ఫ్యాక్టరీ తెరవకపోతే ఆత్మహత్యలే శరణ్యం | If The Factory Does Not Open, We Commit Suicide | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీ తెరవకపోతే ఆత్మహత్యలే శరణ్యం

Published Tue, Jun 26 2018 10:40 AM | Last Updated on Tue, Jun 26 2018 10:40 AM

If The Factory Does Not Open, We Commit Suicide - Sakshi

రావివలస మెట్‌కోర్‌ పరిశ్రమ ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించి నినాదాలు చేస్తున్న కార్మికులు 

టెక్కలి : ‘వందలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న పరిశ్రమను మూత వేసి మమ్మల్ని రోడ్డున పడేశారు.. మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా మా సమస్య పరిష్కారం కాలేదు.. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పరిశ్రమను తెరిపించకపోతే ఆత్మహత్యలకు వెనుకాడం..’ అంటూ టెక్కలి మండలం రావివలసలో మెట్‌కోర్‌ ఫెర్రో ఎల్లాయ్స్‌ పరిశ్రమ కార్మికులు నినాదాలు చేశారు.

సోమవారం 300కు పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ‘జీఎంఆర్‌’ పేరిట ఉన్న ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. పరిశ్రమ నుంచి ప్రారంభమై ఎన్‌ఎం రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. పోలీస్‌ సిబ్బంది నలువైపులా బందోబస్తు నిర్వహించారు.  ఈ సందర్భంగా కార్మికులు చేసిన నినాదాలు మిన్నంటాయి.

పరిశ్రమ తెరిపించే విషయంలో యాజమాన్యం మొండివైఖరి నశించాలని, తక్షణమే 4 సంవత్సరాల పీఎఫ్‌ చెల్లించాలని, 20 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని, పరిశ్రమను వెంటనే తెరిపించాలని తదితర డిమాండ్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొదటగా ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారి సోమేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం తహసీల్దారు కార్యాలయం వర కు ర్యాలీను కొనసాగించి తహసీల్దారు ఆర్‌.అప్పలరాజుకు వినతిపత్రం అందించారు.  పాత జాతీయ రహదారి మీదుగా ర్యాలీను కొనసాగించి కార్మిక శాఖా కార్యాలయం వరకు వెళ్లి అక్కడ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ కొనసాగించారు.

మంత్రికి చెప్పినా ఫలితం శూన్యం..

ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ 2014లో పరిశ్రమ ఉత్పత్తి నిలిపివేశారని, ఆ తర్వాత 60 శాతం జీతాలు ఇప్పిస్తామంటూ అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో యాజమాన్య ప్రతినిధులు ఒప్పందం చేశారని గుర్తు చేశారు. కొన్ని రోజులు మాత్రమే జీతాలు ఇచ్చారని ఆ తరువాత జీతాలు నిలిపివేశారంటూ కార్మికులు వాపోయారు.

ఈ విషయమై మంత్రి చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో, కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ మూతపడటంతో కార్మికులు దాసరి చిన్నబాబు, జి.ఎర్రన్న, బి.ఆర్‌.బి.సాగర్, బి.సూర్యారావు, అడ్డి అప్పయ్యలు మానసిక ఆందోళనతో మృతి చెందారని వాపోయారు.

తక్షణమే డిమాండ్లు పరిష్కరించకపోతే ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నామంటూ కార్మికులు హెచ్చరించారు. ర్యాలీకి సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు ఎన్‌.షణ్ముఖరావు, కె.ఎల్లయ్య తదితరులు మద్దతు పలికారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల సంఘీభావం

ర్యాలీ చేపట్టిన కార్మిక సంఘ ప్రతినిధులకు వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌లు  సంఘీభావం ప్రకటించారు.

శ్రీకాకుళంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశానికి ఇరువురు వెళ్లిపోవడంతో అక్కడి నుంచి కార్మిక సంఘాల నాయకులకు ఫోన్‌లో సంఘీభావం తెలియజేశారు. కార్మికుల పోరాటానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసాఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement