
సమ్మెతో రూ.105 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సమ్మెతో తెలంగాణలో ఆర్టీసీపై తీవ్ర ప్రభావమే పడింది. 9 రోజుల్లో దాదాపు రూ.105 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. వేసవి సెలవులు, శుభకార్యాల వల్ల మే నెలలో ప్రయాణాలు అత్యధికంగా ఉంటాయి. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ఆర్టీసీకి భారీ ఆదాయం ఉంటుంది. మామూలు రోజుల్లో నిత్యం సగటున రూ.9 కోట్ల వరకు ఆదాయం ఉంటే మే నెల తొలి వారంలో అది సగటున 12.50 కోట్లను దాటింది.
పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో రెండో వారంలో ఆదాయం మరింత పెరిగేది. సరిగ్గా ఇదే సమయంలో కార్మికుల సమ్మె వల్ల ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. సమ్మె కాలానికి వేతనాలను చెల్లించనున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. డీజిల్, మరమ్మతుల ఖర్చును తీసేస్తే నికర నష్టం రూ.75 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.