రెండో రోజూ అదే జోరు
► కొనసాగిన పారిశుధ్య కార్మికుల సమ్మె
► చాలా వీధుల్లో పేరుకుపోతున్న చెత్త
► ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీవీఎంసీ
► వ్యాధులు ప్రబలే ప్రమాదం
► మంత్రి గంటా ఇల్లు ముట్టడి
నగరంలో పారిశుధ్యం పడకేసింది. జీవో 279 అమలు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలంటూ జీవీఎంసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కారణంగా క్లీన్ సిటీ కాస్తా చెత్త సిటీగా మారుతోంది. వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో జీవీఎంసీ పనులు చేపడుతున్నా.. అవి సగభాగానికి మాత్రమే పరిమితమయ్యాయి. మరోవైపు కార్మికులు సైతం తమ సమ్మె రెండో రోజు కొనసాగించారు.
విశాఖ సిటీ : నగర పాలక సంస్థలో ప్రజారోగ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా ప్రభుత్వం తీసుకొస్తున్న జీవో 279పై కార్మికుల వ్యతిరేకత కొనసాగుతోంది. కార్పొరేషన్ అజమాయిషీకి చరమగీతం పాడుతూ, కార్మికులకు ఉద్యోగ భద్రతను దూరం చేసే జీవోను రద్దు చేయకుంటే.. ఆందోళన ఉధృతం చేస్తామనే హెచ్చరికలతో సమ్మె సాగుతోంది. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 1600 పర్మినెంట్, 4,130 మంది ఒప్పంద పారిశుధ్య కార్మికులుండగా.. వీరిలో ఒప్పంద కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. చెత్తను తరలించే వాహనాల డ్రైవర్లను కమిషనర్ హరినారాయణన్ కోరిక మేరకు సమ్మె నుంచి మినహాయించారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగులతో జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
సగం చెత్తే తరలింపు
నగరంలో రోజుకు సుమారు వెయ్యి మెట్రిక్ టన్నుల వరకూ చెత్త వస్తోంది. వీటిని ఏరోజు కారోజు డంపింగ్ యార్డుకు తరలించాలంటే కార్మికులంతా పనిచేయాల్సిందే. సింహభాగం కార్మికులు సమ్మెలో పాల్గొనడం వల్ల 1000 మెట్రిక్ టన్నుల్లో కేవలం 500 నుంచి 600 మెట్రిక్ టన్నులు మాత్రమే తరలించగలుగుతున్నారు. దీంతో వార్డుల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. డంపర్ బిన్లు నిండిపోవడంతో రోడ్డుపైనే చెత్తను పారబోస్తున్న పరిస్థితులు తలెత్తాయి. కాల్వలు చెత్తతో పూడుకుపోతున్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో ఇలా చెత్తతో నగరం నిండిపోతే వ్యాధులు ప్రబలే ప్రమాదముందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయం అంతంతమాత్రమే..
సమ్మె కారణంగా నగరంలో తలెత్తిన పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తొలి రోజున సమ్మె ప్రభావంతో కాస్తా చెత్త పేరుకుపోయింది. రెండో రోజుకు రెట్టింపు అవ్వడంతో తలకు మించిన భారంగా మారిపోయింది. దీంతో వెయ్యి మంది రెగ్యులర్ వర్కర్లతో పనులు చేయిస్తున్న జీవీఎంసీ ప్రజారోగ్య శాఖాధికారులు మరో వంద మందిని అదనంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న వర్కర్లను అదనపు పనిగంటలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి గంటా ఇంటి ముట్టడి
జీవో రద్దుపై ప్రభుత్వం అవలంబిస్తున్న వి«ధానాలపై కార్మిక సంఘాలు దండెత్తుతున్నాయి. సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో 8 జోన్ల పరిధిలోని పారిశుధ్య కార్మికులు ఎంవీపీ కాలనీలోని మంత్రి గంటా ఇంటిని ముట్టడించారు. కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేటు కాంట్రాక్టర్లకూ లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. మూడు రోజుల సమ్మెను నిరవధిక సమ్మెగా మారుస్తామని సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్, యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు హెచ్చరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడంతో పీఏకు వినతి పత్రం ఇచ్చిన కార్మిక సంఘాల నేతలు ఇసుక తోట డబుల్ రోడ్డుపై రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
సమ్మె సైరన్ ఆగింది
జీవీఎంసీలో రెండు రోజులుగా మోగుతున్న సమ్మె సైరన్ తాత్కాలికంగా ఆగింది. జీవోనం.279ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 15 రోజుల తర్వాత పూర్తి వివరాలతో చర్చించేందుకు గడువు ఇచ్చింది. సమ్మెతో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తమవడంతో ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించింది.
సంబంధిత శాఖ మంత్రి నారాయణ చర్చల్లో పాల్గొని సమ్మె విరమించాలని కోరినట్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) గౌరవాధ్యక్షుడు ఎం.ఆనందరావు తెలిపారు. రాత్రి 11 గంటల వరకూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్ సంఘ ప్రతినిధులతో చర్చించారని చెప్పారు. జీవోను తాత్కాలికంగా నిలిపేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో పాటు కార్మికులకు సంబంధించిన ఇతర సమస్యలపైనా 15 రోజుల తర్వాత చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారన్నారు. ఉద్యోగుల భద్రతపై ఆలోచించినందుకు ముఖ్య కార్యదర్శి వలవన్‌కు, సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు.