జనం నెత్తిన 50,000 టన్నుల చెత్త
కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడ చూసినా చెత్తా చెదారం
అంటు రోగాలు, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం
మంగళవారం హైదరాబాద్‌తో సహా పలుచోట్ల భారీ వర్షం
పరిస్థితులు అదుపులోనే ఉన్నాయంటున్న సర్కారు
సమ్మె కొనసాగుతుందని కార్మిక జేఏసీ ఉద్ఘాటన
హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలన్నీ చెత్తమయం అయిపోయాయి. ఏకంగా 50 వేల టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీనికితోడు డ్రైనేజీలు పూడుకుపోయి మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చాలా చోట్ల ముక్కు పగిలిపోయేలా దుర్వాసన వెలువడుతోంది. చెత్తాచెదారంపై దోమలు, ఈగలు పెరగడంతో.. డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికు న్‌గున్యా లాంటి విష జ్వరాలు, డయేరియా తదితర అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉంది. పారిశుద్ధ్య కార్మికులు 9 రోజులుగా చేస్తున్న సమ్మెతో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 30 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోగా.. మిగతా 67 నగరాలు, పట్టణాల్లో 20 వేల టన్నుల చెత్త చేరినట్లు అంచనా. ఇక మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, కాలనీలు, వీధుల్లో మురుగునీటి ప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకువచ్చింది.
ఇరు వర్గాల మొండిపట్టు
రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నా ప్రభుత్వం పట్టువీడడం లేదు, కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం కూడా సమ్మె విరమణ సాధ్యం కాలేదు. సమ్మె విరమించి విధుల్లో చేరని కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని సోమవారం సీఎంవో చేసిన హెచ్చరికలు మాత్రం కొద్దిగా పనిచేసినట్లు కనిపించాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని 18 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్లో 14 వేల మంది విధుల్లో చేరారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పగా.. అలాంటిదేమీ లేదని కార్మిక సంఘాల జేఏసీ కొట్టిపారేసింది. సమ్మె యథాతథంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. భయభ్రాంతులకు గురిచేయడంతో కార్మికులు కొందరు విధుల్లో పాల్గొన్నారని, మెజారిటీ కార్మికులు సమ్మెలోనే ఉన్నారని పేర్కొంది.
నిరసనలు చేస్తున్న కార్మికులు అరెస్ట్
మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై అటు కార్మికసంఘాలు, ఇటు ప్రభుత్వం ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న దాదాపు 400 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విధులకు హాజరైన కార్మికులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని అరెస్టు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు మరోసారి స్పష్టం చేశాయి.
సీఎం వైఖరి మార్చుకోవాలి: కృష్ణయ్య
పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తుంటే... సైనికులు, పోలీసులను రంగంలోకి దించుతామని బెదిరించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సైనికులు ఉన్నది దేశరక్షణ కోసమని, కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ నిర్ణయాలను అమలుచేయడానికి కాదని ఒక ప్రకటనలో విమర్శించారు. కార్మికులను భయపెట్టి లొంగదీసుకోవడం సరికాదని, సీఎం ఈ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.
‘వారిని తొలగిస్తాం’
కార్మికులు తొలుత విధుల్లో చేరాలని, మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం వారి డిమాండ్ల ను పరిష్కరిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. విధుల్లో చేరని వారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్య విభాగంలో 18,382 మంది కార్మికులకు 14,268 మంది మంగళవారం విధులకు హా జరైనట్లు చెప్పారు. కార్మికుల సమ్మె వెనుక బ యటి వ్యక్తుల ఒత్తిడి ఉందని ఆరోపించారు. సమ్మె జరిగినప్పటికీ రోజూ దాదాపు మూడు వేల టన్నుల చెత్తను తరలించామన్నారు.