మొక్కల పెంపకం సులభతరం అవుతుందని భావించారు. ప్రతి గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు రానున్న మూడేళ్లలో నాటాలని లక్ష్యం కాగా జిల్లాలో చాలా గ్రామాల్లో తాగడానికే నీరు దొరకని పరిస్థితి ఇప్పుడు. పాఠశాలల్లోనూ నీటి కొరతే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వేల మొక్కలను నాటడం అంత సులభమైన పని కాదు. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న చాలా మొక్కల్లో ఒక్క టేకు మినహా ప్రతిదీ పశువులు తినడానికి అస్కారం ఉన్నదే. ఇక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే అస్కారం ఉన్న గ్రామాలు, కుంటలు, పొలాలు, గట్లు తదితర ప్రదేశాల్లో నాటిన మొక్కల సంరక్షణ కత్తిమీదసామే. సమ్మె దెబ్బ... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది సమ్మె చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా పనులు నిలిచిపోయాయి. నెల రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో ఉపాధి హామీ పనులు పూర్తిగా బందయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీవో ఇలా మొత్తం సిబ్బంది సమ్మెలో పాల్గొంటుండటంతో పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లాలో 37,520 శ్రమశక్తి సంఘాలు ఉండగా జాబ్ కార్డులు కలిగినవారు 5,56,753 మంది ఉన్నారు. తూప్రాన్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కో పంచాయతీ 40 వేల మొక్కలు పెంచేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ.. కార్మికుల సమ్మెతో ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. -
'ప్రభుత్వ ప్రకటన ఉద్దేశం సరిగా లేదు'
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రకటన ఉద్దేశం సరిగా లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీతాల పెంపుదల రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తింజేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్న కార్మికులను తొలగిస్తామనడం ఏకపక్షం, దారుణమని ఆయన అన్నారు. అందుకు తాము అంగీకరించమంటూ తమ్మినేని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
కార్మికుల సమ్మె ఉధృతం
కరీంనగర్ : పదవ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా వేతనాలు పెంచాలని పురపాలక శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించాలని, సిబ్బందిని క్రమబద్దీకరిస్తూ పీఎఫ్, ఈఎస్ఐ ఆమలు చేయాలని, ఈజీఎస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. బుధవారం కలెక్టరేట్ ముందు పది వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షల్లో వామపక్ష పార్టీల నాయకులు గీట్ల ముకుందరెడ్డి, బోయిని అశోక్, జిందం ప్రసాద్, కొలిపాక కిషన్, పైడిపల్లి రాజు, గుడికందుల సత్యం, కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి, ఎర్రవెల్లి ముత్యంరావు పాల్గొన్నారు. హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ ఇంటి ముందు కార్మికులు బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని వెనక్కి పంపించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అద్దెకు ఉంటున్న ఇంటిని ముట్టడించి కార్మికులు నిరసన తెలిపారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు స్థానిక ఎంపీపీ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు బట్టలు పంపిణీ చేస్తుండగా కార్మికులు వెళ్లి నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే కార్మికులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వరాల రవికుమార్ ఆధ్వర్యంలో ముట్టడించారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు ఇంటిని ముట్టడించిన కార్మికులు ఆయన లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించి వెనుదిరి గారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఇంటిని ముట్టడించి బైఠాయించిన కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మె విరమణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కార్మికులతో అక్కడి నుంచే మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడించారు. మానకొండూరు లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిని ముట్టడించి ఆయన లేకపోవడంతో అల్గునూరు చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ధర్మపురిలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర ఎక్స్‌రోడ్‌లో గల ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు కార్మికులు నిరసన చేపట్టి ఇంటికి వినతిపత్రాన్ని అంటించి వెళ్లిపోయారు. మంథని, పెద్దపల్లిలో ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి ఇళ్ల ముందు ధర్నా నిర్వహించి వారు లేకపోవడంతో మంథనిలో సర్పంచ్‌కు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి పీఏకు వినతిపత్రం సమర్పించి వెనుదిరిగారు. జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి ముందు కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇంటి ముందు ధర్నా నిర్వహించి సమస్యలను విన్నవించారు. ఆయన జోక్యం చేసుకొని తన పరిధిలోని సమస్య కాదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. -
బాబోయ్ కంపు..!
♦ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతం ♦ చెత్తకుప్పలుగా మారిన పట్టణాలు ♦ జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ♦ గుంటూరులో కమిషనర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు... ♦ మంచినీరు, వీధిదీపాల సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరిక అరండల్‌పేట(గుంటూరు) : పురపాలక సంఘాలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పారి శుధ్య కార్మికుల సమ్మె ఉధృతమైంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుండడంతో వీధులన్నీ చెత్తతో పేరుకుపోయాయి.ప్రధానంగా జిల్లాలోని 12పట్టణాలు, గుంటూరు నగరం మురికి కూపాలుగా మారిపోయాయి. రోడ్లపై చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీనికితోడు వర్షం కురవడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ వీధి చూసినా చెత్త, చెదారంతో నిండిపోయి కంపుకొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు త్వరితగతిన వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, డెంగీ, వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్మికుల నిరవధిక నిరాహార దీక్షలు కార్మికులకు కనీసవేతనం రూ.15వేలు ఇవ్వాలని, అలాగే పదవ వేతన సవరణను పర్మనెంట్ కార్మికులకు అమలు చేయాలని, జీఓ నంబరు 261 అమలుతో పాటు మొత్తం 17 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. అయితే రాష్ట్రప్రభుత్వం రెండు విడతలుగా వీరితో చర్చలు జరిపినా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. తొలివిడత చర్చల్లో కార్మికులకు కనీస వేతనం రూ.13వేలు ఇస్తామని ఒప్పుకున్న ప్రభుత్వం తర్వాత మాటమార్చి తొమ్మిది, పదివేలంటూ బేరాలాడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు రెండు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలకు దిగారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లోని పురపాలక సంఘాల ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గుంటూరులో కమిషనర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు... జిల్లాలోని అన్ని పట్టణాల్లో పర్మనెంట్ కార్మికులతో పారిశుధ్య పనులు చేయించాలని ఉన్నతాధికారులు కమిషనర్లను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, కమిషనర్లు పర్మనెంట్ కార్మికులు విధుల్లోకి రావాల్సిందిగా హెచ్చరికలు జారీచేశారు. దీన్ని ఖాతరు చేయక పోవడంతో వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. అదేసమయంలో గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఇన్చార్జి కమిషనర్ సి.అనురాధలు మార్కెట్ల వద్ద చెత్తను త రలించేందుకు బుధవారం ప్రయత్నించగా కార్మికులు, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. అదేవిధంగా చెత్తను తరలించే వాహనాల్లో గాలి తీశారు. దీంతో అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లాలోని అన్ని పట్టణాల్లో మంచినీరు, వీధిదీపాల సేవలను సైతం నిలిపివేస్తామని యూనియన్నాయకులు ప్రకటించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం : వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సర్కర్ పై ఎటాక్
- వాహనాల గాలి తీసి.. డ్రెయినేజీ పైపులు కోసేసి.. - దాడులకు దిగుతున్న సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులు - పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్ వీరపాండియన్ - రంగంలోకి డ్వాక్రా మహిళలు - అడ్డుకుంటే అరెస్టులు తప్పవని హెచ్చరిక విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటివరకు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన కార్మికులు సోమవారం రాత్రి వెహికల్ డిపోలోని వాహనాల్లో గాలి తీసేశారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైపులు కోసేశారు. పారిశుధ్య విధులు నిర్వర్తించేందుకు వచ్చిన కాం ట్రాక్ట్ కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికుల చర్యలపై మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సీరియస్ అయ్యారు. డీసీపీ కాళిదాసుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ రక్షణ మధ్య పారిశుధ్య పనులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే అరెస్ట్‌లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజారోగ్య, ఇంజినీరింగ్, యూసీడీ, విద్యాశాఖ, కాంట్రాక్టర్లతో మంగళవారం కౌన్సిల్ హాల్లో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. మీరేం చేస్తున్నారు? పారిశుధ్య పనులు నిర్వహించేందుకు డ్వాక్రా మహిళలు ముందుకు వస్తున్నా ఔట్ సోర్సింగ్ కార్మికులు అడ్డుకుంటున్నారని కాంట్రాక్టర్ తుపాకుల రమణమ్మ కమిషనర్‌కు చెప్పారు. 25, 26 డివిజన్లలో పారిశుధ్య పనులు చేయడానికి వచ్చిన మహిళలపై దాడులు చేశారని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉంటే ఏం చేస్తున్నారంటూ ఏఎంవోహెచ్‌లు, సీఎంవోహెచ్లను కమిషనర్ నిలదీశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇంటికి వెళ్తారని హెచ్చరించారు. కార్పొరేషన్లో పనులు చేయడానికి చాలామంది ముందుకు వస్తారని, వారికి రక్షణ కల్పించే బాధ్యత అధికారులే తీసుకోవాలని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనులు చేసే మహిళలకు రోజుకు రూ.275 చొప్పున వేతనం అందిస్తామన్నారు. ఇందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.25వేల చొప్పున కేటాయించినట్లు ఆయన తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ వర్క్స్ విధులు నిర్వర్తించేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల వైఖరిపై కమిషనర్ మండిపడ్డారు. ‘సమ్మెతో మీకేం సంబంధం లేదు. టెండర్ ప్రకారం కార్మికుల్ని సరఫరా చేయాల్సిందే. లేదంటే మిమ్మల్ని (కాంట్రాక్టర్లు) తొలగించి, కొత్తవారికి టెండర్ ఇస్తాను.’ అని కమిషనర్ మండిపడ్డారు. ఈ మేరకు నోటీసులు జారీ చేయాల్సిందిగా చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. స్ఫూర్తి కలిగించండి విద్యార్థులు, ప్రజల్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తి కలిగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులే కాకుండా ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలను పారిశుధ్య పనుల్లో భాగస్వాముల్ని చేయాలన్నారు. సమ్మె కారణంగా నగరంలో నెలకొన్న పరిస్థితుల్ని వివరించాలన్నారు. ప్రతి ఒక్క అధికారి దీన్ని సవాల్‌గా తీసుకోవాలని, వాహనాల కొరత రానీయొద్దని ఇంజినీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణరావు, ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, సీఈ ఎంఏ షుకూర్, సీఎంవోహెచ్ ఎం.గోపీనాయక్, పలువురు ఈఈలు, డీఈలు, ఏఎంవోహెచ్‌లు పాల్గొన్నారు. -
జనం నెత్తిన 50,000 టన్నుల చెత్త
కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడ చూసినా చెత్తా చెదారం అంటు రోగాలు, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం మంగళవారం హైదరాబాద్‌తో సహా పలుచోట్ల భారీ వర్షం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయంటున్న సర్కారు సమ్మె కొనసాగుతుందని కార్మిక జేఏసీ ఉద్ఘాటన హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలన్నీ చెత్తమయం అయిపోయాయి. ఏకంగా 50 వేల టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీనికితోడు డ్రైనేజీలు పూడుకుపోయి మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చాలా చోట్ల ముక్కు పగిలిపోయేలా దుర్వాసన వెలువడుతోంది. చెత్తాచెదారంపై దోమలు, ఈగలు పెరగడంతో.. డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికు న్‌గున్యా లాంటి విష జ్వరాలు, డయేరియా తదితర అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉంది. పారిశుద్ధ్య కార్మికులు 9 రోజులుగా చేస్తున్న సమ్మెతో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 30 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోగా.. మిగతా 67 నగరాలు, పట్టణాల్లో 20 వేల టన్నుల చెత్త చేరినట్లు అంచనా. ఇక మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, కాలనీలు, వీధుల్లో మురుగునీటి ప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకువచ్చింది. ఇరు వర్గాల మొండిపట్టు రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నా ప్రభుత్వం పట్టువీడడం లేదు, కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం కూడా సమ్మె విరమణ సాధ్యం కాలేదు. సమ్మె విరమించి విధుల్లో చేరని కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని సోమవారం సీఎంవో చేసిన హెచ్చరికలు మాత్రం కొద్దిగా పనిచేసినట్లు కనిపించాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని 18 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్లో 14 వేల మంది విధుల్లో చేరారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పగా.. అలాంటిదేమీ లేదని కార్మిక సంఘాల జేఏసీ కొట్టిపారేసింది. సమ్మె యథాతథంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. భయభ్రాంతులకు గురిచేయడంతో కార్మికులు కొందరు విధుల్లో పాల్గొన్నారని, మెజారిటీ కార్మికులు సమ్మెలోనే ఉన్నారని పేర్కొంది. నిరసనలు చేస్తున్న కార్మికులు అరెస్ట్ మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై అటు కార్మికసంఘాలు, ఇటు ప్రభుత్వం ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న దాదాపు 400 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. విధులకు హాజరైన కార్మికులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని అరెస్టు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు మరోసారి స్పష్టం చేశాయి. సీఎం వైఖరి మార్చుకోవాలి: కృష్ణయ్య పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తుంటే... సైనికులు, పోలీసులను రంగంలోకి దించుతామని బెదిరించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సైనికులు ఉన్నది దేశరక్షణ కోసమని, కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ నిర్ణయాలను అమలుచేయడానికి కాదని ఒక ప్రకటనలో విమర్శించారు. కార్మికులను భయపెట్టి లొంగదీసుకోవడం సరికాదని, సీఎం ఈ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ‘వారిని తొలగిస్తాం’ కార్మికులు తొలుత విధుల్లో చేరాలని, మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం వారి డిమాండ్ల ను పరిష్కరిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. విధుల్లో చేరని వారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్య విభాగంలో 18,382 మంది కార్మికులకు 14,268 మంది మంగళవారం విధులకు హా జరైనట్లు చెప్పారు. కార్మికుల సమ్మె వెనుక బ యటి వ్యక్తుల ఒత్తిడి ఉందని ఆరోపించారు. సమ్మె జరిగినప్పటికీ రోజూ దాదాపు మూడు వేల టన్నుల చెత్తను తరలించామన్నారు. -
పట్టు.. బెట్టు
- పట్టు వీడని ప్రభుత్వం - మెట్టు దిగని కార్మిక సంఘాలు - పోలీసులతోనైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతాం - విధుల నుంచి తొలగిస్తాం - సర్కారు హెచ్చరిక - బెదరని కార్మికులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటుతోంది. విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు దిగివచ్చేది లేదని కార్మిక సంఘాలు పంతాలకు పోతున్నాయి. సమ్మె ప్రారంభమై వారం రోజులు దాటినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పదో పీఆర్సీకిఅనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,170, ఇతర కార్మికులకు రూ.17,380 చెల్లించాల్సిందేనని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. వేతనాలు పెంచేందుకు సిద్ధంగానే ఉన్నామని, వెంటనే విధులో ్లచేరాల్సిందిగా ప్రభుత్వం చేసిన వినతిని సంఘాలు పట్టించుకోలేదు. ఎంత పెంచుతారో చెప్పకుండా సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం అంతే స్థాయిలో పట్టుదలకు పోతోంది. పోలీసులను రంగంలోకి దింపైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొండిగా వ్యవహరిస్తే మంగళవారం నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించింది. సీఎం అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయంలోగా విధుల్లో చేరకుంటే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పరిధిలోని కార్మికులంతా విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. శాశ్వత ఉద్యోగులుగా ఉన్న కార్మికులు గైర్హాజరైతే సీసీఏ నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నాయకుల వల్లనే.... కొంతమంది సంఘాల నాయకుల ఉచ్చులో పడి కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కాదని గుర్తించింది. అయినా... వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని పేర్కొంది. సమ్మె విరమణ కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదివారం రాత్రి నుంచి విస్తృత ప్రయత్నాలు చేశారు. విధుల్లోకి రావాలని... వేతనాలు పెంచే పూచీ తనదని హామీ ఇస్తూ కార్మికులందరికీ ఎస్ఎంఎస్లు పంపారు. సోమవారం ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. నగరంలో నిర్మించనున్న రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జీహెచ్ఎంసీ కార్మికులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తాను కమిషనర్‌ను కాగానే రూ.6,500గా ఉన్న వేతనాన్ని రూ.8,500కు పెంచామన్నారు. రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించాలని కోరారు. మరోవైపు తమ వేతనం రూ.14,170కి పెంచే వరకు వెనకడుగు లేదని కార్మిక సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. ఈ ఒక్క డిమాండ్ తీరిస్తే ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరుతారని, మిగతా వాటి గురించి ఆలోచించరని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఎవరెవరు? మిగతా కేటగిరీల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు (పట్టభద్రులు), డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, సీఏడీ ఆపరేటర్లు, జీఐఎస్ అనలిస్టులు, టీమ్‌లీడర్లు, కోఆర్డినేటర్లు, డ్రాఫ్ట్స్‌మెన్, ఓఎస్సార్టీ అనలిస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్లు (ఐటీఐ/నాన్ టెక్నికల్), ఎలక్ట్రీషియన్లు, లైన్మన్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్లు, రవాణా విభాగంలో డ్రైవర్లు, సీనియర్ ప్రోగ్రామర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు. ఇవి నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించినవి. మిగతా కేటగిరీల్లో సెమి స్కిల్డ్, స్కిల్డ్, సుపీరియర్ కేటగిరీలు ఉన్నాయి. నాలుగో తరగతి ఉద్యోగులు దాదాపు 24,800 మంది ఉన్నారు. మిగతావారు మరో రెండు వేల మంది. -
నీళ్లు బంద్.. కరెంట్ కట్
సంగారెడ్డి మున్సిపాలిటీ : మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. పారిశుద్ధ్య పనులు ఇప్పటికే నిలిచిపోగా, ఆదివారం నుంచీ జిల్లా వ్యాప్తంగా ఆయా మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో విద్యుత్, తాగునీటి సేవలనూ బంద్ చేశారు. శనివారం కార్మికశాఖ మంత్రితో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి అత్యవ సర సేవల్ని నిలిపివేశారు. దీంతో జిల్లాలోని 5 మునిసిపాలిటీలు, 2 నగర పంచాయతీలతో పాటు 2 గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. వీధి దీపాలు వెలగలేదు. ఎక్కడెక్కడ ఎలా ఉందంటే.. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మునిసిపల్ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న 90 మంది కాంట్రాక్ట్ కార్మికులు సేవల్ని నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. మంజీర, రాజంపేట ఫిల్టర్బెడ్ల వద్ద నీటి సరఫరా విభాగాలకు తాళం పడింది. దీంతో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితి చక్కదిద్దడానికి మునిసిపల్ కమిషనర్ జోక్యం చేసుకోగా.. కార్మికులు తిరగబడ్డారు సదాశివపేట మునిసిపాలిటీలోనూ మంజీర నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది జోగిపేట నగర పంచాయతీలో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సత్యసాయి నీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీళ్లు కాలనీలకు చేరడం లేదు మెదక్ మునిసిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది ముఖ్యమంత్రి ఇలాఖాలోని గజ్వేల్ నగర పంచాయతీలో కార్మికులు నీటి సరఫరా నిలి పివేశారు. వీధి దీపాలు వెలగక పట్టణం అంధకారంలో మునిగింది సిద్దిపేట మున్సిపాలిటీలో 300 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో కొద్దిపాటి రెగ్యులర్ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ప్రజలకు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఆదివారం పట్టణానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్లలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎటుచూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. అధికారులు తాగునీటి విభాగంలో పనిచేస్తున్న కార్మికులపై ఒత్తిడి తెచ్చి నీటిని వదిలేందుకు యత్నించగా, కార్మిక సంఘాలు ప్రతిఘటించాయి. -
‘ఎస్మా’త్ జాగ్రత్త!
నేడు స్వచ్ఛ హైదరాబాద్ అందరూ పాల్గొనాల్సిందే సిటీబ్యూరో: ప్రజారోగ్యాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే ‘ఎస్మా’ ప్రయోగిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా రెండో శనివారమైనప్పటికీ నేడు జీహెచ్ఎంసీ పని చేస్తుందని, ఉద్యోగులంతా విధిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి బదులుగా మరో రోజు సెలవుగా ప్రకటిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరూ విధుల్లో పాల్గొనాలని కోరారు. అవసరమైతే ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. పారిశుద్ధ్య విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి సర్కిల్ కార్యాలయాల సూపర్వైజరీ అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ... శనివారం నుంచి విధులకు హాజరయ్యే ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు రెట్టింపు వేతనం. రెగ్యులర్ డ్రైవర్లకు అదనంగా రూ.100 చెల్లింపు. శనివారం ఉదయం కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు ఉన్నతాధికారులందరూ విధిగా స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనాలి. విధులకు హాజరయ్యే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హాజరు నమోదు. అన్ని వాహనాలు విధిగా రిపోర్ట్ చేయాలి. విధులకు హాజరు కాని వాహనాల కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు. {పధాన వీధుల్లోని డస్ట్బిన్లన్నీ ఖాళీ చేయాలి. పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులంతా విధుల్లో ఉండాలి. విధులకు రండి.. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మెలో ఉన్న కార్మికులంతా వెంటనే విధులకు హాజరు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హోం మంత్రి సమక్షంలో జీహెచ్ఎంసీలోని ప్రధాన కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ నెలాఖరులోగా ప్రభుత్వం విధాన ప్రకటన చేస్తుందని ప్రకటించారన్నారు. రంజాన్, బోనాలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
సమ్మెకు సైరన్!
- నేటి నుంచి మునిసిపల్ కార్మికుల సమ్మె - పారిశుద్ధ్యం, నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం - ఆందోళనలో ప్రజలు చిత్తూరు(అర్బన్): తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మునిసిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాటపట్టనున్నారు. రాష్ట్ర కార్మిక సంఘనాయకుల పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. తమ సమస్యలు తీర్చేవరకు నిరవధిక సమ్మె చేస్తామని గురువారం జిల్లాలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు, అధికారులకు కార్మికులు సమ్మె నోటీసులు జారీచేశారు. కార్మికుల సమ్మె ఫలితంగా నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో దాదాపు 1,100 మంది శాశ్వత ప్రాతిపదికన, 3 వేల మందికి పైగా తాత్కాలిక పద్ధతిన కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రులు సైతం రోడ్లపై చెత్తను తీయడం, కాలువల్లో పూడికలు తీయడం లాంటి పనులను చేస్తున్నారు. అయితే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏడాది కాలంగా ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందచేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొన్ని మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వీధి దీపాల నిర్వహణ, నీటి కొళాయిల ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. తాగునీటి సరఫరాపై సమ్మె ప్రభావం పడనుంది. ఇవీ డిమాండ్లు... - జీవో నెం - 263ను పునరుద్ధరించి 1994 నుంచి పదవీ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. - పారిశుద్ధ్య పనుల్లో జీవో నెం - 581ను అమలు చేసి గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలి. - 1993 కంటే ముందు నుంచి టైమ్‌స్కేల్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే పర్మినెంట్ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను సైతం పర్మినెంట్ చేయాలి. - దశాబ్దాల కాలంగా కార్మికులు నివసిస్తున్న మునిసిపల్ క్వార్టర్స్‌ను రెంట్‌ఫ్రీ క్వార్టర్స్‌గా పరిగణించి కార్మికులకు అప్పగించాలి. - కార్మికులకు వాషింగ్ అలవెన్స్, కుట్టుకూలీ పెంచాలి. వ్యక్తిగత జీపీఎఫ్ నెంబర్లు కేటాయించాలి. - ప్రభుత్వ సెలవు దినాల్లో కార్మికులకు పూర్తిగా సెలవులు అమలు చేయాలి. - సీడీఎంఏ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలి. -
ఎక్కడి చెత్త అక్కడే..
కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిగి : పంచాయతీ కార్మికుల సమ్మెతో పరిగి పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పరిసరాలు, రోడ్లు, మురికికాలువలు, చెత్త కుండీలు పరిశుభ్రంగా ఉంచే పంచాయితీ కార్మికులు సమ్మె బాటపట్టడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పట్టణంలో ఉన్న చెత్తకుండీలు పూర్తిగా నిండిపోయాయి. టీచ ర్స్ కాలనీకి వెళ్లే దారిలో, బస్టాండ్ ముందు, కూరగాయాలు విక్రయించే రోడ్ల పై చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పరిసరాలు దుర్గంధంతో నిండిపోయాయి. కార్మికులు సమస్యను పరిష్కరించటంలో పాలకులు చిత్తశుద్ధి చూపటం లేదు. ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపించటంలేదు. గ్రామాల్లో నీళ్లు వదలడం, వీధిలై ట్లు ఆన్, ఆఫ్ చేయడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో తాత్కాలి కంగా పనులను వేరేవారికి అప్పగించిన పాపాన పోవడంలేదు. సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన కుప్పలు ఇబ్రహీంపట్నం: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ‘పట్నం’ నగర పంచాయతీలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. అంబేద్కర్ చౌ రస్తా సమీపంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతం, పెట్రోల్‌బంక్ ప్రాంతం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి సమీపంలో, పోచమ్మబస్తీ, రాయ్‌పోల్ రోడ్డులోని పాత పోలీస్‌స్టేషన్ ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. తీవ్ర దుర్గంధంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య ఇలాగే ఉంటే.. అంటురోగాలు, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడకేసిన పారిశుద్ధ్యం తాండూరు: కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టడంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. నాలుగు రోజులుగా కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో తాండూరు మున్సిపాలిటీలో కాలనీలు, వార్డులు కంపుకొడుతున్నాయి. చెత్తకుప్పలు ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో భరించలేని దుర్గంధంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు, పాలక మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించకపోవడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమల బాధ తీవ్రమైంది. ఇక కాలనీలు, వార్డుల్లో వ్యర్థపదార్థాలు, చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ స్తంభించింది. నాలుగు రోజులుగా సుమారు 160 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లతో అధికారులు, పాలకమండలి చెత్తను ఎందుకు తొలగించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రోజులు ఈ ‘కంపు’ భరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతం
హైదరాబాద్ : కనీస వేతనాలు పెంపుతోపాటు 16 డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతమవుతోంది. ఫలితంగా జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 17 నగర పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడోరోజుకు చేరింది. కార్మికులు విధులను బహిష్కరించడంతో చెత్త పేరుకుపోతోంది. ఇక సమ్మె విరమింపచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రమంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి కార్మిక సంఘాల ఐక్యవేదికతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి జిల్లా డివిజన్‌స్థాయిల్లో ఆందోళన చేపడతామని జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. -
సమరానికి సై...
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో జూలై 1 నుంచి సమ్మె చేస్తామంటూ పలు కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 16నే సమ్మె నోటీసు సైతం ఇచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైన నేపథ్యంలో.. సోమవారం మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం మొత్తం 111 మున్సిపాలిటీల్లో నిరసనలు తెలిపేందుకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. తాము జూన్ 16నే సమ్మె నోటీసిచ్చినా ప్రభుత్వం తాత్సారంపై అవి తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు పురపాలక మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. ప్రధాన డిమాండ్లివే... : మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు వర్తింపచేయాలి ఈ సవరణ ప్రకారం కనీసం వేతనం రూ.15,432 ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలివ్వాలి. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు.. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి సోమవారం నాటి చర్చల్లో ప్రభుత్వం అంగీకరించకపోతే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మె చేస్తాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం. -కె.ఉమామహేశ్వరరావు, జేఏసీ నాయకులు(సీఐటీయూ) -
అమాంతం పెరిగిన విద్యుత్ బిల్లులు
స్పాట్ బిల్లింగ్‌లో జాప్యంతో వినియోగదారులపై భారం కార్మికుల సమ్మె సాకుగా డిస్కంల దోపిడీ హైదరాబాద్: స్పాట్ బిల్లింగ్‌లో జాప్యం జరగడంతో విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా ఏప్రిల్ నెల విద్యుత్ వినియోగానికి స్పాట్ బిల్లింగును పది రోజులు ఆలస్యంగా చేశారు. వ్యవధి దాటిన తర్వాత జరిగిన వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీటర్ రీడింగ్‌లను సేకరించారు. దాదాపు 40 రోజుల వినియోగం కింద అధిక యూనిట్లకు బిల్లింగ్ జరిగింది. దీంతో టారిఫ్ స్లాబులు మారిపోయి బిల్లులు అమాంతం పెరిగాయి. స్లాబుల్లో తేడాతో యూనిట్ ధర కూడా మారిపోతుంది. బిల్లింగ్‌లో జాప్యం జరిగినట్లు తెలిసినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు బరితెగించి వినియోగదారులను దొంగదెబ్బ తీస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వినియోగదారులనే బలి చేస్తున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలో గృహ వినియోగదారులు గత మార్చి నెలలో 464 మిలియన్ యూనిట్లను వినియోగించగా, రూ.178 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. ఇక ఏప్రిల్‌లో ఆలస్యంగా మీటర్ రీడింగ్‌ను నమోదు చేయడంతో వినియోగం ఏకంగా 583 మిలియన్ యూనిట్లకు పెరిగింది. బిల్లులు సైతం రూ.264 కోట్లకు ఎగబాకాయి. మార్చితో పోల్చితే విద్యుత్ వినియోగం 23 శాతం, సంస్థ ఆదాయం 48 శాతం పెరిగిపోయింది. సగటున యూనిట్ చార్జీ రూ.7.22 వసూలవుతోంది. పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర కేటగిరీల వినియోగదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టారీఫ్ స్లాబుల్లో ఒక్క యూనిట్ తేడా వచ్చినా బిల్లు భారీగా పెరిగిపోతోంది. ఉదాహరణకు 100 యూనిట్ల వినియోగానికి రూ.202.50 బిల్లు వస్తుండగా, 101 యూనిట్లకు రూ.263.60 బిల్లు చెల్లించాల్సి వస్తోంది. -
సమ్మెతో రూ.105 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సమ్మెతో తెలంగాణలో ఆర్టీసీపై తీవ్ర ప్రభావమే పడింది. 9 రోజుల్లో దాదాపు రూ.105 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. వేసవి సెలవులు, శుభకార్యాల వల్ల మే నెలలో ప్రయాణాలు అత్యధికంగా ఉంటాయి. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ఆర్టీసీకి భారీ ఆదాయం ఉంటుంది. మామూలు రోజుల్లో నిత్యం సగటున రూ.9 కోట్ల వరకు ఆదాయం ఉంటే మే నెల తొలి వారంలో అది సగటున 12.50 కోట్లను దాటింది. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో రెండో వారంలో ఆదాయం మరింత పెరిగేది. సరిగ్గా ఇదే సమయంలో కార్మికుల సమ్మె వల్ల ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. సమ్మె కాలానికి వేతనాలను చెల్లించనున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. డీజిల్, మరమ్మతుల ఖర్చును తీసేస్తే నికర నష్టం రూ.75 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం
-
చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది.. కార్మిక సంఘాలతో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటివరకు కార్మిక సంఘాల నేతలంతా రాష్ట్రాలకు అతీతంగా ముందుకు సాగగా.. శుక్రవారం సాయంత్రం యాజమాన్యంతో చర్చల సందర్భంగా ఉన్నట్టుండి తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అసలు అంశం పక్కదోవపట్టి చర్చలు విఫలమవటానికి కారణమైంది. సమావేశం నుంచి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అర్ధాంతరంగా వెళ్లిపోవడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయం తుస్సే.. మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమూలకూ సరిపోలేదు. శుక్రవారం కూడా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం 1,550 బస్సులు రోడ్డెక్కగా శుక్రవారం ఆ సంఖ్య 2140కి పెరిగింది. ముఖ్యంగా అన్ని అద్దె బస్సులను పోలీసు రక్షణ మధ్య నడిపించారు. కార్మికులకు, పోలీసులకు.. కార్మికులకు, తాత్కాలిక సిబ్బందికి మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 18 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వరంగల్‌లో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో 15 మంది మహిళా కార్మికులు సహా పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో డ్రైవర్ ఎస్కె గులాం సంధాని పాషా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక ప్రైవేటు వాహనాలు చార్జీలను మరింత పెంచి వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల జేబు గుల్లవుతోంది. ఎండీ వర్సెస్ టీఎంయూ ఆర్టీసీ ఎండీగా ఉన్న సాంబశివరావు తెలంగాణ కార్మిక సంఘాలను వ్యూహాత్మకంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేత అశ్వత్థామరెడ్డి... శుక్రవారం నాటి చర్చ సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీంతో అసలు తెలంగాణకు, తనకు సంబంధమే లేదని... ఆ రాష్ట్ర విషయాలను తనను అడగొద్దని ఎండీ ఘాటుగా పేర్కొన్నారు. అలాం టప్పుడు చర్చలకు తెలంగాణ నేతలను ఎందుకు ఆహ్వానించారని అశ్వత్థామరెడ్డి నిలదీయగా... ఇది ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు సూచన మేరకు ఏర్పాటు చేసిన సమావేశమని, అవసరం లేదనుకుంటే తెలంగాణ నేతలు వెళ్లిపోవచ్చని సాంబశివరావు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రమే కార్మికులకు 27 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదన పెట్టిం దని, తెలంగాణ ప్రభుత్వం ఒక శాతం కూడా ఫిట్మెంట్ ప్రతిపాదన పెట్టలేదన్నారు. ఈ తరుణంలో ఆయనకు, అశ్వత్థామరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత సాంబశివరావు సమావేశం నుంచి నిష్ర్కమించారు. దాంతో అర్ధాంతరంగా భేటీ ముగిసింది. ఎండీ మాటల్లో తప్పులేదు.. తెలంగాణ అంశాలకు తనకు సంబంధం లేదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 27 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదించని విషయం కూడా నిజమేనని చెప్పారు. ప్రత్యేకంగా మంత్రుల సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అది తేల్చకుండా ఫిట్మెంట్ ప్రతిపాదన ఎలా సాధ్యమన్నారు. కాగా.. ఎండీ సాంబశివరావు కావాలనే తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారని టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. కార్మిక నేతల రిలీఫ్‌లకు కత్తెర..: విధుల్లో ఉండాల్సిన అవసరం లేకుండా కార్మిక సంఘం నేతలకు ఉన్న రిలీఫ్‌లను ఆర్టీసీ యాజమాన్యం తొలగించింది. ఎన్ఎంయూ, ఈయూ, టీఎంయూలకు చెందిన 43 మంది నేతలకు 365 రోజుల పాటు విధుల్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఉన్న వెసులుబాటును రద్దు చేసింది. ఇక సంఘం సభ్యుల నుంచి చందా వసూలు చేసి కార్మిక నేతలకు చెల్లించే ఏర్పాటును కూడా రద్దు చేసింది. రాజధానిలో రోడ్డెక్కిన 531 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్నా.. రాజధాని హైదరాబాద్‌లో మాత్రం బస్సులను నడిపించడంలో అధికారులు కొంత వరకు సఫలమయ్యారు. ప్రైవేటు, కాంట్రాక్టు సిబ్బంది సహాయంతో శుక్రవారం హైదరాబాద్ పరిధిలో 531 బస్సులను తిప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ప్రయాణికులకు కొద్దిగా ఊరట లభించింది. ఇక నగరంలోని 28 డిపోల్లో కార్మికులు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. హయత్ నగర్ డిపో వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ మధ్య రైల్వే రోజువారీగా తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మరో 8 రైళ్లను అదనంగా నడిపింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు ఆర్టీసీ సమ్మె, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాకినాడ-విజయవాడ (07051) ప్రత్యేక రైలు 9వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ (07046/07047) ప్రత్యేక రైలు 10న సాయంత్రం 7కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.20కి కాచిగూడకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో 11న ఉదయం 11.30కు కాచిగూడ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.40కి తిరుపతి చేరుకుంటుంది. కాచిగూడ-విజయవాడ ఏసీ డబుల్‌డెక్కర్ (02118/02117) రైలు 11న ఉదయం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8.10కి కాచిగూడ చేరుకుంటుంది. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
ఒంగోలు: ఆర్టీసీలో బుధవారం ఉదయం తొలి సర్వీసు నుంచే సమ్మె సైరన్ మోగనుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల్లో కార్మికులు సమ్మె సన్నాహక కార్యకలాపాల్లో మునిగిపోయారు. మరో వైపు గుర్తింపు సంఘంగా ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ అధికారులు వారికి నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలు విఫలం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయారు. జిల్లాలో పరిస్థితి ఇదీ: ఆర్టీసీ ప్రకాశం రీజియన్ పరిధిలో 701 ఆర్టీసీ బస్సులు, 99 అద్దె బస్సులు కలిపి 3.25 లక్షల కిలోమీటర్లు నడుపుతున్నారు. ఇందు కోసం మొత్తం 4250 మంది కార్మికులు, ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అందులో 1900 మంది డ్రైవర్లు, 1600 మంది కండక్టర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా గత వేతన సవరణల కాలంలో నష్టపోయిన ఫిట్మెంట్ 19 శాతాన్ని వదులుకొని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరో వైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా కార్మికుల పక్షానే నిలవాలని నిర్ణయించింది. ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించి తమ కార్మికులను, ఉద్యోగులను కూడా బుధవారం నుంచి విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు కూడా సంయుక్తంగా ధర్నా నిర్వహించి కార్మికుల న్యాయమైన కోర్కెలు ఫలించేవరకు తాము విధులకు హాజరుకామంటూ స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీలో తెలుగుదేశం పార్టీ అనుబంధ యూనియన్ అయిన ఆర్టీసీ కార్మిక పరిషత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. సమ్మె వల్ల రోజుకు కోటి నష్టం: ఆర్టీసీలో సాదారణ రోజుల్లో రోజుకు రూ.80 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. మరో వైపు వివాహాలు, శుభముహూర్తాలు పెరిగిపోయాయి. దీంతో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయిదు రోజుల నుంచి రోజుకు రూ.20 లక్షల అదనపు ఆదాయం లభిస్తోంది. ఈ దశలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు దిగడంతో ఆర్టీసీ యాజమాన్యానికి శరాఘాతంగా మారింది. ఆర్టీసీ అధికారులు యాజమాన్య ఆదేశాల మేరకు ఇటు రవాణాశాఖ అధికారులతోను, మరో వైపు పోలీసుశాఖ ఉన్నతాధికారులకు తమకు సహకరించాలంటూ విజ్ఞప్తులు పంపారు. ప్రధానంగా ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా అన్ని బస్సులను నడిపేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆర్టీసీ కోరింది. 2001 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటున్న కార్మిక సంఘాలు: ఈ విషయంపై కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులలో 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఒక్క శాతం తగ్గినా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దానికి తోడు 2013 ఏప్రిల్ ఒకటి నుంచి ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె చేయాలనేది తమ అభిమతం కాదని, రెండేళ్లకు పైగా వేచి చూసినా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే తాము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘ నేతలు ప్రకటించారు. సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి: ఆర్టీసీ ఆర్ఎం వి.నాగశివుడు సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆర్టీసీకి కలిసివచ్చే కాలంలో కార్మికులు సమ్మెలోకి వెళితే సంస్థ మరింత సంక్షోభంలోకి వెళుతుంది. పునరాలోచించుకోవాలి. ఒక వేళ కార్మికులు సమ్మెకు సిద్ధపడితే యాజమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు దృష్టి సారించాం. -
సమ్మె..సమస్యలు
డిస్కంలో పేరుకపోతున్న విద్యుత్ ఫిర్యాదులు కోతలు, ఓల్టేజ్ హెచ్చతగ్గులతో గ్రేటర్‌వాసులు సతమతం నిలిచిన మీటర్ రీడింగ్, బిల్లుల వసూళ్లు ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్న నేతలు సిటీబ్యూరో: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. కార్మిక సంఘం నేతలు మాత్రం ఇంకా ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్నారు. నేతల దీక్షకు మద్దతుగా సోమవారం ఉదయం మరోసారి మూకుమ్మడిగా టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మట్టడించాలని కార్మికులు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్‌కో, వివిధ డిస్కంల పరిధిలోని సుమారు 22 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులంతా ఏడు రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఆయా విభాగాల్లో పనులన్ని పూర్తిగా స్తంభించిపోయాయి. లైన్ల పునరుద్ధరణ, కొత్త కనెక్షన్లు, కొత్త లైన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా, హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తినప్పుడు ఇంట్లో విలువైన గృహోపకరణాలు కాలిపోతున్నాయి. అంతేకాదు సర్వీసు వైర్లు కాలిపోతున్నాయి. అంతటా అంధకారం.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్లను పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ఎఫ్ఓసీ కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదు. విద్యుత్ స్తంభాలు ఎక్కేందుకు కార్మికులు లేక పోవడంతో వినియోగదారులు రోజుల తరబడి అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. ఆసిఫ్‌నగర్ డివిజన్ దత్తాత్రేయనగర్ కాలనీలో సర్వీస్ నెంబర్ 030555 వినియోగ దారుడు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం స్థానిక ఏఈకి ఫిర్యాదు ఇచ్చినా..నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. శనివారం చాదర్‌ఘట్‌లో డిస్ట్రిబ్యూషన్ వైరు తెగిపడింది. వెంటనే స్థానికులు డిస్కం కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్‌లో ఆదివారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం స్థానికులు 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. నిలిచిన మీటర్ రీడింగ్.. మీటర్ రీడింగ్ కార్మికులూ సమ్మెలో పాల్గొనడంతో గ్రేటర్ పరిధిలో రీడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిస్కం పరిధిలో వినియోగదారుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ప్రతి నెలా ఒకటి, రెండో తేదీల్లో మీటర్ రీడింగ్ మిషన్లలో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు. సోమవారం వరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. సకాలంలో రీడింగ్ తీయక పోవడంతో శ్లాబురేటు మారి వినియోగదారుని జేబుకు చిల్లుపడుతోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం మీటర్ రీడింగ్‌పై ప్రత్యామ్నాయ దృష్టి సారించింది. డీఈ, ఏఈ, లైన్మెన్లతో పాటు ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చి బిల్లులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. అయితే తమ సమస్యను పరిష్కరించకుండా ఇతరులతో రీడింగ్ తీయిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని కార్మిక సంఘం నాయకుడు సాయిలు హెచ్చరించారు. -
బోనస్ పెంచాలని కార్మికుల సమ్మె
కాసిపేట : దీపావళి బోనస్ పెంచాలని డిమాండ్ చేస్తూ దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మికులు శనివారం సమ్మె చేశారు. పర్మినెంటు, లోడింగ్ కార్మికులకు రూ.17,500 ఇప్పించి, కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.8,500 మాత్రమే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కంపెనీ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో పర్మినెంటు కార్మికులతో సమానంగా బోనస్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం విభజించి పాలించు రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తాడని ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ రాములునాయక్ యూనియన్ను గెలిపిస్తే ఆదిలోనే ఇలా అన్యాయం చేశారని అసంతృప్తి వెల్లగక్కారు. మాజీ ఎమ్మెల్యే మద్దతు.. కార్మికుల నిరసనకు వివిధ కార్మిక సంఘాల నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మద్దతు ప్రకటించారు. గేటు ముందు కార్మికులు చేపట్టిన దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో రూ.20వేలు అడ్వాన్సు చెల్లిస్తామని చెప్పి గెలిచిన అనంతరం కార్మికులకు తెలియకుండ హైదరాబాద్‌లో యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడం దారుణమన్నారు. కార్మికులకు కనీసం రూ.15వేల బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాగజ్‌నగర్ ఎస్పీఎంలో గెలిచిన టీఆర్ఎస్ యూనియన్ కంపెనీని మూసే ప్రయత్నం చేస్తోందన్నారు. గుర్తింపు సంఘం టీఆర్ఎస్ యూనియన్ నాలుగు నెలలకే కార్మికులను విస్మరించడం దారుణమన్నారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని, కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. యూనియన్ల నాయకులు వడ్లూరి మల్లేశ్, తిరుపతిరెడ్డి, గంట మల్లారెడ్డి, లచ్చిరెడ్డి, ప్రకాష్‌పటేల్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు. సమానంగా బోనస్ చెల్లించాలి కాసిపేట : దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ సమానంగా బోనస్ చెల్లించాలని తెలంగాణ ఆసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజన్న డిమాండ్ చేశారు. శనివారం దేవాపూర్‌లో కార్మికుల నిరసనకు మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సమగ్రమైన చట్టంకోసం కార్మికులంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. కంపెనీ యాజమాన్యం, గుర్తింపు సంఘం కాంట్రాక్టు కార్మికులను వర్గీకరించి సీనియర్ కార్మికులకు రూ.10వేలు, మిగతా వారికి రూ.8500 చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం సరికాదన్నారు. టీఏకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య ఉన్నారు.