సర్కర్ పై ఎటాక్ | Attack on sarkar | Sakshi
Sakshi News home page

సర్కర్ పై ఎటాక్

Published Wed, Jul 15 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

సర్కర్ పై ఎటాక్

సర్కర్ పై ఎటాక్

- వాహనాల గాలి తీసి.. డ్రెయినేజీ పైపులు కోసేసి..
- దాడులకు దిగుతున్న సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్ వీరపాండియన్
- రంగంలోకి డ్వాక్రా మహిళలు
- అడ్డుకుంటే అరెస్టులు తప్పవని హెచ్చరిక
విజయవాడ సెంట్రల్
: నగరపాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటివరకు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన కార్మికులు సోమవారం రాత్రి వెహికల్ డిపోలోని వాహనాల్లో గాలి తీసేశారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైపులు కోసేశారు. పారిశుధ్య విధులు నిర్వర్తించేందుకు వచ్చిన కాం ట్రాక్ట్ కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికుల చర్యలపై మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సీరియస్ అయ్యారు. డీసీపీ కాళిదాసుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ రక్షణ మధ్య పారిశుధ్య పనులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే అరెస్ట్‌లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజారోగ్య, ఇంజినీరింగ్, యూసీడీ, విద్యాశాఖ, కాంట్రాక్టర్లతో మంగళవారం కౌన్సిల్ హాల్‌లో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.
 
మీరేం చేస్తున్నారు?
పారిశుధ్య పనులు నిర్వహించేందుకు డ్వాక్రా మహిళలు ముందుకు వస్తున్నా ఔట్ సోర్సింగ్ కార్మికులు అడ్డుకుంటున్నారని కాంట్రాక్టర్ తుపాకుల రమణమ్మ కమిషనర్‌కు చెప్పారు. 25, 26 డివిజన్లలో పారిశుధ్య పనులు చేయడానికి వచ్చిన మహిళలపై దాడులు చేశారని తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉంటే ఏం చేస్తున్నారంటూ ఏఎంవోహెచ్‌లు, సీఎంవోహెచ్‌లను కమిషనర్ నిలదీశారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఇంటికి వెళ్తారని హెచ్చరించారు. కార్పొరేషన్‌లో పనులు చేయడానికి చాలామంది ముందుకు వస్తారని, వారికి రక్షణ కల్పించే బాధ్యత అధికారులే తీసుకోవాలని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనులు చేసే మహిళలకు రోజుకు రూ.275 చొప్పున వేతనం అందిస్తామన్నారు. ఇందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.25వేల చొప్పున కేటాయించినట్లు ఆయన తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ వర్క్స్ విధులు నిర్వర్తించేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల వైఖరిపై కమిషనర్ మండిపడ్డారు. ‘సమ్మెతో మీకేం సంబంధం లేదు. టెండర్ ప్రకారం కార్మికుల్ని సరఫరా చేయాల్సిందే. లేదంటే మిమ్మల్ని (కాంట్రాక్టర్లు) తొలగించి, కొత్తవారికి టెండర్ ఇస్తాను.’ అని కమిషనర్ మండిపడ్డారు. ఈ మేరకు నోటీసులు జారీ చేయాల్సిందిగా చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.
 
స్ఫూర్తి కలిగించండి
విద్యార్థులు, ప్రజల్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తి కలిగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులే కాకుండా ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోలను పారిశుధ్య పనుల్లో భాగస్వాముల్ని చేయాలన్నారు. సమ్మె కారణంగా నగరంలో నెలకొన్న పరిస్థితుల్ని వివరించాలన్నారు. ప్రతి ఒక్క అధికారి దీన్ని సవాల్‌గా తీసుకోవాలని, వాహనాల కొరత రానీయొద్దని ఇంజినీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణరావు, ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, సీఈ ఎంఏ షుకూర్, సీఎంవోహెచ్ ఎం.గోపీనాయక్, పలువురు ఈఈలు, డీఈలు, ఏఎంవోహెచ్‌లు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement