- నేటి నుంచి మునిసిపల్ కార్మికుల సమ్మె
- పారిశుద్ధ్యం, నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం
- ఆందోళనలో ప్రజలు
చిత్తూరు(అర్బన్): తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మునిసిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాటపట్టనున్నారు. రాష్ట్ర కార్మిక సంఘనాయకుల పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. తమ సమస్యలు తీర్చేవరకు నిరవధిక సమ్మె చేస్తామని గురువారం జిల్లాలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు, అధికారులకు కార్మికులు సమ్మె నోటీసులు జారీచేశారు. కార్మికుల సమ్మె ఫలితంగా నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.
జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో దాదాపు 1,100 మంది శాశ్వత ప్రాతిపదికన, 3 వేల మందికి పైగా తాత్కాలిక పద్ధతిన కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రులు సైతం రోడ్లపై చెత్తను తీయడం, కాలువల్లో పూడికలు తీయడం లాంటి పనులను చేస్తున్నారు.
అయితే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏడాది కాలంగా ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందచేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొన్ని మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వీధి దీపాల నిర్వహణ, నీటి కొళాయిల ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. తాగునీటి సరఫరాపై సమ్మె ప్రభావం పడనుంది.
ఇవీ డిమాండ్లు...
- జీవో నెం - 263ను పునరుద్ధరించి 1994 నుంచి పదవీ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి.
- పారిశుద్ధ్య పనుల్లో జీవో నెం - 581ను అమలు చేసి గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలి.
- 1993 కంటే ముందు నుంచి టైమ్‌స్కేల్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే పర్మినెంట్ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను సైతం పర్మినెంట్ చేయాలి.
- దశాబ్దాల కాలంగా కార్మికులు నివసిస్తున్న మునిసిపల్ క్వార్టర్స్‌ను రెంట్‌ఫ్రీ క్వార్టర్స్‌గా పరిగణించి కార్మికులకు అప్పగించాలి.
- కార్మికులకు వాషింగ్ అలవెన్స్, కుట్టుకూలీ పెంచాలి. వ్యక్తిగత జీపీఎఫ్ నెంబర్లు కేటాయించాలి.
- ప్రభుత్వ సెలవు దినాల్లో కార్మికులకు పూర్తిగా సెలవులు అమలు చేయాలి.
- సీడీఎంఏ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలి.
సమ్మెకు సైరన్!
Published Fri, Jul 10 2015 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement