కరీంనగర్ : పదవ పీఆర్‌సీ సిఫార్సులకు అనుగుణంగా వేతనాలు పెంచాలని పురపాలక శాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించాలని, సిబ్బందిని క్రమబద్దీకరిస్తూ పీఎఫ్, ఈఎస్‌ఐ ఆమలు చేయాలని, ఈజీఎస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. బుధవారం కలెక్టరేట్ ముందు పది వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షల్లో వామపక్ష పార్టీల నాయకులు గీట్ల ముకుందరెడ్డి, బోయిని అశోక్, జిందం ప్రసాద్, కొలిపాక కిషన్, పైడిపల్లి రాజు, గుడికందుల సత్యం, కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి, ఎర్రవెల్లి ముత్యంరావు పాల్గొన్నారు.
హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ ఇంటి ముందు కార్మికులు బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని వెనక్కి పంపించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అద్దెకు ఉంటున్న ఇంటిని ముట్టడించి కార్మికులు నిరసన తెలిపారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు స్థానిక ఎంపీపీ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు బట్టలు పంపిణీ చేస్తుండగా కార్మికులు వెళ్లి నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే కార్మికులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వరాల రవికుమార్ ఆధ్వర్యంలో ముట్టడించారు.
వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు ఇంటిని ముట్టడించిన కార్మికులు ఆయన లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించి వెనుదిరి గారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఇంటిని ముట్టడించి బైఠాయించిన కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మె విరమణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కార్మికులతో అక్కడి నుంచే మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడించారు. మానకొండూరు లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిని ముట్టడించి ఆయన లేకపోవడంతో అల్గునూరు చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
ధర్మపురిలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర ఎక్స్‌రోడ్‌లో గల ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు కార్మికులు నిరసన చేపట్టి ఇంటికి వినతిపత్రాన్ని అంటించి వెళ్లిపోయారు. మంథని, పెద్దపల్లిలో ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి ఇళ్ల ముందు ధర్నా నిర్వహించి వారు లేకపోవడంతో మంథనిలో సర్పంచ్‌కు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి పీఏకు వినతిపత్రం సమర్పించి వెనుదిరిగారు.
జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి ముందు కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇంటి ముందు ధర్నా నిర్వహించి సమస్యలను విన్నవించారు. ఆయన జోక్యం చేసుకొని తన పరిధిలోని సమస్య కాదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
కార్మికుల సమ్మె ఉధృతం
Published Thu, Jul 16 2015 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement
Advertisement