ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? ‘సాధ్యం కాదు’ అనుకున్నదాన్ని ‘సాధ్యం’ చేయవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పే పేరు....రుక్మిణి రియర్. ఆరో తరగతి ఫెయిలైన రుక్మిణి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా పనిచేస్తోంది...
స్కూల్ రోజుల్లో రుక్మిణి బ్రైట్ స్టూడెంట్ కాదు. రుక్మిణి ఆరో తరగతి ఫెయిల్ కావడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఆ ఫెయిల్యూరే తనను సక్సెస్‌కు దగ్గర చేసింది. ‘ఫెయిల్యూర్ అంటే మొదలైన భయం ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలను పెంచింది’ అంటుంది రుక్మిణి. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సోషల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన రుక్మిణి ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్’లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.
ఆ తరువాత ముంబై, మైసూర్‌లలో కొన్ని స్వచ్ఛందసంస్థలలో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న క్రమంలో అంకితభావం, వృత్తి నిబద్ధత ఉన్న ఎంతోమంది ఐఏఎస్ అధికారుల గురించి విన్నది. వారి గురించి విన్నప్పుడల్లా ‘ఐఏఎస్’ వైపు మనసు మళ్లేది. చివరికది అది తన కలగా మారింది.‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని రంగంలోకి దిగింది.
కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ‘ఆరోతరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్ సాధించింది’... రుక్మిణి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు ఆమెను కలుసుకొని మాట్లాడి సలహాలు తీసుకునేవారు.
కట్ చేస్తే...
ఇప్పుడు రుక్మిణి రియర్ రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్. యూపీఎస్‌సీలో సెకండ్ ర్యాంక్‌తో ఎలా వార్తల్లో నిలిచిందో మున్సిపల్ కమిషనర్‌గా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం అక్రమార్కుల పాలిట ఆమె సింహస్వప్నం కావడమే. డిసెంబర్‌లో జరగబోయే ‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్’ను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానాశ్రయం నుంచి 22 గోదాముల వరకు ప్రధాన రోడ్లను పరిశీలిస్తూ వెళ్లింది.
నగర పరిశుభ్రత, సుందరీకరణ గురించి స్థానికులతో మాట్లాడింది. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫ్లైవోవర్‌లు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి పెయింటింగ్, లైటింగ్‌ల కోసం సూచనలు ఇచ్చింది. గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి పబ్లిక్ టాయిలెట్లు, చెత్త కుండీలు శుభ్రం చేయడం వరకు ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తుంది. నగర సుందరీకరణతో పాటు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్’ ద్వారా జైపూర్‌ను గ్లోబల్ సిటీగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం జైపూర్ అద్భుతంగా కనిపించకపోయినా... పరిశుభ్రంగా, ఆక్రమణలు లేకుండా కనిపించాలి. ఇది అనుకున్నంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే సమ్మిట్‌కు ఎన్నో నెలలు లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కష్టపడుతూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది రుక్మిణి. ‘పని చెయ్యకపోయినా ఫరవాలేదు. చేస్తే మాత్రం శ్రద్ధగా, భక్తిగా చేయాలి’ అని అమ్మ అంటుండేది. ఆ మాటలే రుక్మిణి రియర్‌కు వేదవాక్కు.
(చదవండి: దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment